గవర్నమెంట్ మర్కజీ హైస్కూల్లో ఫస్టు బెల్లు మోగింది. అంటే టైం తొమ్మిదిన్నర అయింది. పది గంటలకల్లా ఫ్యాక్టరీకి పోకపోతే.. ఓనర్తోని తిట్ల దండకమే! సైకిల్ తాళం తీసి, ఎక్కి తొక్కబోతుంటే చెయిన్ పడ్డది. మనం ఎంత తొందరపడినా.. ఈ సైకిల్ చెయిన్‌లా పరిస్థితులు అప్పుడప్పుడూ మనల్నిట్ల వెనక్కు లాగుతుంటయ్. గ్రీజు మరకలు చేతులకు అంటకుంట కట్టెపుల్లతో తంటాలు పడుతూ వేస్తుంటే.. నా జేబులున్న నోకియా ఫోన్ మోగింది. ఎవరై ఉంటారో అనుకుంటూ ఫోన్ ఎత్తిన. “హలో హుషిలాల్”.. అవతలివైపు నుంచి.“కోన్ చీ (ఎవరు)?”“మ భూక్యా వాతేఖరోచు
(నేను భూక్యను మాట్లాడుతానా)”“క బియా.. కతాచి(చెప్పు అన్న.. ఎక్కడున్నవ్)” “రేడియోల వార్తలిన్నవా?” భూక్య గొంతులో ఏదో గుబులు. నా మనసు కల్లిబిల్లి అయింది.
“లేదు బియా”“నిన్న.. ఎన్ ఎన్.. కౌం టరు” అని ఒక్కో అక్షరం కూడబలుక్కుని అన్నడు భూక్య.అది వినంగనే నా చేతుల్లోంచి ఫోన్ జారిపడ్డది. కాళ్ల కింద భూమి చీలి అందులో కూరుకపోయినట్లు అనిపించింది.“యాడీ…! (అమ్మా!)” అని అప్రయత్నంగానే గట్టిగా అరిచిన.పరిగెత్తుకుంటూ వెళ్లి, పాన్‌షాపుల న్యూస్‌పేపర్ కొన్నా. భయపడుకుంటూ ఒక్కో వార్త చూస్తున్నా.‘జలయజ్ఞం పనులపై ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సమీక్ష’ అని హెడ్లైన్. దాని పక్కనే.. ‘ఖమ్మం జిల్లాలో ఎన్కౌంటర్-నలుగురు మావోయిస్టులు మృతి’ అని ఉంది.‘10 ఏప్రిల్ 2007 (ఖమ్మం) : నిన్న సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా అడవుల్లో పోలీసు బలగాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో నక్సలైట్లకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో తారక్క(43) అలియాస్ మంగ్యా..’మిగతా వార్త చదవబుద్ది కాలే! ఆ తారక్క మా అమ్మే. పేపర్ ముఖానికి పెట్టుకుని గుండెలవిసేలా ఏడ్చిన. వెంటనే బ్యాగు సర్దుకుని బస్టాండ్‌కు పోయి మహబూబాబాద్ బస్సెక్కిన. ఏడుపు కనపడకుండా దస్తీ కట్టుకుని వెనకాల సీట్లో కూచున్న.మా యాడీ అంటే నాకు చిన్నప్పటి నుంచి మస్తు కోపం. నాకు ఏడాది వయసున్నప్పుడే నన్ను అమ్మమ్మకాడ వదిలేసి అడవుల్లోకి పోయింది. మాది మహబూబాబాద్ దగ్గర చిన్న తండా. తండాల అందరూ అయినవాళ్లే ఉన్నా.. అమ్మ లేని లోటును ఎవరూ పూడ్చలేక పోయిండ్లు. హన్మకొండల ఎస్టీ హాస్టళ్ల చదువుకున్నా. హాస్టళ్ల ఉన్నప్పుడు నా దోస్తుగాళ్లను చూసేటందుకు వాళ్ల అమ్మ-నాయనలు ఊకూకే వచ్చేవాళ్లు. నాకోసం మాత్రం ఎవలూ రాకపోయేది.
‘ఒరే.. వీనికి అమ్మ ఉన్నా వదిలేసి పోయిందట’ అని నన్ను ఎక్కిరించేటోళ్లు. ఆ మాటలు నన్ను హాస్టళ్ల ఒంటరిని చేసినయి. మా యాడీ మీద కోపంతోని సదువు మీద శ్రద్ధ పెట్టలేదు. సార్లతోని తిట్లు తినుకుంటూ, దెబ్బలు పడుకుంటూ పదో తరగతి పాసైన. హన్మకొండలనే గవర్నమెంటు కాలేజీలో ఇంటర్ చేసిన. డిగ్రీ కూడా ఇక్కడనే. ఈ సదువులు ఎందుకో నాకెక్కేది కాదు. అవి పనికి మాలినవని అనుకునేటోన్ని.
అందుకే డిగ్రీ అయిపోంగనే హన్మకొండ లష్కర్ బజార్లో రూమ్ తీసుకుని, బట్టల ఫ్యాక్టరీలో పనికి పోతానా. నెలకు ఐదు వేలు జీతం.
గతుకు రోడ్లపై బస్సు తూలుతూ కదుల్తోంది. అమ్మ ఆలోచనలు నన్ను తిర్గమర్గం చేస్తున్నయి. అమ్మను చివరిసారి కలిసినప్పుడు తన రూపాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. మూడేళ్ల కిందట 2004లో నేను డిగ్రీ మొదటి సంవత్సరం సదువుతున్నప్పుడు ఓసారి నన్ను చూడ్డానికి అమ్మ వచ్చింది. అప్పుడు హైదరాబాద్‌లో చర్చలు జరిపేటందుకు నక్సలైట్లను ప్రభుత్వం ఆహ్వానించింది. అదే టైంలో మా యాడి నన్ను కలిసింది. చీకట్లో మా తండావోళ్లు నలుగురైదుగురు వెంటరాగా.. నా అడ్రసు తెలుసుకుని నాకాడికి వచ్చింది. ఆమె మా అమ్మేనని నేను గుర్తు పట్టలేకపోయిన. ఏ కొడుకుకు-తల్లికి రాకూడని దుస్థితి కదా ఇది! అమ్మ నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నది. నా గుండె చెరువైంది. అమ్మ మీద కోపం కూడా వచ్చింది.
“ఎట్లున్నవ్ బిడ్డా!? మంచిగ సదువుకుంటున్నవా!?”“మంచిగనే ఉన్న. గిప్పుడు యాదికొచ్చిననా?”“అది కాదు బిడ్డా”“నీ అసోంటి కసాయి తల్లిని నేను సూడలే”అమ్మ గొంతు నుంచి మాట రాలేదు. ఏడుస్తున్న శబ్దం మాత్రం వినిపిస్తోంది.“ఇప్పుడు ఎందుకు వచ్చినవ్” అని నా కోపాన్నంత వెళ్లగక్కిన.“గట్లంటవేందిరా హుషి.. మీ అమ్మ నిన్ను కలవడానికి కష్టపడి వస్తే..” అని ఎవరో కసురుకున్నరు.“మరి ఏం చేయమంటవ్. నీ పాటికి నువ్వు పోయి అడవులల్ల తిరుగు! నేను సచ్చిన్నో బతికిన్నో నీకెందుకు” నా కళ్ల నుంచి సుడులు తిరుగుతూ నీళ్లు రాలినయ్.
“అది కాదు కొడుకా” అని నా చేతులుముట్టుకోడానికి ప్రయత్నించింది.నేను ఏడుస్తూనే ఛీదరించుకున్న.“ఇగో కొడుకా! గివ్వి ఉంచుకో.. పుస్తకాలు గిట్ల ఏమన్నా కొనుక్కో” అని రెండు వంద నోట్లు నా చేతుల్ల పెట్టింది. నేను వాటిని విసిరికొట్టిన. ఎవరో.. ‘తీసుకో బిడ్డా!’ అని నా జేబులో కుక్కారు. అప్పుడే పోలీసుల పెట్రోలింగ్ సైరన్ వినపడ్డది.“సరే ఇగ.. ఆలస్యం చేస్తే ఎవలికన్నా తెలుస్తది. అందరికీ ప్రమాదం. వెంటనే పోదాం” అన్నరు.
“సరే బిడ్డ.. నీకు నా మీద ఎంత కోపం ఉన్నా.. సదువు మీద సూయించకు బిడ్డ. మంచిగ సదువుకో” అని నా గదవకు ఐదువేళ్లు ఆనిచ్చి ముద్దించుకుంటూ చెప్పింది. మర్రి మర్రి చూసుకుంటూ చీకట్లో కలిసిపోయింది. ఆ పది నిమిషాలే అమ్మను చివరిసారి చూడటం. మళ్లీ కనపడలే!
నేను తండాకు పోయేసరికి చాలామంది వచ్చున్నరు.“తారక్క కొడుకు వచ్చిండు!” అని ఎవరో అనంగనే.. నా చుట్టూ చాలామంది గుమిగూడిర్రు.
“నువ్వేనా మా తారక్క కొడుకువు. ఎంత గొప్ప మాతల్లి తారక్క. ఆయవ్వ కడుపున పుట్టినోడివి. పుణ్యాత్ముడివి” అని నన్ను కౌగిలించుకుని ఏడ్చింది ఓ ముసలామె.ఆమె ఎవలో నాకు తెలవదు. మా గుడిసె ముందు టెంట్ వేసిర్రు. అమ్మ (శవం) ఇంకా రాలేదు. పోలీసులతో మాట్లాడి తీసుకురావడానికి మా తండాల పెద్ద మనుషులు వెళ్లారట.జనం చాలామంది వస్తూ ఉన్నరు. వాళ్లలో చాలామంది ఎరుపు చొక్కాలు, ఎరుపు చీరలే కట్టుకున్నరు. గొంగడి వేసుకుని, తలకు ఎర్ర రుమాల్ సుట్టుకుని, గజ్జెలు కట్టుకుని కళాకారులు పాటలు అందుకున్నరు.
‘ఓ అరుణ పతాకమా..చేగొనుమా రెడ్ సెల్యూట్!శ్రమ జీవుల కేతనమా..ఇదిగిదిగో రెడ్ సెల్యూట్!మృతవీరుల త్యాగ ఫలితమే..
నీ వర్ణం ఎరుపయ్యింది!నీ రెపరెపలను వీక్షిస్తుంటే..మా రక్తం ఉప్పొంగింది!’
పోస్టుమార్టం జరిగాక మధ్యాహ్నం మూడు గంటలకు అంబులెన్సులో అమ్మ నిర్జీవంగా ఇంటికి వచ్చింది. అమ్మను దింపగానే ఏడుపులతో తండా అంతా ఘొల్లుమంది.“తారక్క.. అమర్ రహే” నినాదాల నడుమ తండా వాతావరణమంతా ఎరుపెక్కింది. ఎవరో కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు అంట.. ఆయనొచ్చి అమ్మకు నివాళులు అర్పించిండు. నాకాడికొచ్చి నన్ను దగ్గరకు తీసుకుని..“ధైర్యంగుండు తమ్ముడా! నీకు మేమున్నం!” అన్నడు. మీడియా ముందుకు వెళ్లి..“చర్చలకు అని పిలిచిన ప్రభుత్వం.. చర్చలను సఫలం చేయలే కానీ, అన్నలొచ్చిన దారిని పహారా కాసి, ఒక్కలొక్కళ్లను కాల్చుకుంటూ పోతాంది. నిర్బంధం ఎక్కువైంది. ఈ మూడేళ్లలో ప్రభుత్వం చేస్తున్న హత్యల్లో మరో తార రాలిపోయింది. పౌర హక్కులను కాలరాస్తూ బూటకపు ఎన్కౌంటర్లను చేస్తోంది” అని ఆవేశంగా మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడుతున్నడో నాకప్పుడు అర్థం కాలేదు. ఒక్క ‘తార రాలిపోయింది’ అన్న మాట తప్ప. ఆ తార మా యాడీనే. నా కళ్ల నీళ్లు ఆగలే.
ఓ టీవీ ఛానల్ జర్నలిస్టు మైకు పట్టుకుని నా దగ్గరికొచ్చి..“జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే తారక్క కొడుకు ఇతనే” అంటూ నన్ను చూపెడుతున్నడు. నాకు లోలోపల ఏదో పెద్ద పాపం చేసినట్లు అనిపించసాగింది. అమ్మ ఎందరికో గుండె ధైర్యం. ఒక విప్లవ జ్యోతి. ఒక ఉద్యమకారిణి. కానీ, నాకు మాత్రం నన్ను విడిచి వెళ్లిపోయిన ఓ క్రూరురాలు. తండ్రిలేని బిడ్డనొదిలి తన దారి తాను చూసుకున్న ఓ ద్రోహి. అట్లాంటి మా అమ్మ గురించి అందరూ ఇంత గొప్పగా మాట్లాడుతున్నారేంది? వీళ్లు ఎందుకు ఇంతలా ఆరాధిస్తున్నరు? ఆమె ఏం చేసింది? కన్న బిడ్డను పట్టించుకోని మహిళ.. వీళ్లకు ఎందుకు దేవతయింది? ఈ ప్రశ్నలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసినయ్.అమ్మను చివరిసారి కలిసినప్పుడు నా ప్రవర్తన నాకిప్పుడు వాంతి కలిగిస్తాంది. అమ్మ గురించి పూర్తిగా తెలుసుకోవాలని నాలో నేను గట్టిగా అనుకున్నా. అంతకుమునుపు అమ్మమ్మను అడిగితే..
‘మీ నాయన సచ్చిపోయిండు. మీ అమ్మ అడువుల్లోకి పోయింది’ అని చెబుతుండేది. అంతకుమించి ఆ ముసల్ది నాకు ఏం చెప్పకపోతుండే.
ఆకాశంలో సూరీడు పడమర దిక్కుకు తరులుతుండగా.. అమ్మ అంతిమయాత్ర మొదలైంది. సుట్టుపక్కల తండాలతోపాటు, మిగతా ఊర్ల నుంచి మస్తుమంది వచ్చిర్రు. ఇసుకేస్తే రాలేదేమో అన్నట్లుగా జనం, మధ్యలో పోలీసులు. పాటలు పాడుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ, నినాదాలు చేసుకుంటూ.. యాడీని శ్మశానానికి తీసుకుపోయిర్రు. మా ఆచారం ప్రకారం.. ఎవరు చనిపోయినా పూడ్చిపెడతం. కానీ, మా అమ్మ తనను కాల్చేయాలని అడవిలో ఉన్నప్పుడు ఊకే అంటూ ఉండెనట. ఇదే ముచ్చట ఏవో కాగితాల్లో కూడా రాసుకుంటుండెనట. ఈ విషయం చెబుతూ ఓ కవర్‌ను నా చేతుల పెట్టింది ఒకామె. ఆమె పేరు శాంతక్క. మాజీ నక్సలైట్. గతంలో అమ్మతోని కలిసి అడవుల్లో తిరిగిందట. ఆరోగ్యం సహకరించక ఐదేళ్ల కిందట్నే పోలీసులకు లొంగిపోయింది. ఇప్పుడు ఆమె హక్కుల కార్యకర్త.“దీంట్ల మీ అమ్మ వస్తువులున్నాయి” అన్నది శాంతక్క. అసంకల్పితంగానే దాన్ని గుండెలకు అద్దుకున్నా.
సంధ్య వెలుగులను మింగేస్తూ చీకట్లు ముసురుకుంటుండగా.. అమ్మ శరీరం చితి నిప్పుల్లో కాలిపోయింది. చివరి చూపుకోసం అన్నట్లు ఆకాశంలో నక్షత్రాలు ఆరోజు ఎందుకో మరింత చిక్కగా మెరిసినట్లు కనిపించినయ్. అమ్మ కోసం వచ్చినోళ్లంతా ఎవలింటికి వాళ్లు వెళ్లిపోయిండ్రు. శాంతక్క మాత్రం తండాలనే ఉన్నది.“పెద్దమ్మా.. మా యాడీ అన్నలల్లకు ఎందుకు పోయింది. నేను ఆమె కొడుకును. కానీ, నాకు మా అమ్మ గురించి ఏం తెల్వది. నువ్వన్నా చెప్పు” అని చేయి పట్టుకుని శాంతక్కను అడిగిన.“చెప్తా బిడ్డా.. చెప్తా! మీ అమ్మ గురించి నువ్వు తెలుసుకోకపోతే ఎట్లా” అని మంచంలో కూసొని చెప్పడం మొదలుపెట్టింది పెద్దమ్మ.
“మీ అమ్మానాయిన మంగ్యా-కిషన్. సూడసక్కని సుక్కసొంటి జంట. మీ నాయిన మంచి మాటకారి. మీ అమ్మ.. మీ నాయినకు మేనమరదలే. ఆమెది కూడా ఇదే తండానే అయేసరికి పెళ్లి చేసిండ్లు. మీ అమ్మ చాలా సిగ్గరి పిల్ల. తక్కువ మాట్లాడేది. మీ అమ్మానాయినలిద్దరూ తండాల అందరినీ మనోళ్లే అనుకునేటోళ్లు. ఎవలికేం ఆపద వచ్చినా అర్సుకునేటోళ్లు. చేతనైనంత సాయం చేసేటోళ్లు. వాళ్లకు పెళ్లయిన రెండేళ్లకు నువ్వు పుట్టినవు.
తాతల నుంచి వస్తున్న ఐదెకరాల భూమిని సాగు చేసుకుంటూ.. ఉన్నదో లేదో అన్నట్లు బతుకుతుండేటోళ్లు. అది 1986. ఎన్టీయార్ ముఖ్య
మంత్రిగా ఉన్న సమయం. నక్సలైట్లే నిజమైన దేశ భక్తులని పీఠమెక్కి.. ఆ నక్సలైట్ల మీదనే విరుచుకు పడుతున్న ఘడియలవి. తండాలకు ఆఫీసర్లు వచ్చిండ్లు. ఏవో పత్రాలు సూపెట్టిండ్లు. ‘మీరు సాగు చేసుకుంటున్న భూములు.. దొర భూములు. వెంటనే ఇడిసి పోవాలి’ అన్నరు.
తండోళ్లకు ఏమర్థం కాక నోళ్లు ఎల్లబెట్టిండ్లు.‘అట్లంటే ఎట్ల సారూ.. గీ భూములను మా అవ్వయ్యల కాలం సంది సాగు చేసుకుంటూ
రాబడ్తిమి’ అన్నరు.‘అవ్వన్నీ దొంగముచ్చట్లు.. నిజాం కాలంల ఈ భూములన్నీ దొరోళ్లయే ఉండే! సాయుధ పోరాటం అని కబ్జా చేసిండ్లు’ అన్నరు.. దొర లంచం సొమ్ము తిన్న అధికారులు.మాటా మాటా పెరిగింది.
‘దొర లేడు! ఎవ్వడు లేడు! మేం భూములు వదిలే ముచ్చట్నే లేదు’ తెగేసి చెప్పిండు కిషన్.‘ఏం వాగుతున్నవ్రా..’ అని దొర తన చెప్పును మీదికిసిరిండు.గంతే.. తన చేతులున్న కర్రతోని దొర తలమీద కొట్టిండు కిషన్. నెత్తురు చిమ్మింది.‘మీ ముందే నన్ను సంపడానికి సూసిండు.. వాణ్ని వదలద్దు’.. పోలీసులతోని అన్నడు దొర.కిషన్‌ను అరెస్టు చేసి పట్టుకపోయిండ్లు. దొర పగ.. పాము పగ కన్నా ఎక్కువ అంటుండే! పారిపోతుండగా ఎన్కౌంటర్ చేసినమని కిషన్ శవాన్ని తండాకు పంపిండ్లు. పుట్టెడు శోకంతో మీ అమ్మ.. విధవరాలైంది. తండాలంతా భయం జొచ్చింది.
అప్పటికి అయిపోలే.. కొన్నిరోజులకే మళ్లా తండాలకు పోలీసులను తోలిండ్లు.దొరికినోళ్లను దొరికినట్లు కుక్కను కొట్టినట్లు కొట్టి.. భూములు వదిలి వెళ్లుమన్నరు. అంతల్నే.. ఈ సంగతి అన్నల దాకా ఎట్ల పోయిందో ఏమో.. రానే వచ్చిండ్లు. పట్నం పోతున్న దొరను కాల్సి చంపిండ్లు. దొర దగ్గరి పత్రాలను తెచ్చి తండాల కాలబెట్టిండ్లు.‘మీకు మేమున్నం భయపడొద్దు’ అన్నరు.
అప్పుడే మీ అమ్మ.. ‘నేను మీతోని వస్తానన్న’ అని అన్నలతోని బయలెళ్లింది.భూస్వాముల చేతుల్లో చిక్కుకున్న నిరంకుశ రాజ్యంలో విముక్తి కావాలంటే సాయుధులవ్వడమే మార్గమని నమ్మింది. నోటి మాట బయటకు రాని మంగ్యా అలియాస్ తారక్క.. అరుణ వర్ణం పులుముకున్న మహా విప్లవమైంది. అడవి బాటలో ఆయుధం చేతపట్టింది. తన తండాలాగా దోపిడీకి గురవుతున్న వర్గాలకోసం పోరాడాలని నిశ్చయించుకుంది. ఏడాది బిడ్డను పుట్టింట్లో వదిలి స్వేచ్ఛ కోసం అడుగులు వేసింది. అడివిలనే చదువు నేర్చుకుంది. 1 ఆఫ్ 70 లాంటి చట్టాలున్నా అమలుకు నోచుకోని చోట బందూకై పేలింది. పీడిత వర్గాల గొంతులో విప్లవగీతమై నినదించింది.ఓ మామూలు దళ సభ్యురాలిగా చేరిన తారక్క.. దళ కమాండర్‌గా, రాష్ట్ర కమిటీ మెంబర్‌గా చేసింది. అనేకసార్లు శత్రువుతో పోరాడి ప్రాణాలతో బయటపడింది. గిరిజనుల, ఆదివాసుల భూములు గుంజుకోవడానికి చూసిన భూస్వాములకు పీడకలైంది. ఎంత చేసినా.. అన్ని రోజులు మనవే అవ్వవు కదా బిడ్డా..! అలాంటి చెడ్డరోజు రానే వచ్చింది. ఇన్ఫార్మర్ల కుట్రతో నిన్న అన్నల స్థావరంపై ‘శత్రువు’ దాడి చేయగా.. మీ అమ్మ తారక్క అమరురాలైంది” అని చెప్పి నా వంక చూసింది శాంతక్క. అప్పటికే నా కళ్లు ఊటబాయిలైనయి.“నువ్వు అనుకున్నట్లు మీ అమ్మ కసాయిది కాదు బిడ్డా.. అత్యంత ప్రేమగల్లది. గందుకనే కదా..! అన్నీ ఇడిసిపెట్టి, గుట్టలపుట్టల బాట పట్టింది” అంది.అప్పుడే అమ్మ రాసుకున్న కాగితాలు చదివిన.‘బిడ్డా..!
నువ్వు నా కడుపులో పడ్డప్పుడు మీ నాయినా, నేను ఎంతో సంబురపడ్డం. నెత్తురు పూసుకున్న ఎర్రని మందార పువ్వోలే నువ్వు నా ఒడిలో చేరినప్పుడు.. మా ఆనందం అలుగులై పారింది. నీ భవిష్యత్తుపై ఎన్నో కలలను కట్టుకున్నం. మీ నాయిన ఉసురు తీసి, మా కలలన్నింటినీ బూడిదచేసిందీ దోపిడీ రాజ్యం. నువ్వు ఈ రాతల్ని చదివే సమయానికి నేను కూడా రాజ్యపు కుట్రలకు బలైపోయుంటానని నాకు తెలుసు.
కానీ బిడ్డా.. ఇది గుర్తుపెట్టుకో..
ఎక్కడైతే హక్కులు కాలరాయబడుతాయో..
ఎక్కడైతే అసత్యం సత్యంగా వర్ధిల్లుతుందో..
ఎక్కడైతే సమన్యాయం కొరవడుతుందో..
ఎక్కడైతే నీతిలేని విధానాలు విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తాయో.. అక్కడ అశాంతితో రగిలిన హృదయాలు.. కన్నీటి నావను దాటి, ఏనాటికైనా పోరాట పంథా తొక్కుతయి. స్వేచ్ఛా వాయువులు అందించడానికై ఆరాటపడతయి. అలా ఆరాటపడ్డ నన్ను అడవితల్లి ‘రావే బిడ్డ’ అని పిలిచింది. నీ ఆలనా పాలనా చూడాల్సిన వేళ నిన్నొదిలి తుపాకీ భుజానికెత్తిన. తల్లి ప్రేమకు నోచుకోక నా ఒక్క బిడ్డ పడే బాధ కన్నా.. ఈ పేదోళ్లందరి బతుకులు మారాలని ఆశపడ్డ. అందుకే నిన్ను ఒంటరిని చేసిపోయిన. బిడ్డా.. నన్ను క్షమించు. ఈ తల్లిని క్షమించు. అడవిబిడ్డల మీద జులుం చేసే ఈ దోపిడీగాళ్లు.. మన దగ్గర చదువు లేదని విర్రవీగుతరు. నువ్వు బాగా చదువుకోవాలె. చదువే మన బతుకుల్ని మారుస్తది. మన గోసల్ని తీరుస్తది..
– మీ యాడి’
అది చదివినంక నా కళ్లలో ఉబికిన నీళ్లు కాయితాలపై పడినయ్. నలిగిపోతదని దాన్ని నా అంగీకి ఇంకేటట్టు ఒత్తిన. నోటితో ఉఫ్‌మని ఊదిన. ఆ సమయంలో నా తల్లీతండ్రి సావుకు కారణమైన ‘రాజ్యం’ మీద పట్టరానంత కోపమొచ్చింది. పళ్లు పటపటమని కొరికిన. నా కళ్లలోంచి బయటికొస్తున్న సెగ నాకే భగ్గుమని తగిలింది. అమ్మ రాసుకున్న మాటలు నా చెవుల్లో మళ్లీ మళ్లీ మోగినయ్.“ఇదంతా నీకు తెలిస్తే నీ మనసు నొచ్చుకుంటదని గీ ముచ్చట్లేవీ ఎక్కువ చెప్పొద్దని మీ అమ్మమ్మతోని మీ అమ్మ మాట తీసుకున్నది. గందుకే.. ఆ ముసలామె నీకు ఏం చెప్పలేక పోయింది” అని నా గదువ పట్టుకుని చూసింది పెద్దమ్మ.“అవు బిడ్డా!” అమ్మమ్మ ఏడ్సుకుంటా అన్నది.
