Ramayanam | కాలేజీకి వెళ్లి వస్తున్నా, చదువుకుని నోట్స్ రాసుకుంటున్నా, చిన్నాయన పిల్లల్ని ఎత్తుకుని ఆడించినా, నాయనమ్మతో అప్పుడప్పుడూ మార్నింగ్ షోలు చూస్తున్నా, సాయంత్రం పూట మొక్కలకు నీళ్లు పెట్టినా, చిన్నమ్మలతో కబుర్లు చెప్పినా.. ఏదో తెలియని దిగులు నాలో గూడు కట్టుకోసాగింది. అది ఎందుకో నాకు అప్పటికప్పుడు తెలియకపోయినా.. తరువాత అర్థమైంది. అదేమిటంటే నా ఈడు పిల్లలు లేకపోవడం వల్లనని.
నిజానికి నాయనమ్మ వాళ్లింట్లో నన్ను బాగా చూసుకునేవారు. కానీ, నా ఆలోచనలు, మనోభావాలు పంచుకోవడానికి ఓ మంచి స్నేహితురాలు లేదు. సిటీలో అందరూ ఎందుకో కొన్ని పరిధుల వరకే ఉండేవారు తప్ప.. అది దాటి బయటికి వచ్చేవారు కాదనిపించేది. ఎవరు మాట్లాడినా హృదయపూర్వకంగా ఉండేవి కావు ఆ మాటలు. ఓ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికొచ్చేసరికి మా కజిన్ లక్ష్మి వచ్చి నా కోసం ఎదురుచూస్తోంది. “నాయనమ్మా! నేను రమను తీస్కపోతా! అమ్మ తీస్కరమ్మన్నది. రేపు, ఎల్లుండి సెలవులే గద!” అని నాయనమ్మను అడిగింది. ఆ సోమవారం ఏదో సెలవు కలిసొచ్చింది. “ఏమో! దానిష్టం.. మరి ఏదన్న రాసుకునేదో, చదువుకునేదో ఉన్నదో ఏమో! దాన్నే అడుగు!” అన్నది నాయనమ్మ. ఎందుకోగానీ నేను వెళ్లడం నాయనమ్మకు ఇష్టం లేదనిపించింది. మొత్తానికి నన్ను వెంటబెట్టుకుని గౌలిగూడలోని వాళ్లింటికి తీసుకెళ్లింది లక్ష్మి.
నేను అదివరకు సెలవుల్లో చాలాసార్లు అక్కతో కలిసి వాళ్లింటికి వెళ్లినా, ఈసారి ఎందుకో ప్రత్యేకంగా అనిపించింది. లక్ష్మీ వాళ్లమ్మ పద్మ చిన్నమ్మ (తన పూర్తిపేరు పద్మాసనీ దేవి)కి నేనంటే ఇష్టం. మా ఊరికి, మా అమ్మకు సంబంధించిన ఏవేవో ముచ్చట్లు నన్ను అడిగేది. అమ్మంటే కూడా తనకు బాగా ఇష్టం. సొంత అక్కలాగే చూసేది. నేను పొరపాటుగా కూడా నారాయణగూడా నాయనమ్మ వాళ్లింటి విషయాలు అక్కడ చెప్పేదాన్ని కాదు. ఇక్కడికొచ్చాక వీళ్లు అడిగినా కూడా.. ‘ఉన్నరా.. అంటే ఉన్నరు! బాగున్నరా అంటే బాగున్నరు’ అంతే! అది మా అమ్మ ట్రయినింగ్ మరి!
లక్ష్మి, హైమక్క, గిరిజ, వాళ్ల అన్నయ్యలు ఆనందన్న, దేవన్న, పద్మ చిన్నమ్మ, లక్ష్మీ వాళ్ల అమ్మమ్మ రాజ్యలక్ష్మీ దేవి వీళ్లందరితో ఇల్లంతా సందడిగా ఉండేది. నేను వెళ్లగానే ఎక్కువగా కారం తిననని పద్మ చిన్నమ్మ నాకోసం పక్కనే ఉన్న గజానన్ స్వీట్ హౌస్ నుండి నమక్ పేడాలు, ఏదైనా స్వీటు తెప్పించేది. లక్ష్మీ వాళ్ల నాన్న (మా అమ్మకు మేనమామ కొడుకు) సగం రోజులు హైదరాబాద్‌లోనూ, మరో సగం రోజులు బమ్మెరలోనూ ఉండేవారు. వాళ్లింట్లో అందరూ ఒకే దగ్గర కూచొని నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే బావుండేది.
నేనూ, అక్కా ఇద్దరమే కదా! ఇట్లా చాలామంది ఉంటే ఎంత బాగుంటుంది? ముఖ్యంగా అన్నయ్యలుంటే ఇంకా బాగుంటుంది అనిపించేది. పద్మ చిన్నమ్మ నన్ను ‘రామయ్యా’ అని పిలిచేది ఎందుకో! ఆమె చేతికి ఎముకే లేదు అన్నట్లుగా.. మనుషులు నచ్చితే వాళ్లను నెత్తిన పెట్టుకునేది. వాళ్ల కోసం ఎంత ఖర్చయినా పెట్టేది. చాలా ప్రేమగా ఉండేది. ఆమె లావుగా ఉన్నా.. కళగా ఉన్న ముఖంతో బాగుండేది. వాళ్ల నాన్న రాజా లక్ష్మారావు జాగీర్దారు అప్పటికే చనిపోయారు. హైదరాబాద్‌లో వాళ్లకు చాలా ఆస్తులుండేవని చెప్పుకొనేవారు. వాళ్లింట్లో ఆ వైభవం, ఐశ్వర్యం కనిపించేవి. అయితే ఆ సౌకర్యాలను, విలాసాలను ఏకైక కూతురైన తను మాత్రమే అనుభవించకుండా అందరికీ పంచాలని చూసేది. కోపం, పంతం వస్తే కూడా అంతే తీవ్రంగా ఉండేది.
తనకు కాళ్లు నొప్పులుగా ఉండేవేమో! కింద ఓ చాపేసుకుని పడుకుని.. “కాళ్లు తొక్కురా రామయ్యా!” అనేది. నేను కాళ్లు తొక్కుతూ పక్కనే ఉన్న ఇనుప బీరువాకు ఫిక్స్ అయిన నిలువుటద్దంలో చూసుకుంటూ ఉండేదాన్ని. అందరూ తనని చూసి భయపడేవారు గానీ.. నాకు మాత్రం చిన్నమ్మ దగ్గర మహా చనువు ఉండేది. ఎంతగా అంటే నేను జోకులు వేసేటంత. “అగో! నీకిష్టమైన బిడ్డ ఒచ్చింది. జోకులు చెప్పిచ్చుకో! కాళ్లు తొక్కిచ్చుకో!” అని లక్ష్మివాళ్లు ఆమెను ఏడిపిస్తుండేవారు. ఎక్కువగా నవ్విస్తే ఆ రోజు మాకు సినిమా గ్రాంటెడ్! తనే డబ్బులిచ్చి రాములు అనే మనిషిని తోడిచ్చి పంపేది. మా అమ్మ తరువాత నన్ను అంతగా గారాబం చేసిన మనిషి తనే! అందుకే.. గౌలీగూడకు వెళ్లడం అంటే నాకు ఇష్టంగా ఉండేది.
ఓసారి నాన్న ఏదో కోర్టు పనిమీద రమణయ్యను తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. మొదటగా నన్ను చూసి తరువాత కోర్టుకు వెళ్లి అక్కడినుంచి గౌలిగూడలోని లక్ష్మీ వాళ్లింటికి వెళ్లాడు. పెద్దగా, వసతిగా ఉంటుందని బంధువుల్లో ఎవరు హైదరాబాద్‌కు వచ్చినా.. గౌలిగూడలోని లక్ష్మీ వాళ్లింటికే వచ్చేవారు. శనివారం కాలేజీ అవగానే నేను కూడా వెళ్లాను. నాన్న ఎప్పుడూ ఎవరింటికీ వెళ్లడు కనుక, నాన్న వచ్చాడని వాళ్లు బాగా మర్యాద చేసేవారు. ఆదివారం ఊరికి వెళ్లిపోతానని నాన్న చెబితే అక్కడే ఉన్న దేవానంద్ అన్నయ్య (మేము దేవన్న అనేవాళ్లం) నాన్నతో.. “ఇవాళ ఒక్కరోజు ఉండండి పెదనాయనా! సాయంత్రం రవీంద్రభారతిలో డాన్స్ ప్రోగ్రాం ఉన్నది. చూసి ఎల్లుండి పోదురు గానీ!” అన్నాడు. “నేను డాన్సులు ఏం జూస్త!” అన్నాడు గానీ.. దేవన్న పదేపదే అడగడంతో ఉండిపోయాడు.
ఆ సాయంత్రం రెండు కార్లలో అందరమూ వెళ్లాం. నేను రవీంద్రభారతిని చూడటం అదే మొదలు. ‘శాంతి వేదాంతం గారి కూచిపూడి నృత్య ప్రదర్శన’ అని బయట పెద్ద బ్యానర్లు అమర్చారు. ఆ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసిన సంస్థలో దేవన్న ముఖ్య సభ్యుడు అనుకుంటా. లోపలికి వెళ్లగానే ‘అబ్బ.. ఎంత పెద్ద స్టేజి’ అనుకున్నాను. ఆ రోజు శాంతి వేదాంతం గారి నృత్యం అత్యద్భుతంగా ఉంది. కళ్లార్పకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాను. ‘భామనే సత్యభామనే’ మొదలుకుని చేతుల్లో దీపాలు పెట్టుకునీ, పళ్లాన్ని కాలితో జరుపుతూ చేసే నృత్యాలు అబ్బురపరిచాయి. ఒక క్లాసికల్ నృత్యాన్ని ప్రత్యక్షంగా, అంత దగ్గరగా చూడటం నాకు అదే మొదలు. శాంతి గారు ఎంత గొప్పవారో అనిపించింది. చాలా రోజులపాటు ఆమె నృత్యమే నా కళ్లముందు మెదులుతూ ఉండేది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి