Ramayanam | మా కాలేజీలో క్లాసులు ఉదయం తొమ్మిది నుండీ సాయంత్రం నాలుగు వరకూ ఉండేవి. మొదటి వారంలోనే పుస్తకాలు, రికార్డ్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కొనుక్కున్నాను. క్లాసులు మొదలవగానే మాకు టైం టేబుల్ ఇచ్చారు.
పొద్దుటి నుండీ సాయంత్రం దాకా ఒకే క్లాసులో ఉండే అలవాటున్న నాకు.. ఒక్కో క్లాసుకు ఒక్కో రూంకు తిరగడం భలే సరదాగా ఉండేది. పైగా మా కాలేజీ బిల్డింగ్ మూడు అంతస్తుల మెట్లు ఎక్కడం.. దిగడం ఎంతో ఉత్సాహంగా అనిపించేది. వారంలో నాలుగు రోజులు ఉదయం పూట ల్యాబ్ ఉండేది. ఫిజిక్స్ సరే.. అన్నీ పరికరాలు, కొలతలు ఉండేవి కనుక బాగుండేది. పైగా మాకు బడిలో ఏ ఒకటో రెండో తప్ప ప్రాక్టికల్స్ చేసి చూపేవారు కాదు. స్కూల్లో పరికరాలు ఉండేవి కావేమో పాపం! ఇక్కడ అన్నీ స్వయంగా చేయడం బాగనిపించేది. ఫిజిక్స్ నీరజ మేడమ్ అంటే క్రేజ్. ఆమె అందంగా ఉండటమే కాదు, రోజూ ఫియట్ కారులో వచ్చేవారు. ఆవిడ తన క్లాస్‌మేట్‌నే ప్రేమించి పెళ్లి చేసుకుందనీ, ఆయన ఇంకా అందంగా ఉంటాడనీ మా క్లాసు అమ్మాయి చెబితే.. ‘అంత పర్సనల్ విషయాలు వీళ్లకెట్లా తెలిసాయా!?’ అనుకున్నాను.
కెమిస్ట్రీ ల్యాబ్‌లో ప్రయోగాలు చేయడం, వాటి ఫలితాలు చూడటం ఉత్సాహంగా ఉండేది. కానీ, కొన్ని వాయువులు, మరికొన్ని ద్రావణాలు ఘాటైన వాసనతో వెగటు పుట్టించేవి. కడుపులో తిప్పేది కూడా. ముఖ్యంగా హైడ్రోజన్ సల్ఫైడ్ గురించి ‘కుళ్లిన కోడిగుడ్ల వాసన’ అని చదువుకోవడమే గాని.. చూసింది అదే మొదలు. అంతదాకా కోడిగుడ్లు కుళ్లితే ఎలా ఉంటుందో తెలిస్తే గదా! మాకు రత్నమాల మేడమ్ కెమిస్ట్రీ చెప్పేవారు. ఆమె ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్ కానీ, పాఠం చెప్పడం సరిగ్గా రాదని మా క్లాస్మేట్ ఒకమ్మాయి చెప్పింది. మేడమ్ కాస్త ముద్దముద్దగా మాట్లాడేవారు గానీ, ‘ఒక లెక్చరర్ని అట్లా కామెంట్ చేయొచ్చా!?’ అని బోలెడు ఆశ్చర్యపోయాను.
రత్నాకరం మేడమ్ ఇంగ్లిష్ బోధించేవారు. ఆమె గంభీరంగా, చాలా హుందాగా కనిపించేవారు. ఒక్క తెలుగు మాట కూడా మాట్లాడకుండా, చాలాబాగా అర్థం అయ్యేలా పాఠాలు చెప్పేవారు. తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లిష్ అంటే భయపడ్తారు. కానీ, ఆమె క్లాసు చాలా ఉత్సాహంగా ఉండేది. “తెలుగు మీడియం అయినా నువ్వు ఇంగ్లిష్ ఒక్క తప్పులేకుండా రాస్తున్నావ్, గ్రామర్ కూడా బాగా వచ్చు. ఇక ఫ్ల్లూయెంట్గా మాట్లాడ్డం నేర్చుకో!” అని నన్నెప్పుడూ మెచ్చుకునేవారు.
