జరిగిన కథ : నాగరాజు వల్ల పితృదత్తకు పుట్టిన ఫణిదత్తుడు.. మల్లయోధుడయ్యాడు. కాశీ గంగలో మునిగి, పాతాళానికి వెళ్లాడు. వరుణకన్యకలకు బంధవిముక్తి కల్పించాడు. శశాంకవతి అనే రాజకన్యను రక్షించి.. మిత్రుల దారిద్య్రాన్ని పోగొట్టాడు. ఆమెతో కలిసి పారిపోతుండగా శశాంకవతిని ఎవరో ఎత్తుకుపోయారు. చివరికి విచిత్ర పరిస్థితుల్లో ఆమె జాడ తెలిసింది. ఆమెను తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాల్లో ఫణిదత్తుడు పడరాని పాట్లు పడుతున్నాడు.
సుబాహుడు మొదలైన వారంతా రాజభటుల వద్దకు వెళ్లి..
“ఆయనెవరు? ఎందుకిలా బంధించారు?” అని ప్రశ్నించారు.
“అయ్యా! వీడో గజదొంగ. వీడి వద్ద దొంగతనం జరిగిన వస్తువొకటి దొరికింది. మిగిలిన వస్తువులెక్కడ దాచాడో చెప్పడం లేదు. అందుకే వీడికి ఈ శిక్ష పడింది” అని సమాధానం చెప్పి, ఫణిదత్తుడితోసహా అక్కణ్నుంచి కదిలారు.
సుబాహుడు, సుప్రహస్తుడు, వజ్రకాయుడు.. ముగ్గురూ ఆనాడే కారాగారం ఆనుపానులు తెలుసుకుని వచ్చారు. దానికి చేరువలోనే ఒక సొరంగమార్గం తవ్వడం ఆరంభించారు. కొద్దిరోజులలోనే సొరంగం పూర్తయింది. ఒకనాటి రాత్రి కారాగారంలోకి చొచ్చుకువెళ్లి.. అధికారుల కన్నుగప్పి, ఫణిదత్తుణ్ని రహస్యంగా విడిపించారు. బయటికి వచ్చిన తరువాత..
“మిత్రులారా! నేను వరుణలోకం నుంచి తెచ్చిన శంఖం పోగొట్టుకున్న దగ్గరినుంచి అన్నీ ఆపదలే కలుగుతున్నాయి. నేను బందీని కావడం ఇప్పటికిది రెండోసారి. మొదటిసారి ఆటవికుల వల్ల కలిగిన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. అక్కడినుంచి బయటపడి, ఈ నగరానికి చేరుకున్నాను. సుబంధుని ఇంటికి వెళ్లబోతూ.. ఈ నగరానికి వెలుపల ఒక కాలువలో స్నానానికి దిగాను. ఆ ప్రవాహంలో నా ఉత్తరీయం కొట్టుకుపోయింది. ఇంతలో నీటిలో ఒక వస్త్రం కొట్టుకువస్తూ కనిపించింది. మరో ఆలోచన లేకుండా దానితో ఒళ్లు తుడుచుకుని, ఈ నగరంలోకి వచ్చాను. అది దొంగతనానికి గురైన వస్త్రమట. దాని చెంగున ఒక స్వర్ణకంకణం కూడా ఉంది. అది చూపించి, నన్ను రాజభటులు బంధించారు. ‘మిగిలిన వస్తువులేవి?’ అని అడిగితే నేనేం సమాధానం చెప్పగలను?! దాంతో వేరే దారిలేక శిక్ష అనుభవిస్తున్నాను. నా అదృష్టం కొద్దీ మీరు వచ్చి విడిపించారు. ఇంతకూ మీరు సుబంధుణ్ని కలుసుకున్నారా? శశాంకవతి క్షేమంగా ఉందా?!” అని ప్రశ్నించాడు ఫణిదత్తుడు.
“మిత్రమా! ఈ చెడ్డకాలంలో మంచివార్తలు ఎక్కడ వినిపిస్తాయి?! శశాంకవతిని ఈ నగరపు మహారాజు సుయజ్ఞుడు చెరబట్టాడట. మనం ఆమెను విడిపించుకోవాలి. అందుకు మార్గం ఏమిటో చూడు” అని జవాబిచ్చారు వారు.
