జరిగిన కథ : కాశీలో చదువుకున్న ఏడుగురు మిత్రులలో ఒకడైన దత్తకుడు.. యక్షుని శాపం వల్ల స్త్రీగా మారాడు. చారుమతిగా రాకుమారి రుక్మిణి అంతఃపురంలో ఏడాదిపాటు గడిపి.. ఆమెకు సన్నిహితురాలిగా మెలిగాడు. అదే సమయంలో యువరాజు చిత్రసేనుడు ఆడవేషంలో ఉన్న దత్తకుడిని మోహించాడు. దత్తకుడి స్నేహితుడైన గోణికాపుత్రుని సాయంతో.. చారుమతిని పొందాలని ప్రయత్నించి విఫలమయ్యాడు.
“నాఅనుమతి లేకుండా రుక్మిణి అంతఃపురం నుంచి ఎవరినీ బయటికి వెళ్లనీయకండి” అని చిత్రసేనుడు ఆజ్ఞలు
జారీచేశాడు.
దత్తకుడిని, గోణికాపుత్రుణ్ని తీసుకురమ్మని భటులను పంపాడు.
గోణికాపుత్రుడు విచారవదనంతో వచ్చి..
“నిన్నటినుంచి దత్తకుడు కనిపించడం లేదు ప్రభూ!” అని చెప్పాడు.
చిత్రసేనుడికి ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది.
“వెంటనే వెళ్లండి. ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోండి. నేను కూడా భటులతో వెతికిస్తాను” అన్నాడు.
‘అయ్యయ్యో! నా మిత్రుడు ఎటుపోయాడో? వచ్చినా అతనేమి చేయగలడో కదా! అంతా దైవేచ్ఛ’ అనుకుంటూ గోణికాపుత్రుడు ధారానగరమంతా వెతకసాగాడు.
కొన్నిరోజులు గడిచిపోయాయి. దత్తకుడు సమయం కనిపెట్టి అంతఃపురం నుంచి జారుకున్నాడు. మగవేషంలో గోణికాపుత్రుని వద్దకు వెళ్లాడు. దత్తకుణ్ని చూడగానే పోగొట్టుకున్న నిధి మళ్లీ దొరికినట్లయింది అతనికి.
“మిత్రమా! ఎక్కడికి వెళ్లిపోయావు? అవతల చారుమతి తిరిగి వచ్చేసింది. రాజపుత్రుడు నీకోసం వర్తమానం మీద వర్తమానం పంపుతున్నాడు. నువ్వు లేకుండా నేనొక్కణ్నే వెళ్తే నామీద మండిపడుతున్నాడు. నీకోసం వెతకలేక నా చావుకొచ్చింది” అన్నాడు.
అతణ్ని వెంటపెట్టుకుని రాజభవనానికి వెళ్లాడు.
దత్తకుణ్ని చూడగానే చిత్రసేనుడు ఉప్పొంగిపోయాడు. ఆలింగనం చేసుకుని..
“మిత్రమా! నామీద దయ తప్పిందా ఏమిటి? ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లిపోయావు?! నీకోసం చూసిచూసి నా కళ్లు కాయలు కాచిపోయాయి. నీమాట చెల్లించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇక వర్తమానాలతో పనిలేదు. మనమిప్పుడే అక్కడికి పోదాం. ఆ చారుమతిని ఏదో మిషచేత నీకంట పడేలా చేస్తాను” అన్నాడు.
అందుకు దత్తకుడు..
“ఆమెను నీ దాసురాలిగా చేయకపోతే నన్ను నా పేరుతో పిలవొద్దు” అని ప్రతిజ్ఞ చేశాడు.
ముగ్గురూ కలిసి రుక్మిణి అంతఃపురానికి వెళ్లారు.
“అన్నా! నువ్వు ఆమెకోసం పలుమార్లు ఆరాలు తీస్తున్నావని నీకు జడిసి.. నిన్న ఉద్యానంలో నుంచి నాకు చెప్పకుండానే ఎక్కడికో పోయింది” అని జరిగింది చెప్పింది రుక్మిణి.
చిత్రసేనుడికి అరికాలిమంట నెత్తికెక్కింది.
“చాలు రుక్మిణీ! దానికి ఈ టక్కులు నీ మూలంగానే వచ్చాయి. సభలలో ఆడే వెలయాలికి అంతఃపుర వాసమెందుకు?! నీ అండన ఉండటం వల్లకానీ లేకపోతే దానిని బలవంతంగానైనా తీసుకురాక పోయానా? ఏదో విద్వాంసురాలని, పండితులతో వాదిస్తుందని వేడుక పడ్డాను కానీ, లేకపోతే దానిగోల మాకేల?!” అని రుసరుసలాడుతూ అక్కణ్నుంచి వెళ్లిపోయాడు.
అప్పుడు దత్తకుడు..
“రాజపుత్రా! ఆమె వచ్చినప్పుడు మళ్లీ వస్తాను. నాకిప్పుడు అనుజ్ఞ ఇప్పించండి” అని అడిగాడు.
“చాలుచాలు నిన్ను పోనీయను. దాని రాక ఎప్పుడో తెలియదు. కనుక అంతవరకూ మీరిద్దరూ నా మందిరంలోనే ఉండాలి” అని నిర్బంధించాడు చిత్రసేనుడు.
రోజులు గడిచిపోతున్నాయి కానీ, చారుమతి జాడ తెలియలేదు. ఒకనాడు కొందరు వార్తాహరులు వచ్చి..
‘ఉత్తరదేశం నుంచి వచ్చిన ఒక కళాకారిణి ధారానగరంలోని నాటకశాలలో మొన్న వీణాగానం చేసింది. ఆమె గానం దేవగానమేనని మనవారు స్తోత్రాలు చేస్తున్నారు. ఆమె నేటిరాత్రికి మళ్లీ తన ప్రదర్శన ఇస్తున్నది’ అని నివేదించారు.
“దత్తకా! ఆమె చారుమతి కావచ్చునేమో. మనం కూడా వెళ్దాం పద” అన్నాడు చిత్రసేనుడు.
చిత్రసేనుడితో పాటు దత్తకుడు, గోణికాపుత్రుడు ప్రదర్శనకు వెళ్లారు. కళాకారిణి వచ్చి వేదికపై కూర్చుంది. ముందుగా ప్రార్థనాగీతం ఆలపిస్తూ…
“గొప్ప విద్యాప్రభావం కలవాడు.. పాపభూయిష్ఠమైన లోభాన్ని జయించినవాడు అయిన నా పతి సువర్ణనాభునికి నమస్కరిస్తున్నాను” అన్నది.
ఆ మాట వినగానే దత్తకుడు, గోణికాపుత్రుడు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
‘ఆ సువర్ణనాభుడు మన మిత్రుడేనేమో!’ అనే అనుమానం గోచరించిన వారి అంతరంగాలు వాళ్లిద్దరికీ మాత్రమే అర్థమయ్యాయి.
“ఈమె చారుమతి కాదు. ఇక ఇక్కడుండి లాభం ఏముంది? పదండి పోదాం” అన్నాడు చిత్రసేనుడు.
“యువరాజా! మేము ప్రదర్శన చివరిదాకా చూసి వస్తాం” అని అనుమతి కోరారు మిత్రులిద్దరూ. వాళ్లను అక్కడే వదిలేసి చిత్రసేనుడు వెళ్లిపోయాడు.
మిత్రులిద్దరూ తెర వెనుకకు వెళ్లి.. సువర్ణనాభుని గురించి ఆరా తీశారు.
మిత్రులను చూడగానే అతను ఎదురొచ్చి స్వాగతమిచ్చాడు. వీరిద్దరూ ముందుగా సువర్ణనాభుణ్ని గుర్తుపట్టలేకపోయారు. మునుపటి వేషం కాదు. దివ్యరత్నాలతో, పట్టువస్ర్తాలతో మెరిసిపోతున్నాడు.
“మిత్రమా! ఎప్పుడు వచ్చావు? మాకు చెప్పలేదేం? ఈ గాయనీరత్నాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావు?! నువ్వు కాశీని విడిచింది మొదలు నీ ప్రయాణం ఎలా సాగిందో వినాలని ఉంది. చెప్పు” అని అడిగాడు దత్తకుడు.
“మిత్రులారా! నేను కాశీపురం నుంచి వచ్చేటప్పుడు కుచుమారుడు కూడా నా వెంట వచ్చాడు. మేమిద్దరం కలిసి చాలాదూరం ప్రయాణించాం. కానీ కుచుమారుడు సుకుమారుడు కావడం వల్ల ప్రయాణ కష్టాన్ని తట్టుకోలేక మధ్యలోనే మానేసి, వెనక్కి వెళ్లిపోయాడు. నేను ఒక్కణ్నే ప్రయాణం సాగించాను.
అడవిలో దొరికే పళ్లు, కాయలు, ఆకులు తింటూ ఆకలి తీర్చుకోసాగాను. ఒకసారి నాకు తెలియకుండానే ఏవో ఆకులు తిన్నాను కాబోలు. ఆ మరునాటి నుంచి అమృతపానం చేసినట్లు నాకు ఆకలి లేకుండా పోయింది. రోగవికారాలు లేవు. దేహం వింతకాంతితో మెరవసాగింది. నేను ధైర్యంగా నదులు దాటి, ఏరులు అతిక్రమించి, కొండలెక్కి దిగుతూ ప్రయాణం కొనసాగించాను. దారిమధ్యలో అంతా జనశూన్యమే. ఒక్క జనపదమూ కనిపించలేదు. ఒక సిద్ధుడు కానీ, ఒక యతీశ్వరుడు కానీ ఎదురవ్వలేదు. అనేక కష్టాలు పడుతూ ప్రయాణం కొనసాగించాను.
ఒకనాడు ఒక కొండశిఖరం మీద నిలబడి దారికోసం చూస్తుండగా ఆ ప్రాంతంలో ఎవరో గానం చేస్తున్నట్లుగా మనోహర నాదం వినిపించింది. ఆ పాట వినిపించిన దెసకు వెళ్లాను. కానీ అక్కడికి చేరుకోవడం చాలా కష్టసాధ్యంగా తోచింది. చాలా మిట్టపల్లాలు ఉన్నాయి.
ఒకపక్క ఆ గానం వింటున్నకొద్దీ మైమరపు కలగసాగింది. అది గంధర్వగానమే కానీ మానవగానం కాదని నిశ్చయించుకున్నాను. అందుకే అక్కడికి చేరుకోవడానికి ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలుసుకున్నాను. అయినా పట్టువదలకుండా ప్రయత్నించాను. ముళ్లకు, రాళ్లకు వెరవకుండా ఆ దోవలో ముందుకు వెళ్లాను.
చివరికి పదిరోజుల ప్రయత్నంతో అక్కడికి చేరుకోగలిగాను. అక్కడో విశాల సమతలమైన ప్రాంతం కనిపించింది. అది దేవలోకంలా ఉంది. రుతువు కాని రుతువులో చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి. పువ్వులు విరగబూశాయి. హంసలు, నెమళ్లు నాట్యమాడుతున్నాయి. సుందరమైన తటాకాలున్నాయి. అక్కడ వీస్తున్న మంద్రవాయువులు నా మార్గాయాసాన్ని పోగొట్టాయి. ఆ తుమ్మెదల ఝంకారం వింటూ తటాకంలో స్నానం చేసి, శుద్ధుడినయ్యాను. అక్కణ్నుంచి మరికొంతదూరం వెళ్లేసరికి ఒక ముఖమంటపం దర్శనమిచ్చింది. అందులో ఒక చిన్నది వీణపై పాడుతున్నది. ఆమెను చూసి విస్మయపడి సమీపంగా వెళ్లి, ఓరగా నిలబడ్డాను. ఆమె సంగీతం కట్టిపెట్టి వీణ పక్కన పెడుతుండగా.. నన్ను చూసి అదిరిపడింది. పైకి లేచి నా దగ్గరికి వచ్చి దేవభాషలో ప్రసంగించడం మొదలుపెట్టింది.
“ఎవరు నువ్వు?”.
