జరిగిన కథ : కాశీమజిలీ కథలను మధిర సుబ్బన్నదీక్షితులు పంతొమ్మిదో శతాబ్దిలో.. పన్నెండు సంపుటాలుగా రచించారు. మణిసిద్ధుడనే యతి కాశీయాత్ర చేస్తూ, తనకు సహాయకుడిగా వచ్చిన గోపాలకుడితో చెప్పినవే కాశీమజిలీలు. ప్రస్తుతం మీరు చదవబోయే కథ పదకొండో సంపుటంలోనిది.
చించినీపురంలో భోజకుడనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వాళ్లకు పార్వతి, లక్ష్మి, సరస్వతి అన్న పేర్లు పెట్టుకున్నాడు. పెళ్లి వయసుకు చేరుకున్న తన కుమార్తెలకు భోజకుడు తొందరపడి.. సరిగా ముందువెనుక చరిత్రలు తెలుసుకోకుండానే హరి హర బ్రహ్మలనే ముగ్గురు అన్నదమ్ములకు ఇచ్చి పెళ్లిచేశాడు.
ఆ ముగ్గురు అన్నదమ్ములూ చదువుకున్నవాళ్లు కాదు. కానీ తాము పండితులమని మోసగించారు. తీరా పెళ్లిళ్లు అయిన తరువాత చేసేదేమీ లేక భోజకుడు ఊరుకున్నాడు. వాళ్లకు ఆస్తిపాస్తులు కూడా ఏమీలేవు. పోనీ పెళ్లి తరువాతైనా చదువు చెబుదామని ప్రయత్నిస్తే.. ఆ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.
కూతుళ్లకు తీవ్రమైన అన్యాయం చేశాననే దిగులుతోనే భోజకుడు మరణించాడు.
మామగారు మరణించినా హరి హర బ్రహ్మలు ఇంటిబాధ్యతను తీసుకోలేదు. పనిపాటలు చూసుకోలేదు. పైగా నిరంతరం జూదాలాడుతూ కాలక్షేపం చేయసాగారు. వాళ్ల వ్యసనం కారణంగా భోజకుడు కూడబెట్టిన ఆస్తంతా కరిగిపోయింది. చివరికి భార్యల నగలు కూడా తాకట్టుపెట్టి జూదమాడసాగారు. ఇంత జరుగుతున్నా అక్కచెల్లెళ్లు ముగ్గురూ మౌనంగా భరించేవారు కానీ, భర్తలను నోరెత్తి ఒక్కమాట కూడా అనేవారు కాదు. పైగా వారు కోరిన వస్తువులన్నీ తెచ్చి ఇస్తుండేవారు. చూస్తుండగానే మగవారి జూద వ్యసనానికి ఆస్తిమొత్తం కరిగిపోయింది. భయంకరమైన దారిద్య్రం ఆ కుటుంబాన్ని పట్టిపీడించసాగింది.
దారిద్య్రానికి తోడుగా ఆ దేశానికి అనావృష్టి పరిస్థితులు కూడా తోడయ్యాయి. సూర్యుడు మృగశిరలో ప్రవేశించినా తొలకరి రాలేదు. ఆరుద్ర కార్తె, పునర్వసు కార్తెలు కూడా గడిచిపోయాయి కానీ చినుకు రాలలేదు. మబ్బులు పట్టిపట్టి గాలిచేత దూదిపింజలై చీలికలైపోతాయని.. వర్షం కురుస్తుందని కర్షకులు ఆశలు పెట్టుకుంటే, మేఘాలు ఒక్క నీటిబొట్టు రాల్చలేదు. వర్షకాలం నాలుగుమాసాలూ గడిచిపోయాయి. నదులు అడుగంటాయి. ఏటివంకల్లో ఇసుక మేటవేసింది. నేల నెర్రెలు వారింది. పొలాల్లో పచ్చదనం కరువైంది. పశువులకు మేత, నీరు దొరకట్లేదు. ఏ చెట్టుపిట్టలు ఆ చెట్టుమీదనే చనిపోసాగాయి. ధాన్యపు నిల్వలు అడుగంటిపోసాగాయి.
అటువంటి పరిస్థితుల్లో అక్కచెల్లెళ్లు ముగ్గురూ.. ఇతరుల ఇళ్లలో దాసీపని చేసుకుంటూ పొట్ట పోషించుకోసాగారు. వారిలో మధ్యయువతి లక్ష్మీదేవి భక్తురాలు. నిష్కామంగా, మానసికంగా దేవిని ఎల్లవేళలా ఆరాధిస్తూ ఉండేది. ఆమె భక్తివల్లనే ఆ కుటుంబం అంతోఇంతో మెరుగ్గా ఉండగలిగింది. అలా ఉండగా ఆమె గర్భవతి అయింది. కరవు తట్టుకోలేక, జూద వ్యసనాన్ని కొనసాగించే వీల్లేక అన్నదమ్ములు ముగ్గురూ తమ భార్యలను వాళ్ల కర్మానికి వదిలేసి, ఇంటినుంచి పారిపోయారు. గర్భవతి అయిన లక్ష్మిని మిగిలిన ఇద్దరూ కంటికిరెప్పలా కాపాడుకున్నారు. ఆమె క్రమంగా నెలలు నిండి చక్కని కొడుకును కన్నది.
అతనికి పుత్రకుడని పేరుపెట్టారు. ఆ పిల్లవాడు పుట్టింది మొదలు దేశంలో పరిస్థితులు చక్కబడ్డాయి. కానీ, ఆ ఇంటి పరిస్థితులు మాత్రం అలాగే ఉన్నాయి. పుత్రకుని తల్లి రాత్రీపగలూ మహాలక్ష్మి ధ్యానంలోనే గడిపేది.
ఒకనాడు లక్ష్మి ప్రార్థన చేసి అలసిపోయి నిద్రించిన సమయంలో ఆమెకు స్వప్నంలో దేవీ దర్శనం కలిగింది.
“అమ్మాయీ! నేటినుంచి నీ కొడుక్కు పది సంవత్సరాలు వచ్చేవరకూ.. సూర్యోదయాన్నే నువ్వు నిద్రలేచే సమయానికి నీ కొడుకు తలదిక్కున మణుగు బంగారం ఉంటుంది. నీ కొడుకు గొప్ప కీర్తిమంతుడు కాగలడు” అని ఆశీర్వదించింది దేవి.
ఆశ్చర్యపడుతూ నిద్రలేచేసరికి సూర్యోదయమైంది. స్వప్నంలో దేవి చెప్పినట్లే పుత్రకుని తల దిక్కున బంగారం కనిపించింది. దాంతో ఆ కుటుంబానికి దారిద్య్రబాధ వదిలిపోయింది. అమ్మేసిన పొలాలు, స్థలాలు తాకట్టు విడిపించుకున్నారు. ప్రతిరోజూ లభించే బంగారంలో నాలుగోవంతు ‘పుత్రక ముద్రికలనే’ పేరుతో నాణేలు తయారు చేయించి దానధర్మాలు చేస్తుండేవారు.
పుత్రకునికి పద్దెనిమిదేళ్ల వయసు వచ్చింది. అతనికి చదువు అబ్బలేదు కానీ, సుగుణాలు అలవడ్డాయి. తమ గ్రామంలో పెద్దసత్రం కట్టించి నాలుగు వర్ణాలవారికీ భోజన సదుపాయం కల్పించాడు. ప్రజలందరూ పుత్రకుని దయాగుణాన్ని వేనోళ్ల పొగుడుతూ ఉండేవారు.
కొంతకాలానికి ఇల్లు వదిలి వెళ్లిన హరి హర బ్రహ్మలు తిరిగి వచ్చారు. తండ్రితోపాటుగా పెదతండ్రి, పినతండ్రి చాలాకాలానికి తిరిగి రావడం వల్ల పుత్రకుడు కూడా చాలా సంతోషించాడు. వచ్చిన కొత్తలో వాళ్లు బాగానే ఉన్నారు. కొంతకాలానికి పూర్వపు అలవాట్లు వారిని నిలవనీయలేదు. తమ పాతమిత్రులను పోగేసి మళ్లీ జూదం మొదలుపెట్టారు. చేతికందిన సొమ్ము తీసుకుపోయి పొద్దస్తమానం ఆడేవారు.
పుత్రకునికి ఆ విషయం తెలిసింది. తండ్రులకు డబ్బు అందకుండా జాగ్రత్త పడ్డాడు. అంతేకాకుండా గ్రామంలో ఉన్న జూదగాళ్లందరినీ లేవగొట్టించాడు. దాంతో ఆ అన్నదమ్ములకు ఎక్కడలేని పౌరుషం వచ్చింది. పుత్రకుణ్ని అడ్డం తప్పిస్తే తప్ప.. తమ ఆటలు సాగవని భావించారు.
ఒకనాడు తండ్రి పుత్రకుణ్ని చేరి..
“కుమారా! నువ్వు కడుపులో ఉన్నప్పుడు నువ్వు క్షేమంగా ఉంటే వింధ్యారణ్యంలోని దుర్గాలయానికి తీసుకువస్తామని మొక్కుకున్నాం. మా మొక్కునిప్పుడు నువ్వు చెల్లించాలి” అని కోరాడు.
“తప్పకుండా నాన్నగారూ! మీరు చెప్పినట్లే చేస్తాను” అని పుత్రకుడు వింధ్యారణ్యానికి ప్రయాణం కట్టాడు.
అక్కడికి వెళ్లేసరికి అంతకుముందే తండ్రులు ఏర్పాటు చేసిన హంతకులు కొందరు పుత్రకుణ్ని చుట్టుముట్టారు. కాళ్లు చేతులు బంధించి, దేవీవిగ్రహం ముందుకు తీసుకువచ్చి బలివ్వడానికి పూనుకున్నారు.
“చివరిసారిగా అమ్మవారిని ప్రార్థించుకో!” అని హెచ్చరిక జారీచేశారు.
ఆ సమయంలో పుత్రకుడు..
“పుట్టినవానికి ఎన్నటికైనా మరణం తప్పదు. దానికి నేను శోకించను. కానీ మీరెవరు.. దొంగలా?! నన్నెందుకు చంపుతున్నారు?! డబ్బుకోసమైతే నా దగ్గర ఇప్పుడు చిల్లిగవ్వ కూడా లేదు. మీరు నన్ను వదిలేసి, నాతో మా ఇంటికొస్తే కావాల్సినంత ధనమిస్తాను” అని చెప్పాడు.
అందుకు వారిలో ఒకడు..
“పుత్రకా! నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తున్నది. నీ దగ్గర ఇప్పుడున్న డబ్బుకోసం నిన్ను చంపడం లేదు. మేము మీ తండ్రులకు జూదపు మిత్రులం. నిన్ను చంపితే మేం చక్కగా ఆడుకోవచ్చని.. అడ్డు తొలగించుకోవడానికి నిన్ను చంపుతున్నాం” అని చెప్పాడు.
ఆ మాటతో పుత్రకునికి ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చింది.
“బాబూ! జూదం మహాపాతకం, దారిద్య్ర కారణమని తెలియదా?! అందుకే నేను మిమ్మల్ని అదుపులో పెట్టాను. అంతేకానీ మీమీద కోపం ఏమీ లేదు. సరే కానివ్వండి. మీ కర్తవ్యం నెరవేర్చండి. దయచేసి ఈ వార్త మా తల్లులకు తెలియచేయవద్దు. ఇదే నా చివరికోరిక” అని బలిపీఠంపై తలను ఆన్చాడు.
అతణ్ని చంపడానికి కత్తి ఎత్తినవాడికి ఆ దృశ్యాన్ని చూసి మనసు కరిగి నీరైపోయింది. కత్తి పక్కన పారేసి, కట్లు విప్పాడు.
