జరిగిన కథ : పృథ్వీశ్వరుడిపై యుద్ధానికి ససైన్యంగా కదిలివెళ్లాడు కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు. మరోవైపు యుద్ధంలో ప్రవేశం దొరక్కపోవడంతో.. జాయప దీనంగా ఓ గదిలో ఉండిపోయాడు. జాయపను అలా చూసి హతాశుడయ్యాడు సుబుద్ధి. తనకు ముందే చెబితే.. యుద్ధంలో పాల్గొనేలా సహకరించే వాణ్నని చెప్పాడు. యుద్ధముఖ్యులైన సుబుద్ధి మిత్రుల సాయంతో.. రణభూమిలో అడుగుపెట్టాడు జాయప. భయంకరంగా ఉన్న ఆ క్షేత్రంలో.. ఓ శత్రు సైనికుణ్ని ఎదుర్కోవడానికి అత్యంత వేగంగా కత్తి ఎత్తాడు.
జాయప ఖడ్గ చాలనం చెయ్యగానే శత్రు సైనికుడు చురుగ్గా చూశాడు. జాయపలోని యుద్ధ నైపుణ్యాన్ని గుర్తించినట్లు.. అతనూ కత్తి తిప్పాడు కానీ.. అంత తీక్షణంగా యుద్ధం చెయ్యడంలేదు. జాయపను పిల్లవానిగా జమకట్టి, కత్తితో వేళాకోళ విన్యాసాలు చెయ్యసాగాడు. జాయప కూడా తొలుత ఏదో అభ్యాసంలా భావించినా.. అవతలివాని హాస్య ధోరణి అర్థమై చటుక్కున విసురుగా ఖడ్గ ప్రహారం వేశాడు. మరుక్షణం అతని తల సగం తెగి, మెడపై పక్కకు వాలిపోగా.. గుర్రం బెంబేలెత్తి పరుగుపెట్టింది. ఇదంతా యుద్ధంలో ప్రవేశించిన తొలి ఘడియల్లోనే జరిగింది. దళసభ్యులే కాదు.. దళపతి కేశవ కూడా ఆశ్చర్య చకితుడై జాయపను తేరిపార చూశాడు. జాయప ఇక ఆలస్యం చెయ్యకూడదని నిశ్చయించుకున్నాడు. మిత్రుల అభినందనల మధ్య మరింత లోపలికి చొచ్చుకు పోయాడు. చాలాసేపు శత్రు సైనికులను తన ఖడ్గ ప్రహారాలతో, అశ్వ విన్యాసాలతో భయపెట్టాడు. మధ్యాహ్నభోజన సమయానికి జాయప శక్తియుక్తులు కొంతవరకు యుద్ధభూమిలో తెలిసిపోయాయి.
భోజనశాలలో అతని గురించి స్వపక్షీయులే..
“ఇతను ఎవరు? ఎవరి దళంలో సైనికుడు?”.. అంటూ ఆరాతీయడం నాగంభట్టు గమనించాడు.
తొలిరోజు యుద్ధం ముగిసే సమయానికి జాయప పూర్తి యుద్ధ వీరుడయ్యాడు. అతనిలో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. చక్రవర్తి తిరస్కారంతో పాతాళంలోకి కూరుకుపోయిన ఆత్మవిశ్వాసం.. ఇప్పుడు ఆకాశమంత ఎత్తున ఎగిసింది. ఇక్కడ.. ఇక్కడే తనేదో సాధించాలి. ఇది తనకు అంతిమ అవకాశం. ఇక్కడ సాధించకపోతే తనకిక చావే శరణ్యం.
రెండవరోజు.. మూడవరోజు.. అలా నాలుగైదు
రోజుల్లో జాయప మరింత శక్తిని కూడదీసుకున్నాడు. శత్రువులను మరింత కష్టాలలోకి నెట్టగలుగుతున్నాడు. దొరికితే తలలు తెగ నరుకుతున్నాడు. రానురానూ దళ ప్రముఖుడై పోయాడు. క్షణకాలం జరిగే దళచర్చల్లో ముఖ్యభూమిక నిర్వహిస్తున్నాడు. అతని ఎత్తులు దళమిత్రులను ఆశ్చర్యపరుస్తుండగా.. శత్రువులను గందరగోళంలో పడేస్తున్నాయి. దళపతి స్థాయి దాటి పై అధికారులు సేనాని రాచయ, సేనాపతి సుబుద్ధి కూడా జాయపతో ఆలోచనలు పంచుకుంటున్నారు.
జాయప ఓవైపు శత్రువులను చిత్తుచేస్తుంటే.. మరోవైపు యుద్ధభూమిలో సర్వసైన్యాధ్యక్షుడు ఎక్కడ ఉన్నాడో, చక్రవర్తి ఎక్కడ ఉన్నాడో.. తెలుసుకునే ప్రయత్నం మిత్రులు చేస్తున్నారు.
సాధారణంగా యుద్ధభూమికి వచ్చిన చక్రవర్తి లేదా అత్యుత్తమ అధికారి యుద్ధంలోకి రాడు. శత్రువులు వ్యూహం పన్ని పట్టుకుంటే.. యుద్ధంలో ఓడిపోయినట్లే! అందుకే రాజులాంటివారు స్కంధావారంలోనే ఉండి యుద్ధతంత్రవేత్తలు, అధ్యక్షుల సమష్టి నిర్ణయాలకు అనుగుణంగా మొత్తం యుద్ధాన్ని, పోరాటధోరణిని సమన్వయం చేస్తారు. తప్పని పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించి.. రాచరిక హోదాలైన కిరీటం, కేతనం, ఛత్ర చామరాలు అవనతం చేస్తారు.
ఇక సర్వసైన్యాధ్యక్షుడు, ఇతర ప్రముఖ సైన్యాధ్యక్షులు తమ అంగరక్షకులు, సేనానుల మధ్య యుద్ధ భూమిలో ఉంటారు. గణపతిదేవునిలాగే పృథ్వీశ్వరుడు కూడా యుద్ధరంగానికి వచ్చాడు. ఇరువైపులా మరో వందమంది మహాయోధులు, యుద్ధ అనుభవం ఉన్న రాజులు, సైన్యాధ్యక్షులు ఉన్నారు.
ఇరువైపులా సామంతరాజులు, ప్రత్యేక యుద్ధ నైపుణ్యం కలిగిన లెంకలు, ఎక్కటీలు ఉన్నారు. ఇటు గణపతిదేవుడు అటు పృథ్వీశ్వరుడు అప్పుడప్పుడూ యుద్ధరంగానికి వచ్చి వారివారి సైనికులకు ఉత్సాహం కలిగించి వెళ్తున్నారు కూడా!
యుద్ధం ప్రారంభమై ఇరవైరోజులు దాటింది గానీ.. ఎలాంటి మెరుపులు, ప్రత్యేక అంశాలు లేవు. ఇరు వర్గాలూ కొట్టుకుంటున్నారు. చంపుకొంటున్నారు.
ఎవరిది పైచేయి అంటే.. చెప్పడానికి ఏమీ లేదు.
నాలుగు గవ్యూతుల విస్తీర్ణంలో దాదాపు నాలుగు లక్షల సైన్యం మధ్య జరుగుతున్న ఈ చారిత్రాత్మక యుద్ధక్షేత్రంలోని దక్షిణభాగంలో.. జాయప తన ఆఖరి అవకాశంగా యుద్ధంలో తెగించి పోరాడుతున్నాడు. వేగంగా నేర్చుకునే తత్వమున్న జాయప.. ఒక్కరోజు యుద్ధ అనుభవాన్ని పదిరోజుల అనుభవంగా తీర్చిదిద్దుకో గలడు. జన్మతః లభించిన ఏకాగ్రత.. యుక్తవయసులో లభించిన యుద్ధావకాశం.. విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాల్సిన జీవిత పరిస్థితులు.. అతనిలో నిబిడీకృతమైన శక్తియుక్తులేవో అతని చుట్టూ మరింత ఏకీకృతం చేసి తీవ్రమైన పదునుపెట్టాయి. ఇలా రోజూ యుద్ధరంగానికి రావడం.. ఓ శత్రు సైనికుణ్ని ఎదుర్కోవడం.. వాణ్ని నిర్జించడం.. అతనికి అంతగా నచ్చలేదు. మరేదో చెయ్యాలి! తీవ్రంగా
ఆలోచించసాగాడు!!