సంస్కృతం క్లాసులు కృష్ణప్రియ మేడమ్ తీసుకునేవారు. ఆమె సన్నగా, నాజూగ్గా, చిన్నపిల్లలాగా ఉండేవారు గానీ, పాఠం బాగా చెప్పేవారు. రఘువంశము, కుమార సంభవము, కాళిదాసు మేఘసందేశము, భర్తృహరి సుభాషితాలు వంటివి మా పాఠ్యాంశాలు. అప్పటిదాకా సంస్కృతం తెలుగు లిపిలోనే చూసిన నాకు.. హిందీ లాంటి దేవనాగరి లిపిలో సంస్కృతం నేర్చుకోవాల్సి రావడం కొంత ఇబ్బందిగా అనిపించేది. అయితే చాలా సన్నటి పుస్తకం ఉండేది. తెలుగు తీసుకున్నవాళ్లు మాతో.. “మీకేంటోయ్.. సిలబస్ బాగా తక్కువ. ఈజీగా పాస్ అవొచ్చు” అనేవారు. కానీ, మా కష్టాలు మాకుండేవి.
ఇక జువాలజీ చెప్పే మైథిలి మేడమ్ కొంచెం గంభీరంగా ఉండేవారు. ఆమెను చూస్తే ఎందుకో గానీ, నాకు భయమేసేది. ఓసారి ప్రాక్టికల్ క్లాసులో మేము ఏదో వర్క్ చేస్తున్నాం. కాసేపయ్యాక ఒక్కొక్కరినీ పిలిచి మేడమ్ ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంతలో నన్నూ పిలిచారు. నేను మామూలుగా దగ్గరికి వెళ్లాను. నా రఫ్ నోట్‌బుక్ చూపించి.. “ఇదేమిటి?” అనడిగారు మేడమ్. నా పుస్తకాలు చూసారని అర్థమైంది.
ఏ పీరియడ్‌లో ఏ సబ్జెక్టో, అప్పుడు లెక్చరర్ ఎవరో, పేర్లతో సహా నేను నోట్ చేసుకున్న టైం టేబుల్ గురించి అడుగుతున్నారని ‘టైం టేబుల్’ అని చెప్పాను. “వీళ్లంతా ఎవరు? నీ ఫ్రెండ్సా?” అనడిగారు మైథిలి మేడమ్ సీరియస్‌గా. నాకు అప్పటిదాకా సూటిగా కాకుండా వేరేలాగా కూడా మాట్లాడితే ఏం జవాబివ్వాలో కూడా తెలియదు.
“నిన్నే అడిగేది!” అన్నారు మేడమ్ మళ్లీ. మేడమ్స్ పేర్లను చూపిస్తూ అడిగారు గనుక.. “కాదు లెక్చరర్స్!” అని జవాబిచ్చాను. “మరి నీ స్నేహితులైనట్టు నీరజ, కృష్ణప్రియ అని రాసుకున్నావేంటి?” అన్నారు. ఆ టైంలో నా మొహం ఎలా ఉందో నేను చూసుకోలేను కదా! బిక్కమొహం వేసే ఉంటాను. “మిసెస్ నీరజ, మిసెస్ మైథిలి.. అలా రాయాలి. తెల్సిందా?” అన్నారు. నేను తలూపాను. వెంటనే.. “నీ రైటింగ్ చాలా బాగుంది, కీప్ ఇట్ అప్” అన్నారు.
జువాలజీ ల్యాబ్‌లో బొద్దింకలను, వానపాములను, కప్పలను డిసెక్షన్ చేస్తున్నప్పుడు కడుపులో తిప్పినట్లయ్యేది. మా క్లాసులో సరస్వతి అనే అమ్మాయి రెండుసార్లు జువాలజీ ప్రాక్టికల్స్‌లో వాంతి చేసుకుని.. “వామ్మో! నేనింక ఈ ల్యాబ్‌కి రాలేను. నేను బ్రాంచ్ మారుతాను. నా వల్ల కాదు” అని వాళ్ల అమ్మానాన్నల్ని ఒప్పించి ఆర్ట్స్ బ్యాచ్‌కి మారిపోయింది. ఆఫీసులో దేవకి మేడమ్, సుమిత్ర మేడమ్ ఉండేవారు. మిగతా వాళ్ల పేర్లు ఎందుకో గుర్తులేవు.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి