చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : పంచముడైన వీరాయకు క్రూరమైన శిక్షను అమలు చేయడం.. రాజధానిలో సంచలనం సృష్టించింది. విషయం తెలిసిన గణపతిదేవుడు.. తీవ్ర సంఘర్షణకు లోనయ్యాడు. మురారి చేసిన తప్పును ప్రజలకు వివరించమనీ, తన మాటగా క్షమించమని చెప్పమన్నాడు. గణపతిదేవుడు ప్రజలను క్షమించమని కోరడం.. ఇదే మొదటిసారి. చతుష్పథం వద్ద అనుమకొండ నగర దండనాయకుడు మంచన చమూపతి.. ఇందుకు సంబంధించిన ప్రకటన చేశాడు.
ఆరోజు కాకతీయ సామ్రాజ్య చరిత్రలో మరపురాని మహోన్నతమైన, చరిత్రాత్మకమైన రోజు. భరతముని తర్వాత సంస్కృతంలో నాట్యకళపై జాయచోడుడు రచించిన ‘నృత్త రత్నావళి’, గేయ సాహిత్యంపై రచించిన ‘గీత రత్నావళి’, వాద్య సంగీతంపై రచించిన ‘వాద్య రత్నావళి’ అనే మూడు మహాగ్రంథాలను ఆవిష్కరించి.. గణపతిదేవునికి అంకితమిచ్చి జాతికి అందించిన మహాపర్వదినం.
దండనాయకుడి ప్రకటన విన్న పురవాసులు గగ్గోలు పెట్టారు. అక్కడే నేలపై సాగిలపడి వేడుకున్నారు. చక్రవర్తి అలా క్షమించమని పురవాసులను అడగడం తామెప్పుడూ కనీవినీ ఎరుగమని కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం దేవుడు తప్ప మానవమాత్రులు ఎవ్వరూ అలా ప్రజలను ప్రార్థించలేరని ముక్తకంఠంతో అన్నారు.
ప్రకటన, దానిపై వచ్చిన ప్రజాస్పందన ఆయనకు చేరాయి. కాస్త స్థిమితపడ్డాడు.
అయితే ఈసారి గణపతిదేవుడు కూలంకషంగా ఆలోచించి.. తెగించి ఓ నిర్ణయం తీసుకున్నాడు. రుద్రమదేవి పుట్టిన సమయాన చేసిన వారసత్వపు ప్రకటనకు మరింత పరిపుష్టి చేకూరుస్తూ.. రుద్రమదేవికి ‘పట్టోధృతి’ కార్యక్రమం కేతకిపురం ఏకవీరాదేవి ఆలయంలో జరిపించాడు. ‘పట్టోధృతి’ అంటే దాదాపుగా వారసునిగా సమానార్థం ఇచ్చే వైదికక్రతువు. పుట్టిన సమయంలో వారసుడిగా ప్రకటించిన దానికి ఈ పట్టోధృతి మరికొంత ఊతం ఇచ్చినట్లు. పట్టోధృతి పొందిన రుద్రమ ఆజ్ఞాపిస్తే.. అది గణపతిదేవులవారి ఆజ్ఞగానే అన్ని నియోగాల అధికారులు మన్నించసాగారు.
ఇప్పుడు అందరి చూపూ మురారిపైనే.
‘పట్టోధృతి’ అంటే ఏమిటో అర్థమైందో లేదో తెలియదు కానీ.. ఆయన ఎప్పటిలాగే పకపకా నవ్వుతూ అక్కకు అభినందనలు చెప్పాడు. మంచి నిర్ణయం తీసుకున్న తండ్రిగారికి, వారికి సహకరించిన జాయచోడ మామకూ కృతజ్ఞతలు చెప్పాడు.
ఈ సంఘటన జరిగిన తర్వాత మురారిదేవుడు.. మిత్రులను కలిసే మిషమీద అనుమకొండను వదిలాడు.
ఎక్కడికి వెళ్లాడో తెలియదు. మళ్లీ ఏ ఉపద్రవం తెచ్చిపెట్టబోతున్నాడోనని నారాంబ, జాయచోడుల ఆందోళన.
