జరిగిన కథ : పోటిసునికి అండగా నిలబడాలని, చంద్రహత్థిని కాపాడుకోవాలని చెంచుగూడెం గ్రామస్థులు నిర్ణయించుకుంటారు. భాణుసత్తి ‘మా అత్తకు నిజంగానే చూపు తెప్పిస్తావా?’ అని బాటసారిని అడుగుతుంది. ఆమె అట్లా ఎందుకు అడిగిందో అతనికి అర్థం కాలేదు. తర్వాత..
“ఏంజరుగుతున్నది ఇక్కడ?” గట్టిగా గద్దించినాడు ఈసాణుడు. ఉలిక్కిపడ్డారు తండ్రీ కొడుకులు.. కుసుమ శ్రేష్ఠి, కాపలాదారు రూపంలో ఉన్న యసేనుడు.ముందుగా తేరుకున్న జయసేనుడు..“నేను ఇటు పక్కగా వెళుతుంటే.. ఈ పెద్దాయన తిండి తినలేక అవస్థ పడుతున్నాడు ప్రభూ! ముద్ద కలుపుకోవడం కూడా కష్టంగా ఉన్నదని..” ఎక్కువ మాట్లాడటం రెండు రకాల ప్రమాదం. ఒకటి అవినయం అనే ముద్రపడటం; రెండవది తన గొంతు అతను గుర్తుపట్టే అవకాశం ఉండటం.. అని అర్ధాంతంగా మాటలు ఆపేసినాడు; గొంతులోని ముద్దను మింగేసినాడు.
“హుఁ.. చావనీ! ఈ మూర్ఖులు..! మనకెందుకురా ఆరాటం? అక్కడ చీకటి కొట్టులో వీని కొడుకు నిన్న రాత్రే చివరి శ్వాస విడిచినాడు. ఇప్పుడు వీడు పోతాడేమో పోనీ..” అన్నాడు పళ్లు కొరుకుతూ ఈసాణుడు.అతనట్లా మాట్లాడుతుంటే లోలోపల నవ్వుకున్నారు తండ్రీ కొడుకులు. అంతలోనే ఈసాణుడి అహాన్ని తృప్తి పరచడమే మేలనిపించింది కుసుమ శ్రేష్ఠికి. తల బాదుకుంటూ, మూగవానిలా నటిస్తూ దుఃఖించసాగినాడు. ఈలోపు జయసేనుడు ఆ గదిలో నుంచి జారుకున్నాడు.“చెప్పు! ఇప్పటికైనా చెప్పు! నిధి ఎక్కడుందో చెప్పురా మూర్ఖుడా! నీ భార్య చనిపోయింది; కోడలు అగ్నికి ఆహుతి అయింది; నీ అద్దాలమేడ ఆనవాళ్లు లేకుండా పోయింది; ఇప్పుడు నీ కొడుకు కూడా చచ్చినాడు. ఇంకా ఆ ధనం ఏమి చేసుకుంటావురా నీచుడా!” అంటూ కసిగా అన్నం పళ్లెమును కాలితో తన్నేసినాడు ఈసాణుడు. కుసుమ శ్రేష్ఠి మాత్రం సామాన్యుడా? శబ్దం లేకున్నా గుండెలు పిండేసే దుఃఖం ప్రదర్శించినాడు.“వీణ్ని కూడా తీసుకొని పోయి వీని కొడుకు శవమున్న చీకటింట్లోకి విసిరేయండి!” అని గట్టిగా అరిచినాడు. మరుక్షణం ఇద్దరు భటులు అక్కడికి పరుగెత్తుకొని వచ్చి కుసుమ శ్రేష్ఠిని పట్టుకొని లాక్కొని పోసాగినారు. ఆ భటుల్లో ఒకడిని చేతి సైగతో దగ్గరికి పిలిచినాడు ఈసాణుడు. వానితో గుసగుసలాడుతున్నట్లుగా.. “వీని కొడుకు ఇంకా బతికే ఉన్నాడు. వీడ్ని ఆ పక్క గదిలోనికి తోసేయండి!” అన్నాడు.యాదృచ్ఛికంగా ఆ భటుని రూపంలో ఉన్నవాడు జయసేనుడే.“చిత్తం ప్రభూ!” అంటూ వచ్చినంత వేగంగా వెళ్లినాడు. వెంటనే.. “ఒరేయ్! చిలుకవాడకు మేం వస్తున్నామని, ఆ ఏర్పాట్లు చూడమని ఆ సవరకు సమాచారం అందించండి!” అన్నాడు నిట్టూరుస్తూ.
