Kasi Majili Kathalu Episode 126 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : కాశీమజిలీల్లో ఇంతకుముందే చెప్పుకొన్న సప్తమిత్ర చరిత్రలో.. ఒక సందర్భం ఉంది. ఘోటకముఖుడు.. మిత్రవింద అనే స్త్రీతో దత్త చరిత్రలోని మదాలస కథను చెప్పాడు. మదాలస గొప్ప పతివ్రత. గొప్ప మాతృమూర్తి. సప్తమిత్ర చరిత్ర కథా సందర్భంనుంచి వేరుపరిచి మదాలస గాథను ఓసారి పరికిద్దాం.
శత్రుజిత్తు అనే మహారాజు కుమారుడు ఋతుధ్వజుడు.ఆ రాజపుత్రుడు బుద్ధికి బృహస్పతి. రూపానికి మన్మథుడు. అతనికి సమాన వయోబుద్ధి విక్రమాలు కలిగిన స్నేహితులు అనేకమంది ఉండేవారు. వారితో కలిసి వీణాగానం, కవిత్వ రచన, తపోధనుల ఆరాధన, శాస్ర్తార్థ ప్రసంగాలు చేస్తుండేవాడు. వేటాడినా, నౌకా విహారాలు చేసినా.. భోగస్త్రీలను మాత్రం దగ్గరికి రానిచ్చేవాడు కాదు. వయసులో చిన్నవాడే అయినా అతని కీర్తి ముల్లోకాలలోనూ వ్యాపించింది.
అతని స్నేహితులలో ఇద్దరు నాగకుమారులు కూడా ఉండేవారు. పాతాళంలో ఉండే అశ్వతరుడనే నాగరాజు పుత్రులు వారు. ప్రతిరోజూ ఉదయాన్నే మానవ రూపాన్ని పొంది, ఋతుధ్వజుని వద్దకు వచ్చేవారు. ఆ ముగ్గురి స్నేహం లోకాలకే ఆదర్శప్రాయంగా ఉండేది.
ఇలా ఉండగా నాగరాజు అయిన అశ్వతరుడు..
“కుమారులారా! మీరు ప్రతిరోజూ ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు? మళ్లీ చీకటి పొద్దులో తప్ప ఇంటికి తిరిగి రావడం లేదు. ఇంతసేపు ఎక్కడ ఏం చేస్తున్నారు?” అని ఆరా తీశాడు.
అప్పుడు వారు, తమ స్నేహితుడైన ఋతుధ్వజుని గుణగణాలను కీర్తిస్తూ అతని గురించి అనేక విశేషాలు తండ్రికి తెలియచేశారు.
ఆ కథలన్నీ విన్న తరువాత..
“ఇంతటి పుణ్యాత్ముడు మీకు స్నేహితుడు కావడం నిజంగా అదృష్టం. అతని గుణాలను గురించి విన్న తరువాత అతనికేదైనా మహోపకారం చేయాలని ఉంది. అతనికేం కావాలో కనుక్కుని నాకు చెప్పండి” అన్నాడు అశ్వతరుడు.
“తండ్రీ! అతనివద్ద లేనిది మనమేమి ఇవ్వగలం? అతను పరధనాన్ని ఆశించడు కదా!” అని సందేహం వ్యక్తం చేశారు కుమారులు.
“అయినా సరే.. అతను కోరితే ఏదైనా ఇవ్వాలని నాకు బలంగా అనిపిస్తున్నది” అన్నాడు తండ్రి.
అప్పుడు ఆ కుమారులు అశ్వతరునికి ఒక విశేషాన్ని తెలియచేశారు.
“తండ్రీ! ఋతుధ్వజునికి కావాల్సిన వస్తువేదీ లేదు. కానీ, అతని మనసుకు ప్రియమైనది ఒకటుంది. దానిని సాధించిపెట్టాలంటే.. త్రిమూర్తులకే తప్ప ఇతరులకు శక్యం కాదు. అయినప్పటికీ విద్వాంసులకు సాధ్యం కానిది లేదు. దృఢమైన సంకల్పం ఉంటే దేవత్వాన్ని కూడా సంపాదించవచ్చు. చీమ కూడా నిత్యం నడిస్తే వందయోజనాల దూరంలోని తన గమ్యస్థానాన్ని చేరుకోగలదని మీరు తరచుగా మాకు ప్రబోధం చేస్తుంటారు కనుక, అతని మనోభీష్టాన్ని గురించి చెబుతున్నాం.. వినండి.
ఋతుధ్వజుని చిన్నవయసులో గాలవుడు అనే మహర్షి ఒక గుర్రమెక్కి, శత్రుధ్వజుణ్ని సందర్శించాడు. ఆయన చేత అర్చించబడిన తరువాత..
“మహారాజా! నేను తపస్సు చేసుకుంటుండగా.. ఒక రక్కసుడు నా ఆశ్రమానికి వచ్చి తన మాయాప్రభావం చేత నా తపస్సును భగ్నం చేస్తున్నాడు. నేను కన్నులు మూసుకునే వేళకు వాడు వచ్చి, ఏదో అల్లరి చేసి, నా మనసును చలింప చేస్తున్నాడు. నా కంటిచూపుతో వాణ్ని భస్మం చేయగలను. కానీ, దానికోసం నా తపస్సును వ్యయం చేసుకోవడం నాకిష్టంలేదు.
ఒకనాడు ఆ రాక్షసుని చేష్టలు చూస్తూ.. ఆకాశం వంక చూస్తూ, వేడి నిట్టూర్పు విడిచాను. ఆ నిశ్వాసం నుంచి ఇదిగో ఈ తురగం పుట్టింది. వెనువెంటనే ఆకాశవాణి.. ‘గాలవా! ఈ సైంధవం పాతాళంలోనూ, ఆకాశంలోనూ, నీటిలోనూ కూడా నిరాటంకంగా పోగలదు. భూవలయమంతా ఆయాసం లేకుండా పరిగెత్తగలదు. కాబట్టి దీనికి కువలయము’ అనే పేరు వచ్చింది. దీనిని తీసుకుపోయి, శత్రుజిత్తుని కుమారునికి అర్పించు. అతనే ఆ రాక్షసుణ్ని సంహరించగలడు’ అని పలికింది. కాబట్టి ఓ రాజా! ఈ గుర్రాన్ని నీకొడుక్కి ఇస్తున్నాను. దీనిపై నీ కొడుకును ఎక్కించి నా ఆశ్రమానికి పంపు. అతనే శత్రుంసహారం కావించగలడు” అని కోరాడు.
రాజు అందుకు ఒప్పుకొన్నాడు. కుమారునికి ఆనతిచ్చాడు. కువలయము అనే అశ్వాన్ని ఎక్కి సంచరిస్తాడు కాబట్టే.. ఋతుధ్వజునికి ఆనాటినుంచి కువలయాశ్వుడు అనే పేరు కలిగింది. అతను గాలవ మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. ఒక సంధ్యాసమయంలో మహర్షి అగ్నిని అర్చిస్తున్న వేళ.. రాక్షసుడు వరాహరూపంలో వచ్చాడు. రాజపుత్రుడు తురగమెక్కి, విల్లు ఎక్కుపెట్టాడు. వరాహాన్ని అర్థచంద్రాస్త్రంతో కొట్టాడు.
ఆ దెబ్బతో అది మొర్రో అంటూ బొబ్బపెడుతూ.. ఒక గోతిలో పడి, పాతాళానికి పోయింది. కువలయాశ్వుడు కూడా దానిని వెంబడించాడు. దారంతా అంధకార బంధురంగా ఉంది. అందులో వెళ్లగా వెళ్లగా.. గొప్ప తేజస్సుతో ప్రకాశించే ఒక నగరం కనిపించింది. అక్కడ ఆ వరాహం కానీ, మరెవరుకానీ కనిపించలేదు.
ఒక భవంతి ముందర ఒక యువతి కనిపించింది. ఆమెను చూసి.. ‘ఆ పురమెవ్వరిది?’ అని ఆరా తీయబోయాడు. కానీ, ఆమె ఏమీ మాట్లాడవద్దని సైగచేసి లోనికి తీసుకుపోయింది.
ఆ మేడలో రసాతల దేవతయేమో అన్నట్లుగా ప్రకాశిస్తున్న ఒక సుందరిని చూశాడు. దానితో అతని మనసు మన్మథ బాధకు గురయింది. మరో మన్మథునిలా కనిపిస్తున్న కువలయాశ్వుని చూసి, ఆ తరుణి కూడా చిత్తభ్రమకు, లజ్జా విస్మయాలకు లోనైంది.
“మహాభాగా! ఈమె పేరు మదాలస. విశ్వావసుడనే గంధర్వరాజు కుమార్తె. ఈమె ఒకనాడు ఉద్యానంలో విహరిస్తుండగా, పాతాళకేతుడనే రాక్షసుడు ఎత్తుకొచ్చి ఇక్కడ దాచాడు. రాబోయే త్రయోదశినాడు ఈమెను వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు. ఇక్కడినుంచి ఎలా తప్పించుకోవాలా అని మేము ప్రయత్నిస్తుండగా దైవఘటనలా మీరిక్కడికి వచ్చారు. మీ రూపం చూడగానే మీరు ఉత్తమవంశంలో పుట్టినవారని, మహావీరులని అర్థమవుతున్నది. మా రాకుమారి మీపై మరులుగొంది. దయచేసి ఈమె పాణిగ్రహణం చేయండి” అని చెలికత్తె రాయబారం నడిపింది.
వారిద్దరి వివాహం అప్పటికప్పుడే జరిగిపోయింది.
మదాలసను కూడా తన కువలయాన్ని ఎక్కించుకుని, ఋతుధ్వజుడు బయల్దేరగా.. చతురంగ బలాలతో పాతాళకేతుడు అడ్డంపడ్డాడు. శరవర్షం కురిపించాడు. కువలయాశ్వుడు నవ్వుతూ, రక్కసులపై త్వష్టాస్త్రం ప్రయోగించాడు. ఆ దెబ్బతో కపిలుని దృష్టి తగిలిన సగర పుత్రుల్లా, వారంతా బూడిద కుప్పలయ్యారు.
అటుపైన కువలయాశ్వుడు తండ్రి వద్దకు వెళ్లి, జరిగినదంతా నిర్భయంగా చెప్పాడు. మదాలసను చూపించాడు. శత్రుజిత్తు కుమారున్ని ఆలింగనం చేసుకుని ఆశీర్వదించాడు. ఆనాటినుంచి కువలయాశ్వుడు తన భార్యతో గూడి, తన ఉత్తమాశ్వాన్ని అధిరోహించి.. ప్రతిదినం పర్వత సానువులపై, సముద్రాలపై, నదీతీరాలలో స్వేచ్ఛగా విహరించేవాడు.
ఒకనాడు శత్రుజిత్తు కుమారున్ని పిలిచి..
“వత్సా! నువ్వు ప్రతిదినం అశ్వమెక్కి ఎక్కడికో వెళ్తున్నావు. కానీ నీ అసలు కర్తవ్యం తపోధనుల రక్షణ. ఆ మాట మరిచిపోకు” అని ప్రబోధించాడు. నాటినుంచి కువలయాశ్వుడు, మధ్యాహ్నం వరకు భూమండల పర్యటన చేసేవాడు. సాయంత్రం వరకు పండితగోష్టులు నిర్వహించేవాడు. తక్కిన సమయంలోనే భార్యతో క్రీడిస్తుండేవాడు. పాతాళకేతుని తమ్ముడు తాళకేతువు. వాడు చాలాపెద్ద మాయావి. ఒకనాడు వాడు తాపసి వేషం వేసుకుని.. కువలయాశ్వుడు వచ్చేదారిలో ఒంటికాలిపై తపస్సు చేయసాగాడు.
కువలయాశ్వుడు అతణ్ని చేరి..
“మహాత్మా! మీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతున్నదా? రాక్షసబాధ లేదు కదా?!” అని పరామర్శించాడు.
అందుకు ఆ కపట తాపసి..
“రాజపుత్రా! నీవంటి శూరుడు మాకు రక్షణ కల్పిస్తుండగా.. తపోవిఘ్నాలకు తావులేదు. కాకపోతే నిన్నొకటి యాచిస్తున్నాను. కాదనకుండా ఇవ్వగలవా?” అని ప్రశ్నించి, అలాగేనని కువలయాశ్వుని వద్ద మాట తీసుకున్నాడు.
“నేను ఒక యజ్ఞం చేయదలిచాను. దానికి వారుణ ఇష్టి జరిపించాలి. ఈ నీటియందు ప్రవేశించి.. నేను కొంతకాలం తపస్సు చేయవలసి ఉంది. నా తపస్సు కొనసాగుతున్నంత కాలం నువ్వు ఈ తీరంలోనే కాపలా ఉండాలి. అలాగే ఆ ఇష్టికి కంఠాభరణం అవసరం. కనుక నీ కంఠాభరణాన్ని నాకు ఇవ్వాలి” అని కోరాడు.
కువలయాశ్వుడు అతను చెప్పినట్లే చేశాడు. కపట తాపసి అయిన తాళకేతువు ఆ నగను మెళ్లో వేసుకుని, యమునా నది నీటిలో దిగాడు. రెండుమూడు రోజుల తరువాత కువలయాశ్వుని కన్ను పడకుండా.. నేరుగా శత్రుజిత్తు వద్దకు వెళ్లాడు.
“రాజా! నీ కుమారుడు రాక్షసులతో యుద్ధం చేస్తూ మరణించాడు. ప్రాణాలు విడిచిపెడుతూ.. నాకీ కంఠాభరణాన్ని బహుకరించాడు” అని చెప్పాడు. శత్రుజిత్తు ఆ మాటలు నమ్మాడు. దుఃఖాన్ని తనలోనే దిగమింగుకుని, కోడలైన మదాలసకు ఆ వార్త తెలియచేశాడు. భర్త మరణవార్త వింటూనే ఆ మహాసాధ్వి మొదలంట నరికిన చెట్టులా నేలకూలింది. ప్రాణాలు విడిచిపెట్టేసింది.
“క్షత్రియుడు యుద్ధరంగంలో వీరమరణం పొందడం, అతని స్త్రీ ఇచ్ఛామరణంతో అతణ్ని సహగమించడం కోటియజ్ఞాలు చేయడంతో సమానమని ఆర్యులు చెబుతారు. వీరి మరణానికి చింతించాల్సిన పని లేదు” అని మనసును సమాధాన పరుచుకున్నాడు శత్రుజిత్తు.
మరికొద్దిరోజులకు.. తాళకేతుడు యమునా నదీజలాలనుంచి ఈవలకు వచ్చాడు.
“రాజా! నా చిరకాల వాంఛ నెరవేరింది. నీకు కృతజ్ఞుడను. నీవింక ఇంటికి పోవచ్చు” అన్నాడు.
“మహాప్రసాదం!” అని పలికి, కువలయాశ్వుడు ఇంటిముఖం పట్టాడు. నగరం పొలిమేరల్లోనే అతణ్ని చూసి అందరూ తలోమాటా అనుకున్నారు. మొత్తానికి చనిపోయాడనుకున్న రాజపుత్రుడు తిరిగి రావడంతో సంతోషించారు.
మదాలస మరణవార్త విని, కువలయాశుడు హతాశుడైపోయాడు.
“నావల్ల ఆమె మరణించింది. ఆమె మాట వినగానే నేను కూడా చనిపోయి ఉండవచ్చు. కానీ అది స్త్రీలకు శోభస్కరం కానీ, పురుషులకు కాదు. ఆమెకోసం రోదించడమూ యశస్కరం కాదు. శత్రువులు లోకువ చేసి పరాభవిస్తారు. కాబట్టి నేనింక ఇంతటితో స్త్రీభోగానికి దూరంగా ఉంటాను. దీనివల్ల నా మదాలసకు ఎలాంటి ఉపయోగమూ లేకపోయినా పరవాలేదు. నేను వేరొక స్త్రీని మాత్రం వివాహమాడను” అని ప్రతిజ్ఞ చేశాడు.
