Kasi Majili Kathalu Episode 83 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కన్యాకుబ్జ యువరాజు పుష్పకేతుడితోపాటు అతని నలుగురు సోదరులూ.. తమిళదేశంలోని స్త్రీ రాజ్యానికి వెళ్లారు. అక్కడ పుష్పకేతుడి సోదరులు నలుగురూ కనిపించకుండా పోయారు. వాళ్లను కనుగొనే ప్రయత్నంలో సౌమ్యుడనే ఆఖరు తమ్ముడు ఒక వేశ్య ఇంటిలో చిక్కుకున్నాడని తెలిసి.. ఆ వేశ్యను విద్యలలో ఓడించాడు పుష్పకేతుడు.
ఆ నారీరత్నం వయ్యారంగా నడిచి వచ్చింది. పుష్పకేతుని మెడలో వరమాల వేసి, పాదాలకు నమస్కరించింది. “స్వామీ! నా పూర్వపుణ్యం ఇప్పటికి ఫలించింది. సకల కళాకోవిదులైన మిమ్మల్ని పతిగా పొందగలిగాను” అన్నది. పుష్పకేతుడు దూరంగా జరిగాడు. “నేను నీవంటి వేశ్యల వలలో పడేవాణ్ని కాను. నా తమ్ముడైన సౌమ్యుడిని నీ చెర నుంచి తప్పించడానికే నిన్ను విద్యలలో ఓడించాను. వాణ్ని పిలిపిస్తే వెళ్లిపోతాను” అని పలికాడు. ఆమె వెలవెలపోయే ముఖంతో.. “రాజనందనా! ముందు నా వృత్తాంతమంతా వినండి. తరువాత మీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు. నేను వేశ్యను కాను. ఈ దేశాన్ని పాలించే మహారాణిని. నన్ను రత్నమకుట అంటారు. నేనీ రాజ్యానికి వచ్చి సంవత్సరం దాటింది. మా దేశాచారాలు విచిత్రమైనవి. మా రాజ్యంలో విద్యాధికులైన పురుషులు చాలా తక్కువగా ఉన్నారు. నేను ఉత్తముడైన పతిని పొందాలని, ఒక బౌద్ధసిద్ధుణ్ని ఆశ్రయించాను. ఆయన నా భక్తికి మెచ్చి.. కొన్ని శ్లోకాలు గల ప్రశ్నోత్తరాలు రాసి ఇచ్చాడు. ‘వీటికి ఎవరు సరైన సమాధానాలు ఇస్తారో వారిని నువ్వు వరించు’ అని బోధించాడు. నేను ఆ రీతిగానే.. నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన వారినే వరిస్తానని బహిరంగంగా ప్రకటించాను.
నేను మహారాణిని కావడంతో అత్యాశతో రోజూ ప్రతివాడూ వచ్చి విసిగిస్తుండేవాడు. దాంతో విసిగి, ఈ ఎత్తు పన్నాను. ఈ భవంతి ముందు వేరొక చిత్రపటాన్ని వేలాడదీసి, వేశ్యగా చిత్రించాను. ఆ చిత్రాన్ని చూసి కూడా చాలామంది వస్తుండటంతో.. ఓడినవారిని తోటపనికి వినియోగిస్తానని షరతు పెట్టాను. ఆ షరతు మేరకే మీ తమ్ముడు పనివాడయ్యాడు. అతను వలచింది చిత్రంలోని వేశ్యను. కానీ, నిజంగా నన్ను గెలిచింది మీరే!” అని చెప్పి ఆపింది.
పుష్పకేతుడు ఆమె మాటలకు సంతోషించాడు. పక్కనే ఉన్న పుష్పమాలను ఆమె మెడలో వేశాడు. ఆ మరునాడే పుష్పకేతుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. అయితే స్త్రీ మాత్రమే పాలకురాలు కావాలనే ఆ రాజ్యపు సంప్రదాయాన్ని అనుసరించి.. రత్నమకుటకే సింహాసనంపై కూర్చునే అవకాశమిచ్చాడు. పుష్పకేతుని తమ్ముడైన సౌమ్యుడితో పాటుగా.. అంతకుముందు ఓడినవారందరూ విడుదలయ్యారు. ఇక తన మిగిలిన ముగ్గురు తమ్ముళ్లనూ వెతకాల్సిన బాధ్యత పుష్పకేతునిపై ఉంది. కానీ, ఎంత ప్రయత్నించినా వారెక్కడికి వెళ్లారో తెలియరాలేదు.
* * *
ఒకనాడు.. ఆ రాజ్యపాలనా విశేషాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే కుతూహలంతో పుష్పకేతుడు కూడా, రత్నమకుటతో పాటుగా కొలువుకూటానికి వచ్చాడు. సింహాసనానికి పక్కగా వేరొక పీఠంపై కూర్చున్నాడు. పక్కనే భర్త ఉండటంతో కొంచెం వణుకుతున్న గొంతుతో.. “మంత్రిగారూ! ఈరోజు విచారించాల్సిన అభియోగాలు ఏమున్నాయి?!” అని ప్రశ్నించింది రత్నమకుట. మంత్రి పైకి లేచి.. “మహారాణీ! నేడు ముఖ్యంగా రెండు హత్యాపరాధ విషయాల్లో తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఒకదానిలో వాది, ప్రతివాదులు ఇద్దరూ వచ్చారు. రెండోదానిలో వాది మాత్రమే వచ్చాడు” అని చెబుతూ కాగితాలకట్ట ఆమెకు అందించాడు. రత్నమకుట వణికే చేతులతో వాటిని అందుకుని.. “మీ ఎదుట నేను తీర్పు తీర్చలేను. మీరే విచారించి, న్యాయం చేయండి” అని భర్తకు అందించింది.
అతడు నవ్వుతూ..
“నీ పాలనావిధానం చూడాలని నేను వస్తే నా మీదే భారం పెట్టావా?! సరే కానివ్వు” అంటూ ఆ కాగితాలను నిశితంగా పరిశీలించాడు. “మణిమంతుడు, రత్నపాదుడనే వర్తకులిద్దరినీ పిలవండి” అని భటులను ఆజ్ఞాపించాడు.వాళ్లిద్దరూ వచ్చి.. మహారాణికి, రాజుకు నమస్కరించి నిల్చున్నారు. “మణిమంతా! నీది ఈ ఊరేనా?! నువ్వు కోటీశ్వరుడవట నిజమేనా?!” అని ప్రశ్నించాడు పుష్పకేతుడు.
“అవును ప్రభూ! తాతముత్తాతల నుంచి మాది ఈ ఊరే. ప్రభుత్వానికి ఏడాదికి పదికోట్లకు పైగా పన్ను కడుతున్నా” అని సమాధానమిచ్చాడు మణిమంతుడు. “ఈ రత్నపాదుణ్ని ఎరుగుదువా?!” అని తిరిగి ప్రశ్నించాడు పుష్పకేతుడు.
“ఎరగబట్టే నా కొంపనిలా ముంచాడు” అని మొత్తుకున్నాడు రత్నపాదుడు. “నువ్వు మధ్యలో మాట్లాడకూడదు. మణిమంతుణ్ని చెప్పనివ్వు!” అని ఆజ్ఞాపించాడు పుష్పకేతుడు. మణిమంతుడు తన కథను చెప్పసాగాడు. “ప్రభూ! నేను చాలా భాగ్యవంతుడినైనా సంతానం లేక కొంతకాలం పరితపించాను. చివరికి కొంతకాలానికి కన్యకా పరమేశ్వరి కృపావిశేషం చేత నాకొక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ఏడేళ్ల వయసున్నప్పటి నుంచి పెళ్లి సంబంధాల కోసం ఎంతగానో వెతికాను. అల్లుడికోసం నాలుగేళ్లపాటు దేశదేశాలన్నీ గాలించాను. చివరికి శుకద్వీపంలో ఉండే ఈ రత్నపాదునికి కుమారుడు ఉన్నాడని తెలిసి.. పెళ్లి మాటల కోసం నలుగురు బ్రాహ్మణులను పంపాను. వారు వీరి స్థితిగతులు, వరుని విద్యాశీలాలు పరిశీలించి.. మాకు తగిన సంబంధమని తెలిపారు.
అది మొదలు నేను, నా పరిజనులు వీరింటి చుట్టూ ఆరుమాసాలు తిరిగాం. మాకు రాకపోకలకే పదివేలు వ్యయమయ్యాయి. చివరికీ మహానుభావుడు అంగీకరించాడు. సిద్ధాంతులు ఆరుమాసాల వ్యవధిలో సుముహూర్తం నిశ్చయించారు. ఇరవైవేలు ఖర్చుపెట్టి ఊరంతా పందిళ్లు వేయించాను. బంధువులు నెలరోజుల ముందే వచ్చారు. పేరుపొందిన నూరుమంది భోగం మేళాలను, వందమంది చొప్పున వైణికులను, గాయకులను, భాగవతులను పిలిపించాను. సుముహూర్తానికి మూడురోజుల ముందునుంచే పందిళ్లలో ఉత్సవాలు మొదలయ్యాయి. పదివేల మందికి సరిపడేలా మగపెళ్లివారికి విడిది ఏర్పాట్లు చేశాను. దారిలోనే స్నాతకం చేసుకుని, సుముహూర్తం నాటి ఉదయానికల్లా తప్పకుండా వస్తామని రత్నపాదుడు చెప్పడం వల్ల వారికోసం నిరీక్షిస్తున్నాను. జాముపొద్దెక్కి, రెండుజాములైనా వీరి జాడ కనిపించక పోవడం వల్ల గుర్రాలెక్కించి రౌతులను పరుగెత్తించాను. వాళ్లు చాలాదూరం పోయారు. మగపెళ్లివారు తమకు కనిపించలేదని చెప్పారు. సరే.. రాత్రి లగ్నంలోపుగా రాకపోతారా!? అని మా సన్నాహాలలో మేమున్నాం. అంతలో సూర్యుడు అస్తమించాడు. కానీ వాళ్లు రాలేదు.
‘ఇంక రెండు గడియలలో పీటలపై కూర్చోవాలి. మగపెళ్లివారెక్కడా?!’ అని పురోహితుడు తొందరపెట్టసాగాడు. ఏమని సమాధానం చెప్పాలో తోచక, దారివెంట చూడసాగాను. ఇంతలో ఇద్దరు గుర్రపు రౌతులు వడిగా వచ్చిపడ్డారు. ఒక ఉత్తరం నా చేతిలో పెట్టారు. దాంట్లో ఇలా ఉంది.
‘మేం రత్నపాదునికి సమీప బంధువులం. ముందుగా అనుకున్న రోజునే రత్నపాదుడు పదివేల మందితో కలిసి ఓడలపై బయల్దేరాడు. దారిమధ్యలో సముద్రపు తుఫాను తాకిడికి, వారు ప్రయాణిస్తున్న ఓడల్లో కొన్ని ఒక కొండకు ఢీకొని విరిగిపోయాయి. అందులో ఉన్నవారంతా సముద్రంలో మునిగిపోయారు. మేము కొంతమంది మాత్రం మిగిలాం. రత్నపాదుని కుటుంబం జాడ తెలియలేదు. వారికోసం మేం ప్రయత్నాలు చేస్తున్నాం. వారి జాడ తెలిసేవరకు మీరు ముహూర్తాన్ని వాయిదా వేయవలసింది’.. ..ఆ ఉత్తరాన్ని చదువుకున్న నాకు నవనాడులూ కుంగిపోయాయి. ఏం చేయడానికీ తోచలేదు. అంతలో భగవంతుడే నాకొక ఊహ తెప్పించాడు. ఉత్సవ పందిళ్లలో ఉన్న ప్రేక్షకులను గమనిస్తూ అటూఇటూ పచార్లు చేశాను. ఒకచోట మేజువాణి చూస్తున్న ఒక చిన్నవాడు నాకు కన్నుల పండుగ చేశాడు. విశాలమైన నేత్రాలు, చంద్రబింబం వంటి ముఖం, ఆజానుబాహువులు, పెద్ద ఛాతీ కలిగిన ఆ పురుషుని వద్దకు వెళ్లి.. ‘అబ్బాయీ! నీదే కులం?’ అని ప్రశ్నించాను.
అందుకతడు.. ‘నేను ద్విజుడిని’ అని చెప్పాడు. ‘మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాను. అంగీకరిస్తావా?!’ అని ప్రశ్నించాను. అతడు చిరునవ్వుతో.. ‘అంగీకరించకేమి?!’ అన్నాడు. అప్పటికప్పుడు అతడే నా అల్లుడని నిశ్చయించుకున్నాను. నా భార్య సంతోషించింది. వరుడు ఉత్తమ లక్షణాలు కలవాడని బ్రాహ్మణులు కొనియాడారు. పుణ్యస్త్రీలు మంగళస్నానాలు చేయించి, పట్టువస్ర్తాలు ధరింప చేశారు. మొత్తంమీద అనుకున్న ముహూర్తానికే కన్యాదాన మహోత్సవం జరిపించాను. పెళ్లి వేడుకలు ఇంకా ముగిసిపోక ముందే.. ఆనాటికి ఏడోనాడు రత్నపాదుడు పదివేల పౌజుతో వచ్చాడు. ఊరిబయట ఉద్యానంలో విడిది చేశామని కబురు చేశాడు.
నాకు గుండె ఝల్లుమంది. బిక్కచచ్చిపోతూనే వెళ్లి కలిశాను. జరిగిన సంగతిని మర్యాదగా తెలియచేశాను. రత్నపాదుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు.
‘ఓరీ తుళువా! నువ్వు సంపన్న గృహస్థుడివని, దూరమైనా నీ సంబంధం అంగీకరించాను. మేం వచ్చేవరకు ముహూర్తం వాయిదా వేయమని ముందుగా కబురు చేసినా.. నీ దారిన నువ్వు పెళ్లి జరిపించేస్తావా?! నీకంటే పశువైనా మేలే!’ అంటూ నోటికి వచ్చినట్టు తిట్టసాగాడు. నేను అనేక విధాలుగా బతిమాలుకున్నాను. ‘మీ రౌతులు చెప్పిన మాటల వల్ల మీరు బతికి ఉంటారనే ఆశ నాకు లేకపోయింది. మరో సుముహూర్తం మూడేళ్ల వరకు లేదని దైవజ్ఞులు చెబుతున్నారు. వచ్చిన బంధువులు నిలవరు. చేసిన సామగ్రి చెడిపోతుంది. దైవఘటన లేదని తలచి, వీధిలో పోయేవాడికిచ్చి చేశాం’ అని చెప్పుకొన్నాను.
