అసుర సంధ్యాసమయం. ఆకాశం అరుణవర్ణం దాల్చింది. నిట్రాటకు కట్టేసున్న తోడపెద్దు కళ్లు అగ్నిగోళాల్లా ఉన్నాయి. అది ఖురంతో నేలను దువ్వుతోంది. దాని మొనదేలిన కొమ్ముల చివర్లకంటిన రక్తం.. బొట్లుబొట్లుగా నేలరాలుతోంది. దాని కాళ్లముందు నలభై ఆరేళ్ల దాసుడు విగతజీవిగా పడున్నాడు.
ఊరికి దక్షిణంగా శారదానది పక్కనుంది తోడపెద్దు పెంకుల షెడ్డు! ఆ పక్కనే దాసుడు ఇల్లు! అతని కుడికాలు కాస్త అవిటి! దాంతో కుంటోడని ఎవరూ పిల్లనివ్వలేదు. తల్లిదండ్రులు కాలం చేయడంతో ఒంటరిగా ఉంటున్నాడు. అతని అసలు పేరు అప్పన్న! కానీ అందరూ ‘దాసుడు’ అనే పిలుస్తారు.కాసేపటికి చీకటి చిక్కగా ఆవరించింది. దాసుడి దోస్తు ముత్యాలు అతనితో ఏదో పనిపడి..
“ఒరే దాసుడూ…” అంటూ పిలుస్తూ వచ్చాడు.దాసుడి జాడలేకపోవడంతో..‘సెడ్లో బల్పుగూడ ఎలిగించకుండ తాడిపెద్దును సీకట్లో ఒదిలేసి ఏడకెల్లిపోనడు’ అనుకుంటూ స్విచ్ వేశాడు. బల్పు వెలుగులో తోడపెద్దు ముందున్న ఆ దృశ్యాన్ని చూసి అదిరిపడ్డాడు.
“తాడిపెద్దు దాసుడ్ని పొడిసి సంపీసిందో…” భయంగా అరుస్తూ బయటికి పరుగుతీశాడు.అది విని ఊరి జనం ఉలిక్కిపడ్డారు. పరుగుపరుగునొచ్చారు. రక్తపు మడుగుల్లో పడున్న దాసుడ్ని చూసి కన్నీరెట్టుకున్నారు. సైదులు వస్తూనే గట్టిగా ఏడ్చేశాడు. అతడు శవం దగ్గరకెళ్లబోతుంటే.. తోడపెద్దు కోపంగా కొమ్ము విసిరింది. సైదులు ఒడుపుగా తప్పుకొన్నాడు. లేకపోతే అది అతని గుండెల్ని చీరేసుండేది.ఓ ఇద్దరు ధైర్యంచేసి తోడపెద్దు వెనుకనుంచొచ్చి, దాని మూపురానికి నారాయణకట్టు వేసి, దాని కొసను ముగుదాడుకు బిగించారు. నారాయణకట్టు తోడపెద్దు మెడను పైకిలాగి పెట్టింది. మెడొంచితే ముగుదాడు ముక్కులో మంటపెట్టడంతో అది వెనుగడుగేసింది. దాంతో దాసుడి శవాన్నెత్తుకుని షెడ్డు బయటకు తీసుకొచ్చాడు సైదులు. దాసుడ్ని తోడపెద్దు పొడిచి చంపడం అక్కడున్నవారు జీర్ణించుకోలేక పోతున్నారు.‘సిమ్మాద్రి అప్పన్నసామి! ఏటయ్య ఇది? నిత్తెం నీ సేవసేసే నీ దాసుడ్ని ఇలాగ పొడిసి సంపీడం నాయమా?’ అని నిష్టురమాడుతున్నారు.తోడపెద్దు వారి నిష్టురోక్తులను పట్టించుకోవడంలేదు. అది హుంకరిస్తూ నిట్రాట చుట్టూ తిరుగుతోంది.
దాసుడికి ఆ తోడపెద్దుతో అనుబంధం ఈనాటికాదు. దానికి యేడాదిన్నర వయస్సు నుంచీ ఉంది. సింహాచలం చుట్టుపక్కలుండే జిల్లాల్లో ఊరుకో తోడపెద్దు సేవ గరిడి ఉంటుంది. తోడపెద్దును సాక్షాత్తూ సింహాద్రి అప్పన్నస్వామిగా భావించి పూజిస్తారు. తరతరాలుగా సాగుతున్న ఈ సంప్రదాయం ఆ ఊర్లో దాసుడు వంశస్థులే కొనసాగిస్తూ వస్తున్నారు. అలా వారసత్వంగా వచ్చిన ఆ బాధ్యతను దాసుడు భక్తిగా, శ్రద్ధగా నిర్వర్తిస్తున్నాడు.