చిలుకవాడలోని సవరసత్తి మందిరం..
కొన్నాళ్ల క్రితం ఆవేదనలకు, ఆక్రోశాలకు, భయాలకు, కత్తిపోట్లకు, కల్లోలానికి నిలయంగా మారిన ఆ పరిసరాలు ఇప్పుడు తుఫాను తర్వాత ప్రశాంతతను తలపిస్తున్నాయి. కానీ ఆ ప్రశాంతత నిజమైన ప్రశాంతత కాదు! బడబానలాన్ని కడుపులో దాచుకున్న కడలికి ప్రతినిధిలా ఉన్నది ఆ పరిస్థితి. ఈసాణుడు ఆమె మందిరానికి మళ్లీ రావద్దనుకున్నాడు. ఈసాణుడి పీడ వదిలితే చాలు అనుకున్నది సవర. ఈ రెండూ జరగలేదు!మళ్లీ రెండు ధ్రువాలు ఒకే భూమికి సంబంధించినవి అన్నట్లు ఆ ఇద్దరు ఒకచోట చేరినారు. అతను ఆమెను వెతుక్కుంటూ వచ్చినాడు; ఆమె అతణ్ని కాదనకుండా ఆహ్వానించింది. కాకపోతే గతంలో ఆమె ప్రేమనే పంచింది; అతనిలోనూ ఆమెపట్ల ఆరాధన భావం ఉండేది. ఇప్పుడు ఇద్దరిలోనూ అవి ఉన్నాయో లేదో చెప్పడం కష్టం. ఉన్నా, ఎంత మాత్రమో లెక్కగట్టలేం! వాళ్లిద్దరి మధ్య ఇంతకు మునుపటిలా క్షణాలు వేలి సందుల్లోంచి ఇసుక జారిపోయినట్లు గడిచిపోవడం లేదు.
ఎండాకాలంలోని సెలయేటి గమనంలా సాగలేక ఆగిపోతున్నట్లు భారంగా కదులుతున్నాయి. అతని మాటల్లో మర్యాద ఎక్కువైన విషయం ఆమె గమనించింది. దాన్ని కొంచెం తగ్గిస్తే తమ బృందం ముందుకు సాగడానికి పనికొస్తుందని ఆమెకు తెలుసు. అందుకే..“ధరణినాథ! నీదు తప్పులకంటెనుమాట తీరు చూసి మనసు వగచె;మనసులోన లేని మరియాద లేలొకో!వచ్చుటేల లేని వలపు తోడ!(మహారాజా! తమరు చేసిన పొరబాట్ల కంటే ఇప్పుడు మాట్లాడుతున్న తీరు మనసును బాధపెడుతున్నది. మీ మనసులో లేని మర్యాదను మాటల్లో చూపించడం కృతకంగా ఉంది. అంత ప్రేమలేని వాడవు.. రావడం ఎందుకు?)” అంటూ చిరుకోపం ప్రదర్శించింది సవరసత్తి. చిలుకవాడ మహారాణి! ఆ మాటలతో ఈసాణుడు సవరకు తన పట్ల ప్రేమ ఏమాత్రం తగ్గలేదని అర్థం చేసుకున్నాడు. తీయని ఆమె పరిష్వంగంలో హాయిగా నిద్ర పోయినాడు.
చాలా రోజులుగా నిజంగానే అతనికి నిద్ర లేదు. ప్రతిక్షణం భయం, అసంతృప్తి, బాధ, అభద్రత పట్టిపీడిస్తున్న వానికి వేరే జబ్బులు అవసరం లేదు. క్షణక్షణానికీ అవి మనిషిని బలహీనుణ్ని చేసి, ముందు నిద్రకు దూరం చేస్తాయి; ఆపై కాటికి చేరుస్తాయి. ఆ రాత్రి హాయిగా నిద్రపోయిన ఈసాణుడు మరుసటి రోజు ఎంతో ఉత్సాహంగా నిద్ర లేచినాడు. లేచినప్పటి నుంచి అతను ఎంతో ఆనందమయ క్షణాలను అనుభవించినాడు. ఈ క్షణాలను రాత్రి సవర అందించిన సుఖంతో పోల్చలేము కానీ, ఇవి కూడా మరచిపోలేనివిగా ఉన్నాయి.ఈసాణుడికి ఒళ్లు పట్టడం, మర్దన చేయడం, తలంటు స్నానం చేయించడం.. గతంలో సవర చేసేది. సుకుమారమైన ఆమె స్పర్శ.. ప్రణయానుభూతిని తడి ఆరకుండా నిలిపేది. ఈసారి ఆమె బాగా అలసిపోయి ఉన్నానని, తనకు బదులుగా ఒక వృద్ధ పరిచారకుడితో ఆ పనులు చేయించింది. మొదట అయిష్టంగానే వాని సేవలు అందుకునేందుకు సిద్ధపడిన ఈసాణుడు.. ఆ వృద్ధుని పనితనంతో ముగ్ధుడైనాడు. అతని సేవలు శరీరానికి ఎంతో ఉత్తేజాన్నిచ్చినాయి. అతనే ఇచ్చిన కమ్మని పాలు తాగుతూ ఉండగా ఆమె స్నానం చేసి, కురులు ఆరబోసుకుంటూ దర్శనమిచ్చింది.
“సవరా! రోజురోజుకూ నీ అందం పెరుగుతున్నది” అన్నాడు, దగ్గరకు రమ్మని సైగ చేస్తూ.ఆమె చిరునవ్వుతో అతని వద్దకు చేరి, అతను కూర్చున్న ఆసనం మీద మోచేతిని ఆనించి కూర్చొని, కళ్లలోకి చూసింది.“నిజమా! ఇదీ మాట వరసకు అంటున్న ప్రేమలేని మాటేనా?” అంటూ తల పక్కకు తిప్పుకొన్నది.“ఏది నిజమో, ఏది అబద్ధమో నీ మనసు నీకు చెబుతూనే ఉంటది. నీవే దాన్ని పట్టించుకోవు!” అంటూ అతను ఆమె భుజాల మీదుగా చేతులు చుట్టి, దగ్గరికి లాక్కున్నాడు.అది చూసి అక్కడ ఉండటం సరికాదని వృద్ధ పరిచారకుడు బయటకు వెళ్లడానికి కదిలినాడు.
అతని కదలిక గమనించిన ఈసాణుడు వెంటనే.. “ఆగు!” అన్నాడు.
అతను ఆగిపోయినాడు. సవరకు, వృద్ధుని రూపంలో ఉన్న పోటిసునికి ఒకేసారి గుండె ఆగిపోయినట్లు అనిపించింది. ఈసాణునికి అనుమానం కలిగిందని ఇద్దరూ అనుకున్నారు.వాళ్ల అనుమానానికి బలం చేకూరుస్తూ.. “ఎవరు ఇతను? ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు!” అన్నాడు సవరతో.ఈ ప్రశ్న ముందుగా ఊహించిందే కావడంతో ఏమాత్రం తడబాటు లేకుండా సమాధానం చెప్పింది సవర.. “మా చుట్టమే! దూరపు బంధువు! పిల్లలు సరిగ్గా చూసుకోవడం లేదని నెలరోజుల నాడే నా వద్దకు వచ్చినాడు. పనిమంతుడు. మాటలు రాని మూగవానిలా ఉంటాడు; ఏది చెప్పినా కాదనడు; వంకపెట్టే పని లేకుండా చేస్తాడు ఏ పనినైనా; పాపం.. కొడుకులు కర్కోటకులు! ఇతణ్ని నిస్సహాయుణ్ని చేసినారు” అన్నది నిట్టూరుస్తూ.
“ఇతను నిస్సహాయుడా!” ఆశ్చర్యం ప్రకటిస్తూ అన్నాడు ఈసాణుడు.
“పదిమందిని ఆదుకోగల శారీరక దృఢత్వం ఉన్నది ఈ వృద్ధునిలో. పైకి ముసలివాడే గానీ, నవయువకునికి ఉండే లక్షణాలన్నీ ఇతనిలో పుష్కలంగా ఉన్నాయి”.. ఈసాణుడి ప్రశంసలో.. ‘అతను వృద్ధుడు కాదు, యువకుడే!’ అన్న అనుమానం కూడా ఉన్నది. ఆమె నవ్వింది; పోటిసుడు తలవంచుకున్నాడు. ఈసాణుడు తన ప్రశంసను కొనసాగిస్తూ..“ముఖ్యంగా ఇతని పట్టు చాలా అద్భుతం! శరీర మర్దన, ఒళ్లు పట్టిన తీరు ఎంతో అనుభవజ్ఞుడు అని చెబుతున్నాయి. సైన్యంలో పనిచేసినాడా? లేక ఇదే వృత్తిగా జీవించేవాడా? ఏం పేరు? ఏ ఊరు?” అన్నాడు.
“మీరు ఊహించింది నిజమే ప్రభూ! ఒళ్లు పట్టడమే వృత్తి; పేరు మియంకుడు; ఊరు సిద్ధాపురం” అన్నది ఓరకంట ఈసాణుడి ముఖ కవళికలు గమనిస్తూ.“సిద్ధాపురమా? ఎప్పుడూ విన్నట్లు లేదే!” అన్నాడు ఆలోచిస్తూ.“మాది పక్కరాజ్యం ప్రభూ! అస్మక! అస్మకలోని పోదన నగరానికి నాలుగు క్రోసుల దూరంలో ఉండే పల్లెటూరు” అన్నాడు వినమ్రంగా మియంకుని రూపంలో ఉన్న పోటిసుడు.“అవునా?!” ఆశ్చర్యం, ఆనందం పోటీపడ్డాయి ఈసాణుడి ముఖంలో. వెంటనే.. “నీకు కుసుమ శ్రేష్ఠి తెలుసా?” అన్నాడు.
అంతలోనే తన అత్యుత్సాహం సవరలో అనుమానాన్ని రేకెత్తిస్తుందేమో అనుకున్నాడు.“తెలుసు ప్రభూ! శ్రేష్ఠి గారి గురించి మా రాజ్యంలో తెలువని వాళ్లు లేరు!” అన్నాడు.ఆ సంభాషణను సవర సమక్షంలో కొనసాగించడం ఇష్టం లేక, మాట మార్చినాడు.. “సవరా! ఈ పెద్దాయనని నాతో పంపుతావా?” అన్నాడు. మరో సందర్భంలో అయితే చెప్పకుండానే వెంటబెట్టుకొని పోయేవాడు. ఇప్పుడు ఆ చొరవ కొరవడ్డది. అధికార దర్పం కంటే, అనురాగంతో పనులు నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు జవరాలు సవర వద్ద. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న సవర మాత్రం తప్పనిసరై అంగీకరిస్తున్నట్లుగా.. “ప్రభూ! ఇది మీరు ఆజ్ఞాపించదగినది. మిమ్మల్ని కాదనే వాళ్లు ఎవరు? కానీ అతను మీకు అంతగా ఉపయోగపడడు. పైగా అప్పుడప్పుడూ జబ్బు పడుతుంటాడు. మతిస్థిమితం కూడా అంతంత మాత్రమే! చెప్పకుండా ఎక్కడికో పోతుంటాడు. మీకు లేనిపోని తలనొప్పులు వస్తాయి!” అన్నది పోటిసునికి అతని వద్ద స్వేచ్ఛకు వెసులుబాటును నిర్మిస్తూ..“అవునా? మనిషి చూస్తే అట్లా అనిపించడే!” అన్నాడు ఈసాణుడు, ఆమె మాటల్లోని విశ్వసనీయతను శంకిస్తున్నట్లుగా. “సేవలు సందేహించనవసరం లేదు, బాగా చేస్తాడు! నేను చెప్పిన లక్షణాలు కూడా ఉన్నాయి, అప్పుడప్పుడూ అవి కనిపిస్తుంటాయి” అన్నది కట్టె విరుగకుండా.“సరే! అవన్నీ నేను చూసుకుంటా! ఇతణ్ని మాతో పంపించు” అన్నాడు ఒక నిర్ణయానికి వచ్చినట్లు.
జంగిటిలోని సత్తి త్రయం ఇంట్లో.. భాణుసత్తి మాటలలోని అంతరార్థం గ్రహించలేక, ప్రణాలునిలోని సాధనా నందుడు.. “అదేమిటి తల్లీ! అట్లా అడుగుతున్నారు? అందుకే కదా నేను వచ్చింది” అన్నాడు అయోమయంగా. భాణు తమను ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకుని, గుసగుసలాడుతున్నట్లు..“అదికాదు బాటసారీ! ఆమెకు కండ్లు కనిపించనంత వరకూ మనం ఏమైనా ఆడుకోవచ్చు. చూపు తెప్పిస్తే, మన దారిలో ముండ్లు పరుచుకుంటాయి కదా!” అన్నది.ఠక్కున సాధనానందుని స్థానాన్ని ప్రణాలుడు ఆక్రమించినాడు.“మరి.. మరి.. ఇప్పుడు ఎలా?” అని సందిగ్ధంలో పడిపోయినాడు.వాళ్లిద్దరికీ ఏకాంతం ఎక్కువైందని గ్రహించి, అక్కడికి వచ్చి, ఇద్దరి మధ్యలో దూరి.. “తమరు రండి స్వామీ!” అంటూ బాటసారిని చేయిపట్టి లాక్కొని పోయింది ఆహవసత్తి.
“ఎవరు? నా కొడుకు వచ్చినాడా?” భావాన్ని పలికించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కళ్ల భాషను కూడా కమలసత్తి కంఠమే గుత్తకు గొన్నట్లు.. అన్నది. ఆ మాట ఆహవను పుండు మీద కారంలా మండించింది.“కొడుకు కాదత్తా! బాటసారి! వైద్యుడు! నీ కంటి వైద్యం కోసం వచ్చినాడు..” ప్రతి మాటనూ వత్తి పలికింది.“కాదు! కాదు! అతను నిజంగా నా కొడుకే! నా పట్ల మాతృభావన నిండు మనసుతో చూపించినవాడు. నా బిడ్డలేని సమయంలో వచ్చి, అంతకు మించిన ప్రేమను పంచిన దేవుడిచ్చిన బిడ్డ!” కళ్లకు చూపు లోపించినా, కన్నీరు ఒలికించడం మాత్రం మానలేదు అవి.
కమల సత్తి మాటలు మిగతా ముగ్గురిలో మూడు రకాల ప్రతిస్పందనకు కారణమైనాయి. ‘ఈ పెద్దరాణి గారికి చాదస్తం ఎక్కువైంది. చిన్నరాణి గారి కోరికలను ఈమే ఉసిగొల్పుతున్నది. ఆమెకు లేని ఆలోచన కలిగించి ఆ వచ్చినవానికి కోడలును అప్పిచ్చేటట్లున్నది ఈ పిచ్చిది!’ అనుకున్నది ఆహవ.
‘నిజంగా నీ మనసెంత మంచిది అత్తమ్మా! నీ కొడుకు లేని లోటును ఈ విధంగా పూరించాలి అనుకుంటున్నావు కదా! ఒక ఆడదాని మనసు ఇంకొక ఆడదానికే తెలుస్తుంది అన్నట్లు, నాకేం కావాలెనో నాకంటే నీకే బాగా అర్థమైంది. ఈ అవకాశం భగవంతుడిచ్చిన వరం కాదు! అత్త పెట్టిన బిక్ష!’ అనుకున్నది.. తర్వాత జరగబోయే పరిణామాన్ని కమ్మగా ఊహించుకుంటూ భాణు.‘తల్లీ! నీవు ధన్యురాలవు! సాధారణ కుటుంబంలో పుట్టినా, సాటి మనుషులను సొంత మనుషులుగా ప్రేమించగలిగిన నీ జన్మ సంస్కారానికి శిరసా నమామి! శ్రమణకుల వద్ద శిక్షణ పొందినప్పటికీ బంగారంగా మారజాలని కేటులాగా నేను మాత్రం బుద్ధుని మార్గంలో పయనించలేక పోతున్నాను!’ అనుకుంటూ రెండు కన్నీటి చుక్కలు జారవిడిచినాడు ప్రణాలానందుడు. అంతలో అక్కడికి సచ్చసామి వచ్చినాడు.
(సశేషం)
-దోరవేటి
89788 71961