జరిగిన కథ : కాశీమజిలీల్లో ప్రస్తుతం సప్తమిత్ర చరిత్రలో ఉన్నాం. భోజుని కొలువు సంపాదించుకోవాలనే లక్ష్యంతో కాశీనుంచి బయల్దేరిన మిత్రుల్లో చివరివాడి కథ ఇది.నిజానికి అందరికంటే ముందు భోజరాజును కలిసింది ఇతనే! పేరు ఘోటకముఖుడు. భైరవుడనే తాంత్రికుడు ఎత్తుకుపోయిన భోజుని ఇల్లాలిని వెతికే పనిలో రాజుకు సాయం చేశాడు.ఆ తరువాత అందరికంటే ఆలస్యంగా ఇద్దరు యువతులను వెంటబెట్టుకుని, ధారానగరానికి వచ్చాడు.
ఘోటకముఖుడు తనకు అవ్వతో జరిగిన సంభాషణ చెబుతున్నాడు.“సరేనవ్వా! నాకు నీ డబ్బుతో పనిలేదు. నా మిత్రులిద్దరు మహారాజులయ్యారు. వారి డబ్బును నేను కావాల్సినట్లుగా ఖర్చుపెట్టుకోవచ్చు. కానీ నీవల్ల నాకో సాయం కావాల్సి ఉంది. నీ అల్లుడు రాజు కదా! నన్నొకసారి వరాహద్వీపానికి తీసుకుపో. నిన్ను గుర్రంగా మార్చివేసిన తాంత్రికుడు నీలాగే అనేకమంది స్త్రీలను కూడా జంతువులుగా మార్చాడు. వాణ్ని సంహరించాలంటే.. మహారాజు సహాయం అవసరం” అని కోరాను.
“సరే నాయనా! ఇప్పుడే వెళదాం” అంటూ నన్ను బయల్దేరదీసింది.
ఇంతలో అనేక ఆవులు, ఎద్దులు ఆమె వద్దకు వచ్చాయి. ఆమెను నాకుతూ, ముట్టెలతో పొడుస్తూ వియోగబాధను తెలియచేశాయి. ఆమె కొన్నిటిని గంగడోలు దువ్వి ఓదార్చింది. మరికొన్నిటిని పేరుపెట్టి పిలిచి, చేరదీసింది. అది చూసిన నేను..
“అవ్వా! నువ్వు చెప్పింది నిజమే. పశుపత్ని సుతాలయాలు రుణానుబంధ రూపంగా ఏర్పడతాయి!” అన్నాను.
“అవును నాయనా! నా పశువులను ఎవ్వరూ తీసుకుపోలేరు. ఒకవేళ బలవంతంగా తోలుకు పోయినా అవి ఎందులోనూ కలవవు. వెంటనే పారిపోయి వచ్చి మందలో కలిసిపోతాయి. సరే.. మనం వెళదాం పద!”.
.. అంటూ ఆమె మౌనంగా తన కుటీరంలో అంతకుముందు తలుపులు మూసి ఉన్న గదికి సరిగ్గా వెనుక వైపు తీసుకువెళ్లింది. దానిలో చాలా నిగూఢంగా అమరి ఉన్న చిన్నతలుపు తీసింది. దానిలో ఒక నేలసొరంగం ఉంది. ఇద్దరం దానిలోకి దిగాం. లోపల మిక్కిలి విశాలంగా ఉంది. ఇంద్రభవనంలా ఉంది. వింతవింత వస్తువులున్నాయి.
“ఇందాక చెప్పాను కదా.. ఈ గది ఉన్న జాడ నా కూతురికి కూడా తెలియదు అని. ఒకప్పుడు నా అల్లుడికి చెప్పాను. తరువాత ప్రాణదాతవు కనుక, నీకు చెప్పాను. సరే.. నా కోరిక నెరవేరింది. ఇంక నువ్వు అడిగింది చేస్తాను. పద ప్రయాణం కడదాం” అన్నది అవ్వ.
మంద దగ్గరికి పోయి రెండు దున్నపోతులను తీసుకొచ్చింది. వాటివీపుపై మెత్తని ఆకులు, చిగుళ్లు కలిపి జీనులాగా కట్టింది. ఒకదానిపై తానెక్కి, రెండోదానిపై నన్ను ఎక్కమంది.
నాకు నవ్వు వచ్చింది. కానీ వేరే ప్రయాణ సాధనం లేకపోవడం వల్ల, ఆమె చెప్పినట్లు చేయక తప్పలేదు. ఆ కొండలలో పాదచారిగా వెళ్లడం చాలా కష్టమట. యముడంతటి మహాత్ముడు సైతం దున్నపోతును సాధనంగా చేసుకున్నాడు. ఇక మన మాట లెక్కేమిటి? అని నేను దానిపై ఎక్కాను.
అవ్వ ముందు వెళుతుండగా.. నేను వెనుక పోతున్నాను. కొంచెమైనా కుదుపు లేదు. ఆ దున్నపోతులు చాలా వేగంగా నడుస్తున్నాయి. ఏమీ అదిలించాల్సిన అవసరం రాలేదు. మిట్టలు ఎక్కేటప్పుడు ముందు శరీరాన్ని వంచుతూ.. పల్లానికి దిగేటప్పుడు వెనుక శరీరాన్ని వంచుతూ మాకు ఆయాసం లేకుండా నడుస్తున్నాయి.
మూడురోజులపాటు అలా పయనించి.. సముద్రతీరంలో ఉన్న ఒక పల్లెను చేరుకున్నాం. అవ్వ ఒక ముసలివాని వద్దకు వెళ్లి.. వరాహపురానికి ఓడ కట్టమని నియోగించింది. వాడప్పుడే ఒక చిన్న ఓడ తెచ్చి మాకోసం అట్టేపెట్టాడు. మేము పెందలకడనే భోజనం చేసి ఓడ ఎక్కాం. పొద్దు గుంకడానికి ముందుగా ఆవలి ఒడ్డుకు చేరాం.
వెంటనే ఒక బండి ఎక్కి నగరాన్ని చేరుకున్నాం. ఆ నగరం మహోన్నతమైన సౌధాలచేత, సమస్త వస్తువులతో నిండిన వాణిజ్య మార్గాలతోనూ ప్రకాశిస్తున్నది. రాజమార్గాన కోటకు చేరుకున్నాం.
ఆ అవ్వను అందరూ ఎరిగినవారే కావడంతో ఎవ్వరూ అడ్డగించలేదు. ఆమె నన్ను తిన్నగా లోపలి భవనానికి తీసుకుపోయింది. తల్లి వస్తున్నదన్న వార్త తెలిసి ఆమె పుత్రికైన మిత్రవింద కొంతదూరం ఎదురు వచ్చింది. నన్ను చూసి పక్కకు తొలగబోయింది.
“వద్దు వద్దు. ఈయన మనకు ఆంతరంగిక బంధువు. అర్చనీయుడు. ఈయనకు పాద్యం తీసుకురా!” అని అవ్వ చెప్పింది. ఆమె నాకు కాళ్లు కడుక్కునేందుకు నీళ్లిచ్చింది. సకలోపచారాలు చేసింది.
“నీ భర్త నగరంలోనే ఉన్నాడా?” అని అడిగింది అవ్వ.
“లేరు. వారి మిత్రుడైన విపులుడు వర్తమానం చేయగా మహాపురానికి వెళ్లారు. రేపటి మధ్యాహ్నానికి తిరిగి రాగలరు” అని సమాధానం ఇచ్చింది మిత్రవింద.
ఆ రాత్రికి నాకు విందుభోజనం వడ్డించారు. హాయిగా నిద్రించాను. మరునాడు మంగళగీతాలతో మేల్కొన్నాను. పరిజనులు సకలోపచారాలు చేశారు.
ఇంతలో అవ్వ వచ్చింది. కుశల ప్రశ్నలు వేస్తూ..
“అల్లుడుగారు మధ్యాహ్నానికే వస్తున్నట్లు, ఇప్పుడే వార్త వచ్చింది. అన్నట్లు నా మనుమరాలిని చూశావా? జాంబవతీ! ఇలా రా అమ్మా” అని ఒక యువతిని పిలిచింది.
ఉన్నమాట చెప్పకేం.. ఆమె శరీర లక్షణాలన్నీ సాముద్రిక శాస్ర్తానికే పాఠాలు చెప్పగలిగేలా ఉన్నాయి. ఆమె రూపాతిశయానికి నాకు మోహాతిరేకం కలిగింది. ఆమె నాకు నమస్కరించింది.
‘అనుకూల భర్తృలాభ సిద్ధిరస్తు’ అని ఆశీర్వదించాను. ఆమె ముసిముసి నవ్వులు నవ్వుతూ లోపలికి వెళ్లిపోయింది. మధ్యాహ్నానికి మిత్రవింద భర్త వచ్చాడు.
“ఇదిగో ఈ మహానుభావుని వల్లనే మా అమ్మ మనకు దక్కింది” అని చెప్పింది మిత్రవింద.
“ఆమెకలా కావాల్సిందే! ఈసారైనా అడవికి పోకుండా ఇక్కడే ఉండమని అడిగావా?” అని ఆమెతో నవ్వుతూ అన్నాడు.
తదుపరి నాకు నమస్కరించి, నా వృత్తాంతం అడిగాడు. భైరవుని వృత్తాంతమంతా అతనికి చెప్పాను. అతను నన్ను గొప్పగా గౌరవిస్తూ విద్యలలో కొంతసేపు ముచ్చటించాడు. ఆ పూట మేమిద్దరం ఒకేపంక్తిలో భోజనం చేశాం.
ఆ సమయంలో అతని భార్య మా ఇద్దరికీ తాటాకు విసనకర్రతో విసరసాగింది.
“నాథా! విపులుడు మిమ్మల్ని పిలిపించిన కారణమేమిటో చెప్పగలరా?” అని కోరింది.
అందుకతడు నవ్వుతూ ఇలా చెప్పసాగాడు.
“విను! నిజానికి విపులుడు నిష్కాముడు. అయినా మతంగయోగిని ప్రబోధంతో ఇద్దరు వారకాంతలను వరించాడు. వారిని బలవంతంగా రప్పించుకున్నాడు. ఆ అమ్మాయిలిద్దరూ అంగీకరించకుండా ఎలాగో భోజుని పుత్రునికి తెలియచేశారు.
భోజుని కొడుకైన చిత్రసేనుడు మన విపులునికి..
‘రాజా! ప్రజల న్యాయాన్యాయాలను విచారించి, దుర్జనులను శిక్షించి.. సజ్జనులను రక్షించడం రాజధర్మం. నువ్వు ఆమాట మరిచి ఇద్దరు వారవనితలను బంధించావని తెలిసింది. అది ఎంత పాపం. నువ్వు ఈ జాబు చూసిన తక్షణమే వేశ్యాపుత్రికలను విడిచిపెట్టు. ఆ సంగతి మాకు తెలియచేయి. నీనుంచి సరైన జవాబు రాకపోతే వెంటనే నీపై యుద్ధం ప్రకటిస్తాం. నీ రాజ్యాన్ని అన్యాక్రాంతం చేస్తాం’ అని లేఖ పంపాడు.
విపులుడు భోజునికంటే దుర్బలుడు కనుక..
‘మహారాజా! నా శత్రువులెవరో మీకటువంటి వార్త తెలియపరిచి ఉన్నారు. వేశ్యాపుత్రికలను నేనెన్నడూ తీసుకురాలేదు. వారు నా దేశంలో లేరు. మీకు నా మాటమీద విశ్వాసం లేకపోతే మీ దూతలను పంపి వెతికించండి. నా రాజ్యంలో ఆ వారకాంతలు ఎక్కడున్నా మీ శిక్షకు పాత్రుడవుతాను’ అని తిరుగులేఖ పంపాడు.
తర్వాత నన్ను రమ్మని వర్తమానం పంపాడు. నాకు జరిగినదంతా చెప్పిన తరువాత..