నాటినుంచి తోటివారితో కలిసి, శృంగారరహితమైన వినోదాలతో కాలక్షేపం చేస్తూ గడపసాగాడు.
..నాగకుమారులు ఈ కథను ఇంతవరకూ తండ్రితో చెప్పారు.
“తండ్రీ! అతనికి మనం ఏమిచ్చినా సంతోషం కలగదు. అతని ప్రియురాలైన మదాలసను తిరిగి ఆయనకు అర్పించినట్లయితే.. పూర్తిగా సంతోషిస్తాడు. కానీ, ఆ పని మనకు శక్యం కాదు” అన్నారు.
అందుకు నాగరాజు అయిన అశ్వతరుడు ఇలా చెప్పాడు.
“పుత్రులారా! అశక్యమని ఏ కార్యాన్నీ విడిచిపెట్టకూడదు. శక్యమని తలచి ప్రయత్నించాలి. కర్మఫలం దైవంలో ఉంటుంది. దున్నకుండా భూమి పండదు కదా! అందువల్ల నేను ప్రయత్నించి, ఆ మహాత్మునికి నాకు చేతనైనంత ఉపకారం చేస్తాను”.
ఆ తర్వాత హిమాలయాలలో ప్లక్షతీర్థం చేరుకున్నాడు. అక్కడ సరస్వతీదేవిని గురించి తపస్సు చేశాడు.
‘భూమియందు, ఆకాశమందు, ఇతర స్థలములయందు ఉన్న స్థూల, సూక్ష్మ, వస్తుజాలానికి అంతటికీ నీవే ప్రధానురాలవు. నీవల్లనే సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి’.. అని దేవిని స్తోత్రం చేశాడు.
అతని భక్తివిశ్వాసాలకు భాషాదేవి సంతోషించింది. ఏం వరం కావాలో కోరుకోమని అడిగింది.
“తల్లీ! నాకు కంబళుడు అనే మిత్రుడు కలడు. మా ఇద్దరికీ స్వరసంబంధమైన సంగీతవిద్య అంతా వచ్చేలా అనుగ్రహించు” అని ప్రార్థించాడు. ‘తథాస్తు’ అని పలికి, సరస్వతి అంతర్హితురాలైంది.
అశ్వతరుడు తన స్నేహితుడితో కలిసి.. శివపార్వతులు విహారం చేస్తున్న సమయంలో, ఎలుగెత్తి గానం చేయసాగాడు. శంకరుడు వారి గానానికి సంతోషించాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు.
“మహాత్మా! మదాలస అనే గంధర్వపుత్రి అసత్యవార్త విని, తన భర్త మరణించాడని అనుకుంది. వెనువెంటనే తానూ మరణించింది. ఆమె తిరిగి నా కడుపున పుట్టేలా అనుగ్రహించు. ఆమె చనిపోయేనాటికి ఏ వయసులో ఉందో.. తిరిగి అదే వయస్సులో నాకు పుట్టాలి. ఆనాటి స్మృతి ఆమెకు ఉండాలి” అని కోరాడు.
అప్పుడు శంకరుడు..
“ఓ నాగరాజా! నువ్వు కోరినట్లే జరగగలదు. విను.. నువ్వు ఈసారి పితృకార్యం చేసేటప్పుడు.. శుచివై, మధ్యపిండాన్ని నువ్వే ఆరగించు. అప్పుడు నీ నడిమి పడగనుంచి మదాలస తిరిగి పుడుతుంది” అని పలికాడు.
“ధన్యోస్మి” అని పలికి.. పార్వతీ పరమేశ్వరులకు మొక్కి వెనక్కి వచ్చాడు అశ్వతరుడు.
శంకరుడు చెప్పినట్లుగా భక్షించిన వెంటనే నాగరాజు చేసిన నిశ్వాసం నుంచి మదాలస తిరిగి జన్మించింది.
(వచ్చేవారం.. అలర్కుని చరిత్ర)
-అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