జరిగిన కథ : కాశీలో చదువుకున్న ఏడుగురు మిత్రులు.. ధారా నగరంలో కలుసుకుని,భోజరాజు వద్ద ఉద్యోగాలు సంపాదించుకోవాలని
తీర్మానించుకున్నారు. వారిలో మొదటివాడైన దత్తకుడు అనేవాడు యక్షుని శాపం వల్ల స్త్రీగా మారి, భోజరాజు కూతురి వద్ద చెలికత్తెగా మారాడు.రెండోవాడైన గోణికాపుత్రుడు అప్పుడే ధారానగరానికి చేరుకున్నాడు.
గోణికాపుత్రుడు వేశ్యాపుత్రికలిద్దరితో కలిసి ధారానగరం చేరుకున్నాడు. ఆ రాత్రికి వారంతా ఒక సత్రంలో బస చేశారు. తెల్లవారి లేచి చూసేసరికి చిత్రసేన, రతిమంజరి, బండివాడు కూడా కనిపించలేదు. గోణికాపుత్రుడు నగరంలోనూ, తాము వచ్చిన దారిలోనూ చాలాదూరం వెళ్లి చూశాడు. కానీ, లాభం లేకపోయింది. చేసేదిలేక ఉత్తచేతులతో ధారానగరానికి తిరిగి వచ్చాడు.
రెండురోజులు పోయిన తరువాత, పండితవేషం ధరించి కోటకు వెళ్లాడు. భోజరాజు నగరంలో లేడు. రాజ్య వ్యవహారాలన్నీ చిత్రసేనుడు నిర్వహిస్తున్నాడు. గోణికాపుత్రుడు అతణ్ని ఉద్దేశించి కొన్ని శ్లోకాలు రచించి లోపలికి వెళ్లాడు. రాజపుత్రుడు అప్పుడు మంచంపై పడుకుని ఉన్నాడు. తనకు దేహంలో స్వస్థత లేదని, ఇప్పుడు కవిత్వం వినే ఓపిక లేదని చెబుతూ.. కొన్ని వరహాలు కానుకగా ఇవ్వబోయాడు రాజపుత్రుడు.
అప్పుడు గోణికాపుత్రుడు..
“రాజపుత్రా! నేను విత్తార్థినై రాలేదు. మీ సంస్థానంలో విద్వాంసులున్నారని విని, వారితో వాదించడానికి వచ్చాను. చూడబోతే మీరేదో మానసిక సమస్యతో బాధపడుతున్నట్లుగా ఉన్నారు. దీనికి నేను మందివ్వగలను” అన్నాడు.
ఆ మాటలతో రాజపుత్రుని ముఖం వికసించింది.
“కూర్చోండి. మీరు మా బాధ గ్రహించినట్లున్నారు. దీనికి ఔషధమేమిటో సెలవివ్వండి” అని అడిగాడు.
గోణికాపుత్రుడు రాజపుత్రునికి దగ్గరగా జరిగి..
“మీరు ఎవరిపైనో మనసు పారేసుకుని, విరాళిలో మునిగిపోయారు. అవునా?!” అని అడిగాడు మెల్లిగా..
రాజపుత్రుడు వెంటనే ఎక్కడలేని భక్తి ప్రదర్శించాడు. రెండు చేతులూ జోడించి..
“మహాత్మా! చారుమతి అనే వేశ్య నా హృదయాన్ని ఆకర్షించింది. ఆమెది జనాతీత సౌందర్యం. కానీ, అందరాని పండులా మారింది. మా సోదరి అంతఃపురంలో ఉంటున్నది. ఆమెను చూసింది మొదలు.. నన్నీ వ్యాధి పీడిస్తున్నది. మీరే నన్ను ఎలాగైనా రక్షించాలి” అన్నాడు.
గోణికాపుత్రుడు అభయమిస్తూ..
“అలాగే. ఒక్కసారి నన్ను ఆ అమ్మాయిని చూడనిస్తావా?” అని అడిగాడు.
రాజపుత్రుడు వెనువెంటనే..
‘కాశీనుంచి ఒక పండితుడు వచ్చాడు. అతనికి సంస్థాన కవులకు రేపు వాదాలు జరుగుతాయి. చారుమతి మహావిద్వాంసురాలు అని విని ఉన్నాం కనుక, రేపటి సభకు ఆవిడ మధ్యవర్తిగా వ్యవహరించాలని కోరుతున్నాం’ అని సందేశం పంపించాడు.
మరునాడు యథాకాలానికి సభ జరిగింది. సభలో ఒకవైపు తెర కట్టించారు. రాజపుత్రికతోపాటుగా యక్షుని శాపంతో చారుమతిగా మారిన దత్తకుడు కూడా కూర్చున్నాడు. ఆనాటి సభలో భోజ, కాళిదాసులిద్దరూ లేరు. మిగిలిన పండితుల మధ్య గోణికాపుత్రునితో రెండుగంటలకు పైగా వాదోపవాదాలు జరిగాయి. మధ్యవర్తి తీర్పు లేకుండా గోణికాపుత్రుని ఎదుట భోజరాజు ఆస్థానంలోని పండితులందరూ ఓటమిని అంగీకరించారు.
అప్పుడు రాజపుత్రిక ప్రోత్సాహం మీదట చారుమతిగా ఉన్న దత్తకుడు వాదన మొదలుపెట్టాడు. తెర అడ్డుగా ఉంది. తెరలోపల ఉన్నది తన మిత్రుడేనని గోణికాపుత్రునికి తెలియదు. గొంతును బట్టి, పేరునుబట్టి అవతల ఉన్నది తన మిత్రుడేనని దత్తకునికి తెలుసు. ఇతని బలాలు, బలహీనతలేమిటో కూడా స్పష్టంగా తెలుసు. దాంతో దత్తకుని గెలుపు నల్లేరు మీద బండినడక అయ్యింది. గోణికాపుత్రుడు తన ఓటమిని ఒప్పుకోక తప్పలేదు. రాజపుత్రి, చారుమతి అతనికి దర్శనం ఇవ్వకుండానే లోనికి వెళ్లిపోయారు.
“మహాత్మా! ఇలా చేశారేమిటి? పోనీ.. ఆమె నైజం కనిపెట్టారా?!” అని అడిగాడు చిత్రసేనుడు.
అందుకు గోణికాపుత్రుడు..
“రాజపుత్రా! ఆమె చాలా చదువుకున్నది. ఆమెను వాదంలో ఓడిస్తే తప్ప నీకు లొంగదు. ఆమెను ఓడించగలవాడు మా మిత్రుడైన దత్తకుడు మాత్రమే. అతను కూడా నాతోపాటు ఈ ధారానగరానికే వస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఇక్కడికి చేరుకోగలడు. అప్పుడు ఈమె సంగతి చూద్దాం” అని అభయమిచ్చాడు.
చేసేది లేక రాజపుత్రుడు ఊరుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. యువరాజు చేసిన సౌకర్యాలతో గోణికాపుత్రుడు ధారానగరంలో హాయిగా ఉన్నాడు. దత్తకుడి రాకకోసం ఎదురు చూస్తున్నాడు.
చూస్తుండగానే ఏడాదికాలం గడిచిపోయింది.
ఒకనాటి రాత్రి చారుమతికి, రాజపుత్రిక రుక్మిణికి అర్ధరాత్రి దాకా కామశాస్త్రంపై చర్చలు జరిగాయి.
చివరిగా రాజపుత్రిక..
“సఖీ! నీలాంటి విదుషీమణి వల్ల కానీ నాకు ఇటువంటి శాస్త్రవిషయాలు బోధపడే అవకాశం ఉంటుందా? ఇందుకు తగిన పారితోషికం ఇవ్వడానికి నా దగ్గరేమీ లేదు. ఇదిగో నిన్ను ఆలింగనం చేసుకుంటున్నాను” అంటూ కౌగిలించుకుని, చెక్కులు ముద్దుపెట్టుకుంది.
చారుమతి కూడా ఆమెను కౌగిలించి..
