జరిగిన కథ : మణిసిద్ధుడనే సన్యాసి కాశీయాత్రకు వెళ్తూ.. తోడుగా వచ్చిన గోపాలకునికి మజిలీల్లో చెప్పిన కథలే కాశీమజిలీ కథలు. వీటిని 1930వ దశకంలో మధిర సుబ్బన్న దీక్షితులు 12 భాగాలుగా రచించారు. పాటలీపుత్ర నగరాన్ని గురించి రాసిన 11వ భాగం కథలో.. పుత్రకుడు అవ్వతో చెప్పినట్లుగా కనిపించే కథ ఇది.
ప్రతిష్ఠానపురంలో దేవదర్శనుడు అనే సోమయాజి ఉండేవాడు. ఆయనకు సంతానం లేదు. నిరంతరం అగ్ని ఆరాధన చేస్తుండేవాడు. ఒకనాడు అతను వేకువజామున లేచి హోమశాలకు వెళ్లగా.. దక్షిణాగ్ని పక్కగా నీరునింపి ఉంచిన బంగారపు కలశంమీద మెత్తటి పొత్తిళ్లలో ఒక శిశువు చిరునవ్వులు ఒలికిస్తూ కనిపించాడు. సోమయాజి ఆశ్చర్యంతో, ఆనందంతో ఆ పిల్లవాణ్ని ఎత్తుకుని, సోమిదమ్మకు అప్పగించాడు.ఆ పిల్లవానికి శ్రీదర్శనుడని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచసాగారు. శ్రీదర్శనుడికి చిన్నతనం నుంచి ఆటలంటే మోజు. చదువు తలకెక్కేది కాదు. జూదమంటే లోకం మరిచిపోయేవాడు. పాచికలు వేయడంలో తనంతవాడు లేడని గర్వపడుతుండేవాడు. కొద్దోగొప్పో వ్యాయామం నేర్చాడు. క్రమంగా శ్రీదర్శనుడికి యవ్వనం ప్రవేశించింది.
కుమారుడికి పెళ్లిసంబంధం కోసం వెతుకుతూ.. ఒకసారి ప్రయాగ వెళ్లిన సోమయాజిని నీటిలో మొసలి లాక్కుపోయింది. ఆ వార్త తెలిసిన సోమిదమ్మ తానూ దేహత్యాగం చేసింది.
తల్లిదండ్రులు గతించిన తరువాత శ్రీదర్శనుణ్ని ఆటంక పరిచేవారు లేకపోయారు. ఇంటినే జూదశాలగా మార్చేశాడు. అన్ని దేశాలనుంచి జూదరులు ఆ ఇంటికి వచ్చి, రాత్రింబవళ్లు ఆడుతుండేవారు. క్రమంగా శ్రీదర్శనుడి ఆస్తి మొత్తం జూదరుల పాలైంది. ఇంటితో సహా సమస్తమూ కోల్పోయాడు. కట్టుబట్టలు తప్ప మరేమీ మిగలని శ్రీదర్శనుడు.. ఒకనాడు వ్యసనాన్ని మానుకోలేక ఉత్తరీయాన్ని ఒడ్డి పందెం కాశాడు. చివరికి అది కూడా పోయింది. కట్టిన వస్త్రమేమో చిరుగులు పట్టింది. ఇప్పుడు ఉపవస్త్రం కూడా లేదు. ఆ అవతారంలో నగరంలో తిరగడానికి సిగ్గుపడ్డాడు.
అప్పుడిక శ్రీదర్శనుడికి జ్ఞానోదయం అయింది.
‘ఆహా! ఇలా నన్ను చూసి సాటివారు మొఖంమీదే ఉమ్మేస్తారు. ఇక బతికి ఉండటం కంటే మరణించడమే మేలు’ అనుకుంటూ.. ఆనాడు భోజనానికి కూడా ఎక్కడికీ వెళ్లకుండా ఆ గదిలోనే కూర్చుండిపోయాడు.
తోటి జూదరులు కొందరు భోజనం తెచ్చి తినమన్నారు. కానీ అతను ఒప్పుకోలేదు. నిరాహారంగా కూర్చుండిపోయాడు. అతని మంకుపట్టును ఎవరూ మాన్పలేకపోయారు. చివరికి శ్రీదర్శనుడి బాల్యస్నేహితుడైన ముఖరకుడు పూనుకున్నాడు.
“మిత్రమా! జరిగిందేదో జరిగింది. పోదాం పద.. కొద్దిగా ఎంగిలి పడుదువు గానీ” అన్నాడు.
కానీ శ్రీదర్శనుడు అంగీకరించలేదు. అప్పుడు..
“మిత్రమా! నీ మంకుపట్టు విడిపించేందుకు నేనో కథ చెబుతాను ఆలకించు..” అంటూ ముఖరకుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.
భూమికి తిలకం వంటిది.. లక్ష్మీ సరస్వతులకు శాశ్వత నివాస స్థానమైనది కాశ్మీరదేశం. ఆ దేశానికి రాజధాని శ్రీనగరం. వితస్తానదీ తీరంలో నివసించడానికి దేవతలందరూ ఇష్టపడతారు. అటువంటి శ్రీనగరాన్ని భూనందనుడనే రాజు పాలిస్తున్నాడు.
ఆయన గొప్ప విష్ణుభక్తుడు. ఒక ద్వాదశినాడు ఆయన విష్ణువును ఆరాధించి, ధ్యానంలోనే నిద్రలోకి జారుకున్నాడు. స్వప్నంలో ఆయనకొక చక్కెరబొమ్మ కనిపించింది. సరస సంభాషణలు ఆడుతూ ముగ్గులోకి దించింది. ముద్దులు, కౌగిలింతలతో ఆ రాత్రంతా మైమరపించింది. కల పూర్తయ్యేసరికి కంగారుపడుతూ నిద్రలేచిన భూనందనుడికి ఆ సుందరి జాడ కనిపించలేదు. కానీ, ఒంటిపై సంభోగ చిహ్నాలు స్పష్టంగా తెలిశాయి. వాటిని చూసిన రాజు విస్మయం పొందాడు.
‘ఆహా! నేను అనుభవించిన సుఖమంతా కేవలం స్వప్నం కాదని, నా ఒంటిపైన ఉన్న చిహ్నాలే చెబుతున్నాయి. ఎవరో దివ్యాంగన నిన్న రాత్రి వచ్చిందనేది నిశ్చయమే! ఆమె సోయగాన్ని నాలుగు ముఖాలున్నవాడు కూడా వర్ణించలేడు. ఆ మొగము, ఆ నవ్వు, ఆ పలువరుస, ఆమె పలికిన నర్మగర్భమైన పలుకులు ఇంకా నాకు కళ్లకు కట్టినట్లే ఉన్నాయి. అటువంటి యువతీమణిని భార్యగా పొందలేనినాడు నాకీ రాజ్యమెందుకు? ఈ రాత్రి మళ్లీ ఆమె కనిపించకపోతే నా ప్రాణాలు నిలవవు’ అనుకుంటూ, పగలంతా ఆమె ధ్యానంలోనే గడిపాడు.
ఆ రాత్రి పడకటిల్లు చేరి, అదే పనిగా ధ్యానిస్తూ ఉండటం వల్ల అసలు నిద్రే పట్టలేదు.
‘నిద్ర పట్టకుండా కల రాదు కదా! కల రానిదే నిన్నటి యువతి మళ్లీ కనిపించదు..’ అని భూనందనుడు ఎంత ప్రయత్నించినా, నిద్రమాత్రం రాలేదు.
అలా పదిరోజులపాటు రాజుకు కంటిమీద కునుకే లేదు. ఏ ఆహారమూ రుచించేది కాదు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. రాచకార్యాలు పట్టించుకునేవాడు కాదు. మంత్రులందరూ అతనికి పిచ్చి పట్టిందనుకోసాగారు.
భూనందనుడు తనకు కలలో కనిపించిన యువతి చిత్రపటాన్ని గీసుకుని, మంచం పక్కనే పెట్టుకుని.. తదేకంగా దాన్నే చూస్తుండేవాడు.
ఒకనాడు ప్రధానమంత్రి వచ్చాడు.
“మహారాజా! మీరు ఆస్థానానికి రావడమే మానేశారు. ఇది రోగవికారమో, భోగవికారమో తెలియకుండా ఉంది. రాచకార్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈవేళ ఒక విచిత్రమైన అభియోగం వచ్చింది. దానిలో మీరు తప్పక తీర్పు చెప్పాల్సి ఉంది” అని మనవి చేశాడు.
భూనందనుడు తప్పనిసరై ఆస్థానానికి వెళ్లాడు.
అప్పటికే ఆ విచిత్రమైన వ్యాజ్యాన్ని గురించి విని.. రాజుగారు ఎలాంటి తీర్పు చెబుతారో తెలుసుకోవాలనే ఉత్సుకత కొద్దీ అనేకమంది ప్రజలు కొలువు కూటానికి వచ్చారు. రాజు ఒకసారి అందరినీ పరికించి..
“ఏమిటీ అభియోగం” అన్నాడు.
“మహారాజా! ఈమె పేరు రాజరత్నం. మన నగరంలో పేరుమోసిన వేశ్య శిఖామణి. ఈమె మొన్నరాత్రి ఈ విటశేఖరుని కలలో కనిపించి, అతని వద్ద వెయ్యి వరహాలు పుచ్చుకున్నది. తన కూతురైన రతిమంజరితో పొత్తు కలపడానికి ఒప్పుకొన్నది. కానీ, నిన్నరాత్రి సంభోగం కోసం ఈ విటశేఖరుడు వెళ్లగా.. ‘నీ డబ్బూ తెలియదు! నువ్వూ తెలియదు!’ అని చెబుతున్నది. దాంతో ఇతగాడు కొంతమంది స్నేహితులతో కలిసివెళ్లి రాజరత్నం ఇంటిలో గలాభా చేశాడు” అని ప్రధాని వ్యాజ్యాన్ని వివరించాడు.
“రాజరత్నమా! ఈ విటుడు నిన్నేం చేశాడు?” అని ప్రశ్నించాడు భూనందనుడు.
రాజరత్నం రాజుకు నమస్కరించి..
“ప్రభూ! ఎక్కడైనా ఇటువంటి వింత విన్నామా? ఇతగాడేదో కలగంటే నేనెలా బాధ్యురాలిని అవుతాను?! పోనీ.. ‘ఇప్పుడు వరహాలమూట తీసుకురావయ్యా!’ అంటే వినిపించుకున్నాడు కాదు. ‘డబ్బు ముందే ఇచ్చేశాను కనక, పిల్లను పంపాల్సిందే!’ అంటాడు. పైగా నిన్న పదిమందిని వెంటేసుకు వచ్చి ఒకటే గొడవ చేశాడు. నామీద చెయ్యి కూడా చేసుకున్నాడు. చూడండి మహాప్రభూ!” అంటూ గాయం చూపించింది.
భూనందనుడు విటశేఖరుని వైపు తిరిగి..
“ఏమయ్యా! దీనికి నువ్వేమంటావు?” అన్నాడు.
“దేవా! నేను ఈ మధ్యనే ఇల్లు కట్టుకునేందుకు గానూ నా మాన్యాన్ని తాకట్టు పెట్టి వెయ్యి వరహాలు అప్పు తెచ్చుకున్నాను. మొన్నటిరాత్రి ఈమె కూతురు రతిమంజరి చక్కనిదని విని దాని ఇంటికి పోయాను. ‘నీ కూతురికి కన్నెరికం చేయడానికి ఏం తీసుకుంటావు!?’ అని అడిగాను. వెయ్యి వరహాలిమ్మని అడిగిందీమె. నేను వెంటనే దాచిపెట్టిన వరహాలు తీసుకుపోయి ఈమె చేతిలో పోశాను. నేను చూస్తుండగానే ఆ సంచీని మూలనున్న ఇనపపెట్టెలో దాచింది. నేను రతిమంజరితో కొన్ని శృంగార చేష్టలు కూడా చేశాను. అంతలో తెల్లవారుతున్నది కాబోలు.. నా తల్లి తలుపు తీసి వాకిలి ఊడుస్తుండగా మెలకువ వచ్చింది. మహాప్రభూ! వెయ్యి వరహాలు అన్యాయంగా పోగొట్టుకున్నాను. నన్ను మీరే కాపాడాలి” అంటూ బోరున ఏడవసాగాడు.
భూనందనుడు వాణ్ని విసుక్కుంటూ..
“సరేసరే.. తరువాతేం జరిగిందో కూడా చెప్పు!” అన్నాడు.
“ఏలికా! ఏమని చెప్పను?! నేను మెలకువ వచ్చి చూసుకునే సరికి నా ఒంటిమీద పంటిగాట్లు ఉన్నాయి. గోటిగిచ్చుళ్లు ఉన్నాయి. పెట్టెతీసి చూస్తే నా వరహాలమూట కనిపించలేదు. అప్పుడు అది కల అని ఎలా అనుకోగలను?! నేను నిన్న రాజరత్నం ఇంటికెళ్తే.. పరిచారికల చేత గెంటించింది ప్రభూ! పైగా నేను కొట్టానని నా మీద అభియోగం మోపింది” అన్నాడు విటశేఖరుడు.. ఇంకా ఏడుపును కొనసాగిస్తూనే.
భూనందనుడికి ఒక్కసారి ఒళ్లు జలదరించింది.
‘ఈ విటశేఖరుని కథ కూడా నా కథలాగే ఉందే!?’ అనిపించింది.
“మహారాజా! కలలో సంపాదించుకున్న వస్తువులు ఎలాంటివో మీకు తెలియదా?! ఎండమావుల్లో నీళ్లు తాగదల్చుకున్నట్లు.. కలలో చేసిన పనులకు, ఇలలో ముడిపెట్టుకుని కూర్చోడం అవివేకం కాదా?!” అన్నది రాజరత్నం.
“ప్రభూ! తమకంటే అనుభవశాలులు ఎవరూ లేరు. ఇటువంటి విచిత్రాలు మీరెన్నో చూసి ఉంటారు. నా సొమ్ము నాకు ఇప్పించండి. లేదంటే రతిమంజరినైనా ఇప్పించండి!” అని గోలపెట్టసాగాడు విటుడు.
రాజు కంగుతిన్నాడు.
‘నా మనసులో సంగతులు వీడికెలా తెలిశాయి?! ఏదో మాటవరసకే అన్నాడా?! నా విషయం తెలిసే ఇలా మాట్లాడుతున్నాడా?!’ అని కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు.
“ఒరేయ్! ముందా ఏడుపు కట్టిపెట్టు. నీ పెట్టెలో నువ్వు డబ్బు పెట్టినట్లు సాక్ష్యముందా?!” అని అడిగాడు రాజు.
“అప్పుపత్రం ఉంది ప్రభూ! పొరబాటుగా అది కూడా రాజరత్నానికి ఇచ్చిన మూటలోనే ఉండిపోయింది” అని సమాధానమిచ్చాడు విటుడు.
“నీకు కలవచ్చిన మరునాడు నీ పెట్టెలో సరిగా చూసుకున్నావా?”.
“చూశాను ప్రభూ! లేదు. పెట్టెలో నా మూట ఉంటే తగువెందుకు తీసుకువస్తాను?”.
వాళ్లమాటల మధ్యలో రాజరత్నం కలిగించుకుంది.
“ప్రభూ! మీరు కూడా పొరబడుతుంటే నేనేం చేయగలను?! కలలో తెచ్చి ఇచ్చానని తానే చెబుతుంటే.. నిజంగా జరిగినట్లు అడుగుతారేం?!” అన్నది.
“ఈమె పెట్టెలో నా డబ్బు మూట చూపిస్తే ఒప్పుకొంటుందేమో అడగండి మహారాజా!” అన్నాడు విటుడు.
“నాకు తెలియకుండా నా పెట్టెలోకి డబ్బుమూట ఎందుకొస్తుంది మహాప్రభూ!” అన్నది రాజరత్నం.
“ఆ సంగతేదో నీ ఇంట్లోనే తేలుద్దాం” అంటూ కొందరు మంత్రులు, సేనాపతితో కలిసి మహారాజు బయల్దేరాడు.
రాజరత్నం ఇంట్లోని పెట్టెలో మూట కనిపించింది.
“ఇదిగో ఇదే.. నా వరహాలమూట. పరీక్షించండి మహాప్రభూ!” అని విటశేఖరుడు అందించాడు.
అందులో అతను చెప్పినట్లుగా అప్పుపత్రం కూడా కనిపించింది. అది చూసిన రాజరత్నానికి నోటమాట రాలేదు.
“లోకంలో ఒక్కొక్కసారి ఇటువంటి వింతలు జరుగుతుంటాయి. ఇతగాడికి వచ్చిన కల నిజమైనదే. రాజరత్నం! నువ్వు దీనికి కట్టుబడాలి. ఆ వెయ్యి వరహాలు పుచ్చుకుని నీ కూతురికి కన్నెరికం చేయి” అని తీర్పు చెప్పాడు భూనందనుడు.
విటశేఖరుడు ఆనందం పట్టలేకపోయాడు.
“దేవా! మీరు నా కోరిక నెరవేరేలా చేశారు. త్వరలో మీ అభిలాష కూడా తీరగలదు” అన్నాడు.
అందుకు రాజు నవ్వుతూ..
“ఏరా! నా మనసులో ఏముందో నీకెలా తెలుసు?” అని ప్రశ్నించాడు.
“నాకేమీ తెలియదు ప్రభూ! ఏదో నా సంతోషం కొద్దీ అలా అన్నాను” అని చెప్పాడు విటశేఖరుడు.
అంతఃపురానికి తిరిగి వెళ్లిన భూనందనుడికి ఆ రాత్రి కూడా నిద్రపట్టలేదు.
‘ఈ సంవాదం నా భవిష్యత్తుకు సూచన కావచ్చా?! లేకపోతే భగవంతుడు నాకీ విధంగా బుద్ధి చెప్పాడా?! ఏది జరిగినా మంచిదే!’ అనుకున్నాడు. మరికొంతసేపటి తరువాత..
‘తపస్సుతో సాధ్యం కానిది ఏదీ లేదు. శ్రీహరి కోసం తపస్సు చేసి నేను కలలో చూసిన యువతిని చేజిక్కించుకుంటాను’ అని నిశ్చయానికి వచ్చాడు.
మంత్రిమండలికి రాజ్యభారాన్ని అప్పగించి, హిమాలయాల్లోని త్రికూటాచలానికి వెళ్లాడు. కందమూలాలు మాత్రమే తింటూ పన్నెండేళ్లపాటు ఉగ్రతపస్సు కొనసాగించాడు.
ఒకనాటి రాత్రి.. రాగిరంగులోకి తిరిగిన జటలతో, మెడలో రుద్రాక్షలతో, ఒంటిపై విబూది రేఖలతో ఒక మహర్షి తుల్యుడు తన శిష్యులతోపాటు కొండదిగి కిందికి వస్తూ కనిపించాడు.
అతనికి నమస్కరించి..
“మీరు జ్ఞానమే కన్నుగా కలవారు. మీకు తెలియని సంగతులు ఉండవు. నేను కాశ్మీర దేశాధిపతిని. కలలో చూసిన వస్తువును పొందగోరి తపస్సు చేస్తున్నాను. నా తపస్సు ఫలించే మార్గం చెప్పండి” అని వేడుకున్నాడు.
అందుకు మహర్షి చిరునవ్వు నవ్వాడు.
(వచ్చేవారం.. పాతాళ సుందరి)
అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