మగపిల్లలు దారి తప్పితే తల్లిదండ్రులు చేయగలిగింది లేదు. గుండెకోత తప్ప. ఆనాడైనా ఈనాడైనా!!
పదో అధ్యాయం : ఆంధ్ర నగరిలో
ఆంధ్రనగరి పురవీధులలో ఓ అశ్వం ఒంటరిగా, మెల్లగా పోతోంది. ఓరుగల్లు దాటింది. అనుమకొండలో ప్రవేశించింది. అటూఇటూ చూస్తూ చిన్ననాడు తిరుగాడిన ప్రదేశాలను పరికిస్తూ.. మనోఫలకం ముందు తిరుగాడుతున్న స్మృతులతో పరవశంగా స్పందిస్తూ సాగిపోతున్నాడా ఆశ్వికుడు.
చుట్టుపక్కల నివాసాల చావడుల నుంచి ఆ మహాపురుషుడు రచించిన రూపకాలు, యక్షగానాలను విద్యార్థులు వల్లె వేస్తుండటం వినిపిస్తోంది. గుర్తించినవారు కైమోడ్పులిడగా శిరఃకంపనతో వాటిని అవధరిస్తూ చిరునవ్వుతో సాగిపోతున్న ఆ ఆశ్వికుడు.. అనుమకొండపురంలోని వీధివీధిలో కౌమారుడుగా తిరుగాడి పరవశించిన అరువది నాలుగేండ్ల నాట్యాచార్యుడు జాయచోడుడు.
పోయిపోయి ఓ మహాభవంతి ముందు ఆగాడు. కాపలాదారు చూసి గుర్తించి ద్వారం తీయగానే లోపలినుంచి నివాసులు బిలబిలమంటూ బయటికి వచ్చి వినయంగా ఆహ్వానించారు.
“సుస్వాగతం నాట్యాచార్యా!”
ఈ వయసులో కూడా రవ్వంత తేజస్సు తగ్గని మహా తేజోమూర్తి, ఎదురేగితే శత్రువు కూడా ఆసనం దిగి ప్రణామాలు ఆచరించే మహాపండితుడు జాయచోడుడు నవ్వి..
“నా గృహంలో నాకు ఆహ్వానమా..” అంటూనే, తెలిసిన గృహంలా చనువుగా లోపలికి కదిలాడు.
“ఎక్కడ నా మిత్రుడు.. ఎక్కడ మీ తాత..? వృద్ధాప్యంతో బాధపడుతున్నాడా ఆనందిస్తున్నాడా?..” అంటూ మరో మందిరంలో ప్రవేశించి అక్కడ నిలబడిపోయాడు.
ఎదురుగా ముక్కాలిపీటపై చదరంగం బల్ల. మూడు పక్కలా ముగ్గురు వృద్ధులు. ముందు గుర్తించినవాడు లేచి ఆనందంతో, సంభ్రమంతో అరిచాడు..
“జాయపా.. నా మిత్రమా..” అని.
చేతులు చాచి ఆర్ద్రంగా అన్నాడు జాయచోడుడు..
“నా మిత్రమా త్రిపురా..”
యాభై ఏళ్ల స్నేహం.. ఆలింగనంలో పరవశించింది.
“ఎంత అదృష్టం చేసుకున్నావు మిత్రమా. డెబ్బది ఏళ్ల ప్రాయంలో మిత్రులతో చదరంగం ఆడుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నావు కదా..”
“నీలాంటి మిత్రుని కన్నా వేరు అదృష్టం నాకున్నదా జాయపా.. చాలు. నీ స్మృతులతోనే నాకు దినమూ వర్ధిల్లుతున్నది..” అన్నాడు త్రిపుర తృప్తిగా జాయచోడుణ్ని చూస్తూ.
“అవునవును మహాశయా! నిత్యమూ క్షణక్షణమూ మీ నామస్మరణమే త్రిపురకు..” అన్నాడు మరో మిత్రుడు.
“ఏమి.. ఎందుకు నా నామస్మరణం?”
“అప్పట్లో త్రిపురను మీతోపాటు యుద్ధభూమికి తీసుకుపోయారట. అక్కడ వెయ్యిమంది శత్రు సైనికులను చంపాడట. రోజూ అవే ముచ్చట్లు. చెప్పినవే చెప్పి చంపుతున్నాడు. వినలేక కొడుకులు, మనుమలు, మనుమరాళ్లు పారిపోతే.. మిత్రులుగా మేమే భరిస్తున్నాము..”
జాయచోడునికి మహా వినోదంగా ఉంది ఆ సంభాషణ. మళ్లీ నాగంభట్టు, త్రిపుర, కంటకదొర తదితర మిత్రుల కబుర్లన్నీ కళ్లముందు కదలాడుతున్నాయి. ఎప్పుడో జరిగిన యుద్ధాల ముచ్చట్లు దాదాపు ఏభై ఏళ్ల తర్వాత కూడా గుర్తుచేసుకుని మురిసిపోతున్నాడంటే.. అది ఆయనను కూడా ఉత్తేజపరచింది.
“ఏమి చెబుతున్నాడు మీ మిత్రుడు?”
“తను వెయ్యిమందిని చంపాడట.. నిజమా?”
జాయచోడుడు త్రిపురను చూస్తూ హాస్యంగా నవ్వాడు.
“మహావీరుడు కూడా ఓ యుద్ధంలో వెయ్యిమందిని కాదు కదా.. వందమందిని కూడా చంపలేడు. నేను పదిమందిని సంహరిస్తే గొప్ప. మరి త్రిపుర లాంటి మహాయోధుడు వెయ్యిమందిని సంహరించడం.. ప్చ్.. జరిగిందేమో..” అన్నాడు కొంటెగా.
అందరూ పడిపడి నవ్వారు. త్రిపుర కూడా బోసినోటితో నవ్వాడు.
ఆ మిత్రులు త్రిపుర చెప్పిన యుద్ధం ముచ్చట్లు అన్నీ జాయచోడునికి చెప్తుంటే.. ఆయన కూడా పగలబడి నవ్వుతూ వింటున్నాడు.
“ఒకడు త్రిపురను ‘బావా.. నన్ను చంపితే మీ చెల్లాయి ముండ మోస్తుంది.. అది నీకు న్యాయమా?’ అన్నాడట. అప్పుడు త్రిపుర వాడిని వదిలేశాడట. మరొక శత్రు సైనికుడు.. ‘నా భార్య గర్భవతి. పుట్టిన పిల్లవాడికి నీ పేరే పెట్టుకుంటాను వదిలేయ్!’ అన్నాడట. వదిలేశాడట. మరొకడు.. ‘నేను సైనికుడిని కాదు. ఏనుగు లద్దె ఎత్తేవాడిని!’ అంటూ కత్తి కింద పడేసి త్రిపుర కాళ్లు పట్టుకున్నాడట. వాడిని క్షమించి విడిచి పెట్టాడట. అబ్బో.. ఇలా ఓ వెయ్యి సంఘటనలు.. ఇన్నేళ్లుగా అవే మళ్లీమళ్లీ చెప్పిచెప్పి చంపుతున్నాడు..” అన్నాడు నవ్వుతూ.
“అసలు త్రిపుర యుద్ధభూమిలో చేసింది అదే..”
“ఏది?”
“ఏనుగుల లద్దె ఎత్తడం.. అవును కదా మిత్రమా!?”
జాయచోడుడు అలా చెప్పడంతో అందరూ పగలబడి నవ్వారు. త్రిపుర కూడా.
జాయచోడుడు ఒక మిత్రుణ్ని పరిశీలనగా చూసి..
“తమరు? మీరు చలమయశెట్టి కదూ?!” అన్నాడు.
చలమయ నవ్వుతూ తల ఊపాడు. నవ్వుతుంటే శరీరమంతా వణుకుతోంది.. వృద్ధాప్యం వల్ల.
