Kasi Majili Kathalu | జరిగిన కథ : ఏడుగురు మిత్రుల కథ ఇది. వారిలో ఐదోవాడైన కుచుమారుడి గురించి ఇప్పుడు చెప్పుకొంటున్నాం. అతను ధారానగరానికి వస్తూ అడవిలో దారి తప్పాడు. మరణించిన ఒక సిద్ధయోగి అస్థిమాలను ధరించి.. అష్టసిద్ధులను పొందాడు. పురందరపురం యువరాణి సరస్వతిని వాదంలో ఓడించి, ఆమె రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.
రెండు పరీక్షలు నెగ్గిన తరువాత కుచుమారునికి మరో అసలైన పరీక్ష పెట్టింది సరస్వతి. తన వద్దనున్న మొద్దు చిలుకను అతని వద్దకు పంపి, దానిచేత మాట్లాడించమని చెప్పింది. కుచుమారుడు ఆ చిలుకను అందుకుని ముద్దుపెట్టుకుంటూ..
“ఓసి చిలుకా! నీకు సరస్వతి ఏయే విద్యలు నేర్పింది? మీ రాజపుత్రిక సందేశమేమిటో చెప్పు!” అని అడిగాడు. కానీ, ఆ చిలుక పలకలేదు. అప్పుడు దానిని తీసుకొచ్చిన దాది..
“అయ్యా! ఈ చిలుకను మా సరస్వతి విదేశాల నుంచి తీసుకొచ్చింది. ఎంత ప్రయత్నించినా దీనికి మాటలు రాలేదు. కనుకనే దీనికి మాటలు నేర్పమని కోరుతున్నది” అని చెప్పింది.
“సరే అయితే.. దీనిని రేపు పంపిస్తాను. నువ్వెళ్లు” అని సెలవిచ్చి పంపాడు కుచుమారుడు.ఆ రాత్రికి ఎవరూ లేని సమయంలో తన మెడలోని సిద్ధుని ఎముకల మాలను చిలుకకు తగిలించాడు.
“ఓసీ చిలుకా! సర్వవిద్యలూ ఎరిగిన ప్రౌఢవయ్యావు. ఇక మాట్లాడవే!” అన్నాడు. మరు నిమిషంలో సర్వగ్రాహిణీ యంత్రంలా చిలుకకు విద్యలు వచ్చేశాయి. ఆశుకవిత్వం సైతం చెప్పసాగింది. సంతృప్తి పడిన కుచుమారుడు తన అస్థిమాలను వెనక్కు తీసుకున్నాడు. మరునాడు దాది వచ్చి, చిలుకను తీసుకుపోయింది.
“ఏమే మొద్దు చిలుకా! సుద్దులేమైనా నేర్చుకున్నావా?” అని అడిగింది సరస్వతి.
“నేను మొద్దు చిలుకనో, ముద్దు చిలుకనో ఇకమీదట చూస్తావు. నేను కుచుమారుని శిష్యుడినయ్యాను. నన్ను ఏ విద్యలలోనైనా పరీక్షించుకో!” అన్నది చిలుక. ఆ మాటలకు నిశ్చేష్టురాలై..
“సరే అయితే.. చతుష్షష్టి కళల పేర్లు చెప్పు?” అన్నది సరస్వతి.
“కుచుమారుని శిష్యుణ్ని అడగాల్సిన ప్రశ్నేనా ఇది?! ఇంత చిన్న ప్రశ్నకు నేనెందుకు?” అంటూ.. వరుసగా అరవైనాలుగు కళల పేర్లు చెప్పి..
“కావాలంటే.. నన్ను ఏ విద్యలో అయినా పరీక్షించుకో!” అని సవాల్ విసిరింది చిలుక.
దాని మాటలకు సరస్వతికి భలే సరదా వేసింది. అబ్బురపడుతూ..
“అన్ని విద్యలు నేర్చినావుటే.. ఏదీ ఇది చెప్పు చూద్దాం!” అంటూ.. వరుసగా ఆరు శాస్ర్తాలలో వివిధ ప్రశ్నలు వేసింది. అన్నిటికీ చిలుక తెలివిగా సమాధానం చెప్పింది. వాటిని విన్న తరువాత సంబరపడి పోయిన సరస్వతి తన దాసి అయిన సారసికతో..
“ఈ చిలుక పలుకులు వింటుంటేనే ఆ కుచుమారుడు ఎంతటివాడో అర్థమవుతున్నది. నేను అతణ్ని వరించాను” అన్నది.
“అదేమిటమ్మా! అతని రూపం, యవ్వనం, ధనం వంటివన్నీ చూడకుండా ఎలా?” అన్నది దాది.
“నువ్వు ఆయన్ను చూడలేదా? అందగాడు కాదా?! కాకపోయినా సరే.. ఇంతటి పండితుణ్ని వరించకపోతే నా చదువు, జన్మ వ్యర్థమవుతాయి” అన్నది సరస్వతి.
“నేను ఆయన్ను సరిగా చూడలేదమ్మా! పోనీ.. రేపోసారి వెళ్లి రమ్మంటారా?” అని అడిగింది దాది.
“అవసరం లేదు. నలదమయంతులకు మధ్య హంసలా.. ఈ చిలుకే ఇకనుంచి మా మధ్య రాయబారం నడపగలదు” అన్నది సరస్వతి. తన మెడలోని ముత్యాలపేరును చిలుక నోటికి అందించింది. హంస తామరతూడును కరచి పట్టుకున్నట్లు ఆ ముత్యాలహారాన్ని ముక్కున పెట్టుకుని చిలుక ఎగిరింది. కుచుమారుని విడిదిలో అతని ముందు వాలింది. అతని ఎదుట హారాన్ని ఉంచి.. సరస్వతి పంపించిన సందేశాన్ని వినిపించింది. అతను ముత్యాలహారాన్ని తన మెడలో వేసుకున్నాడు.
“నేను ఆమె ఇచ్చిన హారాన్ని గుండెలమీద పెట్టుకున్నానని చెప్పు” అని సరస్వతికి తన తిరుగు సందేశం పంపించాడు. అలా వారిమధ్య కొంతకాలం చిలుక రాయబారం నడిచింది. ఒకనాడు తనతో వచ్చిన శంబరునితో..
“ఓరీ! రాజ్యలక్ష్మితోపాటుగా త్వరలో సరస్వతి నా పరం కానున్నది” అని చెప్పాడు కుచుమారుడు. అప్పుడు శంబరుడు..
“అయ్యా! ఇదంతా మా తండ్రిగారి ఉపదేశం వల్లనే కదా! రాజ్యం వచ్చిన తరువాత మీకు మా మీద దయ ఉంటుందో లేదో..” అని నసిగాడు. అందుకు కుచుమారుడు నవ్వుతూ..
“శంబరా! రాజ్యం శాశ్వతమా? అటువంటి చింత పెట్టుకోకు. అయినా నాతోపాటు ఈ రాజ్యానికి నా మిత్రులు ఆరుగురు భాగస్థులు కాగలరు. వారితోపాటే నువ్వు కూడానూ. నా మిత్రులిప్పుడు నా దగ్గర లేరు. నువ్వు ఉన్నావు. మా పెళ్లి పెద్దవు నువ్వే” అని నవ్వుతూ చెప్పాడు. శంబరునికి ఆ మాటలు ములుకుల్లా బాధించాయి.
‘వీడికప్పుడే రాజ్యం వచ్చేసినట్లు గప్పాలు కొడుతున్నాడు. నా తండ్రివల్లనే ఇదంతా సాధ్యమైందన్న విశ్వాసం కూడా లేకుండా ఎక్కడో ఉన్న మిత్రులకు రాజ్యం పంచి పెడతాడట. నేను వీడి పెళ్లికి నానా చాకిరీ చేయాలట. చూస్తాను’ అని మనసులో తలపోశాడు. కుచుమారుడు ఆ రాత్రి నిద్రపోతున్న సమయంలో ఒక పెద్ద బండరాయి తెచ్చి అతని నెత్తి బద్దలుకొట్టాడు శంబరుడు. ఆ తరువాత అతణ్ని ఎత్తి, కందకంలో పారేశాడు.
‘ఇంక ఈనాటినుంచి నేనే కుచుమారుణ్ని. ఈ రాజ్యమూ, సరస్వతి కూడా నాకే దక్కగలవు’ అనుకున్నాడు. తానే కుచుమారుడిగా ప్రవర్తించసాగాడు. మరునాడు రాజకుమారి యధాతథంగా తన చిలుకను రాయబారం పంపించింది. అది వస్తూనే..
“శంబరా! మా గురువుగారెక్కడ?” అని ప్రశ్నించింది. అందుకు శంబరుడు విసుక్కుంటూ..
“నేనే కుచుమారుణ్ని. నీకు కళ్లు కనిపించడం లేదా?!” అని ప్రశ్నించాడు.
“శంబరా! నువ్వు నేనెరుగని వాడివి కావు. దయచేసి మా గురువుగారు ఎక్కడ ఉన్నారో చెప్పు!” అన్నది చిలుక.