రోజూ యుద్ధరంగానికి రావడం తగ్గించి.. సుబుద్ధి సహాయంతో ఒక ఏనుగుల బృందాన్ని తయారుచేసి, వాటికి ఒక యుద్ధతంత్రం నేర్పాడు. ఆ యుద్ధ పన్నాగాన్ని నాగంభట్టు, త్రిపుర పాతిక ఏనుగులతో బాగా అబ్యాసం చేయించాక.. యుద్ధరంగంలో ప్రవేశ
పెట్టాడు. ఇప్పుడు జాయప మెడలో కొమ్ముబూర వచ్చి చేరింది.
ముందు ఓ శత్రుసేనానిని ఎంచుకున్నాడు. సేనాని అయినవాడు యుద్ధరంగంలో ఒంటరిగా ఉండడు. వెంట దళం ఉంటుంది. ఏనుగులు, గుర్రాలు, కాల్బలం పరివేష్టించి ఉండగా.. ఆయన గుర్రంపైగానీ ఏనుగుపైగానీ వస్తాడు. సహజంగా సేనాని మంచి యోధుడై ఉంటాడు. తనకు తగిన శత్రుయోధుణ్ని ఎంచుకుని యుద్ధం చేస్తాడు. దళం – శత్రుదళం తలపడతారు. ఇక్కడ జాయప, గజబృందం అతణ్ని లక్ష్యం చేసుకున్నారు. ఏనుగులు శిక్షణ ఇచ్చినట్లు మెల్లగా అతని దళాన్ని చుట్టి వచ్చాయి. ఇది శత్రుదళానికి తెలియదు. అప్పుడు జాయప మెడలోని కొమ్ముబూర గట్టిగా కూజితం చేసింది. అంతే.. గజబృందమంతా ఏదో అనుజ్ఞ లభించినట్లు ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలా ఘీంకారం చేశాయి. ఆ శబ్దానికి పైన ఎగురుతున్న గద్దలు చచ్చి నేలరాలాయి. శత్రుదళం గందరగోళ పడిపోయి చిందరవందరయ్యింది. కాచుకుని ఉన్న జాయప అతి వేగంగా శత్రువు ఏనుగుపైకి లంఘించి క్షణకాలంలో శత్రుసేనాని గుండెల్లో బరిసెను దింపాడు.
యుద్ధభూమి కంపించింది. ఆ ప్రకంపనలు ఇరు వర్గాలలో ప్రతిధ్వనించాయి. అందరూ గుర్తించేలోగా, జాయప మరికొందరు శత్రువీరులను ఈ పద్ధతిలోనే నిర్దాక్షిణ్యంగా చంపేశాడు.