అతను బాధ్యత చేపట్టిన రెండేళ్లకే ఆ గ్రామ తోడపెద్దు వార్ధక్యంతో కాలం చేసింది. దాంతో దాసుడు భోగి పండుగరోజు పుట్టిన దూడ కోసం వెతుకులాట ఆరంభిస్తే.. ఓ గ్రామ రైతు దగ్గరుందని తెలిసింది. దాసుడు తమ సేవ గరిడి బృందంతో కలిసెళ్లడిగితే.. ఆ రైతు సంతోషంగా దూడను దానమిచ్చాడు. దాన్ని తీసుకొచ్చి ముగుదాడు వేసి తోడపెద్దుగా కొలుసున్నాడు. అది రెండు పళ్లు వేశాక అచ్చుపోత వేడుక చేయాలి. అందుకోసం దాసుడు ఎదురుచూస్తుండగానే.. ఆ సమయం రానే వచ్చింది.
దాంతో దాసుడు సేవ గరిడి బృందంతో కలిసెళ్లి ఆ ఊరి సర్పంచ్ నూకరాజుకు విషయం చెప్పాడు. తన హయాంలో ఆ వేడుక జరగడం అదృష్టంగా భావించిన నూకరాజు.. అచ్చుపోతకు ముహూర్తం నిర్ణయించి, ఊరంతటినీ సమావేశపరిచాడు.“తాడిపెద్దు రూపంలో సిమ్మాద్రి అప్పన్నసామి మనూరిని సల్లగ సూత్తున్నడు. ఆ సామికి అచ్చుపోత పండగ జెరిపిద్దం! అందరూ తలో సేయి ఏసి.. దాసుడికి సాయమందించండి” అని చెప్పాడు.
దానికి ఊరంతా సంతోషంగా తమ సమ్మతిని తెలిపింది. అదిగో ఆ రోజే.. భార్యవెంట ఆ ఊరికి ఇల్లరికమొచ్చాడు సైదులు. పూర్వాశ్రమంలో అతనూ ఓ దాసుడే! అచ్చుపోత గురించి తెలుసుకుని సరైన సమయానికొచ్చానని సంతోషించాడు. దాసుడ్ని కలిసి.. సేవ గరిడి పాటలన్నీ పాడి వినిపించాడు. రాగంతీసి పాడుతున్న విధానానికి, అతని మాటల చమత్కారానికి పులకించిపోయి.. సైదులును తమ బృందంలో కలిపేసుకున్నాడు దాసుడు.
సైదులుకు మరో వ్యాపకంలేదు. రోజంతా దాసుడితో ఉంటూ, అతనితోపాటు చందాలకు తిరుగుతూ.. ఎవరు ఎంతిస్తున్నారో చూస్తున్నాడు. దండిగా వసూలవుతున్న చందాలను చూసి ఆశ్చర్యపోతున్నాడు.‘ఈ ఊరోల్లకు తాడిపెద్దుంటే బత్తెక్కువే!’ అనుకుంటూ మురిసిపోతున్నాడు.
ఊరు ఊరంతా దాసుడికిస్తున్న గౌరవాన్ని చూసి ఈర్ష్యపడుతున్నాడు.దాసుడు ఊరి జనమిస్తున్న చందాలతో ఖర్చుకు వెనుకాడకుండా ఏర్పాట్లు చేస్తున్నాడు. అంత ఖర్చెందుకని సైదులుకు అనిపించేది. వసూలైన డబ్బులో కొంత వెనకేసుకోమని ఓ రోజు సలహా కూడా ఇచ్చాడు.
“దేవుడి సొమ్ముకు ఆసపడేటోడ్నిగాదు. నా రెక్కల కస్టం నాకు సాలు! ఇంకెప్పుడూ ఇలాటి సలహాలివ్వకు” అంటూ కోప్పడ్డాడు దాసుడు.
ఆ మర్నాడు ఉదయమే అచ్చుపోత! దాసుడి ఇంటిముందు తాటాకుల పందిరేశారు. ఊరంతా లైటింగ్ పెట్టారు. ఆ సాయంత్రానికి చుట్టుపక్కల గ్రామాలనుంచి పన్నెండు సేవ గరిడిలు తమ తోడపెద్దులను వెంటేసుకునొచ్చాయి. ఆ రాత్రి తమ తోడపెద్దుల ముందు నరసింహ కోల వెలిగించి, సేవ గరిడి బృందాలు వలయంగా ఏర్పడి తాళాలు మోగిస్తుంటే.. దాసుళ్లు దశావతారాలు ఆలపిస్తుంటే.. ఊరంతా భక్తిపారవశ్యంతో ఊగిపోయింది.
దాసుడు పంచెకట్టి, మెడలో రుద్రాక్షమాల, పూలదండ ధరించి, తమ ఊరి సేవ గరిడి మధ్యలో భగ భగమండుతున్న అగ్గికోలను అటూఇటూ తిప్పుతూ..‘హరి హరి నారాయణ ఆదినారాయణో… కరుణించి మమ్మేలు కమలలోచనుడూ…” అంటూ రాగంతీస్తూ ప్రారంభించాడు.
రెండో దాసుడు సైదులు ఎడమచేత్తో బెత్తం,కుడిచేత్తో నెమలి కుంచు పట్టుకుని..“అల్లో నారాయణ అల్లో…” అంటూ రాగం తీస్తూ మొదలుపెట్టాడు.
దాసుళ్లిద్దరూ పోటాపోటీగా రాగయుక్తంగా పాడుతుంటే వింటున్నవారు మైమరచిపోయారు.’
‘సెభాసో’ అంటూ వారిని ప్రోత్సహించారు.ఆ మరునాడు ఉదయం తోడపెద్దును పసుపునీళ్లతో స్నానం చేయించి, అందంగా అలంకరించారు. నుదుటి మీద సింహాద్రి అప్పన్నస్వామి వెండి అచ్చు, కొమ్ములకు వెండి తొడుగులు, నడుముకు వెండి వడ్డాణం, కాళ్లకు వెండి కడియాలు, మెళ్లో గంటలహారం, పూలదండలతో.. తోడపెద్దు భక్తిభావం ఉట్టిపడేలా ఉంది.దాసుడి ఆహ్వానం మేరకు సింహాచలం నుంచొచ్చిన నారాయణ దాసుడు పూజలు జరిపాడు. ఎండిన ఆవుపేడను పుటంబెట్టి, అందులో ఇనుపచువ్వకు అతికిన నక్షత్రం గుర్తును ఉంచి కాల్చాడు. ఇంటి ముందు తెల్లటి పంచెపరిచి దానిమీద ధాన్యం వేసి, ఆ ధాన్యంమీద తోడపెద్దును నిల్చోబెట్టాడు.దాసుళ్లంతా దాని చుట్టూచేరి..“జోజో రేపల్లె నాథా… ఉయ్యాల్లో జోకొట్టి నీయమ్మ నీళ్లకెళ్లింది… నువ్వు నిద్రపో తండ్రీ నీలవర్ణుడా… ” అంటూ జోలపాట పాడుతూ తోడపెద్దును జోకొడుతూ నిద్రపుచ్చారు.
నారాయణదాసుడు పుటంలో ఎర్రగా కాలిన ఇనుపచువ్వను భక్తిభావంతో తీసుకొచ్చి, తోడపెద్దు కుడిపిర్ర మీద నక్షత్రం గుర్తును అచ్చుపోత వేశాడు. ఆ వేడుక ముగిసాక, తోడ పెద్దులను సేవగరిడిలతో ఊరేగించారు. వీధుల్లో స్త్రీలు తోడపెద్దుల కాళ్లుకడిగి హారతులిచ్చారు. మధ్యాహ్నం భారీగా అన్నదానం చేశారు.
దీనంతటికీ అయిన ఖర్చూ, వచ్చిన చందా ప్రతీది రాయించేవాడు దాసుడు. చివరకు లెక్కలుతీస్తే ఖర్చులుపోగా ఎనభైవేలు మిగిలింది. అంత డబ్బును చూసి సైదులు పళ్లు చప్పరించాడు. దాసుడు మీటింగ్ పెట్టి జమాఖర్చులు చెప్తానంటే, సైదులు అడ్డు చెప్పాడు.
“నెక్కలు సెప్పడమెందుకు దాసుడు? నువ్వు, నాను, ముత్తాలు పనుల మానుకుని కస్టపడ్డం. అందువొల్ల గుట్టుసప్పుడు నేకుండ తలా ఇంతని పంచేసుకుందం” అన్నాడు.దాసుడు కస్సుమన్నాడు.“ఊరోల్లు సందాలిచ్చిందీ మనం తినీడానికేటి? సెడ్డులో పెంకులూడిపోయి వొనత్తే సాలు.. తాడిపెద్దు తడిసిపోతున్నది. డొబ్బులు కూడబెట్టి స్లేబు ఏయించాల. నెక్కలు సెప్పి, దేవుడి పేర బేంకులో ఏత్తను” కరాఖండిగా చెప్పాడు.
“సరే! నీ ఇట్టమొచ్చినట్టు సేసుకో” అంటూ.. సైదులు నిరాశగా, విసురుగా వెళ్లిపోయాడు.
కాలం గడుస్తోంది. దాసుడు ఉదయాన్నే నిద్రలేస్తాడు. షెడ్డు శుభ్రంచేసి, తోడ పెద్దుకు జావ ఉడకబెట్టి తినిపిస్తాడు. వ్యవసాయ పనికెళ్తూ ముందురోజు తెచ్చిన పచ్చగడ్డేస్తాడు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు ఓ మోపుగడ్డి కోసుకొస్తాడు. సాయంత్రం పనిలోంచి వస్తూ మరో మోపు తెస్తాడు. తను పస్తులన్నా ఉంటాడుగాని.. తోడ పెద్దు మేతకు లోటు రానీయడు. రైతులు వట్టిగడ్డిమోపులు తెచ్చిస్తారు. మేతకు లోట పెళ్లీపేరంటాల కూడలా ఎదిగిన తోడపెద్దును చూస్తే.. ఓ పక్క భయమూ, మరోపక్క భక్తీ ఏకకాలంలో కలుగుతాయి. ఊర్లో పండుగలు, పెళ్లీపేరంటాలకూ దాసుడికి మర్యాదపూర్వకంగా అరటిపళ్లు, ఆకూచెక్కా ఇచ్చి సేవ గరిడిని తీసుకురమ్మని కోరతారు. ఆ ఆహ్వానం మేరకు సేవ గరిడి బృందం తోడపెద్దును వెంటతీసుకెళ్లి వారింట సేవ చేస్తారు. అందుగ్గాను ప్రసాదంతోపాటు ఓ రెండుమూడు వేలవరకూ తాంబూలంలోపెట్టి దాసుడికిస్తారు. దాసుడు ప్రసాదాన్ని బృందానికి పంచి, డబ్బులను బ్యాంక్‌లో వేసేస్తాడు.
సేవ గరిడి వల్ల ప్రసాదం తప్ప రూపాయి లాభంలేదని గింజుకునేవాడు సైదులు. చేతిలో డబ్బుల్లేక దాసుడిదగ్గర అప్పుకోసం చేతులు చాచేవాడు. దాసుడు లేవని తప్పించుకోబోతే..‘మందునేక నాలిక లాగేత్తున్నది. అందాక తాడిపెద్దు డొబ్బులివ్వు. ప్లేబేసినప్పుడు ఇచ్చేత్తనే!’ అంటూ బలవంతం చేసేవాడు. అతని బాధ చూడలేక తను దాచుకున్న డబ్బులిచ్చేవాడు దాసుడు. ఓ రోజు ఓ పెళ్లింటివద్ద సేవ చేసి తిరుగొచ్చాక, దాసుడు లేనప్పుడు..“కట్టం మనది. పెలితమేమో ఆడిది” అంటూ బృందసభ్యులతో అన్నాడు సైదులు.“డొబ్బులివ్వకపోతే పోయింది. ఎవురికీ సాంపిలు మందైన ఇవ్వడు. వొత్తున్న డొబ్బు బేంకులో ఏత్తున్నడో… నొక్కేత్తున్నడో ఎవుడికి తెలుసు? ఈ సారి దాసుడు పిలిత్తే ఎల్లగూడదు. అప్పుడు మన ఇలువేటో తెలిస్తది” అంటూ రెచ్చగొట్టాడు.“నా మాటింతే అందరికీ మందుకర్సు నేకుండ సేత్తను” అని ఆశ చూపించి, అందరినీ తన దారికి తెచ్చుకున్నాడు.ఓ రోజు ఆహ్వానమొచ్చిందని దాసుడు ఇంటింటికీ తిరిగి కబురు చెప్పినా.. సైదులు మాటిని ఎవ్వరూ వెళ్లలేదు. ఒక్కరూ రాకపోవడంతో దాసుడు తల్లడిల్లాడు. ఆ మరునాడు అందరినీ సమావేశపరిచి అడిగితే ఎవ్వరూ మాట్లాడలేదు. తన దోస్తు ముత్యాలును..
“ఒరే ముత్తాలు! నువ్వన్న సెప్పర? సేవ గరిడికి మీరొంతా ఎందుకు రానేదో?” అడిగాడు.
ముత్యాలు ఏదో చెప్పబోతుంటే.. సైదులు గొంతిప్పాడు.“మామంతా సేవ గరిడికెందుకు రావాలి? కస్టం మాది, డబ్బు నీదీనా? వొచ్చిన డొబ్బుల్లో సగం మాకు కర్చుసేత్తనంతే ఒత్తం. నేకపోతే రాము!” అన్నాడు.దానికి మిగిలినవారు అవునంటూ తలూపారు.దాసుడు సైదులువైపు కోపంగా చూస్తూ..“నీ దుస్టెప్పుడు తాడిపెద్దు డొబ్బుమీదున్నప్పుడే నాను కనిపెట్టేసినను. ఏదోరోజు నువ్వు సేవ గరిడిలో ముసలం పుట్టిత్తవని! అట్టాగే పుట్టించేసినవు” అన్నాడు. బాధగా నిట్టూర్చి..“మీరంత ఒకటైనాక నాను మాత్రం సేసేదేముంది. సంప్రదాయిం అటకెక్కకుండ ఉండలంతే ఒప్పుకోకదప్పదు. ఏటి సేస్తను.. మీకివ్వగ మిగిలిందే బేంకులో ఏత్తను” ఇష్టం లేకపోయినా ఒప్పుకొన్నాడు. తన మాట నెగ్గినందుకు సంతోషించాడు సైదులు.
అప్పట్నుంచి సేవ గరిడికిచ్చే సొమ్ము దాసుడి చేతిలో పడగానే.. అందరికీ మందు తెస్తానని ఆ డబ్బు తీసేసుకుంటాడు సైదులు. మందు కొనుక్కొచ్చి ఇద్దరికో క్వార్టర్ చొప్పున ఇస్తాడు.
మిగిలిన దాంట్లో కొంత నొక్కేసి, ఇంతే మిగిలిందని దాసుడి చేతిలో పెడతాడు. ఆ ఇచ్చిన డబ్బునే కిక్కురుమనకుండా తీసుకుని బ్యాంక్‌లో వేస్తున్నాడు దాసుడు. షెడ్డును చూసినప్పడల్లా.. తోడపెద్దు తడిసిపోకుండా స్లాబెప్పుడు వేయిస్తామో అనుకుంటాడు. రోజులో ముప్పావువంతు తోడపెద్దు గురించే ఆలోచిస్తాడు దాసుడు. తోడపెద్దు కూడా అతనిపట్ల విశ్వాసంగానే ఉండేది. అతను కనిపించగానే తన ఆనందాన్ని తలూపి ప్రకటించేది. అతను దాని గంగడోలు సవరిస్తుంటే.. అది అతణ్ని ఆప్యాయంగా నాకేది. తోడు లేని దాసుడికి తోడపెద్దే తోడని అంతా అనుకునేవారు. తోడనుకున్నదే పొడిచి చంపడమేమిటని ఇప్పుడు అందరూ విస్తుపోతున్నారు.
తెల్లారక పోలీసులు శవాన్ని పోస్ట్‌మార్టానికి తరలించి, మధ్యాహ్నానికి అప్పగించారు. నూకరాజు దగ్గరుండి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించాడు. దాసుడికి తలకొరివి ఎవ్వరితో పెట్టించాలని తర్జనభర్జన పడుతుంటే.. తాను పెడతానని సైదులు ముందుకొచ్చాడు. ఆ సాయంత్రం దాసుడి శవాన్ని సేవ గరిడితో ఊరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్లి, పిడికెడు బుగ్గి చేశారు.
మూడురోజులు గడిచాయి. తోడపెద్దు పొడవడం వల్లే దాసుడు చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్టొచ్చింది. దాంతో ఒకరిద్దరికున్న అనుమానం కూడా తీరిపోయింది. తోడపెద్దు దాసుడ్ని ఎందుకు చంపేసిందన్న ప్రశ్న మాత్రం సమాధానం లేకుండా ఉండిపోయింది.
తోడపెద్దు ఎప్పుడు చూసినా కోపంగా, అసహనంగా ఉంటోంది. దాంతో సేవ గరిడి బృందం హడలిపోతోంది. దానికి నీళ్లు పెట్టడానికి, గడ్డి వేయడానికి వెళ్లినవారిని పొడవడానికి ప్రయత్నిస్తోంది. దాంతో దాన్ని కట్టడిచేయడానికి ఇద్దరుముగ్గురు తమ పనులు మానుకుని ఉండాల్సొస్తోంది. తోడపెద్దు వింత ప్రవర్తన ముత్యాలుకు అంతుపట్టడంలేదు. అది దాసుడితో ఎంత ప్రేమగా ఉండేదో అతనికి తెలుసు! దాని కోసం ప్రాణాలక్కూడా తెగించిన దాసుడి గురించీ తెలుసు! ఆ రోజు జరిగిన సంఘటన అతని కళ్లముందు మెదిలింది.
అనకాపల్లిలో జరిగిన ఓ అచ్చుపోత వేడుకకెళ్లి, తోడపెద్దును ట్రక్‌లో ఉంచి తిరుగొస్తుంటే.. ట్రక్ అదుపుతప్పి రోడ్డుపక్కనున్న పెద్ద వ్యవసాయ బావిలో పడి మునిగిపోయింది. అందులో ఉన్న దాసుడు, ముత్యాలు, డ్రైవర్ ఎలాగో బయటపడి ఈదుకుంటూ పైకి తేలారు. తోడపెద్దు తేల్లేదు. ట్రక్ సైడురాడ్కు దాన్ని తాడేసి కట్టేయడంవల్ల అది పైకి తేల్లేకపోతోందని అర్థమయింది దాసుడికి. వెంటనే నీటిలోకి మునిగి పైకి తేలడానికి గింజుకుంటున్న తోడపెద్దును చేరాడు. దాని మెడ దగ్గరకెళ్లి మెడకు కట్టిన తాడును ఒడుపుగా విప్పేశాడు. దాంతో తోడపెద్దు కాళ్లాడిస్తూ దాసుడితోపాటే పైకి తేలింది. కాసేపటికి అక్కడికి చేరుకున్న జనం బావిలోకి తాడుకొసను విసిరారు. దాసుడు ఆ కొసను తోడపెద్దు నడుముకు కట్టాడు. అది అలసిపోయి మునిగి పోకుండా.. పైనున్నవారు తాడులాగి పట్టుకున్నారు. క్రేన్ సహాయంతో దాన్ని పైకి లాగాక, తోడపెద్దును పట్టుకుని ఏడ్చేశాడు దాసుడు. ముత్యాలుకు ఆ సంఘటన గుర్తుకు రాగానే తోడపెద్దు వైపు కోపంగా చూశాడు.
“నీ పేనం కాపాడిన దాసుడ్నే సంపేసినవు గదే!” అన్నాడు.“దానికంకితే నిన్ను నన్నుగూడ సంపేద్ది” అన్నాడు.. అక్కడే ఉన్న సైదులు.
“అలాగయితే దీన్ని మేపడమెలాగ?”అన్నాడు ముత్యాలు.“మేపలేం గాబట్టే వొదిలించేసుకుందం” అంటూ ఓ పరిష్కారం చెప్పాడు సైదులు.దానికి సేవ గరిడి బృందం సరేనంది. అంతా కలిసి నూకరాజు దగ్గరకెళ్లి తమ నిర్ణయాన్ని చెప్పారు.“తాడిపెద్దుకు మదమట్టుకుంది. దాన్నిక లొంగదీయలేం. ఆ పెయిత్నం సేత్తే సావల్సిందే! మదమెక్కిన తాడిపెద్దులను సిమ్మాచలం దీస్కెల్లి వొదిలేత్తరు. మనం అలాగ సేత్తే బావుంటది” చెప్పాడు సైదులు.“సరే! ఇకపై మనూరి సేవ గరిడికి దాసుడివి నువ్వే! దాసుడి దినారం అయినాక కొత్త తాడిపెద్దును తెద్దం! ముందు దీన్ని నువ్వు సెప్పినట్టు సెయ్యి” అని ఖర్చులకు కొంత డబ్బు సైదులు చేతిలో పెట్టాడు నూకరాజు.సైదులు ఆ మర్నాడే ఓ ట్రక్ తీసుకొచ్చాడు. తోడపెద్దు మూపురానికి నారాయణకట్టు కట్టి, గ్రామస్తుల సాయంతో దాన్ని కష్టంగా ట్రక్‌లోకి ఎక్కించాడు. సైదులు, ముత్యాలును వెంటబెట్టుకుని డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు. ఊరి జనం పెద్దసంఖ్యలో వచ్చి బాధగానే తోడపెద్దుకు వీడ్కోలు పలికారు.
ట్రక్ సింహాచలం తొలి పావంచాకు కొద్ది దూరంలో ఆగింది. తోడపెద్దును ట్రక్‌లోంచి కిందకు దించి.. సైదులు, ముత్యాలు దాన్ని పావంచా వరకూ నడిపించుకొని తీసుకెళ్లారు. ముత్యాలు పావంచామీద కొబ్బరికాయ కొట్టి, కొండ శిఖరంవైపు చూసి నమస్కరిస్తూ..
“అప్పన్నసామీ… నీ పెతిరూపంగా కొల్సిన తాడిపెద్దు నీ దాసుడ్నే సంపీసింది. ఎందుకు సంపిందో నీకే తెలియాల?” అన్నాడు బాధగా.
ముత్యాలు మాటలకు సైదులు విషపు నవ్వు నవ్వాడు. ఆ అసుర సంధ్య కళ్లముందు కదలాడింది.
సైదులు మొదటినుంచీ సోమరి! ఏ పనీ చేతకాదు. సొంతూరులో సేవ గరిడి బృందం దగ్గర అప్పులు చేసి.. అవి తీర్చలేక భార్యవెంట ఇల్లరికం వచ్చేశాడు. అతని భార్య తిండైతే పెట్టేదిగాని.. చేతికి రూపాయి ఇచ్చేది కాదు. దాంతో అతని కన్ను తోడపెద్దు డబ్బుమీద పడింది. క్రమంగా అతనిలో దుర్బుద్ధి మొదలైంది. ఇకపై ఆ డబ్బు తనది కావాలంటే దాసుడ్ని లేకుండా చేయాలనుకున్నాడు. అందుకు యేడాదినుంచి రంగం సిద్ధంచేశాడు. సేవ గరిడి బృందాన్ని మచ్చిక చేసుకుని మంచోడని పేరు తెచ్చుకున్నాడు. సేవ గరిడిలో రెండో దాసుడిగా ఊరి జనం దగ్గర గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతా తనకు అనుకూలంగా మార్చుకున్నాక దాసుడ్ని చంపడానికి ఆ అసుర సంధ్యను ఎంచుకున్నాడు.
దాసుడు తోడపెద్దుకు నీరు పెట్టి షెడ్డులో కట్టి, దాని ముందు పచ్చగడ్డి వేస్తున్నాడు. చుట్టుపక్కల ఎవ్వరూ లేని ఆ సమయంలో వచ్చాడు సైదులు.
వస్తూనే దాసుడికి కొమ్ము చూపిస్తూ..“ఒరే దాసుడు! ఈ కొమ్ముకి దండమెట్టుకోరా! ఇది నిన్ను సిమ్మాద్రి అప్పన్నసామి దెగ్గిరికి సేరుత్తది” అన్నాడు వెటకారంగా. దాసుడు అయోమయంగా..“ఏటన్నా దీని ఇసేసం? ఇదే కొమ్ము?” అడిగాడు.“ఎద్దు కొమ్మురా! కబేలలో ఎతికి నెలకితం అట్టుకొచ్చి దాసినాను. దీంతో నిన్ను ఆ సామి దెగ్గిరికి అంపేద్దామని” అంటూ వాడిగా ఉన్న ఎద్దు కొమ్మును దాసుడి గుండెల్లోకి బలంగా దింపాడు.భళ్లున రక్తం ఎగజిమ్మింది. కాస్త ఎడంగా మరో పోటు పొడిచాడు. దాంతో తోడపెద్దు ముందు కుప్పకూలిపోయాడు దాసుడు. నెపం తోడపెద్దు మీదకు రావడానికి రక్తాన్ని దాని కొమ్ములకు గబగబా పూస్తుంటే.. జరిగింది దానికప్పుడు అర్థమయ్యిందేమో! సైదులు మీదకు కొమ్మిసిరింది. అతను లాఘవంగా తప్పించుకుని అక్కడనుంచి మాయమయ్యాడు.
ఆ దారుణ కృత్యం తల్చుకుని ఆనందించాడు సైదులు. ఆ రోజుతో తోడపెద్దు పీడకూడా విరగడైపోతున్నందుకు అతనికి సంబరంగా ఉంది.
