Ramayanam | మెల్లమెల్లగా కాలేజీ లైఫ్‌కి అలవాటు పడుతుండగానే దసరా సెలవులు వచ్చాయి. కాలేజీలో అందరూ ‘దసరా హాలిడేస్.. దసరా హాలిడేస్’ అంటుంటే.. ‘బతుకమ్మ పండుగ సెలవులను దసరా హాలిడేస్ అంటరేంది?’ అనిపించేది నాకు. ఎందుకో దసరా నాకు మగవాళ్ల పండుగే అనిపిస్తుంది.
ఊర్లలో అయితే మగవాళ్లు కొత్త బట్టలు కుట్టించుకునే ఏకైక పండుగ దసరానే. రోజువారీ తిండి కోసం రోజూ పని వెతుక్కునే గుడిసెల వాళ్ల ముఖాలు కూడా.. ఈ పండుగ రోజుల్లో కళకళలాడుతూ వెలిగిపోయేవి. అందరి ఇళ్లల్లో ఆడపిల్లలు పుట్టింటికి వచ్చేవారు. ఎవరింట్లోనైనా ఆడపిల్లలు ఇంకా రాకపోతే.. “ఏందన్నా! ఇంకా నీ బిడ్డను తోలుకరాలేదా?” అని పక్కవాళ్లే అడిగేవారు. “వాళ్లింట్ల బగ్గ ఎవుసం పని ఉంటది. మా బిడ్డ లేకుంటె ఎల్లదు. ఇగ పండుగ రేపనంగ ఒస్తది” అనే జవాబు వచ్చేది. అది విన్నప్పుడు ‘అయ్యో! ఆడోళ్లకు ఎన్ని పనులు గదా! ఒక్కొక్కళ్లు ఎంత చాకిరి జేస్తరు?’ అనిపించేది.
మా అమ్మ కూడా అంతే! దసరా రోజు చాలామంది కోసం భోజనాలు, పిండి వంటలు సిద్ధం చేసేది. నాన్నెప్పుడూ వంటింటి పనిలో సహాయం చేయగా చూడలేదు. నాన్నేమిటీ.. నేనూ, అక్కా కూడా ఎప్పుడూ ఏవో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవాళ్లం. అమ్మ వంటగదిలోంచి.. “కొంచెం కల్యామాకు తెచ్చియ్యండే, కొంచెం పూదినాకు తీసుక రాండే!” అని అరిచి చెప్పినా వినిపించుకోకుండా ముచ్చట్లలోనే మునిగిపోయేవాళ్లం. ఇక యద్దనపూడి సులోచనారాణి గారి నవల పట్టుకున్నామంటే పరిసరాలే గుర్తుకొచ్చేవి కావు. “ఆ.. సరే సరే” అని మళ్లీ అందులోనే తలదూర్చేవాళ్లం.
ఇంతట్లోనే మా నానమ్మ దేవతలా మా సహాయానికి వచ్చేది. “వాండ్లనెందుకు పిలుస్తవే? పాపం ఏందో పుస్తకాలు చదువుకుంటున్నరు గద! నేను తెచ్చిస్త తియ్యి!” అని అమ్మకు చెప్పేది. “ఆ.. వాండ్లు ఏం జదువుతున్నరో నాకెరుక లేదా? ఏదో నవల పట్టుకొని కూచుంటరు. గీ కల్యామాకు తేవడానికి ఎంత సేపు పడ్తది? ఇచ్చి పొయ్యి మళ్ల చదువుకోరాదా?” అనేది అమ్మ. అమ్మ అంత కష్టపడుతుంటే మేమెందుకు సహాయం చేసేవాళ్లం కాదో ఇప్పటికీ అర్థం కాదు నాకు. అయితే అమ్మ బహుశా ఈ ఇంటి పని చేయాలనే ఒత్తిడి మాపైన ఎప్పుడూ తేలేదు. మేము ఇవన్నీ చేయడం వల్ల చదువుకు ఎక్కడ దూరం అవుతామోననే భయం కావచ్చు. అయితే కథలు, నవలలు చదవొద్దని అమ్మ ఎప్పుడూ చెప్పలేదు.