‘మిత్రమా! నేను మతంగయోగిని మూలంగా బలవంతంగా ఇద్దరు గణికలను ఎత్తుకొచ్చానన్న మాట నిజమే. గడిచిన దానికి వగచిన ప్రయోజనం లేదు. ఇప్పుడు వీరిని విడిచిపెడితే నా అక్రమమార్గం వెల్లడి కాక తప్పదు. ఎంతైనా వేశ్యాపుత్రికలు కదా అని తెచ్చాను. వాళ్లేమో కులస్త్రీల కంటే ఎక్కువ పరితాపం చెందుతున్నారు. కాబట్టి మీరు వీరిని మీ దేశానికి తీసుకుపోయి కొన్నిదినాలు కాపాడండి. ప్రస్తుతం ఎదురైన ఉపద్రవం గట్టెక్కిన పిమ్మట తదుపరి కర్తవ్యం ఆలోచిద్దాం’ అని కోరాడు.
అక్రమమైనా మిత్రుని కార్యం చేయదగినదని తలచి.. వాళ్లిద్దరినీ ఇక్కడికి తీసుకు వచ్చాను. వారు చావడి గదిలో ఉన్నారు!”
..అని భర్త చెప్పిన మాటలు ఆలకించిన మిత్రవింద ముక్కున వేలేసుకుంది.
..ఇంతవరకూ కథ చెప్పి, ఒక క్షణం ఆపిన ఘోటకముఖుడు తన మిత్రుడైన గోణికాపుత్రుని వైపు తిరిగి..
“మిత్రమా! ఆనాడు నీ దగ్గరనుంచి మాయమైన వేశ్యాపుత్రికలిద్దరూ ఏమైనారో ఇప్పటికైనా తెలిసిందా?!” అన్నాడు.
“అది సరే మిత్రమా! వారే వీరిద్దరూ అని.. నేను వీరికోసమే చూస్తున్నానని నీకెలా తెలిసింది? తరువాతి కథేమిటి?” అని ప్రశ్నించాడు గోణికాపుత్రుడు.
అప్పుడు ఘోటకముఖుడు తాను విడిచిపెట్టిన కథను తిరిగి ఇలా కొనసాగించాడు.
అలా భర్త చర్యలను తప్పుపట్టిన మిత్రవింద అతనితో..
“నాథా! మీరు చేసిన పని భోజరాజుకు తెలిస్తే ఆయన మీపై కూడా కత్తిగట్టక మానడు. ‘కర్తా కారయితాచైవ’ అన్నారు. పుణ్యపాపాలు చేసినవాడు, చేయించినవాడు, ప్రేరకుడు, దానిని అనుమోదించినవాడు కూడా సమంగా ఆ ఫలాన్ని పొందాల్సి ఉంటుంది. దీనికి తార్కాణంగా ఒక పండితుడు నాకు చెప్పిన కథను చెబుతా వినండి.
కౌశికుడనే బ్రాహ్మణుడు ఒకనాడు ఒక సన్యాసిని.. తన ఇంటికి భిక్షకు పిలిచాడు. తనకు వాడుకగా పెరుగు, పాలు తెచ్చే గొల్లభామను పిలిచి.. కమ్మని మీగడ పెరుగు తెచ్చిపెట్టమని పురమాయించాడు. ఆమె అలాగేనని పెరుగుముంత తట్టలో పెట్టి నెత్తిన పెట్టుకుని నడిచి రాసాగింది. మార్గమధ్యంలో గాలివీచి ముంతపైనున్న వస్త్రం తొలగింది.
అదే సమయంలో ఆకాశంలో గరుడపక్షి ఒక తెల్లత్రాచును పట్టుకుపోతున్నది. ఆ పాము కక్కిన విషం కాస్తా.. ఈ పెరుగు ముంతలో పడింది. అసలు సంగతి తెలియని బ్రాహ్మణుడు ఆనాడు యతికి భిక్షలో ఆ పెరుగే వడ్డించాడు. దానిని తిని యతి మరణించాడు.
ఆ బ్రాహ్మణుడు మిక్కిలి దుఃఖిస్తూ గ్రామస్తుల సాయంతో యతి దేహాన్ని గంగార్పణం కావించాడు.
ఇప్పుడు ఈ యతిహత్యాదోషాన్ని ఎవరి పేరిట రాయాలన్న సంశయం చిత్రగుప్తునికి కలిగింది. యముడు సైతం తత్తరపడ్డాడు. ధర్మకర్తలను అడిగారు. అప్పుడు వారు..
‘శ్రోత్రియుడికి అందులో విషం కలిసిందని తెలియదు. ఆయన శ్రద్ధాభక్తులతోనే కర్తవ్యం పాటించాడు. గొల్లభామకు తన తలపైనున్న ముంతపై వస్త్రం తొలగిందని తెలియదు. ఆమె తన కులాచారాన్ని పాటించింది కనుక, ఆమెకు పాపం అంటగట్టలేం. పోనీ వస్ర్తాన్ని కదిలించిన వాయువుకు ఈ పాపాన్ని పంచడమూ సాధ్యం కాదు. చలనం ఆయన సహజ లక్షణం. అలాగే గరుడుని నోట చిక్కిన పాము అస్వతంత్రురాలు. దానికి ఇందులో వాటా లేదు. పాములు గరుడుల ఆహారం కనుక, గరుడునికీ దీనితో సంబంధం లేదు..’ అని చెప్పారు.
యమధర్మరాజు ఆ మాటలు ఆలకించి..
‘ప్రస్తుతం ఈ పాపాన్ని ఎవరి పేరునా రాయవద్దు’ అని చిత్రగుప్తునితో చెప్పి, వైకుంఠానికి వెళ్లాడు.
నారాయణుడు గొప్పసభ చేసి, మహర్షులను పిలిచాడు. వారు కూడా ఈ ధర్మసందేహాన్ని తీర్చలేకపోయారు. ఆ సభలో అందరి మాటలూ ఆలకించిన గరుత్మంతునికి ఆరడి పుట్టింది. ఒకవేళ వీళ్లంతా కలిసి తమ జాతిపై నెపం తోసివేస్తారేమో.. తమను శపిస్తారేమో అని.
గరుత్మంతుని మనసులోని ఆవేశం పక్షిజాతికి అంతటికీ చేరిపోయింది. పక్షులన్నీ ఇదే కథను చెప్పుకోసాగాయి.
ఒకనాడు ఒకచెట్టుపై రెండుపక్షులు ఇదే కథను చెప్పుకొంటూ ఉండగా.. పక్షిభాష ఎరిగిన ఇద్దరు బ్రాహ్మణులు చెట్టుకింద కూర్చుని ఉన్నారు. వారిలో ఒకడు..
‘ఈ మాత్రం దానికి మహర్షుల దాకా ఎందుకు? నారాయణుడు సభ చెయ్యడం ఎందుకు?! నేనైతే తేలిగ్గా సమాధానం చెప్పేస్తాను. పెరుగు ముంతలో విషం ఉందని పరీక్ష చేయకుండా వడ్డించిన శ్రోత్రియ బ్రాహ్మణుడిదే తప్పు’ అన్నాడు.
ఆ మాటలను వెనువెంటనే చిత్రగుప్తుడు ఆలకించాడు. యమధర్మరాజుకు చెప్పి వాణ్ని నరకానికి పిలిపించాడు.
‘నువ్వు ధర్మసూక్ష్మాన్ని వివరించగలవా?!’ అంటూ అతని ముందు రెండు పెరుగు ముంతలను పెట్టాడు.
‘వీటిలో ఒకదానిలో విషం కలిసింది. నువ్వు విషం లేని ముంతను తాగి, కలిసినదానిని విడిచిపెట్టు’ అని పరీక్ష పెట్టాడు.
ఆ మాటతో ప్రగల్భాలు పలికిన బ్రాహ్మణుడికి కళ్లుబైర్లు కమ్మాయి.
‘అసత్య దోషారోపణ చేశావు కనుక, నువ్వే ఈ ఫలాన్ని అనుభవించు’ అని యమధర్మరాజు తీర్పు చెప్పాడు.
నాథా! అందుచేత మీరు చేసినది మంచి పని కాదు..” అని మిత్రవింద చెప్పింది.
ఘోటకముఖుడు చెబుతున్న కథ ఇంకా కొనసాగనుంది.
(వచ్చేవారం.. మిత్ర సమ్మేళనం)
-అనుసృజన:
నేతి సూర్యనారాయణ శర్మ