“అవునూ.. తమరి మిత్రుడు.. అదే.. ఆ వాతూల అహోబలపతి.. ఎవరో ఇప్పటికైనా కలిశారా?”
నిరాశగా చూశాడు చలమయ.
“ప్చ్.. ఇప్పటికీ గుర్తించలేకపోయాను మహాశయా! ప్చ్.. నావల్ల కాలేదు..”
జాయచోడుడు కూడా నిరాశగా చూశాడు. దాదాపు యాభై ఏళ్ల నాటి అంశం. ఇన్నేళ్లలో కూడా ఆ వ్యక్తి ఎవ్వరో గుర్తించలేదంటే.. ఆ వ్యక్తి అసలు ఉన్నాడో లేడో.
అదే అడిగాడు త్రిపురను జాయచోడుడు.
“ఆ వాతూల అహోబలపతి ఎవరు త్రిపురా?”
అప్పుడు నవ్వాడు త్రిపుర. చేతి సహాయంగా ఉన్న కర్రతో అక్కడున్న మరోవ్యక్తిని చూపిస్తూ..
“ఈయనే ఆ వాతూల అహోబలపతి!” అన్నాడు.
చలమయ, ఆ మూడోమిత్రుడు, జాయచోడుడు కూడా ఆశ్చర్యంగా చూశారు.
“ఈయనే ఆయన. వాతూల అహోబలపతిగారు. అంటే గాలి నరసయగారు. అది సంస్కృత నామం. ఇది అసలు సిసలు తెలుగుపేరు! నరసయది మా నివాసానికి కుడిపక్క నివాసమైతే.. చలమయది ఎడమ పక్క నివాసం!”
చెప్పి ఆపాడు. రెండు లిప్తలకాలం అంతా నిశ్శబ్దం.
ఎవ్వరూ మాట్లాడకుండా మనసుపెట్టి అసలు ముచ్చట అర్థం చేసుకోవడానికి తీవ్రంగా విశ్లేషిస్తున్నారు. అర్థమై పెద్దపెట్టున నవ్వాడు జాయచోడుడు. ముగ్గురూ జత కలిపారు. చివరగా చలమయ.
తన ఇంటికి కుడిపక్కన ఉన్నవాడి పేరు.. ఎడమపక్క ఇంటివాడికి సంస్కృతంలో చెప్పి.. చలమయను యాభై ఏళ్లు వెర్రివాడిని చేశాడు త్రిపుర. ముగ్గురూ అలా నవ్వుతూనే ఉన్నారు.
“వాతూల.. ఏమిటేమిటి. అహో.. బలపతి. భలే.. వాతూలము అంటే గాలి. అహోబలపతి అంటే నృసింహుడు. నరసయ. భలే.. అమ్మో ఎంత మోసం. ఒక్కరోజు రెండురోజులు కాదు. యాభై ఏళ్లు..”
“జాయపా.. సంస్కృత పండితుడివి కదా.. నీకూ అర్థం కాలేదా.. భలే భలే..”
“సంస్కృత పండితుడనే. కానీ, నన్నుకూడా పిల్లిమొగ్గ వేయించాడు త్రిపుర. నన్ను క్షమించు చలమయా. సంస్కృతంలో గ్రంథాలు రాశాను. కానీ, ఒక్క సంస్కృత నామం తెలుగులోకి అనువదించలేక పోయాను..”
ముగ్గురూ అలా నవ్వుతూనే ముచ్చట్లు పంచుకున్నారు. కలిసి భోజనాలు చేశారు.
“రేపు నేను రచించిన మూడు సంస్కృత గ్రంథాలను చక్రవర్తులవారికి అంకితం చేస్తున్నాను. ఇదిగో ఆహ్వాన మంజూష. మీ ముగ్గురూ తప్పక హాజరుకావాలి..”
ఆరోజు కాకతీయ సామ్రాజ్య చరిత్రలో మరపురాని మహోన్నతమైన, చరిత్రాత్మకమైన రోజు. భరతముని తర్వాత సంస్కృతంలో నాట్యకళపై జాయచోడుడు రచించిన ‘నృత్త రత్నావళి’, గేయ సాహిత్యంపై రచించిన ‘గీత రత్నావళి’, వాద్య సంగీతంపై రచించిన ‘వాద్య రత్నావళి’ అనే మూడు మహాగ్రంథాలను ఆవిష్కరించి.. గణపతిదేవునికి అంకితమిచ్చి జాతికి అందించిన మహాపర్వదినం.
గణపతిదేవుడు ఆ పుణ్యదినాన నిండు పేరోలగాన్ని ఏర్పాటుచేసి పూర్తి సభాలంకరణాలతో కిరీటధారియై పట్టమహిషి సమేతంగా అశేష కవిపండితుల నడుమ, వందిమాగధుల స్తోత్రపాఠాలను, జయజయ ధ్వానాలను అందుకుంటూ చారిత్రాత్మకమైన ఆ సమావేశానికి విచ్చేశాడు.
దాదాపు ఐదు వందలమంది మహామహా గ్రంథకర్తలు, కవి గాయక నాట్య పండితోత్తములతో పురోలగం ఇంద్ర సభామందిరంలా భాసిస్తోంది. తెలుగు సామ్రాజ్యం గ్రామగ్రామాన ఉన్న కవులు, కళాకారులు తరలి వచ్చి గ్రంథావిష్కరణ మహోత్సవంలో ఆనందంగా పాల్గొని తాము చరితార్థులమయ్యామని పొంగిపోయారు. ఇతర రాజ్యాల నుంచి జాయచోడుని అంతేవాసులైన సమకాలీనులు ‘సంగీత రత్నాకరం’ రచియించిన శార్ఘ్యదేవుడు, ‘సంగీత సమయసారం’ రచించిన పార్శ్వదేవుడు, ‘దేశీనృత్త సముద్రం’ రచించిన నారదుడు కూడా ఈ చారిత్రాత్మక సంబరంలో పాల్గొన్నారు.
మహాజ్ఞాని, అపర నటరాజు, మహాయోధుడు అయిన జాయచోడుణ్ని తెలుగుజాతి వేనోళ్ల కీర్తిస్తూ గర్వంతో మీసం మెలివేసుకుంది. పండితులు, కవులు, సంగీతజ్ఞులు, నాట్యకారులు, విద్యావేత్తలు.. జాయచోడుని మహా మేధావిత్వానికి వివశులయ్యారు.
తన మూడు గ్రంథాలను పుచ్చుకుని వినమ్రంగా కూర్చున్న జాయచోడునికి పక్కనే ఎవరో కూర్చున్నట్లు.. కాకతి!
మెల్లగా జరిగి ఆమెకు చోటు ఇచ్చాడు. ఇప్పుడు దంపతుల్లా.. జాయచోడుడు, కాకతి!!
ఈ అంకితం అనేది ఇప్పుడు సాహిత్యరంగంలో సరికొత్త విన్నాణం. కృతి కూతురైతే కృతికర్త తండ్రి అవుతాడు. అంకితం పుచ్చుకున్న కృతిగ్రహీత భర్త అవుతాడు.
ఈ వినూత్న కార్యక్రమానికి పౌరోహిత్యం నిర్వహించినవాడు మహాకవి, భారత తెలుగుసేత తిక్కన సోమయాజి అయితే సభా కార్యక్రమాన్ని నిర్వహించినవాడు కవిచక్రవర్తి బిరుదాంకితుడు సూరనశర్మ.
నిత్యమూ గణపతిదేవుడు నిర్వహించే మూడవకొలువును ఈ కవి చక్రవర్తే నిర్వహిస్తాడు. సభాధ్యక్షత వహించేది జాయచోడుడే అయినా సభానిర్వహణ ఈ కవి చక్రవర్తిదే.
పురోహితుల పూజ, వేద పఠనం అనంతరం కవి చక్రవర్తి సభను ప్రారంభించాడు.
“సభాయ నమః! ఈరోజు మనందరి జన్మ ధన్యమైనదిగా భావిస్తున్నాను!”
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284