Ramayanam | ఓ సంక్రాంతి సెలవుల్లో అక్కా, నేనూ మాత్రమే కాదు, పెండ్యాల నుండి ఇంద్రాణి కూడా వచ్చింది. వాళ్లిద్దరూ రోజూ కాలేజీలో కలుస్తూనే ఉంటారు గానీ, నేను మళ్లీ ఎండాకాలం సెలవుల దాకా కలవను కదా! అని వచ్చి ఓ పదిరోజులుంది.
నేను తనను ఎప్పుడూ ‘అక్కా’ అని పిలవలేదు. అక్క ‘ఇందూ’ అంటే నేను ‘ ఇంద్రాణీ’ అని పిలిచేదాన్ని. మేము చాలా స్నేహంగా ఉండేవాళ్లం. ముచ్చట్లు, నవ్వులు, ఆటలు, అల్లరి… చెప్పలేనంత హడావుడిగా వుండేది. ఓ రోజు హై స్కూల్లో వాళ్ల క్లాస్మేట్ వెంకటేశ్వర్లు మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి ఏ మగపిల్లలు వచ్చినా నాన్న ఎలాంటి అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేయడం గానీ, గూఢచారి పనులు చేయడం గానీ జరిగేది కాదు. అమ్మ కూడా వాళ్లు వెళ్లిపోయినాక మాత్రమే విషయమేమిటి అని తెలుసుకునేది.
ఇంతకూ వెంకటేశ్వర్లు ఓ కథ రాసి పట్టుకొచ్చాడు. వస్తూనే ‘సంధ్యారాణీ! నేనొక కథ రాసిన! ఒకసారి చదివి కొంచెం ఫెయిర్ చేసి పెడుతవా?’ అని అడిగాడు. ఇంద్రాణిని చూసి ‘ఓ, నువ్వు గూడ ఇక్కడ్నే ఉన్నవా? ఇద్దరిట్ల ఎవరన్న రాసి పెట్టుండి’ అన్నాడు. వెంకటేశ్వర్లు క్లెవర్ స్టూడెంట్. నాకు వెంటనే ఆ కథేమిటో చదవాలనిపించింది. కానీ, అతను నన్నూ, నా కథలు చదివే నైపుణ్యాన్నీ ఏ మాత్రం గుర్తించకుండా నన్నొక బచ్చా ( బచ్చీ అనాలేమో కదా!) లాగా చూసి ఏ మాత్రం లెక్కజేయకపోవడం నాకు నచ్చలేదు. ఇంద్రాణి అప్పటికే కథ చదవడం మొదలు పెట్టింది కూడా. ‘ఏడ జైన్ అయినవ్?’ అని నా శ్రేయోభిలాషిలా నన్ను అడిగాడు వెంకటేశ్వర్లు. ‘హైదరాబాద్’అని నేను చెప్పాను. ‘హైద్రాబాదుల ఏడ?’ అన్నాడు. ‘రెడ్డి కాలేజ్’ చెప్పాను.
‘అంటే కో ఎడ్డా?’ అని చాలా కంగారుపడ్డాడు. ‘కాదు, విమెన్స్ కాలేజీ’ అన్న! ‘గదే చూస్తాన, రెడ్డి కాలేజి అంటే గరల్స్ది అనిపిస్తలేదు. మీ అక్కను ఉమెన్స్ కాలేజీల ఏసి నిన్ను గట్ల జేస్తరా అనుకుంటాన’ అన్నాడు ఏదో ప్రమాదం తప్పిపోయినట్టుగా. ‘అయిన సుత గంత దూరం ఎందుకు పోయినవ్?’ అన్నాడు మళ్లీ. ‘మరి హైద్రాబాదు గక్కడ్నే ఉన్నది, ఏం జేద్దాం?’ అన్నాను నేను. ‘గట్ల గాదు, మీ అక్క హన్మకొండ, నువ్వు హైద్రాబాదు ఉండేదానికంటే ఇద్దరు హన్మకొండల ఒక్క కాడ్నే ఇల్లు కిరాయికి తీస్కోని ఉండొచ్చు గద మంచిగ!’ అని సలహా ఇచ్చాడు. ‘మాకు వంట రాదు గద, ఎట్ల? అయినా మా అమ్మానాన్న గక్కడ్నే జాయిన్ జేసిన్రు ఏం జేస్తం?’ అన్నాను నేను.
ఈ లోగా ఇంద్రాణి కథ మొత్తం చదివాక అక్కకు ఇస్తే అక్క చదవడం మొదలుపెట్టింది. ఇంద్రాణి నా వైపు చూసింది ‘ ఇక చూస్కో!’ అన్నట్టుగా. ‘అవును గానీ, వెంకటేశ్వర్లూ.. నువ్వు కథలు గూడ రాస్తున్నావా?’ అంటూ ప్రారంభించి ‘అబ్బో, పెద్ద రచయితవు అయినాక మేం యాదికుంటమా? అప్పుడు నీ ఆటోగ్రాఫన్న ఇస్తవో లేదో! ఇప్పుడే తీసుకోవాలె!’ అంటూంటే అతను మెలికలు తిరిగిపోయాడు. ‘ఇంతకూ నీకు కథలు ఉత్తమ పురుషల రాసుడు ఇష్టమా? ప్రథమ పురుషలనా? ఎట్లాటి కథలిష్టం? కామెడినా, ట్రాజెడీనా, లవ్‌స్టోరీలా?
పౌరాణిక, చారిత్రక, సామాజిక కథలల్ల ఏవి ఎక్కువ రాయాల్ననుకుంటున్నవ్?’ అంటూ ప్రశ్నల్తో చంపేసేసరికి వెంకటేశ్వర్లు ఊహించని ఈ ఎదురుదాడికి జవాబు చెప్పలేకపోయాడు. ‘ఇంతకు ఇది కొత్త కథ తీరుగ లేదు, ఇది ‘మంచి మనసులు’ సిన్మా కథ గదా! కాకపోతె ఆ సిన్మాల నాగేశ్వర్ రావు తనకు పెండ్లయిందని సావిత్రికి అబద్ధం చెప్తడు, నీ కథల అదేం వుండదు. అండ్ల హీరో, హీరోయిన్ ప్రేమించుకుంటరు గానీ, పెండ్లి చేసుకోరు. నీ కథల జేసుకుంటరు. హీరో చదువుకోవడానికి సిటీకొచ్చి హీరోయిన్ ఇంట్ల ఉండుడు, వాండ్లు ప్రేమించుకునుడు అన్నీ సేమ్! అయినా గూడ గా పాత బ్లాక్ అండ్ వైట్ సిన్మా ఎందుకు? కొత్త కలర్ సిన్మాల తీరుగ ఏదన్న ట్రై జెయ్యకపోయినవా?’ అని అంటుంటే వెంకటేశ్వర్లు దిక్కులు చూడటం మొదలుపెట్టాడు.
ఆలోగా అక్క కూడా కథ చదివేసింది. ‘ఇగో వెంకటేశ్వర్లూ! నీ రైటింగ్ బాగుంటది. నా రైటింగ్ అంత గొప్పగ వుండదని నీకు తెలుసు. మరి నువ్వు రాసిన కథ నేను ఫెయిర్ చేసుడేంది చెప్పు! దానికన్న ‘నేనొక కథ రాసిన, చదివి ఎట్లున్నదో చెప్పు’మంటే చెప్పుతం గద! గీ ఫేర్ జేసుడు, గిదంత ఏంది? అయినా గూడ కాపీకథ కాకుండ కొత్త కథ ఏదన్న రాయి, చదివి చెప్పుతం’ అన్నది. ‘అది గాక నీ కథల లాజిక్ గూడ మిస్ అయ్యింది’ అని అక్క అనగానే వెంకటేశ్వర్లు రోషంగా ‘కథలల్ల లాజిక్ ఏముంటది? కథంటేనే ఊహించి పుట్టిచ్చుడు గద!’ అన్నాడు.
‘అవునుగానీ, నీ కథల హీరో, హీరోయిన్ ఒక్కూరోళ్ళే! హీరోయిన్ చదువు కొరకు సిటీకి పోతె హీరో కూడా చదువుకునేటందుకు అదే సిటీకి పొయ్యి ఇల్లు కోసం ఎతుక్కుంటు హీరోయిన్ తండ్రిని కలిసి ఆయన చెప్పంగనే వీళ్లింట్ల అవుట్ హౌస్‌ల వుంటడు. హీరో, హీరోయిన్ తరువాత ప్రేమించుకుంటరు! అది వేరే సంగతి గానీ, మరి ఒక్కూరోళ్లు అయినపుడు మొదలు చూసినపుడు వాళ్ల నాన్నకు తెలువకుంటే మానే గాని, హీరోయిన్ ఆ హీరోను గుర్తుపట్టదా?!దాన్నే లాజిక్ లేకపోవుడు అంటరు’ అని వివరించింది అక్క.
‘అయితె ఇది చిరంజీవులు, మంచి మనసులు మిక్సింగ్ అన్నట్టు. లేకపోతె ఫస్ట్ సగం ఓన్ కథ కావొచ్చు. అంతేనా?’ అన్నది ఇంద్రాణి. అంత డైరెక్ట్ గా అటాక్ చేసేసరికి తట్టుకోలేక ఆ కథ రాసిన పేపర్లు అడిగి తీసుకుని వెంకటేశ్వర్లు ఒకటే పరుగు ! అయితే వారం రోజులకే మేము ఊహించని ఒక సంఘటన జరిగింది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి