Ramayanam | కాలేజీకి రెండు రోజుల సెలవులు ఎప్పుడు వచ్చినా నేను గౌలీగూడాలో పద్మ చిన్నమ్మ వాళ్లింటికి వెళుతూ ఉండేదాన్ని. మొదట్లో ఒకటి రెండు సార్లు లక్ష్మి వచ్చి నన్ను తీసుకువెళ్లినా ఆ తరువాత నేను నారాయణగూడా నుండి బయల్దేరి వచ్చిరాని హిందీలో రిక్షావాలా ‘దేడ్ రూపై’ అంటే నేను ‘అడే రూపై’ ఇస్తానని తెలిసీ తెలియని బేరం ఆడుతూ గౌలీగూడాకు వెళుతుండేదాన్ని.
హైమక్క, లక్ష్మితో ముచ్చట్లు, గిరిజతో ఆటలు, అన్నయ్యలతో నవ్వులు, చిన్నమ్మ ప్రేమ ఇవన్నీ నాకు బాగుండేవి. అయితే 1975 ఆఖరికి వచ్చేసరికి వాళ్ల ఆర్థిక పరిస్థితి కొద్దిగా దిగజారుతున్నట్లు నా తెలిసీ తెలియని బుర్రకు అర్థం అయింది. నిజాం రాజుకు ఏదో వైద్యం చేయడమో, ఎవరో బందిపోటు దొంగను పట్టి ఇవ్వడమో చేసినందుకు పూర్వం వాళ్ల వంశీకులకు ‘రాజా’ అనే బిరుదుతో బాటు హైదరాబాదు నగరంలోని అల్వాల్, మోతీ నగర్, బోరబండ, హరి బౌలి లాంటి ప్రాంతాల్లో వంద ఎకరాల భూమిని నిజాం ఈనాంగా ఇచ్చాడని చెప్పుకొనేవారు. పద్మ చిన్నమ్మ తండ్రి రాజా లక్ష్మారావు గారు చనిపోయారు గనుక ఆ ఆస్తికంతటికీ ఆమె, వాళ్లమ్మ రాజ్యలక్ష్మీ దేవి వారసులుగా ఉండేవారు.
ఈ క్రమంలో ఓ రాజకీయ నాయకుడు, మరో పైరవీకారు, ఇంకో వకీలు కలిసి వాళ్లను బాగా మోసం చేసారని అక్కడి మాటల ద్వారా తెలిసింది. మొత్తానికి ఆ సమయంలో వాళ్లకు ఆస్తి సంబంధమైన చిక్కులు చాలా కలిగాయి. అవన్నీ దేవన్న, చిన్నమ్మ చూసుకునేవారనుకుంటా. ఒక వారాంతంలో నేను వాళ్లింటికి వెళ్లేసరికి అందరూ హడావుడిగా ఉన్నారు. ఇల్లంతా శుభ్రంగా బూజులు దులిపేస్తున్నారు. వస్తువులన్నీ నీట్గా సర్దుతున్నారు. ‘మామిడాకులు ఇప్పుడా, రేపా? పూలదండలు ఇప్పుడా, రేపా? వేప మండలు ఇప్పుడా, రేపా?’ అన్న విషయం మీద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఇల్లంతా కోలాహలంగా ఉంది.
ఏంది హైమక్కా? ఇంట్ల ఏమన్న ఫంక్షనా? అని హైమక్కను అడిగాను.
‘అయ్యో! నీకు తెల్వదానే? అమ్మ ప్రతి ఆదివారం పొద్దున్నే ఏం తినకుండ తాగకుండ నింబోలీఅడ్డాకు పోతది గదా!’ అన్నది హైమక్క ఒకటో తరగతి పిల్లను టెంత్ క్లాసోళ్లు చూసినట్టు చూస్తూ.
‘నాకు ఏమన్న తెలిస్తె కదా!’ మనసులో అనుకుని ‘నింబోలీఅడ్డాల ఎవరున్నరు? ఎందుకు అక్కడికి భోజనానికి పిలిచిన్రా ఎవరన్న?’ అని మళ్లీ అడిగాను.
‘అయ్యో! నీకు తెల్వదానే? అక్కడ అమ్మ ఉంటది గదా! గందుకని పొద్దున్నే పోతది’ జవాబిచ్చింది.
‘అమ్మెవరు? అమ్మమ్మ ఇక్కడ్నే ఉన్నది గద, ఇంక అమ్మ ఎవరు?’
‘అయ్యో, నీకు తెల్వదానే! కమలమ్మ అని ఉంటది చూడూ! కళ్లు సగం మూసుకుని’ ఎంతో భక్తిగా ఆ పేరు అనడమే అపరాధంలా కుడి చేతిని ఓసారి రెండు చెంపలకూ ఆనించుకుని చెప్పింది.
కమలమ్మ అంటే కమలమ్మ చిన్నమ్మనా? ఆమె గిక్కడెందుకుంటది? మా ఇంకో చిన్నాయన భార్య పేరు కమలే. ఈ సారి ‘అయ్యో, నీకు తెల్వదానే’ అనలేదు హైమక్క. నాకు ఈ విషయంలో ఏ మాత్రం జ్ఞానం లేదని తెలుసుకున్నదై… గొంతు తగ్గించి ‘ఇగో చెల్లె, మళ్ల ఎవ్వరితోని అనొద్దు, అన్నా గూడ నేను జెప్పిన్నని అస్సలు అనొద్దు!’ అన్నది.
ఆ సస్పెన్స్ ఏదో బద్దలవ్వడానికి ఏం చేయాలన్నా సిద్ధంగా ఉన్నాను నేను. అందుకని సరే, ఎవ్వరికి తెల్సినా నాతోని అయితె తెల్వదు, సరెనా! అన్నాను.
అప్పుడు హైమక్క సూతుడు శౌనకాది మునులకు కథ చెప్పినట్టు నాకు మొత్తం విషయం సవిస్తరంగా వివరించింది. దాని ప్రకారం కమలమ్మ అనే మధ్యవయసు తమిళ మహిళ ‘కరుమారి అమ్మన్’ భక్తురాలు, ఉపాసకురాలు. ఈ ఉపాసన అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆమెకు చిన్నమ్మ ఎలా తెలుసో లేక చిన్నమ్మకు ఆమె గురించి ఎలా తెలిసిందో హైమక్కకు కూడా తెలియదు. కానీ, తను చెప్పినట్టు చేస్తే అన్ని సమస్యలూ దూది పింజల్లాగానో లేక ఇంకా అంతకంటే తేలికైన వాటిలాగానో తేలిపోతాయని ఆమె చెప్పిందట. అందువల్ల ప్రతి ఆదివారం ఉదయం చిన్నమ్మ ఆ కమలమ్మ ఇంటికి వెళ్లి మధ్యాహ్నం వస్తూ ఉండేది. వెళ్లేటప్పుడు బోలెడు పూలు, పళ్లు, పూల దండలు, కొబ్బరి కాయలు, నిమ్మకాయలు, అరిటాకులు, ఇంకా పూజా ద్రవ్యాలు, తినుబండారాలు కారు నిండా తీసుకుని వెళ్లేది.
ఇక్కడ పద్మ చిన్నమ్మ గురించి ఒక మాట చెప్పాలి. దాతృత్వం విషయంలో ఆమె మహానటి సావిత్రి అంతటిది. మిగతా వాటిల్లో పోలిక లేదనుకోండి. ఆమె అలా చీరలు, నగలు, ఇంకా విలువైన వస్తువులు ఎన్నెన్నో ఇచ్చేస్తూ ఉండేది. ఇక అప్పట్లో ఈ కమలమ్మకు ఎన్ని ఇచ్చిందో చెప్పలేము.
‘ఏందీ, ముచ్చట్లు పెడుతున్నరు, పూలు అల్లాలే! శానా ఉన్నయి’ అని ఎవరో పిలవడంతో మేము కదిలాం. ‘నీకు పూలు అల్లుడు ఒస్తదానే?’ అని లక్ష్మి అడిగింది. నాకు అప్పటిదాకా పూలు అల్లడం రాదు. ఊర్లో మా ఇంట్లో గంపల కొద్దీ మల్లెలు, చేమంతులు, కనకాంబరాలు పూసినా నేను గానీ, అక్క గానీ బడికి వెళ్లేటప్పుడు పూలు పెట్టుకునేవాళ్లం కాదు. నానమ్మ సెలవులప్పుడు పూలు దండగా గుచ్చి మాకిస్తే పెట్టుకునేవాళ్లం. అంతే! ఎప్పుడూ పూలల్లే అవకాశమే రాలేదు. అమ్మ చేద బావిలోనుంచి బిందెల కొద్దీ నీళ్లు చేది భుజాన మోస్తూ చెట్లకు పోసి పెంచేది. అమ్మ, నానమ్మ గుర్తొచ్చి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
‘ఏ.. గీ దీనికే ఏడుస్తరా? నేను నేర్పిస్త తియ్యి’ అని నేను పూలు అల్లడం రానందుకే ఏడుస్తున్నాననుకుని హైమక్క అంది. మొత్తానికి ఒక్క రోజులో పూలల్లడం నేర్చుకున్నాను.
వాళ్లు రాములు అనే పనబ్బాయిని పంపి మొజాంజాహీ మార్కెట్ నుంచి దడల లెక్కన పూలు తెప్పించేవాళ్లు. దడ అంటే కుప్ప అనుకుంటా, ఒక్కో దడలో రెండున్నర కిలోలు అన్నట్లు జ్ఞాపకం. మేము కబుర్లు చెప్పుకొంటూ ఓ రెండు గంటలపాటు ఆ పూలన్నీ అందమైన దండలు అల్లేవాళ్లం.
అంత డబ్బు, శ్రమా వెచ్చించగా వచ్చిన ఆ పెద్ద దండలన్నీ కారులో పెట్టుకుని చిన్నమ్మ తీసుకెళ్తుంటే బాధ కలిగేది. అప్పుడప్పుడూ చిన్నమ్మతో ఆనందన్న గానీ, హైమక్క గానీ, లక్ష్మి గానీ వెళ్లేవారు. ఇంతకూ ఆ మర్నాడే దేవుడమ్మ అనే వ్యక్తిని చూడ్డం కుదిరింది నాకు.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి