అయితారం పూట అంగడి నడుత్తాంది. తొవ్వంత ఉస్కె వోత్తె రాలనంత మందున్నరు. అంతట్లకే.. “జరుగుండ్రి.. ఉరుకుండ్రి!” అంట లొల్లి మొదలైంది. నస్రుద్దీన్ గాడిది మీదెక్కి రువ్వడిగ రావట్టిండు. తొవ్వలున్న సామానంత కల్లకల్లమైంది.
ఆల్లీల్లు ఎట్లనో కిందిమీదజేశి.. నస్రుద్దీన్ను, గాడిదిని దొరుకవట్టిండ్రు. “ఏమైంది మియా! అంత ఆగమాగం జేశినవు. గింత రువ్వడిగ ఏడికి వోతున్నవు?” అంట అడిగిండ్రు. నస్రుద్దీన్ జరంత తమాయించుకొని.. “అరె! గా ముచ్చట నన్నెందుకు అడుగుతుండ్రు. నా గాడిదిని అడుగుండ్రి. ఏడికి వోతందో! అవ్వతోడు.. నాగ్గూడ ఎర్కలేదు! నేనెక్కి కూకోంగనే.. అదే రువ్వడి రువ్వడిగ ఉర్కవట్టింది!” అంట అన్నడు.
– పత్తిపాక మోహన్