ఫణిదత్తుడు వెంటనే వారికి సమాధానం చెప్పలేదు.
కొంతసేపు ఆలోచించి..
“తెల్లవారేసరికి అధికారులు కారాగారంలో బిలాన్ని గుర్తిస్తారు. నా అంచనా సరైనదైతే వాళ్లు మనల్ని వెంబడిస్తారు. కనుక మనం మారువేషాలు ధరించి.. జాగ్రత్తగా సంచరించాలి” అని చెప్పాడు.
అప్పటికప్పుడు వాళ్లు తమ రూపాలను మార్చుకున్నారు. ఎవరూ తమను గుర్తుపట్టలేని విధంగా నగరంలో సంచరిస్తూ.. శశాంకవతిని విడిపించే అవకాశం కోసం వెతకసాగారు. ఇంతలో నగరంలో కల్లోలం మొదలైంది. ప్రజలందరూ బిలమార్గాన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా సొరంగం తవ్విన దొంగల చాకచక్యాన్ని చూసి అచ్చెరువొందుతున్నారు. అలా వచ్చినవారిలో శశాంకవతి చెలికత్తె కుమారవతి కూడా ఉండటం ఫణిదత్తుడి మిత్రబృందాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
రహస్యంగా ఆమెను సమీపించి.. “నువ్విక్కడ ఉన్నావేమిటి?” అడిగాడు ఫణిదత్తుడు.కుమారవతి అతణ్ని గుర్తించింది.
“మహానుభావా! దొరికావా?! మా రాకుమారి అనుమానం నిజమే అయింది. పద.. కోటకు పోదాం. నీ కొడుకును చూద్దువుగాని” అని తీసుకుపోయింది.
ఆమె మాటలు విని, ఫణిదత్తుడు ఆశ్చర్యపోయాడు.
‘పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందేమో అనుకుంటే.. ఈమె ఇలా మాట్లాడుతోందేమిటి?’ అనుకుంటూనే ఆమె వెంట నడిచాడు. కోటలో సురక్షితంగా ఉన్న శశాంకవతిని కలుసుకున్నాడు. కొడుకును ఎత్తుకుని మురిసిపోయాడు.
కొంతసేపటి తరువాత..
“ఈ సుయజ్ఞుని భార్య మా పెదతండ్రి కూతురే. మా బావ తెలియక నన్ను కామించి, ఒక గదిలో బంధించి చెరపట్టబోయాడు. నేను గట్టిగా అరిచేసరికి, నా అదృష్టం కొద్దీ ఆ అరుపులు మా అక్క చెవినపడ్డాయి. ఆమె తన భర్తను చివాట్లేసి, నన్ను చెర విడిపించి కాపాడింది” అని చెప్పుకొచ్చింది శశాంకవతి.
“ఇదిగో మహానుభావా! మీ శంఖం. అడవిలో ఉన్న మీ చిన్నభార్యగారు మీకిమ్మని నా చేతికిచ్చారు” అంటూ కుమారవతి, తాను ఈ నగరానికి వస్తుంటే అడవిలో చూసిన విశేషాలన్నీ చెప్పుకొచ్చింది.
‘అయితే ఈ శంఖమే మళ్లీ నా ఆపదలన్నీ తీర్చిందన్నమాట. ఈ శంఖం దొరికే సమయం వచ్చింది కాబట్టే నా చిక్కులన్నీ వాటంతట అవే విడిపోయాయి’ అనుకున్నాడు ఫణిదత్తుడు.
“నాకు ప్రసవం అయిన వార్త మా నాన్నగారికి చేరింది. మనవణ్ని చూడాలని ఆయన ఒకటే తపన పడిపోతున్నాడు. త్వరలో మనం సురప్రస్థానికి ప్రయాణం కట్టాలి” అని చెప్పింది శశాంకవతి.
“అలాగే! ముందుగా పాటలీపుత్రానికి వెళ్లి, అక్కడినుంచి మీ ఊరికి బయల్దేరుదాం” అన్నాడు ఫణిదత్తుడు.