“రాజపుత్రీ! నీ సౌందర్య చాతుర్యాలకు తగిన భర్త లభించి, అతనితో మదన క్రీడలలో తేలుతున్నప్పుడు నన్ను స్మరిస్తావు కదూ! అదే నా ఉపదేశానికి ఫలము” అన్నది నవ్వుతూ.
ఆ మాటలకు రాజపుత్రికకు సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి. ఆ రాత్రికి వాళ్లిద్దరూ ఒకే శయ్యపై నిద్రించారు. అర్ధరాత్రి వేళకు రుక్మిణికి పాదాలు బరువెక్కినట్లుగా తోచడంతో మెలకువ వచ్చింది. కళ్లు తెరిచి చూడగా.. తన పక్కన శయనించి ఉన్నది చారుమతి కాదు.. వేరే ఒక పురుషుడు.
దత్తకుడు యక్షుని శాపంతో స్త్రీగా మారాడని తెలియని ఆమె కాసేపు గందరగోళానికి గురయ్యింది.
‘ఈ మోహనాంగుడు ఎవరు? చారుమతి ఏమైనది? ఈ సుందరుణ్ని నా పక్కపై శయనింప చేసి తానెక్కడో దాగి ఉంటుంది. అసలు ఇతణ్ని అంతఃపురంలోకి ఎలా తీసుకువచ్చింది?! ఏది ఏమైనా ఇతని మేని సంపర్కం కలిగింది కనుక, ఇతనే నా భర్త కావాలి. ఆహా! ఇతని సౌందర్యం ఎంత చూసినా తనివి తీరడం లేదు. చారుమతి మొత్తానికి మంచి ఉపకారమే చేసింది. ఇప్పుడు ఇతణ్ని లేపి, వివరాలు అడగడం ఎందుకు? ఊరకే సుఖనిద్రకు భంగం కలిగించడం ఎందుకు?’ అనుకుని.. వేరొక మంచంపై కూర్చుని తదేకంగా అతణ్నే చూస్తూ, తెల్లవారడం కోసం ఎదురు చూడసాగింది.
ఆమెకు తెలియకుండానే నిద్ర పట్టేసింది.
అటుపిమ్మట దత్తకుడికి మెలకువ వచ్చింది. నాలుగు మూలలా చూసుకుని..
‘ఆహా! నేటితో నా శాపం తీరినట్లుంది. అప్పుడే సంవత్సరమైంది కదా! జరిగినవన్నీ కలగా తోస్తున్నాయి. ఇప్పుడీ రాజపుత్రిక నిద్రిస్తున్నది. లేపి నా వృత్తాంతం చెప్పుకొని, ఇక్కడినుంచి వెళ్లడమా?’ అనుకుని, కొంతసేపు తర్జనభర్జనలు పడి, చివరికి ఆమెను నిద్రలేపకుండానే అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. అంతఃపురం బయట కాపలాదారులు దత్తకుణ్ని ఆపేశారు. లోపలికెలా ప్రవేశించావని ఆరా తీశారు. సరైన సమాధానం లేకపోయేసరికి దత్తకుణ్ని బంధించారు. కాస్త పొద్దెక్కిన తరువాత..
“తమరు అనుమతిస్తే అపరాధిని ప్రవేశపెడతాం” అని చిత్రసేనునికి విన్నవించారు కాపలాదారులు.
అప్పటికి అతను మంచంపై పడుకుని ఉన్నాడు. పక్కనే గోణికాపుత్రుడు కూర్చుని ఏదో చెబుతున్నాడు. భటులు తెచ్చిన సందేశం విని..
“మహాత్మా! మీరు వెళ్లి విచారించి రండి. నేను రాలేను” అన్నాడు రాజపుత్రుడు.
గోణికాపుత్రుడు ఈవలకు వచ్చాడు. ఎదురుగా ఉన్నది తన స్నేహితుడైన దత్తకుడే! చూడగానే అమాంతం కౌగిలించుకున్నాడు.
“మిత్రమా! నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎంతకాలమైంది ధారానగరానికి వచ్చి?!” అన్నాడు.
“మిత్రమా! ఈవేళే వచ్చాను. తెలియక రాకుమారి అంతఃపురంలోకి వెళ్తుంటే ఈ భటులు నన్ను బంధించారు” అన్నాడు దత్తకుడు.
