ఒకపారి నస్రుద్దిన్కు పనివడి పొద్దుగాలనే కొడుకుతోని గల్శి పొరుగూరికి బైలెల్లిండు. కొడుకు శిన్నోడాయె! ఎక్వ నడుసుడు అలవాటు లేదని.. గాడిదిమీద ఎక్కిచ్చి, పక్కన నడువవట్టిండు. కొద్దిగ దూరం బోంగనే.. పక్కూరి మౌల్వీ సాబ్ ఎదురువడ్డడు. ఈళ్లను సూడంగనే.. “ఏం మియా! మీ నాయిన పెద్దోడు.
గాయినెను నడిపిచ్చి, నువ్వేమో గాడిదిమీద పోతున్నవా!?” అంట మందలిచ్చిండు. దాంతోని కొడుకు దిగి.. గాడిదిమీద నస్రుద్దిన్ను కూసుండవెట్టి, ముందు నడిశిండు. అంతట్లకే ఆళ్ల సుట్టం ఎదురై.. “గాడిదికి గాడిది ఉన్నవ్.. కొడుకును నడిపిచ్చి నువ్వు గాడిదిమీద పోతవా!? దిమాకుందా నీకు!?” అంట దిట్టిండు.
గిట్ల గాదనుకుంట.. నస్రుద్దిన్, కొడుకు ఇద్దరు గల్శి గాడిది మీదెక్కిండ్రు. అది తిప్పల వడుకుంట.. మెల్లగమెల్లగ వోవట్టింది. అయ్యాకొడుకులిద్దరూ గాడిది మీదికెక్కి పోవుడు సూశిన ఓ ఆసామి.. “మీ ఇద్దరికీ ఇమానం.. దయా లేదు. దున్నపోతుల్లెక్క ఉన్నరు.
మీకు దిమాక్ ఏమన్న ఉన్నదా!? ఇద్దరూ ఒక్కపారే గాడిదిమీద ఎక్కుతరా!” అంట ఇయ్యరమయ్యర దిట్టిండు. ఎట్లయినా పంచాయితే అయితుందనుకుంట.. గాడిదిని శెరోదిక్కు వట్టుకొని, అయ్యాకొడుకులు నడుసుకుంట వోయిండ్రు. మల్ల సూశినోళ్లంతా.. “గాడిదున్నా నడుతాండ్రు పిచ్చోళ్లు!” అంట నవ్వవట్టిండ్రు.
– పత్తిపాక మోహన్