అన్నట్లు.. చెప్పుడు మర్శిన! మన గోపాల్ బంద్ ఇకమతులల్ల అవ్వల్ దరి. కని.. సదువుడు అంతంతనే! రాత రాసుడు గుడ గట్లనే.. గోపాల్ రాశింది.. గోపాలే సదువాలె! ఆల్ల ఊర్ల ఒక ముసలమ్మ ఉంటుండేది. ఆమెకు ఒక్కడే కొడుకు. గా పిల్లగాడు పూరీకి అవుతల నూరూర్ల మైళ్ల దూరంల పనికి వోయిండు. మాలెస్క దినాల సంది ఉత్తరం రాలే. కొడుకు మీద పానం గొట్టుకొని.. మతలబు దెల్సుకుందామని గోపాల్ తానికి వోయింది ముసలమ్మ. ఆరం దినాల కెల్లి.. రేపు, మాపు అనుకుంట బాతలు వెట్టవట్టిండు గోపాల్.
ఒక అయితారం పొద్దుగాలనే వోయి.. “గోపాలయ్యా! నువ్వు నా కొడుక్కు ఉత్తరం రాశిపెట్టాలె! ఇయ్యాల్ల నువ్వు రాశేదాంక నేను పోయేది లేదు!” అంట పట్టుబట్టింది. అట్టిట్ల తప్పిచ్చుకునెతందుకు మాలెస్క అబద్ధాలు, ముచ్చట్లు జెప్పిండు. అవ్వ అస్సలు ఇనలేదు. ఆఖరుకు.. “అవ్వా! నాకు కాళ్లనొప్పులు. నీ కొడుక్కు ఉత్తరం రాసుడు నాతోనిగాదు!” అంట జెప్పిండు. “ఉత్తరం శెయ్యితోని రాసుడైతే.. కాళ్లనొప్పికి ఏమైతదంట!” అని అవ్వ అడిగెటాల్లకు.. “నువ్వన్నది నిజమే అవ్వా! నా రాత నాకే అర్థమైతది. ఉత్తరం రాశినంక.. నీ కొడుక్కు సదివి ఇనిపియ్యటానికి నేనే వోవాలే! నాకు కాళ్లనొప్పులాయె! గందుకే.. ఎవలతోనన్న రాయించుకో!” అంట అనేటాల్లకు అవ్వ తెల్లమొఖమేశింది.
– పత్తిపాక మోహన్