Ramayanam | నేనేదో మా స్కూలులో గొప్పగానీ, ఇక్కడ ఏమీ కానని కాలేజీకి వచ్చిన కొన్నిరోజులకే తెలిసింది. మా స్నేహితుల్లో, బంధువుల్లో నేను ఆముదం చెట్టుని.. అంతే! మా వరదారెడ్డి సారు నన్నెప్పుడూ ‘డాక్టరమ్మా!’ అని పిలిచేవారు. అందుకని కొంతా, సీటు వచ్చింది కాబట్టి బైపీసీనే తీసుకున్నాను.
నిజానికి నేను బాగా చదివి సీటు తెచ్చుకున్నా.. నన్ను మెడిసిన్ చదివించే స్తోమత మా వాళ్లకు ఉందో లేదో నాకు తెలియదు. పైగా అప్పట్లో అమ్మాయిలు ఇంజినీరింగ్‌లో చేరడం ఎక్కువగా లేదు.
నేను లెక్కలు బాగా చేసేదాన్ని. నాకు అన్నిటికన్నా టీచింగ్ ఇష్టం. కానీ, అప్పట్లో ఎక్కడికైనా వెళ్తే, మొదట అడిగే ప్రశ్న.. ‘ఏం చదువుతున్నవ్?’ అనే! ‘ఇంటర్ల చేరిన’ అని నేను చెప్పిన వెంటనే.. ‘ఏం తీసుకున్నవ్?’ అనేవారు. బైపీసీ అంటేనే కొంచెం గొప్పగా ఉండేది. ఎంపీసీ మగపిల్లల గుండుగుత్తా కోర్సు. ఇక సీఈసీ కాస్త ఫర్వాలేదు కానీ, హెచ్ఈసీ అనగానే.. ‘అంతేనా?’ అన్నట్టు చూసేవారు. ఎవరు ఏమనుకున్నా మా అక్క ఆ ముందు సంవత్సరం హెచ్ఈసీనే ఎంచుకుంది. మా క్లాస్‌మేట్స్‌లో మగపిల్లలైతే ‘ఏం జేస్తున్నవ్!?’ అంటే.. ‘కాలేజ్ జేస్తాన’ అనేవారు. ‘కాలేజ్ జేసుడు ఏంది? కాలేజీని వీళ్లు తయారు జేస్తరా?’ అనుకునేదాన్ని.. అక్కడికి నా తెలుగేదో బ్రహ్మాండంగా ఉన్నట్టు.
మా క్లాసు ఆడపిల్లల్లో రేవతి, వనజ కుమారి, నేను మాత్రమే కాలేజీలో చేరాం. మిగతావాళ్లంతా ఇళ్ల దగ్గరే ఉండిపోయారు. కొందరికి పెళ్లి ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. రేవతి వాళ్ల బాబాయి వరవరరావు (ప్రముఖ కవి, సృజన సంపాదకులు, విరసం సభ్యులు) గారి ఇంట్లో ఉంటూ వరంగల్ కాలేజీలో చేరింది. మేమిద్దరమూ తరచూ ఉత్తరాలు రాసుకునేవాళ్లం. అయితే నేనొక్కదాన్నే ఇంత దూరం హైదరాబాద్ వచ్చాను. నాతో ఎవరైనా తెలిసిన స్నేహితులుంటే బాగుండు, పోనీ నేనైనా వరంగల్‌లోనే ఎవరింట్లోనైనా ఉంటే బాగుండు అనిపించేది.
నేను ద్వితీయ భాషగా సంస్కృతం తీసుకున్నాను. అది కూడా నా ఇష్టమో, నిర్ణయమో కాదు. ఆప్షన్ ఇచ్చేటప్పుడు పక్కన ఎవరో అమ్మాయికి వాళ్ల నాన్న ‘సాంస్క్రిట్ తీసుకోమ్మా! తక్కువ సిలబస్ ఉంటుంది. మార్కులు కూడా లిబరల్గా ఎక్కువ వేస్తారట’ అని చెబుతుండగా విన్నాను.
బడిలో చదువుకుంటున్నప్పుడే సదాశివరావు సారు చెప్పగా సంస్కృత భాషా పరీక్షలు రాసి ‘ప్రారంభిణి, ప్రవేశిక’ అనే సర్టిఫికెట్లు కూడా తెచ్చుకున్నాను. మరో కారణం కూడా ఉంది. మన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గారి సతీమణి పేరిట బర్కత్‌పురాలో సత్తెమ్మ నరసింహారావు కాలేజీ ఉండేది. ఆ కాలేజీ సరిగ్గా నడవకపోతే రెడ్డి సొసైటీ వాళ్లే టేకోవర్ చేసి.. దాన్ని ఆర్ట్స్-కామర్స్ క్యాంపస్‌గా మార్చారు. తెలుగు క్లాసులు అక్కడే జరిగేవి. ప్రతిసారీ ఒక్క తెలుగు క్లాసు కోసం అంతదూరం నడిచి వెళ్లాలని కూడా.. మా సైన్సు వాళ్లమంతా సంస్కృతం ఎంపిక చేసుకున్నాం.
హైదరాబాద్‌లో ఉన్న ధనవంతుల అమ్మాయిల్లో ఎక్కువ మంది మా కాలేజీలోనే చేరేవారని నాకు తెలిసింది. ఇంగ్లిష్ మీడియంలో చదివే మా బ్యాచ్‌మేట్ అనితా పటాలే అనే అమ్మాయి రోజూ కారులోనే కాలేజీకి వచ్చేది. రంగురంగుల బెల్‌బాటమ్ ప్యాంట్లు, పూలపూల పొట్టి షర్టులు వేసుకుని రోజొక రకం బ్యాగు వేసుకుని బాగా తయారై వచ్చేది. తన క్లాసువాళ్లను.. ‘వాట్ రే! విచ్ క్లాస్ నౌ రే!’ అనడుగుతూ ఉండేది. అలా ఫ్యాషన్ పరేడ్‌కు వచ్చినట్టుగా కాలేజీకి వచ్చే అమ్మాయిలు పదుల సంఖ్యలో ఉండేవారు.
మాకు బడిలో యూనిఫామ్ ఉండేది. ఏడాదికి రెండో, మూడో కొత్త బట్టలు కొనేవారు. అంతే! వాటిని ఏదైనా ప్రత్యేక సందర్భంలోనో, పండుగలకో, పెళ్లిళ్లకో, ఊరెళ్లినపుడో వేసుకునేవాళ్లం తప్ప.. ఇన్ని బట్టలు ఉండేవే కావు. ఒక సాదాసీదా లంగా జాకెట్ వేసుకుని కాలేజీకి వెళ్తున్నప్పుడు అనితా పటాలే లాంటి వాళ్లు ఎదురైతే.. నాకు ఎంతో సిగ్గుగా ఉండేది. అలా ఎందుకు అనిపించేదో తెలియదు గానీ, ఏదో తప్పు చేసినట్టు ‘పక్కకు జరిగి పోదామా!?’ అనిపించేది. వాళ్ల చూపులు నన్ను గుచ్చుతున్నట్టు అనిపించేవి. ఇప్పుడైతే వంద నీతివాక్యాలు చెబుతాను గానీ, అప్పుడు ‘ఎవరి స్తోమత వారిది. మన ఆర్థిక స్థాయి మనది. దానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు’ అని నాకు ఎందుకు అనిపించలేదో ఇప్పటికీ అర్థం కాదు. పైగా నా మనసు విప్పి మాట్లాడుకోవడానికీ, నా భావాలు పంచుకోవడానికీ, ఆ సమయంలో మోరల్ సపోర్ట్ ఇవ్వడానికీ నాకు దగ్గరి స్నేహితులూ లేరు.
మాధవీలత అని నా క్లాస్మేట్ ఉండేది. వాళ్లది కరీంనగర్ జిల్లాలోని గంభీరావు పేట. నాలాగే తెలంగాణా పల్లెటూరి భాష మాట్లాడేది. తను ఓరోజు ఫ్యాషన్కో ఏమోగానీ.. టెంత్‌లో వేసుకునేలాంటి ఒక ఫ్రాక్ వేసుకుని వచ్చింది. ఆమెను హాస్టల్లో ఉండే సీనియర్లు బాగా సతాయించారు. ‘వామ్మో! ఇక్కడ మంచిగ చదువుడే కాదు, ఆడంబరంగా కనబడాలె కూడానా? మరి లేనివాళ్లకు ఎట్ల?’ అనిపించేది నాకు. లోలోపల చెప్పరాని దిగులు వేసేది.
అలా.. నా స్వభావానికి విరుద్ధంగా, నా పదమూడేళ్ల వయసులో (సర్టిఫికెట్లలో మాత్రం పదిహేను).. నేను మెల్లిగా అంతర్ముఖురాలిని కావడం మొదలయింది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి