జరిగిన కథ : ధారానగరానికి వెళ్తున్న ఏడుగురు మిత్రుల కథ ఇది. ముగ్గురు మిత్రులు ఇప్పటికే ఆ నగరం చేరుకున్నారు. నాలుగోవాడైన కుచుమారుడు, ఐదోవాడైన గోనర్దీయుడు పురందరపురంలో ఉన్నారు. ఆరోవాడైన చారాయణుడు భైరవుడనే తాంత్రికుడి వల్ల గాడిదలా మారి ఎటో పోయాడు. ఏడోవాడైన ఘోటకముఖుడు, భోజరాజుకు సాయం చేయడానికి పురందరపురం వచ్చాడు.
పురందరపురం కవిపండితులతో కిటకిటలాడుతున్నది. ఆ నగరాధిపతి అయిన హిరణ్యగర్భుడు తిరిగి వచ్చాడు. ఆయన తన కూతురైన సరస్వతి చాలాకాలంపాటు ఎవరినీ వరించకపోవడంతో విసిగి వేసారాడు. రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి వనవాసానికి వెళ్లిపోయాడు. చివరికి ఆమె కుచుమారుణ్ని వరించిందని తెలిసి సంతోషించాడు. ఇంతలో.. ‘అతను కుచుమారుడు కాదు. అవునని నిరూపిస్తే తప్పక అతణ్నే పెళ్లాడతాను’ అని ఆమె చెప్పడంతో రాజధానికి తిరిగి వచ్చాడు.
ధర్మనిర్ణయం చేయడానికి కవిపండితులందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వర్తమానాలు పంపాడు. ధారానగరానికి కూడా వర్తమానం వెళ్లింది. భోజరాజు, కాళిదాసు కూడా ఆ సభకు వస్తారని అంతా అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో భోజరాజు ధారానగరంలో లేడని, కాళిదాసు ప్రస్తుతం అల్లాణభూపతి ఆస్థానంలో ఉన్నాడని తెలిసి నిరుత్సాహపడ్డారు. నిజానికి ఘోటకముఖునితో కలిసి.. భోజరాజు ఆ సభకు రానేవచ్చాడు. కానీ, ఆ సంగతి ఎవరికీ తెలియదు.
ధర్మనిర్ణయానికి సభాపతిగా ఎవరు ఉండాలనే చర్చ వచ్చినప్పుడు భోజరాజే.. ఘోటకముఖుని పేరు ప్రతిపాదించాడు. గోనర్దీయుడు రాజ్యాధిపతి హోదాలో వచ్చాడు. అతని పక్కనే కుచుమారుడు కూడా ఆసీనుడయ్యాడు. ఘోటకముఖుని ఎంపికను గోనర్దీయుడు సమర్థించాడు.
సభాపతి హోదాలో ఘోటకముఖుడు ప్రశ్నించాడు.
“కుచుమారా! నువ్వు నిజమైన కుచుమారునివి కాదని సరస్వతి చెబుతున్నది. దీనికేమంటావు?”.
“అయ్యా! నేనే కుచుమారుణ్ని. సరస్వతిని అన్ని విద్యలలోనూ ఓడించాను. దైవికంగా ఆమె పంపిన చిలుక ఒక పిల్లి వల్ల చచ్చింది. మళ్లీ ఆమె మరో చిలుకను పంపి, దానికి విద్యలు నేర్పమని కోరింది. నేను అందుకు అంగీకరించలేదు. ఒకే పనిని మళ్లీ మళ్లీ చేయమని చెప్పడం మాకు అవమానకరం. ఇష్టముంటే పెళ్లి చేయండి. లేదంటే నా దారిన నేను పోతాను” అన్నాడు.. మాయా కుచుమారునిగా వేషం వేసుకున్న శంబరుడు.