‘దీనిని విడిచిపెడితే సరస్వతికి నిజం చెప్పగలదు’ అని తలపోసిన శంబరుడు ఆ చిలుకను చేజిక్కించుకున్నాడు. దాని మెడవిరిచి చంపేశాడు. ఎవరూ చూడకుండా పాతిపెట్టాడు. రెండురోజులు గడిచినా కుచుమారుని వద్దకు వెళ్లిన చిలుక వెనుతిరిగి రాకపోవడంతో సరస్వతి కంగారు పడింది. ఏం జరిగిందో తెలుసుకోమని దాసిని పంపించింది.
ఆమె విడిదికి వచ్చి..
“అయ్యా! కుచుమారుల వారున్నారా?” అని ప్రశ్నించింది.
“అదేమిటి సారసికా! ఇదివరకు నన్ను చూసినదానివే కదా! మరిచిపోయావా? నేనే కుచుమారుణ్ని” అన్నాడు శంబరుడు.
ఆమె శంబరుడి ముఖం చూస్తూనే..
‘మహాపండితుడైన కుచుమారుడెక్కడ? ఇతనెక్కడ?! వీని ముఖాన దరిద్రదేవత తాండవిస్తున్నది’ అని మనసులో తలపోసింది.
“అయ్యా! మీవద్దకు పంపిన చిలుక తిరిగి రాలేదు. రెండురోజుల నుంచి మాకు ఏ వర్తమానం అందలేదు” అన్నది దాసి.
“అయ్యయ్యో! చెప్పడం మరిచాను. మొన్న చిలుక నావద్దకు వచ్చినప్పుడు దానికి జామపండు పెడదామని లోపలికి వెళ్లాను. ఇంతలో ఒక రాకాసి పిల్లి వచ్చి, దాన్ని తినేసింది” అని విచారంగా చెప్పాడు. మళ్లీ తనే..
“అన్నట్లు మీ సరస్వతి ఏదైనా సందేశం పంపించిందా?!” అని ప్రశ్నించాడు శంబరుడు.
“నేటికి మరేమీ లేదు” అని వెనుతిరిగింది సారసిక.
యువరాణి సరస్వతి దగ్గరికి వచ్చి..
“అమ్మా! నా అంచనా నిజమైతే, అతను నిజమైన కుచుమారుడు కాదు. మనం మోసపోయాం” అని చెప్పింది. అప్పుడు సరస్వతి మరో చిలుకను కుచుమారుని బసకు పంపింది. దానిని తీసుకువెళ్లిన సారసిక..
“అయ్యా! ఆ పాతచిలుక మరణం మా సరస్వతిని చాలా కుంగదీస్తున్నది. ఈ చిలుకకు మాటలు నేర్పితే ఆ విచారం పోతుంది. ఆమె సందేశమంతా ఇందులో ఉంది” అని ఒక పత్రికను చేతికి అందించింది. శంబరుడు ఆ పత్రికను అటూఇటూ తిప్పి చూశాడు. ఆ లిపి అతనికి అర్థం కాలేదు. కోపాన్ని అభినయిస్తూ..
“మాటిమాటికీ మా విద్యలను వృథాగా వినియోగించడం నాకిష్టం లేదు. ఒకమారు పరీక్షించారు. సమాధానం ఇచ్చాను. మీకు నచ్చకపోతే చెప్పండి.. నా దారిన నేను పోతాను. అంతేకానీ ఇలా అవమానించడం మీ రాకుమారికి తగదు” అని హెచ్చరించాడు శంబరుడు. ఆమె వెనుతిరిగి వచ్చి సరస్వతితో అంతా వివరంగా చెప్పింది.
‘కనీసం మీరు లేఖలో రాసిన లిపి కూడా అతగాడికి బోధపడలేదు’ అని ముక్తాయించింది. సారసిక వెళ్లిన తరువాత శంబరుడు నిదానంగా ఆలోచించాడు.
‘ఇక్కడే ఉంటే నా గుట్టు బయటపడక మానదు. వీళ్లకు తెలియకుండా పారిపోవడమే మంచిది’ అని తగిన సన్నాహాలు చేసుకోసాగాడు. ఇంతలో అతని విడిది బయట మంగళవాద్యాలు వినిపించాయి. పురందరపురం మంత్రులు కుచుమారుని ఎదుటికి వచ్చి, నమస్కరించారు.
“అయ్యా! మా యువరాణికి తగిన వరుణ్ని తీసుకురాలేక.. విరక్తితో మా మహారాజుగారు వానప్రస్థానికి వెళ్లిపోయారు. ఆమె స్వయంవర నిర్ణయం తెలియచేయగానే తనకు కాబోయే అల్లుడికి.. యువరాణితోపాటుగా ఈ రాజ్యాన్ని కూడా కట్టబెట్టమని మమ్మల్ని నియమించి వెళ్లారు. ఆమె మిమ్మల్ని వరించినట్లు నిన్ననే మాకు వర్తమానం అందచేసింది. త్వరలో మీ ఇద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేయనున్నాం. దయచేసి మీరు కోటకు వచ్చి, మా ఆతిథ్యం స్వీకరించండి” అంటూ గౌరవ లాంఛనాలతో తీసుకెళ్లి, భద్రగజాన్ని అధిరోహింప చేశారు. శంబరుడు ఆ సంతోషంలో తాను పారిపోవాలని అంతకుముందే నిశ్చయించుకున్న మాటే మరిచిపోయాడు.
ఇది ఇలా ఉండగా..
పురందరపురానికి క్రోసెడు దూరంలో ఒక బెస్తవారి పల్లె ఉంది. వారికి తరచుగా రాత్రిపూట రాజభటులు చూడకుండా దొంగచాటుగా కోట కందకంలో చేపలు పట్టడం అలవాటు. ఒకనాటి రాత్రి అలాగే వలలు వేసి ఉంచారు. అదృష్టంకొద్దీ కుచుమారుడు వారికి చిక్కాడు. అప్పటికింకా అతనిలో ప్రాణం ఉంది. వారు అతణ్ని తమ పల్లెకు తీసుకుపోయి, తమ శక్తికి మించినదైనా ఎంతో ఖర్చుపెట్టి వైద్యం చేయించారు. నెత్తిమీద బలంగా దెబ్బ తగిలినందువల్ల నాలుగురోజుల పాటు కుచుమారునికి స్పృహ రాలేదు. వచ్చిన తరువాత కూడా తానెవరో ఏమిటో.. ఎక్కణ్నుంచి వచ్చాడో గుర్తించ లేకపోయాడు.
దాదాపు నెలరోజులకు గానీ కుచుమారునికి పూర్తిగా ఒంట్లో ఓపిక చేకూరలేదు. ఆరోగ్యం కుదుటపడిన తరువాత అతనికి క్రమంగా పూర్వస్మృతి కలిగింది. కానీ, ఆ పల్లెవారితో ఆ సంగతులు చెప్పలేదు. కానీ ఎంతకాలం వారికి భారంగా ఉండగలడు?!
అందుకని ఆ పల్లెవారితోపాటే తానూ పనిచేయడం మొదలుపెట్టాడు. త్వరలోనే అతని తెలివితేటలకు ఓడలు నడుపుకొనే వారివద్ద ఉద్యోగం దొరికింది. అది గొప్ప రేవు. వేలకొద్దీ బాటసారులు నిత్యమూ ఆ రేవుదాటి వెళ్తుంటారు. బాటసారుల నుంచి ఓడ రుసుము స్వీకరించి, అలా సేకరించిన సొమ్ముకు పద్దులు రాయడం కుచుమారుని బాధ్యత.
అలా ఉండగా ఒకనాడు.. జయపురాన్ని ఏలే గోనర్దీయుడనే మహారాజు తన సైన్యంతో సహా ఇక్కడికి వస్తున్నాడని, మన రేవు దాటి పురందరపురానికి వెళ్తాడని.. వారికి కావాల్సిన నావలను సిద్ధపరిచి ఉంచాలని కుచుమారునికి సందేశం అందింది. గుర్రాలు వంటివాటిని ఎక్కించడానికి.. మనుషులు కూర్చోవడానికి వేర్వేరుగా నావలను సిద్ధపరిచాడు కుచుమారుడు. ఆ మహారాజు రానేవచ్చాడు. అతని అధికారులు కుచుమారుడు చేసిన ఏర్పాట్లకు సంతోషించారు.
“రండి.. మా మహారాజుగారి దగ్గరికి వెళ్లి, తదుపరి ఉత్తర్వులు తీసుకుందాం” అన్నారు వారు.
గోనర్దీయుడు, కుచుమారుడు, దత్తకుడు, గోణికాపుత్రుడు వీరంతా కాశీలో ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేసినవారు. ప్రాణమిత్రులు. గోనర్దీయుడు మొదట కుచుమారుణ్ని గుర్తుపట్టలేకపోయాడు. కానీ అతను నమస్కరించక..
“కుశలమా!” అని అడిగేసరికి తేరిపార చూశాడు. ఆ తరువాత..
“మిత్రమా! కుచుమారా! నువ్వేనా?!”
అంటూ తాను కూర్చున్న ఆసనం దిగివచ్చి కౌగిలించుకున్నాడు.
(వచ్చేవారం.. వేదం చదివిన రాక్షసుడు)
– అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