‘పుట్టు ముహూర్తం లేకపోతే పెట్టు ముహూర్తం ఉండదా?! సామగ్రి చెడిపోతుందని కదా.. పెళ్లి చేశావు?! నీ సామగ్రిని, నీ కొత్తల్లుణ్ని, చుట్టాలతో కూడా మట్టుమాపుతాను చూసుకో! నీ భాగ్యమంతా కొల్లగొట్టి, మా ఇంటికి పట్టించుకుని పోకపోతే నా పేరు మార్చుకుంటాను’ అని సవాలు చేశాడు రత్నపాదుడు.
రత్నపాదుడి పరిజనం దుడ్డుకర్రలు చేతపట్టుకుని బయల్దేరింది. పందిళ్లను కూలదోసింది. వంట సంబారాలను, ఇతర సామగ్రిని చిందరవందర చేయసాగింది. అడ్డువచ్చిన వారందరినీ చావబాదసాగింది. ఇంతలో మా అల్లుడు మెరిసే కత్తిని చేతబూని బయటికి వచ్చాడు. తన గుర్రాన్ని మడమలతో కొడుతూ.. శత్రుమూకల మధ్యకు చొచ్చుకుపోయాడు. గుర్రపు డెక్కలచేత వారిని తొక్కించి, కత్తివేటు వేస్తూ.. వారినందరినీ తోసి, గుచ్చి, పొడిచి బెబ్బులిలా చెలరేగిపోయాడు. గడియలో రత్నపాదుని బలగాన్నంతా పీనుగుపెంట చేసి పారేశాడు. ఆనాడు మా అల్లుడు అడ్డుపడకపోతే ఈ రత్నపాదుడు మా ఇల్లు కొల్లగొట్టేవాడే! ఇందులో మా తప్పేం ఉందో దేవరవారు విచారించాలి”..
..అని మణిమంతుడు చెప్పడం పూర్తిచేశాడు.
“రత్నపాదా! అతను చెప్పిన దాంట్లో అసత్యమేమైనా ఉందా?!” అని ప్రశ్నించాడు పుష్పకేతుడు. “అంతా సత్యమే ప్రభూ! నిరాయుధులైన మా భటులను పీనుగుపెంటలను చేసి, మా తప్పేమీలేదని ఇతను కల్లబొల్లి మాటలు చెప్పడం విచిత్రంగా లేదా?! నేను అవమాన భారాన్ని తట్టుకోలేకే దాడులు చేయించాను కానీ, వేరే ఉద్దేశం లేదు. అంతమాత్రానికే.. ఇలా హత్యలు చేయించవచ్చా!? ఈ అపరాధాన్ని మీరు విచారించరా?!” అన్నాడు రత్నపాదుడు.
“వియ్యంకుణ్ని ఊరికే బెదిరించడానికి పదివేల జనంతో ఇంటిమీద పడ్డావన్నమాట! ఆ పెళ్లిపందిళ్లన్నీ భగ్నం చేయించావన్నమాట! అంతేనా?! బాగుంది నీ న్యాయం. ఇంక నువ్వు ఊరుకో. అది సరేకానీ, మణిమంతా! నీ అల్లునికి కూడా ఆజ్ఞాపత్రిక పంపాం కదా.. అతడు రాలేదేం!? బలవంతుడనని గర్వం కాబోలు!” అని దర్పం ఉట్టిపడుతూ పలికాడు పుష్పకేతుడు.
మణిమంతుడు నీళ్లు నమిలాడు. “అంతమాట అనకండి ప్రభూ! మీరు పాలకులు.. మేము పాలితులం. మీరు ఆగ్రహిస్తే మేం బతకలేం. మా అల్లుడు కూడా వినయవంతుడే కానీ, గర్విష్టి కాదు” అని విన్నవించుకున్నాడు.
“సరే.. నువ్వు పోయి ఇప్పుడే వెంటపెట్టుకు రా. అతణ్నుంచి కొంత సాక్ష్యం తీసుకోవాల్సి ఉంది” అని ఆజ్ఞాపించాడు పుష్పకేతుడు. మంత్రి వైపు తిరిగి.. “రెండో అభియోగంలో వాదిని ప్రవేశపెట్టండి” అన్నాడు.
(వచ్చేవారం.. కుందమాల తల్లి)
– అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