దసరా సెలవులకు ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యాను. చిన్నాయన వచ్చి నన్ను సికింద్రాబాదు స్టేషన్లో రైలు ఎక్కించారు. కిటికీ పక్కన సీటు చూసుకుని కూర్చున్నానంటే నేను పరిసరాలే మర్చిపోయేదాన్ని. రైలు కదలడానికి ఇంకా బోలెడు టైం ఉండగా.. ఎదురు పట్టాల మీద ఏదో ట్రెయిన్ వచ్చి ఆగింది. అది ఎటునుంచో ఎటో పోయే ట్రెయిన్. సికింద్రాబాదు ఆఖరి మజిలీ కానట్టుంది. ‘మా ట్రెయిన్ ఎప్పుడు కదులుతుందా!?’ అని నేను చూస్తుంటే.. ఎదుటి ట్రెయిన్లో తెరుచుకున్న కిటికీ నుండి ఒకాయన నావైపే చూస్తున్నట్టు అనిపించింది. ఆ చూపులు ఎందుకో మామూలుగా లేవని అనిపించింది నాకు. ఎందుకో.. ఒళ్లంతా గొంగళి పురుగులు పాకినట్టుగా, సూదుల్తో పొడిచినట్టుగా అనిపించింది. అప్పటివరకూ నేను చూసిన మగవాళ్లు ఎవరూ.. నన్ను అలా చూడలేదు. నేను అటువైపు చూడొద్దనుకుంటూనే ఎందుకో చూసాను. వాడు కన్ను కొట్టాడు. ఇంకా చాలా వికృత చేష్టలు చేసాడు. నాకు జుగుప్స కలిగింది. అసహ్యం వేసింది. నేను కూచున్న కిటికీ డోర్‌ను కిందికి లాగాను. ఇంతలో రైలు కదిలింది. చాలాసేపు నన్ను వాడి వెకిలి చూపులే వెంటాడి.. స్థిమితంగా ఉండలేక పోయాను. వెంట తెచ్చుకున్న పుస్తకం చదవడం మొదలుపెట్టాను.
రైలు మా ఊరి దగ్గరికి వస్తున్నకొద్దీ ట్రాక్ పక్కన ఆకుపచ్చని మక్కజొన్న, పజ్జొన్న, సజ్జ చేన్లు కంకులు తొడిగి కళ్లను సేదతీర్చాయి. ఆ వాతావరణం చూడగానే మనసు ఎగిరి గంతులు వేసింది. మనం మన ఇంటివాళ్లను ప్రేమించినట్టే సొంత ఊరినీ ప్రేమిస్తాం కదా! స్టేషన్లో రైలు దిగి నా బిస్తర్ మోసుకుంటూ.. పాన్ డబ్బా రాజయ్య షాపు దాకా వెళ్లాను. బిస్తర్ను అక్కడ పెట్టి నడుచుకుంటూ ఇంటికి వెళ్లాను. నేను ఏ రోజు వస్తానో తెలియదు గనుక స్టేషన్‌కు మనిషి రాలేదు. ఇంటికి పోయాక నాన్న ఎట్లాగో తెప్పిస్తాడు.
మేము పదో తరగతి దాకా ప్రతి బతుకమ్మ, దసరా పండుగలకు బమ్మెర వెళ్లేవాళ్లం. ఆ తరువాత కొంచెం తగ్గుతూ వచ్చింది. ఆ యేడు ఎందుకో అక్క ఫ్రెండు ఇంద్రాణి సెలవుల్లో మా ఇంటికి వచ్చింది. మా కజిన్స్ కూడా అయిదారుగురు వచ్చారు. మా ముచ్చట్ల మధ్య నేను ట్రైన్లో చూసిన వ్యక్తి గురించి చెప్పాను. “అయ్యో! మాకు గూడ ఇట్లాటివి జరుగుతయి. మనం కొంచెం జాగ్రత్తగ ఉండాలె. ఎవ్వడు ఎటువంటోడో తెల్వదు గద. మనం శానమందిమి ఉన్నప్పుడు ఒక తీరు ధైర్యంగ ఉంటది. అప్పుడు ఎవడన్న తిక్క వేషాలు ఏస్తే ఎదిరించాలె, దవుడ పలగ్గొట్టాలె. అదే మనం ఒకళ్లమే ఉన్నమనుకో.. కొంచెం తెలివిగ అక్కడుండకుండ తప్పిచ్చుకోవాలె” అని చెప్పారు. నాకీ విషయాలు కొత్త.
“మన దరిద్రానికి ఒక్కొక్కసారి సిన్మాకు పోతే ఎవడో హౌలాగాని పక్కన సీటు వచ్చిందనుకో! వాడు మన చెయ్యి మీద చెయ్యి ఏస్తే ఏం జేస్తవు?” అనడిగింది లక్ష్మి. “ఎహె! గట్లెందుకు ఏస్తడు?” అన్నాను నేను. “సరే! చెయ్యేసిండనుకో.. నేనేం జేస్త తెల్సా? నా బ్యాగులోంచి మెల్లగ ఓ గుండు సూది తీసి కుచ్చుత. దెబ్బకు చెయ్యి ఎనుకకు తీసుకుంటడు!” అంది. నేనలాగే వింటున్నాను. “నాక్కూడ ఒకసారి అట్లనే అయింది. నేను సిన్మా చూసుట్ల మునిగి ఉంటె.. నా పక్కకు కూచున్నోడు నా కాలు తొక్కుడు, కాలుకు కాలు ఆనిచ్చుడు జేసిండు. నేను నా చెప్పు కాలు తోటి గట్టిగ తొక్కిన. వాడు గిజగిజలాడుతుంటే.. ‘మళ్ల ఇట్లనే సతాయించినవనుకో.. నా చెప్పు తీసి నీ చెంప పలగ్గొడుత!’ అని చెప్పిన. దెబ్బకు బంజేసిండు” అన్నది మా సరస్వతక్క. ‘అబ్బో! ఇట్ల ఎన్ని చూడాల్నో!’ అనుకున్నాను. ఆ సెలవుల్లో అలా ఓ కొత్త పాఠం నేర్చుకున్నాను.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి