చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : తన కాలానికి ‘వైష్ణవం – శైవం’ రెండూ రెండే అన్నంత సమ ఉజ్జీలుగా ఉండటం జాయపుణ్ని ఆహ్లాదపరచింది. కొండొకచో కొంత ఆనందపరచింది. ఆదిమ యుగాల కాలంలో అంతా ఉగ్రమే! ఉద్రేకాలు ఎక్కువ. కాబట్టి.. ఆ యుగపు ప్రజల తీరుకు అనుగుణమైన లక్షణాలున్న రుద్రుడు, పశుపతి, శర్వుడు, భీముడు, మహాదేవుడు.. వారి దేవతలు. చిత్రంగా ఆ ఆదిమజాతుల్లోనూ సాత్వికులు ఉండేవారు. వారి ప్రధానదేవుడు విష్ణువు. నలుగురికి మంచి చెప్పి, అంతూదరీ లేని సముద్రమనే మహాప్రపంచాన్ని మధించి.. పుట్టిన అమృతాన్ని అందరికీ పంచే ఈ విష్ణుమూర్తి ఎక్కువమందిని ఆకర్షించలేదు.
కానీయుద్ధాల యుగాల్లో అడుగడుక్కీ రెచ్చిపోయి శూలం పుచ్చుకొని తిరిగే రుద్రుడు సాధారణ పౌరులకు గొప్ప ఆకర్షణ! ఆ ఆదిమకాలంలోనే కాదు.. ఈ కాలంలో కూడా కత్తులు పుచ్చుకొని తిరిగే దేవుళ్లపై మోహం ఎక్కువే కానీ, సాత్విక విష్ణువు ఆరాధన కూడా పెరుగుతున్నది.
విష్ణువుకు మిత్రదేవతలు ఇంద్రుడు, నారాయణుడు, సంకర్షణ, వాసుదేవుడు తదితరులున్నారు.
సమాజంలో రానురానూ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కాలంలో ఈ సాత్విక దేవతల పట్ల భక్తులు కూడా పెరిగిపోసాగారు. బుద్ధుడు లాంటి గొప్ప ప్రవక్తల వల్ల గణం కోసం, సమాజం కోసం అమూర్త దేవతలకు చేసే యజ్ఞయాగాదులు తగ్గిపోయాయి.
వాటి స్థానంలోనే దేవుళ్ల మానవరూపాలు వచ్చేశాయి. వారికి గుడులు కట్టి.. వాటిని పవిత్రస్థలాలుగా భావిస్తూ, సదరు దేవతలకు పూజా పునస్కార విధానాలు వచ్చాయి. అంశాలవారీ దేవుళ్లు.. అంటే చదువుకో దేవత, కళలకో దేవుడు, యుద్ధాలకో దేవుడు.. ఇలా బహు దేవతోపాసన వచ్చింది. వేరువేరు దేవుళ్లకు వేరువేరు పూజా విధానాలు.. వ్రతాలు, ఉపవాసాలు, దానాలు, పుణ్యలోకగతులు.. అబ్బో బోలెడు!!
రుద్రుడల్లా శివుడయ్యాడు. అంటే ఉగ్రం కొంత తగ్గిందన్నమాట. పశుపతి, శర్వుడు తదితర పేర్లు ఇప్పుడు వినిపించడంలేదు. ఈ సాత్వికదేవుళ్లలో ఇంద్రుడు లాంటి యుద్ధ దేవతలంతా పోయారు. విష్ణుమూర్తి మాత్రం దశావతారాలతో అందరికీ ఆరాధ్యుడయ్యాడు.
అప్పుడు పెరిగిందండీ.. ఈ భక్తి అనే పదానికి ప్రాబల్యం. ఒక్కో దేవుడికి ఓ భక్తబృందం.. సంకర్షణునికి ఓ ప్రాంతంలో గొప్ప ఆరాధన. కృష్ణునికి మరో ప్రాంతంలో.. వాసుదేవునికి మరో రాజ్యంలో.. నారాయణునికి మరో చోట! ఇవన్నీ కలిపి భక్తి అయితే.. ఈ భక్తి ఎదుగుదలలో సాహిత్య, కళారూపాల ప్రభావం తీవ్రంగా ఉంది. మొత్తంగా భక్తి భావన సామాజిక దైనందినంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.
శైవ తీవ్రవాదులు, వైష్ణవ తీవ్రవాదులు ఉండొచ్చు. వాళ్లు పరస్పరం కొట్లాడుకోవచ్చు. కానీ, సాధారణ సమాజంలో ప్రశాంత జీవనపు ప్రాధాన్యం పెరిగింది మాత్రం భక్తి ప్రభావం వల్లనే. ఎదురొచ్చిన వారికి నమస్కరించడం, హత్తుకోవడం.. గుంపు ధోరణి తగ్గి వ్యక్తికి ప్రాధాన్యత పెరిగింది. పంచములు, నిమ్న వర్గాలవారి పట్ల ఏహ్యత తగ్గి ఉదాసీనత మిగిలింది. అది పట్టుకున్నాడు జాయపుడు.
అసలు ఈ భక్తిభావన ఉద్యమంలా పైకి ఉబికింది దక్షిణావర్త రాజ్యాలలో అని తెలిసినప్పుడు జాయపుడు చాలా ఆశ్చర్యపోయాడు. వైష్ణవ పీఠాధిపతి చెప్పిన ఆళ్వారులే ఈ భక్తి కవులబృందం. వీళ్లు భక్తి గీతాలు, పాశురాలు రాసుకుని చిన్న ఏకతారో.. తంబూరో.. చిడతలో పుచ్చుకొని రాసుకున్నవి పాడుకుంటూ వీధివీధి తిరుగుతూ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చెయ్యసాగారట. ఆ ప్రభావం పైకిపోయి ఆర్యావర్తమంతా వ్యాపించిందట. యజ్ఞ, హోమాలు, బలులు, రక్త తర్పణలు వీరభక్తులు చేస్తుంటే.. భజనలు, కీర్తనలు, పాటలతో సాత్వికులు ఈ సాత్విక దేవుళ్లను కొలుస్తున్నారు.
తమిళ గోదాకల్యాణం ప్రదర్శనలో ఆ పటుత్వం, తీవ్రమైన భక్తిభావనతో ఆ ప్రదర్శన అంతటా ఓలలాడటం.. ఆ అద్భుత ఆళ్వారుల భక్తి పాశురాల ప్రభావమే! ఇప్పుడు మహా ప్రవర్తనాచార్యుడు రామానుజుడు వచ్చాక ఈ సాత్విక దైవభావనలన్నీ మిళితమై వైష్ణవంగా ఓ బలమైన మతరూపు తీసుకున్నాయి. మన తెలుగు రాజ్యాలలో కూడా వైష్ణవం బాగానే ప్రచలితం అవుతున్నది. పలనాడులో జరిగిన యుద్ధాలకు లోపాయకారిగా ఈ మతగొడవలే కారణమని విన్నాడు జాయపుడు.
పరాశరుణ్ని అడిగాడు.. “ఇక్కడ శైవనాట్యాల సంగతి ఏమిటి మిత్రమా?” అంటూ.
“చూస్తావా..” అని, చటుక్కున నాలిక కొరుక్కుని..
“చూస్తారా..” అన్నాడు పరాశరుడు.
చురుకయ్యాడు జాయపుడు. తనపై పరాశరునికి సందేహం కలిగినట్లు అనుమానించాడు. పక్షం రోజులనుంచి పరాశరుని ప్రవర్తనలో మార్పు గుర్తించాడు. తనను తాకుతూ తుళ్లిపడుతూ మాట్లాడటంలేదు. జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం, తాకకుండా పక్కన నడుస్తూ ఏదైనా అడిగినప్పుడు వినయంగా మాట్లాడటం. నవ్వుకుంటూ మరింతగా తాకుతూ భుజంపై చెయ్యివేస్తూ పరాశరుణ్ని ఉడికిస్తున్నాడు జాయపుడు. ఇద్దరూ శైవమఠంలో నాట్య ప్రదర్శనలు కొన్ని చూశారు.
శైవుల దేశీప్రదర్శనలు మామూలే. అదే ఉద్రిక్తత.. అదే తీవ్రధోరణి. భైరవ ఆత్మాహుతి నాటి దృశ్యప్రభావం వల్ల జాయపుడు వాటిని ఆస్వాదించలేక పోతున్నాడు. మరొక శిష్ట కులీనవర్గం ఏర్పాటు చేసిన ‘మార్కండేయ చరితం’ యక్షగాన ప్రదర్శన చూశారు. అది శైవ వ్యాపారశ్రేణివారు కట్టించిన భవంతిలో.. వెలనాడు రాజ్యంలోని ముక్త్యాల, జయంతిపురపు కళాకారులు ఇచ్చిన ప్రదర్శన. సాత్వికత తక్కువున్నా ప్రదర్శన ఉన్నతస్థాయిలో ఉంది. ఇది చూశాక కాస్త ప్రశాంత చిత్తుడయ్యాడు. పరాశరునికి కూడా ఈ ప్రదర్శన నచ్చింది.
“బాగుంది మిత్రమా! వైష్ణవుణ్ని అయినా ఈ శైవాంశ ప్రదర్శన మెచ్చుకోకుండా ఉండలేను. శివ పాత్రధారి అదరగొట్టేశాడు. మార్కండేయుడు కూడా వహ్వా.. ఓ శివభక్తునిపై నేను కూడా యక్షగానమొకటి రాస్తాను”
జాయపునిలో మళ్లా ఆలోచనలు..
ప్రదర్శకుల తాదాత్మ్యపు నటన వల్ల పరాశరుడనే రచయిత ప్రగాఢంగా ప్రభావితుడైనట్లేనా?!
ఇప్పుడు ఆలోచనలలో సంఘర్షిస్తున్నవి తాదాత్మ్యం! తన్మయత్వం!! ప్రగాఢ ప్రభావితం!!!
ఈ మూడింటి మధ్య సమన్వయం కుదిరినప్పుడే జాయపునిలో సంఘర్షిస్తున్న యుద్ధరావాలకు ముగింపు దొరుకుతుంది.
ఘల్లు ఘల్లు.. ఘల్లు ఘల్లు.. గజ్జెల సవ్వడి.
ఓరోజు ఉదయం ఎప్పటిలాగే తన ఉదయాభ్యాసాలలో భాగంగా నాట్య భంగిమలు, ముద్రలు ఏవేవో.. రూపకల్పనలో ఉండగా, దగ్గరగా గజ్జెలసవ్వడి. భృకుటి ముడిచి విన్నాడు. నిజమే! గజ్జెలసవ్వడి దగ్గరగా మెల్లగా! మళ్లా ఘల్ ఘల్ ఘల్.. వేగంగా.. ఎవరో పరిగెత్తి పోయినట్లు! మళ్లా చిన్నగా.. మళ్లీ పరిగెత్తి వచ్చినట్లు దగ్గరగా.. మళ్లీ.. ఈసారి ఇద్దరు ముగ్గురు.. వస్తున్నట్లు.. పోతున్నట్లు. ఒక్కరు కాదు చాలామంది.. ఎవరు చెప్మా? చళ్లున చరిచినట్లు.. కాకతి??
వేగంగా చురుకుగా మందిరం నుంచి బయటికి పరిగెత్తుకొని వచ్చాడు.
బయట నడవలో దృశ్యం చూసి ఖంగుతిన్నాడు. రెప్పలు వెయ్యడం మరచిన కళ్లు పెద్దవై ఆగిపోయాయి.
తెరిచిన నోరు అలాగే ఉండిపోయింది. దాదాపు యాభైమంది పిల్లలు.. కాళ్లకు గజ్జెలు కట్టుకుని మందిరమంతా బుజ్జి బుజ్జి పరుగులు పెడుతున్నారు. వాళ్లను చూసి లిప్తకాలంలో ముఖం ప్రసన్నమైంది. ఆత్మీయతతో కూడిన ఆర్ద్రత ఏదో బాల్యచేష్టల మాధుర్యంతో మిళితమై కళ్లల్లో తొణికిసలాడేవేళ అటే చూస్తూ.. మెల్లగా జారి కింద కూర్చుండిపోయాడు. జాయపుణ్నే చూస్తూ.. ‘రావాలా వద్దా!?’ అన్నట్లు బిడియంగా పసినవ్వుల వరద.. పసిపసి కెరటాల ఊగిసలాట..
రెండుచేతులూ చాచి సౌంజ్ఞ చేసి పిలిచాడు. లాలనగా కళ్లతో.. చేతులు చాచాడు.. రా రమ్మన్నట్లు.
వాళ్లు మెల్లమెల్లగా వంగి జాయపుణ్నే చూస్తూ అడుగులో అడుగువేసుకుంటూ.. ఒక్కక్కరే.. ఒక్కక్క అడుగే వేస్తూ వస్తూ, మళ్లా బిడియంగా వెనక్కు వెళ్లగా.. జాయపుని హస్తాలు నాట్య భంగిమలతో రమ్మని పిలుస్తూ..
దగ్గరగా ఎవరో వచ్చిన్నట్లు గుర్తించి తలతిప్పి చూశాడు. అన్న పృథ్వీశ్వరుడు ముందు కనిపించగా.. వెనక అన్నలు, తమ్ముళ్లు, మరదళ్లు, వదినలు, జ్ఞాతిసోదరులు.. వారివారి భార్యలు. అందరి వెనగ్గా పినతండ్రి బ్రహ్మయచోడుడు.
మంచానికి అతుక్కుని పోయిన బ్రహ్మయచోడునికి కూడా జాయపుణ్ని చూస్తే అదో ఉద్వేగం. అందరితోపాటు తనూ జాయపుణ్ని చూడటానికి మందిరం నుంచి లేచి వచ్చాడు.
జాయపుణ్ని పరివేష్టించి నిలబడ్డ తమతమ అమ్మానాన్నలను చూడగానే.. దూరంగా నిలబడి ‘రావాలా వద్దా!?’ అని బిడియపడుతున్న పిల్లలంతా బిలబిలమని పరుగు పరుగున వచ్చి వచ్చి.. కూర్చున్న జాయపునిపై ఒక్కుమ్మడిగా పడిపోయారు.
కృష్ణమ్మ ఉరికురికి ఎగసి ఎగసి సంద్రంలో దూకినట్లు.. జాయపుడు ఉక్కిరిబిక్కిరయ్యాడు.
అందరినీ ఆప్యాయంగా పొదువుకున్నాడు. హత్తుకున్నాడు. మీదికి గుంజుకున్నాడు. పట్టుకున్నాడు. పిల్లల ఉధృతికి వెనక్కు తూలిపోయాడు. గజ్జెలకాళ్లతో పిల్లలు మీదకు ఎక్కేశారు. అల్లరి వెంట గజ్జెల గానం.. మనసంతా నాట్యమేకానీ నొప్పిలేదు. అనేకానేక రాగాలు.. ఎన్నెన్నో నృత్త భంగిమలు.. మరెన్నో వాద్యాల ఘోష గందరగోళంగా కలగలిసిపోయి నృత్తమాడుతూ మీద మీద పడిపోతే ఎలా ఉంటుందో.. అలా ఉంది జాయపునికి. తన అన్నదమ్ముల పిల్లలు.. అలా ఒక్కసారిగా ఉరికురికి మీదపడి అల్లకల్లోలం చెయ్యడం.. జాయపునికి ఊహించని సంఘటన. ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కానీ ఏదో హాయి! పినతండ్రి బ్రహ్మయచోడుడు ముందుకు వచ్చాడు నవ్వుతూ.
“జాయప తండ్రీ.. వీళ్లకు నీలాగే నాట్యం చెయ్యాలని ఉన్నదట. నువ్వే నాట్యం నేర్పించాలట. నిన్ను అడిగే సాహసం చెయ్యలేక నన్ను రమ్మని మంచంపై ఉన్నవాణ్ని లేపుకొని వచ్చారు వీళ్ల అయ్యా అమ్మలు!”..
చకితుడయ్యాడు జాయపుడు.
అనుమకొండలో అక్క పిల్లలతో ఆడుకునేవాడు కానీ, వాళ్లింకా చంకలో పిల్లలు. వీళ్లు కాస్త పెద్దవాళ్లు. కాళ్లకు గజ్జెకట్టి ఎగురుతున్న తూనీగలు. తన నాట్య అభ్యాసవేళ మందిరమంతా నిశ్శబ్దంగా ఉండాలని అన్నను కోరాడు. అలాగే ఉంటుంది మందిరం. కానీ, వీళ్లు.. ఈ చిచ్చర పిడుగులు.. తమ కోర్కెను ఘనంగా చాటడానికి గజ్జెలు వాడారు. గొప్ప ఆలోచన..
ఎవరి పిల్లలను ఆ తల్లిదండ్రులు వెనక్కు లాగి పట్టుకున్నారు. గబగబా కదిలి ఓ ఆసనం తీసుకువచ్చి..
“కూర్చోండి చిన్నాన్నా..” అంటూ పినతండ్రిని కూర్చోబెట్టాడు.
నిన్ను చూడాలని.. నీతో సాహితీచర్చలు చేయాలని మన రాజ్యపు పండితులు, గ్రంథకర్తలు, కవులు, నాట్య, వాద్యకారులు
ముచ్చట పడుతున్నారు. ‘పట్టాభిషక్తుడై ఆరునెలలు దాటింది. జాయచోడులవారికి పాలనపై ఆసక్తి లేకపోయినా వారు మహాకళాకారులు కదా.. సాహితీ సమాలోచనంలోనైనా పాల్గొనవచ్చు కదా!’ అని వారంతా అడిగారు. దినమూ ఒత్తిడి చేస్తున్నారు!” వివరించాడు పృథ్వీ.
అందరినీ ఆత్మీయంగా నవ్వుతూ చూశాడు. అందరూ అన్నదమ్ములు, జ్ఞాతులు.. భార్యాభర్తలు వాళ్ల పిల్లలు.
చేతులు చాపి ఆనందంగా పిలిచాడు..
“ఇలా రండి..”
ఘల్ ఘల్ ఘల్.. బోలెడు గజ్జెలు.. ఉరికురికి
మీదకు వచ్చి పడ్డారు.
“తప్పకుండా! నాకు వచ్చింది మీకు నేర్పుతాను సరేనా?!”.
పిల్లల కంటే తల్లిదండ్రుల హర్షధ్వానాలతో ఆ మందిరం పరవశించింది.
చిన్నాన్నను లేపి పొదవుకుని భుజాలపై చెయ్యి వేసి నడిపించుకుంటూ ఆయన మందిరంవైపు కదిలాడు జాయపుడు.
ఆరోజు నుంచి జాయపుని జీవితం మరోమలుపు తిరిగింది. నాట్యకారుడు.. నాట్యాచార్యుడయ్యాడు.
“మండలేశ్వరులు శ్రీశ్రీశ్రీ జాయప సేనానులకు స్వాగతం!”.. ధనదుప్రోలు కోటలోని సమావేశ మందిరంలోకి మండలేశ్వరుడుగా జాయపుడు ప్రవేశించగానే సభాసదులంతా ఉత్సాహంగా లేచి నిలుచుని అతనికి ఘనస్వాగతం పలికారు. అందరికీ నమస్కరించి.. అందరూ ఆసీనులయ్యాకే తను కూర్చున్నాడు.
పృథ్వీశ్వరచోడుడు సంధ్యాకాలపు సాహితీ సమావేశానికి ఆహ్వానించినప్పుడు మొదట జాయపుడు అంగీకరించలేదు.
“నాకంత ఆసక్తి లేదు అన్నా..” అని చెప్పాడు.
“నిన్ను చూడాలని.. నీతో సాహితీచర్చలు చేయాలని మన రాజ్యపు పండితులు, గ్రంథకర్తలు, కవులు, నాట్య, వాద్యకారులు ముచ్చట పడుతున్నారు. ‘పట్టాభిషక్తుడై ఆరునెలలు దాటింది. జాయచోడులవారికి పాలనపై ఆసక్తి లేకపోయినా వారు మహాకళాకారులు కదా.. సాహితీ సమాలోచనంలోనైనా పాల్గొనవచ్చు కదా!’ అని వారంతా అడిగారు. దినమూ ఒత్తిడి చేస్తున్నారు!” వివరించాడు పృథ్వీశ్వరుడు.
సాలోచనగా చూశాడు జాయపుడు.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284