“నేను భూసురుణ్ని. నన్ను సువర్ణనాభుడంటారు”.
“ఇక్కడికెందుకు వచ్చావు?”.
“మీవంటి విద్వాంసులను చూడటానికి దేశాలు తిరుగుతున్నాను. మొత్తానికి ముల్లోకాలలోనూ దుర్లభమైన నీలాంటి దివ్యవస్తువును దర్శించాను”.
“వాచాలత కట్టిపెట్టు. ఏకాంతంగా ఉన్న కాంతల వద్దకు ఇలా రావచ్చునా?”.
“ఇది విధి ప్రేరణ. సామాన్య మానవులకు ఇంతటి అదృష్టం పట్టదు”.
“ఏమిటా విధి?”.
“అసంభవం అనుకున్న సంఘటనలను మనకోసం ఏర్చికూర్చి మనకు శుభాలను చేకూర్చడమే!”.
..ఇలా మేము కొద్దిసేపు సంభాషించిన తరువాత నా ప్రవర్తన ఆమెకు నచ్చింది. పిమ్మట నాకు అతిథి పూజ చేసి, భక్ష్యాలను తెచ్చిపెట్టింది. నేను విశ్రాంతి తీసుకున్న తరువాత మళ్లీ ఆమె వద్దకు వెళ్లాను.
“కల్యాణీ! నువ్వు ఎవరు? ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఉండటానికి కారణం ఏమిటి? తెలుసుకోదగ్గ విషయం అయితే నాకు చెప్పు” అని కోరాను.
అప్పుడామె తన కథనంతా వివరంగా చెప్పింది.
ఆమె ఒక యక్షకన్య. పేరు సువర్ణపదిక. చిన్ననాడే తల్లి విడిచిపెట్టి పోవడంతో అక్క వద్ద పెరిగింది. ఒకసారి కుబేరుని వల్ల ఆమె బావకు భార్యావియోగం కలిగింది. ఆ శాపం పోయిన తరువాత అలకాపురిలో ఉండటానికి ఇష్టపడని ఆమె బావ, తన భార్యను తీసుకుని భూమికి వచ్చేశాడు. అప్పట్నుంచి సువర్ణపదిక ఒక్కతే ఉండసాగింది. ఆ సమయంలో కుబేరుని వంటవాడొకడు తనను ప్రేమించానని వెంటపడటం మొదలుపెట్టాడు. ఆ బాగోతాన్ని గురించి పలుమార్లు కుబేరునికి మొరపెట్టుకున్నా ఆయన వినిపించుకోలేదు. దాంతో విసిగి తానూ భూలోకానికి ప్రయాణం కట్టింది. ఒక వృద్ధయక్షుని సలహా మేరకు ఆ శిఖరంమీద చంద్రశేఖరుణ్ని ప్రతిష్ఠించుకుని, ఒంటరిగా ఉండసాగింది.
అంతవరకు కథ చెప్పిన తరువాత..
“నువ్వు ఉత్తముడివని తోస్తున్నది. ఈ చంద్రశేఖరుడు నీకు గొప్ప పండితుడే భర్త కాగలడని స్వప్నంలో చెప్పాడు. నువ్వు పండితునివైతే నేను నిన్ను వరించగలను” అంటూ నన్ను కొన్ని విద్యలలో పరీక్షించింది.
చివరికి సంతృప్తి చెంది, నా మెడలో వరమాల వేసింది. అప్పటి నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. నేను వేరొక పూలమాలను ఆమె మెడలో వేశాను. ఇద్దరమూ పువ్వులే తలంబ్రాలుగా చల్లుకున్నాం. మన్మథ పరవశులమై నూరు పగళ్లు రాత్రులు ఒక్క గడియలా గడిపేశాం. చివరికి ఆమె వల్ల కొన్ని సంప్రదాయాలు తెలుసుకుని, ‘సాంప్రయోగిక ప్రకరణం’ అనే గ్రంథాన్ని రచించాను.
ఆ తరువాత ఒకరోజు..
“నా మిత్రులు ధారానగరంలో ఉన్నారు. వారిని కలుసుకుని వస్తాను” అని ఆమె అనుమతి కోరాను.
“స్వామీ! నేను కూడా మీతో వస్తాను. మా అక్క, బావలెక్కడైనా కనిపించవచ్చు” అన్నదామె.
ఆమె కూడా కుబేరుని శాపం వల్ల దేవతాశక్తి కోల్పోయి ఉంది. మా ప్రయాణంలో పాపం.. ఎంతో అలసిపోయింది. ఆరుమాసాలకు గానీ ఊళ్లు కనిపించలేదు. అక్కణ్నుంచి పట్టణాలలో ఈ సంగీతసభలు నిర్వహిస్తూ ద్రవ్యం ఆర్జిస్తున్నాం. ఇలా నేటికి మిమ్మల్ని కలుసుకోగలిగాను!”.
..అని సువర్ణనాభుడు తమ కథ చెప్పి, మిత్రులిద్దరినీ సువర్ణపదిక వద్దకు తీసుకుపోయాడు.
“ఇతను నా మిత్రుడు దత్తకుడు. మహాపండితుడు” అని దత్తకుణ్ని చూపుతూ పరిచయం చేశాడు.
ఆమె నమస్కరించింది. అప్పుడు దత్తకుడు..
“సాధ్వీమణీ! మీ అక్క, బావలున్న తావు నాకు తెలుసు” అన్నాడు.
“వేగంగా చెప్పండి స్వామీ!” అని వేడుకుందామె.
దత్తకునికి శాపమిచ్చిన యక్షుడు తామున్న తావు ఇతరులకు చెబితే.. మళ్లీ స్త్రీగా మారిపోతావని చెప్పాడు. దత్తకుడు ఆ సమయంలో ఆ మాట మరిచిపోయాడు. సువర్ణపదికతో ఆనాడు తాను చూసిన యక్షుని గుహ వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. అలా చెబుతూ ఉండగానే ఉన్నట్లుండి అతనిలో చిత్తచాంచల్యం కలిగింది.
“ఇక్కడే ఉండండి.. ఇప్పుడే వస్తాను!” అంటూ అక్కణ్నుంచి బయటపడి ఎక్కడికో పరుగెత్తసాగాడు.
అలా పరుగెడుతూ ఉండగానే మళ్లీ స్త్రీగా మారిపోయాడు. ఈసారి తనకు పూర్వస్మృతి కూడా తప్పిపోయింది. కానీ, తాను గతంలో రాకుమారిని కలుసుకున్న ఉద్యానవనం మాత్రం గుర్తుకు వచ్చింది.
దాంతో ఆ ఉద్యానంలోకి వెళ్లాడు. ఆమె లోనికి వెళ్తుండగానే కొంతమంది భటులు.. ‘చారుమతి వచ్చింది’ అని కేకలు పెట్టసాగారు. చిత్రసేనుడికి వెంటనే వర్తమానం తెలియచేశారు. అతను మెరుపువేగంతో ఉద్యానానికి వచ్చాడు. పువ్వులు కోస్తున్న చారుమతిని చేరి, తన మనసులో మాట చెప్పడానికి నిశ్చయించుకున్నాడు.
వీలైనంత భావుకంగా ఆమెతో సంభాషించాడు. పూర్వస్మృతి లేని చారుమతి అతని ప్రేమను అంగీకరించింది. ఆమె అంత త్వరగా అంగీకారం తెలుపుతుందని ఊహించని చిత్రసేనుడు మురిసిపోయాడు. ఆమెను దగ్గరికి తీసుకుని చెక్కులు ముద్దుపెట్టుకున్నాడు. మేను పులకింతలు పెడుతుండగా బండి ఎక్కించి అంతఃపురానికి తీసుకుపోయాడు.
ఆ తరువాత చారుమతిగా మారిన దత్తకుని కథ ఏమైందో తెలుసుకునే ముందుగా.. అతని ఏడుగురు మిత్రులలో ఒకడైన కుచుమారుని కథ ముందుగా తెలుసుకోవాల్సి ఉంది.
(వచ్చేవారం.. సిద్ధయోగి స్వీయచరిత్ర)
-అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