ఈ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో గజాలతో అతను మరిన్ని తంత్రాలు పన్నడం ప్రారంభించాడు. చిన్న ఈటెలను తెప్పించి.. ఏనుగులకు తొండాలతో వాటిని విసరడం నేర్పాడు. ముఖ్యంగా గుర్రాల కాళ్లకు గురి చూసి విసరడం అభ్యాసం చేయించాడు. మావటీలు కేవలం ఆత్మరక్షణ చేసుకుంటూ ఏనుగులతో యుద్ధం చేయించాలని జాయప చెప్పాడు. పైనున్న మావటి ఈటె కిందకు జార్చగానే.. ఏనుగు చటుక్కున అంది పుచ్చుకుని పరిగెడుతున్న గుర్రం కాళ్లకు గురిచూసి విసరడం.. గుర్రం ముందుకుపడిపోవడం.. ఆ
ఆశ్వికుణ్ని కాకతీయ సైనికుడు కత్తితో నరికి వేయడం.. క్షణాల్లో జరిగిపోయేది. చురుకైన ఏనుగుల ఎంపిక బాధ్యత సుబుద్ధిది. యుద్ధపన్నాగం జాయపది. కాగా శిక్షణ, అభ్యాసం నాగంభట్టు, త్రిపుర చూసుకునేవారు.
జాయప రోజురోజుకూ విజృంభించి యుద్ధభూమిలో వీరవిహారం చేస్తున్నాడు. ఒకరోజు అంబులపొదితో, విల్లంబుతో రథంపై కనిపిస్తాడు. మరొక రోజు ఏనుగుపై నుంచి బరిసెతో శత్రువులను పొడిచి చంపేస్తాడు.
ఒకరోజు ఒకవైపు అంకెవన్నెల్లోనే రెండు కాళ్లు పెట్టుకుని, అశ్వంపై ఎవ్వరూ లేనట్లు శత్రువుకు భ్రమ కలిగించి.. దగ్గరికి వచ్చిన ఓ సేనానిని ఊహాతీతంగా విచ్చుకత్తితో నరికేశాడు. ఇది యుద్ధభూమిలో అందరూ విస్తుపోతూ చెప్పుకొన్నారు.
ఆరోజు రాత్రి జాయపను వెదుక్కుంటూ వచ్చాడు గిరిజన నాయకుడు కంటక దొర.
“మమ్మల్ని వెదుక్కుంటూ ఎలా వచ్చావ్ కంటకా?” అన్నాడు నాగంభట్టు.
“యుద్ధంలో సిన్నదేవర ఏనుగుల కోసం కూసే కూతలు నాకూ అర్థం అవుతాయ్గా పొంతులూ..” అన్నాడు కంటక దొర.
కంటక దొర ఉంటే జాయపకు మంచి అండా దండ.
“అన్నా! నువ్వు నాతో ఉండాలి. వచ్చేయి అన్నా!” అన్నాడు జాయప.
జాయప అభ్యర్థన కాదనగలడా కంటక?! సామంత గిరిజన సైన్య నాయకుడిగా తన బాధ్యతలు మరొకరికి అప్పగించి, జాయప బృందంలోకి వచ్చాడు కంటక. ఈ మార్పును అధికారికం చేయించాడు సుబుద్ధి. కంటక వచ్చాక జాయప విజృంభణ మరింత పెరిగింది. ముందు గజదళం శత్రు సైన్యాన్ని గందరగోళం చేస్తే.. తర్వాత జాయప, కంటక దొర శత్రుదళం మొత్తాన్నీ అతివేగంగా చంపేసేవారు.
ఈ కేశవశెట్టి దళ విజయదుందుభి సర్వసైన్యాధ్యక్షుల దృష్టికి వెళ్లింది. తీసుకెళ్లినవాడు అనుమకొండ నుంచి ఆయుధ సరఫరాలను సమన్వయం చేస్తున్న సకలసేనాధిపతి రుద్రయసేనాని.
“సేనాపతి సుబుద్ధి దళాలలో కేశవశెట్టి దళం నుంచి తక్కువ పొడవున్న చిన్నఈటెలు కావాలని అభ్యర్థన వచ్చింది. ఈ అంశం మీ దృష్టికి వచ్చిందా?” అని యుద్ధ వేగుల ద్వారా లేఖ పంపాడు. చదివి ఆశ్చర్యపోయాడు చౌండ.
అప్పుడు అతని దృష్టికి వచ్చాడు జాయప.
‘జాయప యుద్ధభూమికి వచ్చాడా?!’..
జాయప కోర్కెను చక్రవర్తి తిరస్కరించినట్లు ఆయనకు తెలిసింది. యుద్ధక్షేత్రంలో కలిసిన వెంటనే పినచోడుడు తన కొడుకు అంశం చౌండ వద్ద ప్రస్తావించాడు.
“జాయప.. చక్రవర్తి మెచ్చిన నాట్యకారుడు పినచోడా! వాడి గురించి దిగులువద్దు!” అన్నాడు భుజంతట్టి. ఆ జవాబు పినచోడుడికి పూర్తి తృప్తి కలిగించలేదు. కేశవదళంతో ఉన్నది ఎవరు? అని అడిగితే.. వేగులు జాయప పేరు చెప్పారు. యుద్ధరంగం దక్షిణప్రాంతంలో సంభవించిన సంచలనం కూడా చౌండకు చేరింది.
మర్నాడు చౌండ ముందు నిలబడ్డారు సుబుద్ధి, జాయప. కాస్త వెనగ్గా కంటక, నాగంభట్టు, త్రిపుర. “ఊ.. మీరు యుద్ధప్రవేశం చేసి సంచలనాలు సృష్టించడం. మేము తెలుసుకుని తమరిని పిలిస్తే అప్పుడు మా ముందుకు వస్తారన్నమాట!”.. జాయప తత్తరపడ్డాడు.
“శాంతం – పాపం బాబయగారూ! తమరికి చెప్పే అవకాశం రాలేదు. క్షమించాలి..” అన్నాడు జాయప.
సుబుద్ధి సైగ చేయగా.. వెనువెంటనే చౌండ కాళ్లపై పడ్డాడు. ప్రఫుల్లమయ్యాడు చౌండ.
ఆప్యాయంగా హత్తుకుని..
“వెళ్లి శిబిరంలో ఉన్న మీ తండ్రిగారిని దర్శించు..” అన్నాడు.
“శాంతం – పాపం.. శాంతం – పాపం.. చక్రవర్తుల వారూ అక్కడే ఉన్నారు కదా! యుద్ధం వద్దన్నవారి ముందుకు ఇప్పుడు వెళ్లడం..”
అన్నాడు భయం భయంగా.
“సరే! యుద్ధ విజయానంతరమే కలుద్దువు గానీ.. సరేనా!?” అన్నడాయన నవ్వుతూ.
జాయప యుద్ధభూమికి చేరిన విధమంతా అనుమకొండలోని రుద్రసేనానికి తెలియపరిచాడు చౌండ.
‘కేశవదళం కోరిన ఆయుధాలు, ఇతర వస్తువులు వెనువెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా మనవి. ఈ యుద్ధాన్ని మలుపు
తిప్పగలవాడు మన జాయపే!’..
చౌండ జాబు చదివి జాయప అంశం తెలిసినవాడు కాబట్టి.. రుద్రుడు మరో సలహాను చౌండకు పంపాడు. వెంటనే జాయపకు సర్వసైన్యాధ్యక్షుడిగా చౌండ ఆజ్ఞ! “జాయపా.. నువ్వు యుద్ధం చెయ్యడం కంటే యుద్ధ పన్నాగాలు, యుద్ధ మంత్రాంగాల బృందంలోకి రావాలి!”..
శిరసావహించక తప్పదు.
“కాకపోతే చిన్న వెసులుబాటు కల్పించండి బాబయ మహాప్రభో! అప్పుడప్పుడూ యుద్ధక్షేత్రానికి అనుజ్ఞ ఇవ్వండి!”..
“అలాగే.. కానివ్వు!”..
కొందరు మెరికల్లాంటి యువవీరులను జాయపకు అప్పగించాడు చౌండ!
కాకతీయ సైన్యం క్రమంగా పైచేయి సాధిస్తున్నట్లు పృథ్వీశ్వరునికి తెలియవచ్చింది.
దానికి కారణం.. జాయప అనే లేత మహాయోధుడని మాత్రం తెలియదు.
(సశేషం)