“ఆ మాట సమంజసంగా లేదు. మళ్లీ మళ్లీ చెప్పినంత మాత్రాన విద్యలకు అవమానం కాదు. ఆమెకు కాదు, మా ప్రశ్నలకు సమాధానం చెబుతావా?”.
“నేనెవ్వరికీ చెప్పదలుచుకోలేదు”.
“బహుశా.. నువ్వు చదివిన విద్యలన్నీ చిలుకకు ఉపదేశించడం వల్ల మరుపునకు వచ్చాయేమో!”.
“అది కూడా కావచ్చు!”.
శంబరుడు చెప్పిన సమాధానానికి సభంతా పకపకమని నవ్వింది. ఆ నవ్వుల మధ్య..
“పోనీ.. నీకు కుచుమారుడు అని పేరున్నట్లు మీ గ్రామస్తుల చేత చెప్పించగలవా?” అని ప్రశ్నించాడు ఘోటకముఖుడు.
“చెప్పించగలను. కానీ.” అని తడబడసాగాడు శంబరుడు.
అప్పుడు క్రోధాతిరేకంతో..
“ఓరీ! నువ్వు కుచుమారునివి కాదు. నేను, కుచుమారుడు ఒకే గురువు దగ్గర చదువుకున్నాం. నా మిత్రుడే రాజపుత్రికను ఓడించాడన్నమాట వాస్తవం. నువ్వతని స్థానంలోకి ఎలా వచ్చావు? నా మిత్రుణ్ని ఏం చేశావు?! చెప్పకపోయావో నువ్వు రాజదండనకు గురికాక తప్పదు” అని పలికాడు ఘోటకముఖుడు.
సభ వైపు తిరిగాడు.
“అయ్యా! వీడు వట్టి శుంఠ. వీని వద్ద సంస్కారమేమీ లేనట్లు ఆ మాటతీరు చూస్తుంటేనే తెలుస్తున్నది. రాజపుత్రిక బుద్ధిమంతురాలు కాబట్టే నిజం గ్రహించింది. ఆమె ఈ మూఢుణ్ని పెళ్లాడటం సమంజసం కాదు. కుచుమారుడే తగినవాడు. వాణ్ని వెతికి తెప్పించడమే సరైనది” అని పలికి కూర్చున్నాడు.
సభవారంతా కరతాళ ధ్వనులు చేశారు.
అప్పుడు గోనర్దీయుడు లేచి నిలబడి..
“అయ్యా! నేనిప్పుడు యదార్థం చెబుతున్నాను వినండి. ఇప్పుడు కుచుమారుని వేషంలో ఉన్నవాడి పేరు శంబరుడు. నా మిత్రుడైన కుచుమారునికి వంటచేసే నిమిత్తం ఈ నగరంలో ప్రవేశించాడు. సరస్వతిని గెలుచుకున్న తరువాత ఒకనాడు కుచుమారుడు నిద్రపోతుండగా వాని శిరస్సుపై బండవేసి పగులగొట్టి.. వీడు అతని స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు చెపుతున్నాను. ఇదిగో.. ఇతనే నిజమైన కుచుమారుడు” అని సభకు పరిచయం చేశాడు.
కుచుమారుడు లేచి నిలుచున్నాడు.
“మిత్రులారా! మీరేనా?! ఇంతసేపూ గమనించనేలేదు సుమా!” అంటూ ఘోటకముఖుడు వచ్చి వారిని కౌగిలించుకున్నాడు.
మిత్రులు ముగ్గురూ కలుసుకున్న ఆనందంలో ఉండగా.. సభలోని కవి పండితులు శాస్త్రవిషయాల్లో కొన్ని ప్రశ్నలు వేశారు. కుచుమారుడు అన్నిటికీ సరైన సమాధానాలు చెప్పాడు.
“ఇతనే కుచుమారుడు. ఇతనే సరస్వతిని ఓడించినవాడు” అని సభ తీర్మానించింది.