అనుకున్నట్లుగానే వారంతా పాటలీపుత్రానికి వెళ్లారు. తన తల్లిని, తనను అవమానించినందుకు రుక్మవర్మకు బుద్ధిచెప్పాలనేది ఫణిదత్తుడి తాపత్రయం. కానీ, పాటలీపుత్ర ప్రజలందరూ రుక్మవర్మ ధార్మికబుద్ధిని తెగ పొగుడుతుంటే విని, ఆశ్చర్యపోయాడు.
పాముకాటుతో చచ్చిబతికిన తరువాత రుక్మవర్మలో వైరాగ్యం కలిగింది. అసలేం జరిగిందంటే..
రుక్మవర్మ చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో గుణవర్ధనుడనే బ్రాహ్మణుడు వచ్చి..
“చనిపోయినవారి జుత్తులో పదిరోజులవరకూ ప్రాణం ఉంటుంది. సరైన వైద్యం జరిగితే మళ్లీ బతకవచ్చు!” అని చెప్పి, అంత్యక్రియలు ఆపుచేయించాడు.
గుణవర్ధనుడు మూడురోజులపాటు మంత్రం వేసేసరికి.. రుక్మవర్మ కోలుకున్నాడు. తనకు ప్రాణం పోసిన బ్రాహ్మణుడికి మూడుకోట్ల వరహాలు బహుమానమిచ్చాడు. అంత డబ్బు ఈయవద్దని సలహా చెప్పినందుకు పాతమంత్రిని తొలగించి.. గుణవర్ధనుడికే మంత్రిపదవి ఇచ్చాడు. ఆ మంత్రిగారి వల్లనే రుక్మవర్మ ధార్మికునిగా మారిపోయాడు.. అని ఫణిదత్తుడు తెలుసుకున్నాడు. ఇక రుక్మవర్మతో విభేదం లేదు కనుక, ఆ మంత్రిగారిని అభినందించాలని, ఆయన మంత్రప్రభావాన్ని తెలుసుకోవాలని అనుకుని.. కోటకు వెళ్లాడు ఫణిదత్తుడు.
తనను తాను గుణవర్ధనుడికి పరిచయం చేసుకున్నాడు. అతను చెప్పింది విని గుణవర్ధనుడు తటాలున పైకి లేచి కౌగిలించుకున్నాడు.
“బాబూ! నువ్వు పితృదత్త కొడుకువా! నేనెవరినో నీకు తెలియదు. నేను మీ మేనమామను. మీ తల్లి కన్యగానే గర్భవతి కావడంతో అవమానం తట్టుకోలేక మా అన్నదమ్ములిద్దరం ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాం. హిమాలయాలకు పోయి వైరాగ్యంతో తపస్సు చేసుకున్నాం. చివరికి హరిద్వారంలో విచిత్రంగా కలుసుకున్నాం. మా తమ్ముడు కేదారంలో ఒక మహర్షిని భక్తితో సేవించగా ఆయన మెచ్చుకుని ఏం కావాలో కోరుకోమన్నాడట. అందుకు వీడు మోక్షవిద్యను అనుగ్రహించమని కోరుకున్నాడు. కానీ ఆయన.. ‘వత్సా! నీకింకా సమయం ఉంది. అంతలోపుగా పరకాయ ప్రవేశవిద్య నేర్చుకో’ అంటూ ఆ విద్యను బోధించాడు. ‘గురుదక్షిణగా ఏదైనా అడగండి!’ అని వీడు కోరితే.. గురువు తనకేమీ అక్కరలేదన్నాడట.
కానీ, మావాడు అతిశయించిన భక్తితో గురువును ఒత్తిడిచేయగా.. ఆయన మూడుకోట్లు పట్టుకొచ్చి సమర్పించమని ఆదేశించాడట. మా అన్నదమ్ములిద్దరం ఆ డబ్బుకోసం చాలా ప్రయత్నించాం. చివరికి ఈ నగరం చేరుకున్నాం. అప్పటికే రుక్మవర్మ చనిపోయి ఉన్నాడు. దాంతో మా తమ్ముడు రాజదేహంలో ప్రవేశించాడు. తాను రాజుకాగానే నన్ను మంత్రిని చేసి, నాకు మూడుకోట్లివ్వగా దాంతో గురుదక్షిణ చెల్లించాను. కానీ, రాజదేహంలో విలాసాలకు అలవాటైన మా తమ్ముడు తన పాతదేహాన్ని మరిచిపోయాడు. అలా మేమిద్దరం ఈ పాటలీపుత్రానికి రాజుగా, మంత్రిగా స్థిరపడ్డాం..” అని తన కథనంతా చెప్పుకొచ్చాడు మంత్రి.
కొంతకాలం మేనమామల దగ్గర ఆనందంగా గడిపిన ఫణిదత్తుడు.. మిత్రులతోనూ, భార్యాపుత్రులతోనూ కలిసి సురప్రస్థానికి బయల్దేరాడు. అరణ్యాలగుండా ప్రయాణిస్తుండగా దారితప్పి, వారణాసి చేరుకున్నాడు. విశ్వనాథుణ్ని సేవించి.. మరొక్కసారి వరుణలోకానికి వెళ్లి రాగలిగితే బాగుండును అనుకున్నాడు.
“మునుపటిలాగే నౌకావిహారం చేస్తే.. గంగలోనుంచి చండిక వస్తుందేమో!? నిన్ను వరుణలోకానికి తీసుకుపోతుందేమో!?” అని సలహా చెప్పాడు సుబాహుడు.
మిత్రులు నలుగురూ గంగకు వెళ్లారు. మునుపటిలాగే ఒక స్త్రీవదనం పైకి తేలింది. ఆ తరువాత రెండుచేతులూ పైకి తేల్చింది. నలుగురూ ఒక్కసారే నీళ్లలోకి దూకారు. కానీ, ఫణిదత్తుడు మాత్రమే ఆ స్త్రీ చేతిని పట్టుకోగలిగాడు. ఆమె మళ్లీ అతణ్ని వరుణలోకానికి తీసుకుపోయింది. అక్కడ ముందుగా శివాలయాన్ని చేరుకున్నాడు ఫణిదత్తుడు. ఆ తరువాత అంతకుముందు తాను వరుణకన్యలను కలుసుకున్న భవంతిని చేరుకునే తోవ గుర్తురాక చాలాసేపు తర్జనభర్జనలు పడ్డాడు. చివరికి కనిపెట్టగలిగాడు. వారుణి మొదలైన వరుణకన్యలందరూ అతని రాకకు సంతోషించారు.
“మహాభాగా! మీరాకతో మా హృదయ వేదనంతా ఒక్కసారిగా తొలగిపోయింది. మీ దయవల్ల మేము మణిమంతానికి చేరుకున్నాం. మా మహారాజు మణిమంతులవారు మీ తండ్రిగారే అని తెలుసుకుని సంతోషించాం. మీ తల్లిగారు కూడా అక్కడే ఉన్నారు” అని తెలియచేసింది వారుణి.
ఆ మాటలు వినేసరికి ఫణిదత్తుడికి అంతులేని ఆనందం కలిగింది.
“నన్ను మీ నగరానికి తీసుకుపోగలరా? మా అమ్మను చూపిస్తారా?” అని అడిగాడు.
“సరే” అంటూ వారుణి బయల్దేరింది. ఆమె వెంట మిగిలిన ఏడుగురు వరుణకన్యకలూ వచ్చారు.
తల్లిని చూడగానే పసిపిల్లాడిలాగే ఏడుస్తూ వెళ్లి కౌగిలించుకున్నాడు ఫణిదత్తుడు. తల్లి కూడా పరిష్వంగంతో పుత్రుణ్ని సేదదీర్చింది. మణిమంతుడు కొడుకును
ఆదరించాడు.
“కుమారా! నువ్వీ వరుణకన్యకలను పెళ్లాడి, ఈ మణిమంతానికి యువరాజువై సుఖించు” అన్నాడు.
“మీ మాట నాకు శిరోధార్యమే కానీ, ఒక మగనికి ఒక్క భార్య ఉండటమే సమంజసం. ఇంతమంది స్త్రీలను ఒక్కసారిగా పెళ్లాడటం తెలివైన పని కాదు కదా!” అన్నాడు ఫణిదత్తుడు.
దానికి సమాధానం వారుణి చెప్పింది.
“మనోహరా! ఇతర కాంతలతో సంభోగం కొన్నిసార్లు పీడాకరం కావచ్చు. శక్తిని తగ్గించవచ్చు. కానీ, మాతో సంగమించడం వల్ల నీ శక్తి పెరుగుతుందే తప్ప క్షీణించదు. మేమందరమూ పతివ్రతలమే. ఒక్కరినే భర్తగా వరిస్తాం. కానీ, మాతో కూడే మగవారికి అటువంటి నియమం లేదు. మాలో ఒక్కొక్కరి వల్ల నువ్వు ఒక్కొక్క శక్తిని పొందగలవు. పైగా మమ్మల్ని రక్షించిన వీరుణ్ని మేమందరమూ వివాహమాడతామన్నది మా ప్రతిజ్ఞ. దానిని కూడా భంగపరచలేం. కనుక వెనుకంజ వేయవద్దు” అన్నది.
దాంతో ఫణిదత్తుడికి వరుణకన్యకలతో ఆడంబరంగా వివాహం జరిగింది.
ఇంద్ర, వరుణాది ముఖ్యదేవతలు అతిథులుగా వచ్చారు. తల్లిదండ్రుల కోరికమేరకు కొంతకాలం అక్కడే ఉన్నాడు ఫణిదత్తుడు. ఆ తరువాత అతడికి మళ్లీ భూలోకం మీదికి మనసు పోయింది. తల్లిని, భార్యలను వెంటపెట్టుకుని తటాకంలో మునిగి.. కాశీగంగలో తేలాడు. అప్పటిదాకా అతనికోసం స్నేహితులు కాచుకుని ఉన్నారు. దివ్యాభరణాలతో, వస్ర్తాలతో దేవతల్లా కనిపించే ఫణిదత్తుణ్ని, అతడి భార్యలను, పితృదత్తను చూసిన వాళ్లందరూ అప్రయత్నంగా చేతులెత్తి నమస్కరించారు.
సురప్రస్థంలో భూరిశ్రవుడు కూడా తన అల్లుడి వైభవానికి తబ్బిబ్బయ్యాడు. కూతురిని, మనవణ్ని చూసుకుని ఆనందించాడు. కొంతకాలం అతని ఆతిథ్యం తీసుకున్న తరువాత పితృదత్త, వారుణి మొదలైనవారంతా వరుణలోకంలోని మణిమంతానికి మరలిపోయారు. తాను తలచినప్పుడు మళ్లీ వస్తానని ఫణిదత్తుడికి వారుణి మాటిచ్చింది.
మరికొంతకాలం గడిచిన తరువాత భూరిశ్రవుడు..
“అల్లుడుగారూ! నేనింక వానప్రస్థానికి తరలిపోతున్నాను. ఈ రాజ్యాన్ని మీరు పాలించండి” అని చెప్పి, పట్టాభిషేకం చేశాడు. తన మిత్రులైన సుబాహుణ్ని, సుప్రహస్తుణ్ని మంత్రులుగానూ, వజ్రకాయుణ్ని సైన్యాధిపతిగానూ చేసుకుని ఫణిదత్తుడు సురప్రస్థాన్ని పాలించసాగాడు.
అడవిలో శబరుల ఆటలు కట్టించి, వారిచ్చే బలులను మాన్పించాడు. ఫణిదత్తుడికి, శబరకాంతకు పుట్టిన పిల్లవాణ్ని ఆ శబరరాజ్యానికి యువరాజును చేశాడు.
మరికొంతకాలానికి మేనమామల నుంచి పిలుపు వచ్చింది.
‘మాకు భోగాలమీద వాంఛ నశించింది. పాటలీపుత్రాన్ని నీ పరం చేస్తున్నాం. వచ్చి స్వాధీనం చేసుకో’ అంటూ.. అలా ఆ రాజ్యానికి కూడా ఫణిదత్తుడే ప్రభువై, చాలాకాలంపాటు ప్రజారంజకంగా
పాలన చేశాడు.
(వచ్చేవారం.. విగ్రహంలో విద్యాధర)
-అనుసృజన:
నేతి సూర్యనారాయణ శర్మ