“పుత్రకా! నువ్వు మాకొక్క మాటివ్వాలి. ఇకపై ఎప్పుడూ చించినీపురం కేసి తిరిగి చూడకు. నువ్వు బతికే ఉన్నావని తెలిస్తే మీ తండ్రులు మమ్మల్ని బతకనివ్వరు” అని పలికి తమ దారిన తాము పోయారు.
‘ఆహా! నా సంపదలన్నీ ఎంతలో దూరమైపోయాయి’.. అని విచారిస్తూ పుత్రకుడు వాళ్లు వెళ్లిన దిక్కుకు కాకుండా వేరొక దిక్కుకు ప్రయాణించసాగాడు. ఆ అడవిలో ఎంతదూరం ప్రయాణించినా జనసంచారం కనిపించలేదు. దారిలో దొరికిన పళ్లు తింటూ, రాత్రిపూట చెట్లెక్కి కొమ్మలసందున నిద్రిస్తూ నాలుగురోజులు ప్రయాణించాడు. ఐదోనాడు ఒక చోట చిన్నమెట్ట వంటిది కనిపిస్తే దానిపైకి వెళ్లాడు.
అక్కడ ఎవరో ఇద్దరు అన్నదమ్ములు తమలో తాము తగాదా పడుతున్నారు. వాళ్ల ముందు మూడు వస్తువులు ఉన్నాయి.
అవి.. ఒక బొంతసంచి, ఒక యోగదండం, ఒక జత పాదరక్షలు.
“తమ్ముడా! మన తండ్రి ఘోరతపస్సు చేసి, అపురూపమైన ఈ మూడు వస్తువులూ సంపాదించాడు. వీటిమీద మనిద్దరికీ సమానమైన అధికారం ఉంది. వీటిని మనం ఉమ్మడి ఆస్తిగానే భావిద్దాం. పాళ్లు పంచుకోవడం ఎందుకు?” అన్నాడు అన్నయ్య.
“కుదరదు. నాకు ఎవరితోనూ ఉమ్మడి పనికిరాదు. పంచి తీరాల్సిందే!” అని పట్టుబట్టాడు తమ్ముడు.
“అయితే జ్యేష్ఠభాగం కింద ఈ సంచీని నాకు వదిలేయి. దండం, పాదరక్షల్లో నీకు కావలసింది నువ్వు తీసుకుని, మిగిలిందే నాకివ్వు” అన్నాడు అన్నయ్య.
“అలా కుదరదు. అసలు మహిమంతా సంచీలోనే ఉంది. నాకు సంచీయే కావాలి” అని పంతంపట్టాడు తమ్ముడు.
“పోనీ పాదుకలు, దండం చెరొకటీ తీసుకుని.. సంచీని ఉమ్మడిగా ఉంచుకుందాం” అని అన్నయ్య ప్రతిపాదించాడు.
“నేనొప్పుకోను. ఉమ్మడిగా ఏదీ ఉండటానికి వీల్లేదు. పంచి తీరాల్సిందే!” అని ఎదురు తిరిగాడు తమ్ముడు.
ఆ అన్నదమ్ములకు వాళ్లలో వాళ్లకు వాటాలు తెగడం లేదు.
అంతలో పుత్రకుడు వాళ్లను సమీపించాడు. అన్నదమ్ములిద్దరూ అతణ్ని గౌరవంగా దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకున్నారు.
వాళ్లలో పెద్దవాడు తమ కథనిలా చెప్పసాగాడు.
“అయ్యా! నా పేరు నందుడు. వీడు నా తమ్ముడు ఉపనందుడు. ఈ సందిగ్ధ సమయంలో దైవం పంపినట్లే నువ్వు వచ్చావు. మా తగువు విని, నీకు తోచినట్లు న్యాయం చెప్పు. ఇవిగో ఈ మూడు వస్తువులనూ మా తండ్రిగారు చాలాకాలం హిమాలయాల్లో తపస్సు చేసి సంపాదించుకున్నారు. ఈ బొంత సంచిని ఆ దండంతో ఒకసారి కొట్టి దులిపితే.. దాంట్లోంచి కావాల్సినన్ని నాణేలు రాలుతుంటాయి. అంతేకాకుండా దండానికి మరో ప్రయోజనం కూడా ఉంది. దీనితో ఒక వైపు గీస్తే పల్లె, మరోవైపు గీస్తే పట్టణం పుడతాయి. సమస్త ధనకనక వస్తువాహనాలతో, ప్రజలతో ఆ రాజ్యం దండం ధరించినవాని పరం అవుతుంది. ఇవిగో.. ఈ పాదుకలను తొడుక్కుని, ఎక్కడికి పోవాలని తలచుకుంటే అక్కడికి చిటికెలో ఆకాశమార్గంలో పోగలుగుతాం. ఈ మూడు వస్తువులనూ పితృధనంగా మాకిచ్చి మా తండ్రిగారు స్వర్గస్తుడయ్యాడు. వీటిని సమానంగా పంచుకోవాలంటే మాలో మాకు పాళ్లు కుదరడం లేదు. నువ్వు తీర్పు చెప్పు. నువ్వెలా చెబితే మేమిద్దరం అలాగే నడుచుకుంటాం” అన్నాడు.
ఆ కథంతా విని.. ‘ఛీఛీ! ద్రవ్యం వంటి దుష్టపదార్థం మరొకటి లేదు కదా! ఇప్పుడు వీరిని మోసం చేయాలని నాకే బుద్ధి పడుతున్నది’ అని మనసులో తలపోశాడు. కానీ, ఆ ఊహను అణచి ఉంచుకోవడం అతని వల్ల కాలేదు. ఆ దివ్యవస్తువులను ఎలాగైనా తాను సొంతం చేసుకోవాలని ఒక యుక్తి పన్నాడు.
“బాబూ! నేనీ గుట్టనెక్కి చేతి సత్తువ కొద్దీ ఒక కట్టెపుల్లను దూరంగా విసురుతాను. మీరిద్దరూ పరుగెత్తుకుని వెళ్లి ఆ పుల్ల తీసుకురావాలి. ఎవరు ముందుగా వస్తే వారికి సంచి ఇస్తాను. మిగిలిన వస్తువుల కోసం మరోసారి పరుగుపందెం పెడతాను” అన్నాడు.
అన్నదమ్ములిద్దరూ అమాయకంగా అతని మాటలు నమ్మారు. తమ వస్తువులను పుత్రకుని వద్దనే విడిచిపెట్టి అతను విసిరిన కట్టెపుల్లను తీసుకురావడానికి పరిగెత్తారు.
పుత్రకుడు వెంటనే పాదుకలు తొడుక్కుని, మిగిలినవి చేత్తో పట్టుకుని..
‘నేను ఉత్తరదేశపు అడవులలో, పర్వత శిఖరాన జలాధార సమృద్ధిగా ఉన్నచోటికి వెళ్లాలి’ అని తలుచుకున్నాడు.
కళ్లుమూసి తెరిచేంతలో పుత్రకుడు తాను కోరుకున్న చోటికి చేరిపోయాడు. ఆ ప్రదేశం చాలా మనోజ్ఞంగా ఉంది. సుందరమైన వనమధ్యంలో నిర్మల తటాకం కనువిందు చేసింది. మనుచరిత్రలో ప్రవరాఖ్యునిలా తనను చిటికెలో అక్కడికి చేర్చిన పాదుకల ప్రభావానికి ఆనందపడుతూ పుత్రకుడు ఆ ప్రదేశంలో కలియతిరిగాడు.
జాము పొద్దెక్కింది. తీక్షణంగా ఎండ కాయసాగింది. పుత్రకుడు కాసిన్ని పళ్లు తిని, స్నానం చేయడం కోసం ఆ పాదుకలను గట్టుమీద విడిచిపెట్టాడు. పక్కనే సంచిని, దండాన్ని, తన దుస్తులను ఉంచి తటాకంలోకి దిగాడు.
(వచ్చేవారం.. మర్రిచెట్టు మీద బొంతసంచి)
అనుసృజన:
నేతి సూర్యనారాయణ శర్మ