‘కొత్త తాడిపెద్దును తెచ్చి అచ్చుపోత పేరుతో ఊర్లో డొబ్బులు నొక్కియాల!’ అనుకున్నాడు.“ఒరే ముత్తాలు! సిట్టసివరిగ నీ సేతులతో తాడిపెద్దికి ఒట్టిగడ్డేసి వొచ్చీ” అంటూ అక్కడనుంచి ట్రక్ వైపు కదిలాడు. ముత్యాలు తోడపెద్దును ఓ చెట్టునీడకు తీసుకెళ్లి, వెంట తెచ్చిన వట్టిగడ్డిని దాని ముందేసి..“నీకు మాకు రునం తీరిపోనది. నిన్ను ఆ అప్పన్నసామికి ఒప్పగించేతున్నం! ఆ సామే నిన్నిక సల్లగ సూసుకుంతడు” అంటూ.. అది గడ్డి మేయడంకోసం నారాయణకట్టును మూపురంనుంచి తప్పించి, భయంగా అక్కడనుంచి కదిలాడు.
అంతవరకూ నారాయణకట్టు వల్ల మెడ దించలేకపోయిన తోడపెద్దు.. నెమ్మదిగా మెడదించి తల విదిలించింది. ఖురంతో గడ్డిని దువ్వింది. దాని కళ్లలోంచి అగ్గినిప్పులు కురుస్తున్నాయి. హుంకరిస్తూ వెనుదిరిగి తీక్షణంగా ఏటో చూసింది. పరుగందుకుంది. సింహాచలం కొండే దూసుకొస్తున్నట్టుగా ఉన్న తోడపెద్దును చూసి.. అక్కడున్న భక్తజనంతోపాటు ముత్యాలు కూడా బెంబేలెత్తిపోయాడు. అయితే అది తనను దాటుకుని సైదులు వైపు వెళ్లడంతో ఊపిరిపీల్చుకుని..“సైదులూ.. తాడిపెద్దు” అని కేకేశాడు.ట్రక్ వద్దకు చేరుకున్న సైదులు కంగారుగా వెనక్కి తిరిగాడు. ఎదురుగా తోడపెద్దు! హిరణ్య కశిపుడ్ని సంహరించడానికి ఎదుట నిలిచిన నరసింహస్వామిలా ఉంది. సైదులు తేరుకునేలోగా.. అతణ్ని తన వాడి కొమ్ములతో కుమ్మేసింది. నేలకు ఆనించి కసితీరా నలిపేసింది. కొమ్ములతో సైదులు పేగులను బయటకు లాగేసింది. తోడపెద్దు క్రోధంతో హుంకరిస్తోంది. దాని మొనదేలిన కొమ్ముల చివర్లకు అంటిన రక్తం.. బొట్లుబొట్లుగా నేలరాలుతోంది.
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం కొండ పైనుంచి మైక్‌లో నరసింహ మంత్రం వినిపిస్తోంది.బొడ్డేడ బలరామస్వామి అనకాపల్లి జిల్లా, కశింకోట గ్రామం.. బొడ్డేడ బలరామస్వామి స్వస్థలం. ప్రైవేటు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈయనది వ్యవసాయ కుటుంబం. ఇప్పటివరకూ 33 కథలు, కొన్ని కవితలు.. వివిధ పత్రికలలోనూ, సంకలనాలలోనూ ప్రచురితమయ్యాయి. చతుర నవంబరు 2018 సంచికలో ఈయన రాసిన ‘ఆకుపచ్చని చంద్రుడు’ నవల అచ్చయ్యింది. ‘సముద్రం’ కథకు 2017లో స్వాతి మాస పత్రిక నుంచి ‘అనిల్ అవార్డు’ అందుకున్నారు. గౌరీ గ్రంథాలయం, అనకాపల్లి కథలపోటీలో ‘ఆడపిల్ల’ కథకు డా. సి. నారాయణరెడ్డి చేతుల మీదగా ద్వితీయ బహుమతి అందుకున్నారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం కథల పోటీ-2021లో ‘కీడు గుడిసె’ కథకు ప్రత్యేక బహుమతి, కథల పోటీ-23/24లో ‘డేగ’ కథకు తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. ‘కళింగ పౌరుషం’ చారిత్రక కథకు జాగృతి వార పత్రిక నుంచి ప్రోత్సాహక బహుమతి, ‘పట్టుచీర’ కథకు హాస్యానందం పత్రిక నుంచి ప్రత్యేక బహుమతి దక్కించుకున్నారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో తృతీయ బహుమతి రూ.10 వేలు పొందిన కథ.
-బొడ్డేడ బలరామస్వామి
89197 07141