శాంతక్కను చూస్తూ..“మా యాడీబావు (అమ్మానాన్న) సావుకు కారణమైన ఈ వ్యవస్థను మార్చాలి” అన్నాను.“ఏంది బిడ్డా? నువ్వు కూడా అడవుల్లోకి పోతనంటవా ఏంది?” అనుమానంగా అడిగింది.“లేదు. నేను చదువుకుంటా. ఈ అసమానతలను అరికట్టేందుకు గన్నులతో ఇప్పుడు పనిలేదు. నాకిప్పుడు పుస్తకం కావాలి. నేను ఐఏఎస్ అవుతా. చట్టాలను సక్రమంగా అమలు చేసే అధికారిని అవుతా. ప్రభుత్వ పథకాలను అట్టడుగు ప్రజలకు చేరేటట్లు చూస్తా. లంచగొండులను తూర్పార పడతా. గిరిజన ఆదివాసీ జీవితాల్లో వసంతం తీసుకొస్తా!” అని చెప్పిన.
నా మాటల్లో తీవ్రతను గమనించిందేమో..“శెభాష్ బిడ్డా!” అని నా భుజం తట్టింది శాంతక్క. అమ్మ కవర్లో నుంచి పెన్నును తీసి నా చేతికిచ్చింది.
“విప్లవం” అని పిడికిలి ఎత్తింది.“వర్ధిల్లాలి” అని నేనూ.. పెన్నెత్తి అన్నా!
మూడేళ్ల తర్వాత..“ఇదిగోండి ఇదే ఆ పెన్ను”.. అంటూ, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ప్యానెల్ ముందు టేబుల్‌పై పెన్ను పెట్టాడు ధరావత్ హుషిలాల్ నాయక్. ‘మారుమూల తండా నేపథ్యం నుంచి ఢిల్లీ వరకు రావడానికి గల ప్రేరణేంటి?’ అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తన ప్రయాణాన్ని ఈ విధంగా చెప్పుకొచ్చాడు అతను. అప్పుడే.. తన మనసు లోతుల్లో ‘అమ్మా! నీకు వందనం’ అని ప్రణమిల్లాడు.
పవన్ కుమార్ దూడం
పీడిత ప్రజల పక్షాన పోరాడే మహిళా మావోయిస్టుకు కొడుకు ఉంటే.. అతని మనఃస్థితి ఎలా ఉంటుంది? భవిష్యత్తులో అతను ఎలాంటి మార్గంలో పయనిస్తాడు? అనే రచయిత ఆలోచనకు అక్షర రూపమే.. ‘వసంతం’ కథ. రచయిత పవన్ కుమార్ దూడం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కట్కూరు ఈయన సొంతూరు. 2020లో పాత్రికేయ రంగంలోకి వచ్చారు. ప్రస్తుతం ఓ ప్రముఖ మీడియా సంస్థలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. బాల్యం నుంచే వివిధ పత్రికల ఆదివారం అనుబంధంలో వచ్చే కథలను చదివి, వాటి మీద ఇష్టం పెంచుకున్నారు. అలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో చిన్నచిన్న కథలు రాస్తుంటారు. నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీలో బహుమతి గెలుచుకోవడం ఇది రెండోసారి. అంతకుముందు 2022లో రాసిన ‘పిల్లి’ కథకు ప్రత్యేక బహుమతి అందుకున్నారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన‘కథల పోటీ-2025’లో రూ.2వేలబహుమతి పొందిన కథ.
-పవన్ కుమార్ దూడం
83744 03163