మోసం చేసి తానే కుచుమారుడినని ప్రకటించుకున్న శంబరుణ్ని తీవ్రంగా శిక్షించాలని సభ ప్రతిపాదించింది. కానీ కుచుమారుడు ఒప్పుకోలేదు. “దయచేసి అతణ్ని విడిచిపెట్టండి. అతని తండ్రి ఇచ్చిన సలహా మేరకే నేను సరస్వతిని గెలుచుకున్నాను. అతనే లేకపోతే నాకీ విజయమే లేదు. కనుక, శంబరుణ్ని వీలైతే సత్కరించండి. శిక్షించవద్దు” అని కోరాడు.
పురందరపురం అధిపతి హిరణ్యగర్భుడు అందుకు అంగీకరించి.. సభ వారు చేసిన ధర్మనిర్ణయాన్ని కుమార్తెకు తెలియచేశాడు.
ఆనాటి సాయంత్రం కుచుమారుని వద్దకు సరస్వతి మరో చిలుకను పంపించింది. పూర్వంలాగే.. తన మెడలోని సిద్ధుని అస్థిమాలను చిలుక మెడలో వేశాడు కుచుమారుడు. ఈసారి పాతచిలుక కంటే కొత్తచిలుక మరింత పండితురాలైంది. దాని వైదుష్యాన్ని చూసి సరస్వతి మరింత మురిసిపోయింది.
‘ఇతనే కుచుమారుడు’ అని తండ్రికి ధ్రువీకరించింది. ఆ మరునాడే మిత్రులందరి మధ్య ఘోటకముఖుడు ఇలా చెప్పాడు.
“మిత్రులారా! మిమ్మల్ని కలుసుకోవడానికి నేను ధారానగరానికి వస్తున్నాను. దారిమధ్యలో అడవిలో ఒకచోట ఒక యువతి మెడకు ఉరిపోసుకుంటూ కనిపించింది. నేను పరుగున వెళ్లి రక్షించాను. ఆత్మహత్య మహాపాపమని చెప్పి ఆమె ప్రయత్నం మాన్పించాను. తనను సురక్షితమైన చోటికి చేర్చుతానని నమ్మించి, నాతోపాటు తీసుకు వెళ్లసాగాను.
కొంతదూరం వెళ్లేసరికి మాకు ఒక దుష్టతాంత్రికుడు ఎదురుపడ్డాడు. వాడు ఎలుగుబంట్లను, చిరుతలను, కుక్కలను మెడలకు తాళ్లుకట్టి నడిపిస్తూ వెళ్తున్నాడు. వాణ్ని చూసి, నేను ఆ యువతి దారిపక్కగా తొలగి చూస్తున్నాం. ఇంతలో వాడి కన్ను ఆమెపై పడనే పడింది. ఆమెను దగ్గరికి రమ్మని చేతితో సంజ్ఞ చేశాడు. ఆమె గమనించ లేదు. దాంతో వాడే మా దగ్గరికి వచ్చాడు. నేను వాడి దగ్గరున్న జంతువులను చూసి భయపడుతూనే..
‘అయ్యా! ఈమె నా చెల్లెలు. ధారానగరం పోతున్నాం. దయచేసి మమ్మల్ని మా దారిన పోనివ్వండి’ అని అడిగాను.
దానికి వాడు వికటంగా నవ్వుతూ.. కుక్కల తాళ్లు వదిలేశాడు. అవి నామీదికి వచ్చాయి. నేను భయపడి పరిగెత్తాను. నన్ను కొంతదూరం తరిమిన తరువాత ఆ కుక్కలు వెనక్కు వెళ్లిపోయాయి. నేను వెనుతిరిగి వచ్చి.. ఆమెకోసం వెతికాను. అయితే, ఆమె కానీ, తాంత్రికుడు కానీ కనిపించలేదు. అనవసరంగా పాపం ఆ యువతిని దుర్మార్గుడి పాలు చేశానని చింతిస్తూ ధారానగరం దిశగా ప్రయాణించసాగాను”
..ఘోటకముఖుడు ఈ కథను ఇంతవరకూ చెప్పి, తన పక్కన ఉన్న భోజమహారాజును చూపించాడు. తదుపరి మళ్లీ ఇలా చెప్పసాగాడు.
“ఇదిగో ఈయన ఆ అడవిలోనే ఎదురయ్యాడు. ఆ తాంత్రికుడి చేతిలో చిక్కుకున్నది ఈయన భార్యేనని తెలిసింది. ఇంతకూ ఈయన ఊరేమిటో.. పేరేమిటో కూడ నేను అడగలేదు. ఈయన చెప్పలేదు. ముఖం చూస్తుంటేనే ఏదో గొప్ప అధికారమున్నవాడని అర్థమవుతున్నది. అదీకాకుండా నేనా యువతిని రక్షించాను. ఆమెను తన భర్త దగ్గరికి చేర్చడం నా విధి అని నమ్ముతున్నాను.
కుచుమారా! నీ వివాహానికి నేను కూడా ఉండాలని ఉంది. కానీ ఇప్పుడు సమయం లేదు. ఈయన భార్యను ఎత్తుకువెళ్లిన వాడి పేరు భైరవుడని తెలుసుకోగలిగాం. వాడు అల్లాణ భూపతి పాలిస్తున్న ఏకశిలా నగరంలో ఉన్నాడని తెలిసింది. నేను ఈయనతో పాటు వెళ్లి.. ఆ భైరవుణ్ని చూపించాలి.
మన మిత్రులైన దత్తకుడు, గోణికాపుత్రుడు, సువర్ణనాభుడు కూడా ధారానగరంలోనే ఉన్నారని రూఢిగా తెలిసింది. చారాయణుడు వివాహం చేసుకున్నాడు. అతను కూడా ఈపాటికి ధారానగరానికి చేరి ఉంటాడు. మీరు ఈ పెళ్లి తరువాత అక్కడికే వెళ్లండి. వీరి భార్య దొరికిన తరువాత వీరితోపాటే నేనూ వస్తాను”..
ఇలా చెప్పి ఘోటకముఖుడు, భోజమహారాజుతో కలిసి.. అల్లాణ భూపతి పాలించే ఏకశిలానగరానికి వెళ్లాడు.
తదుపరి లగ్నానికే సరస్వతి కుచుమారుల వివాహం జరిగింది.
అల్లాణ భూపతి గొప్ప శివభక్తుడు. అతనికే భళ్లానుడని మరో పేరుంది. గొప్ప శివార్చన పరుడు. సర్వవిద్యా లాలసుడు. కవీంద్రులను, పండితులను ఆదరిస్తుంటాడు. వదాన్యతలో శిబి కర్ణ దధీచులనే మించిపోతాడని చెప్పుకొంటారు.
అతని భార్యపేరు సువ్రత. అరుంధతిలో సైతం తప్పులు పట్టగల మహాసాధ్వి అని పేరు. ఆమె సుగుణాలను వర్ణించడం సామాన్యులకు సాధ్యం కాదు.
అల్లాణుడికి ఒక వ్రతం ఉంది. నిత్యం పదిమంది అతిథులనైనా మహేశ్వర రూపంగా అర్చించకుండా.. వారికి భోజనం పెట్టకుండా, వారి కోరినది ఇచ్చి పంపకుండా తాను భుజించడు.
అలా ఉండగా ఒకనాడు అతని వద్దకు విభూతి, రుద్రాక్షలను దాల్చిన పశుపతి అనే సిద్ధుడు వచ్చాడు. అపర మహేశ్వరునిగా కనిపిస్తున్న అతణ్ని రాజు అర్చించాడు. భోజనం పెట్టాడు.
తదుపరి తమ కోరిక ఏమిటని అడుగగా పశుపతి..
“వద్దులే మహారాజా! ఇప్పుడు నా మనసులో ఉన్న కోరికను చెప్పుకోవడం సిగ్గుచేటు. దానిని తీర్చడానికి నీవంటి ప్రభువులు పూనుకోనక్కరలేదు. నేనే నెరవేర్చుకోగలను. నన్ను పోనివ్వు” అన్నాడు.
“అదేమిటి మహాశయా! నేను మీకు కానుకగా ఏ వస్తువునైనా సమర్పించకుండా నా వ్రతం పూర్తికాదు. దయచేసి మీ మనోరథం ఏమిటో సెలవివ్వండి” అని ప్రార్థించాడు భూపతి.
“వద్దు మహారాజా! నేనా కోరిక చెబితే నాతోపాటు నువ్వు కూడా అపకీర్తి మూటగట్టుకోవాల్సి వస్తుంది” అన్నాడు పశుపతి.
“పరవాలేదు. ఏది ఏమైనా సరే.. దానిని తీర్చక తప్పదు” అని పట్టుబట్టాడు భూపతి.
అప్పుడు పశుపతి..
“చెబుతున్నాను విను. నువ్వు కోరిక చెప్పమని అడిగిన సమయానికి నా మనసులో వేశ్యసంగమాభిలాష కలిగినది. నేటి రాత్రికి ఏ విటుని అధీనంలోనూ లేని వారకాంతను తెచ్చి, నాకు సమర్పించాలి. కులాంగన పనికిరాదు. వేరొక విటుడు ముందుగానే ఒడంబడిక చేసుకున్నట్లయితే అట్టి వేశ్యను కూడా నేను కూడను” అని గంభీరంగా పలికాడు పశుపతి.
“ఓహో! ఇదెంత భాగ్యం. రాత్రి వరకు మీరు మా అంతఃపురంలోనే ఉండండి. నేటి రాత్రికి మీ మనోరథం ఈడేరగలదు” అని మాటిచ్చి అక్కణ్నుంచి కదిలాడు అల్లాణ భూపతి.
సిద్ధుని మనోరథం చెల్లించాలని అల్లాణ భూపతి ఎంతగానో ప్రయత్నించాడు. ఏకశిలానగరంలో ఉన్న వేశ్యకాంతలందరి ఇళ్లకూ అధికారులు వెళ్లారు. చిత్రంగా ఆనాటి రాత్రి ఒక్క వేశ్య కూడా ఖాళీగా లేదు. అబద్ధం చెబితే రాజు తల తరిగేస్తాడు కనుక, అధికారులు ఉత్తచేతులతో వెనుతిరిగి వచ్చారు.
అల్లాణ భూపతి తాను చేపట్టిన వ్రతం భంగం అయిందని అల్లాడసాగాడు.
అటువంటి తరుణంలో అతని భార్య అయిన సువ్రత వచ్చి ఎదుట నిలబడింది.
“నాథా! వారకాంత దొరకలేదని.. వ్రతభంగం కాగలదని మీకంత బాధ ఎందుకు?! మీరు అనుమతిస్తే నేను వెళ్తాను” అని పలికింది.
భార్య మాటలు విని అల్లాణుడు పొంగిపోయాడు.
“వ్రతం విడిచిపెట్టాల్సి వస్తుందేమో అనుకున్నాను. నువ్వు పోయి ఆయన్ను మహేశ్వరునిగా ఎంచి కామితం తీర్చు. నీకు ఏ దోషమూ అంటనేరదు. అన్నట్లు నువ్వు రాజు భార్యనని చెప్పకూడదు సుమా!” అని సుద్దులు చెప్పి పంపాడు.
సువ్రత చక్కగా అలంకరించుకుని పశుపతి ముందుకు వెళ్లి నిలబడింది.
సుందరాంగి అయిన వారాంగన పొందుకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న పశుపతి ఆమె రాకతో అదిరిపడ్డాడు.
(వచ్చేవారం.. భోజకాళిదాసుల సమ్మేళనం)
అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