“సరే పద. నీకోసం యువరాజు చిత్రసేనుడు ఎదురు చూస్తున్నాడు. నీతో చాలా పని ఉంది” అంటూ, లోపలికి తీసుకుపోయాడు గోణికాపుత్రుడు.
చిత్రసేనుడి వద్దకు వెళ్లి..
“యువరాజా! నా మిత్రుడు వచ్చేశాడు. ఇతనే దత్తకుడు. మహా పండితుడు. చారుమతిని ఓడించగల దిట్ట” అని చెప్పాడు.
ఆ మాటతో చిత్రసేనుడికి ఎక్కడ లేని ఓపిక వచ్చింది. మంచంమీద నుంచి లేచి కూర్చున్నాడు.
అప్పుడు దత్తకుడు..
“చారుమతి ఎవరు మిత్రమా?!” అని అడిగాడు.
గోణికాపుత్రుడు జరిగిన కథంతా చెప్పాడు. చారుమతి అనే వేశ్యను రాజపుత్రుడు వరించాడని, ఆమె మహాపండితురాలని, ఆమెను విద్యలో ఓడించి.. ఈయనకు వశపడేలా చేయాలని వివరించాడు.
“అదెంత పని?! ఆమెను వాదానికి పిలవండి” అన్నాడు దత్తకుడు.. చిరునవ్వుతో.
“వెంటనే రుక్మిణి అంతఃపురానికి లేఖ పంపండి” అని ఆదేశాలిచ్చాడు చిత్రసేనుడు.
“సభ ఏర్పాటు చేయగానే చెబుతాను. అంతవరకూ మీరు విశ్రాంతి తీసుకోండి” అని దత్తకునితో పలికాడు.
గోణికాపుత్రుడు మిత్రుణ్ని తన ఇంటికి తీసుకెళ్లాడు.
రుక్మిణి అంతఃపురానికి రాజపుత్రుని సందేశం అందింది.
“చారుమతి ఈవేళ ఉదయాన్నే ఎక్కడికో వెళ్లింది. ఆమె రాగానే మళ్లీ సమాచారమిస్తాను” అని రాకుమారి తిరుగు సందేశం పంపించింది.
అది చూసి చిత్రసేనుడు హతాశుడయ్యాడు.
రోజులు గడుస్తున్నా ఆమె తిరిగి రాలేదు. రోజురోజుకూ చిత్రసేనుడు కృశించి పోతున్నాడు. గోణికాపుత్రుడు అతనికి సాంత్వన వాక్యాలు చెబుతున్నాడు.
ఇటు దత్తకుడిలో రుక్మిణిని చూడాలనే కోరిక రోజురోజుకూ అధికం కాసాగింది. ఆమెను తాను ప్రేమించానని అప్పుడే తెలుసుకున్నాడు. కానీ ఈవేషంలో తాను అంతఃపుర ప్రవేశం చేసే అవకాశం లేదు. ఆమె తనను చూసే అవకాశం రాదు. విరహతాపంతో కుంగుతూ ఒకనాడు దత్తకుడు నగరంలో సంచరించసాగాడు. ఒక దేవాలయం వద్ద కూర్చుని అక్కడి విశేషాలు చూస్తున్నాడు. అంతలో చేతిలో చిత్రపటంతో ఒక స్త్రీ వచ్చింది. చిత్రపటాన్ని, దత్తకుని ముఖాన్ని మార్చిమార్చి చూడసాగింది.
“స్వామీ! ఇది మీ చిత్రపటమేనా?” అని అడిగింది ఆ చిత్రపటాన్ని చూపించి.
దత్తకుడు దానివంక చూసి..
“నువ్వు చిత్రలేఖవా ఏమిటి?! నా కులగోత్ర నామాలతో నీకేం పని?” అని అడిగాడు.
“ఆహా! మీరు ఉషాదేవిని పరిణయం ఆడిన శ్రీకృష్ణుని మనుమడైన అనిరుద్ధుడైతే.. నేను ఉషాదేవి వద్దకు మిమ్మల్ని చేర్చగలిగే ఆమె చెలికత్తె చిత్రలేఖనే! పని ఉన్నందునే మిమ్మల్ని పలకరించాను. ఈ చిత్రపటం మీది కాదా?! మీరెప్పుడైనా భోజరాజ పుత్రిక రుక్మిణి అంతఃపురానికి వచ్చారా?” అని అడిగింది ఆ చెలికత్తె.
“శుద్ధాంతానికి నేనెలా రాగలను?” అని అమాయకంగా అడిగాడు దత్తకుడు.
“పోనీ.. చారుమతిని ఎరుగుదురా?”.
“నేనే ఆమె.. ఆమే నేనుగా కొన్నాళ్లు మెలిగాను”.
“మిమ్మల్ని ఆవిడ మా రాజపుత్రి అంతఃపురంలో విడిచివెళ్లలేదా?”.
“ఏమో జ్ఞాపకం లేదు”.
“మీకు దండం పెడతాను. నిజం చెప్పండి!”.
“చెబితే ఫలమేమిటి?”.
“తప్పకుండా ఉంటుంది. మీకోసం మా రాజపుత్రి విరహబాధ అనుభవిస్తున్నది. ఒక్కసారి ఆమెకు కనిపించి వెళ్లండి. మీ మేలు మరిచిపోలేం”.
“కానీ, వచ్చేదెలా? మగవాళ్లను అంతఃపురంలోనికి రానివ్వరుగా?” అడిగాడు దత్తకుడు.
పరిచారిక ఆలోచనలో పడింది. దత్తకుడు నవ్వేసి, అందుకు తగిన ఆలోచన చెప్పాడు. అతను చెప్పిన సమయానికి పరిచారిక గుర్రాన్ని సిద్ధపరిచింది. దత్తకుడు ఆడవేషం వేసుకుని, ఆ గుర్రాన్నెక్కి అంతఃపురానికి వెళ్లాడు.
“చారుమతీ! వచ్చావా?!” అంటూ.. రాకుమారి ఎదురొచ్చి ఆలింగనం చేసుకుంది.
“ఆ యువకుణ్ని నా పక్కన పడుకోబెట్టి నువ్వెక్కడికి వెళ్లిపోయావు? ఎంత గాభరా పడ్డానో తెలుసా?! అయినా అంత రాత్రి సమయంలో అతణ్ని లోపలికి ఎలా తీసుకురాగలిగావు?!” అని అడిగింది.
“నీకోసమే ప్రత్యేకంగా ఎన్నిక చేశానతణ్ని. నచ్చాడా నీకు? అయినా ఎంత నచ్చకపోతే ఆ చిత్రపటం అంత చక్కగా గీసివుంటావులే” అన్నాడు చారుమతి వేషంలోని దత్తకుడు.
“నువ్వు నా మనసు ఎరిగినదానివి” అంటూ సిగ్గుపడింది రాకుమారి రుక్మిణి.
“నువ్వు కోరుకుంటే మళ్లీ అతణ్ని నీముందు నిలబెట్టగలను. ఒక్కసారి కళ్లుమూసుకో” అన్నాడు దత్తకుడు.
ఆమె ఆవిధంగా చేయగానే తన స్త్రీవేషాన్ని తీసివేసి రాకుమారి ముందు నిలబడ్డాడు. అతణ్ని చూడగానే..
“ఇంతలో చారుమతి ఏమైంది?” అని ఆశ్చర్యపోయింది రుక్మిణి.
అతని వంకనే తదేకదృష్టితో చాలాసేపు చూడగా చారుమతి, దత్తకుడు ఒకరే అని గ్రహించుకోగలిగింది. అతణ్ని గంధపుష్పాలతో పూజించింది. ఆ రాత్రి వారిద్దరూ ఇష్టక్రీడలలో మునిగితేలారు.
చారుమతి మళ్లీ అంతఃపురానికి వచ్చిందనే వార్త తెల్లవారేసరికి చిత్రసేనుడికి తెలిసిపోయింది.
(వచ్చేవారం.. యక్షిణీ గానం)
-అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