తాతను స్పెషల్ వార్డ్‌లో జాయిన్ చేసారు. రాత్రి పది దాటింది, లైట్లు తీసేసారు. చీకటిలో నీలం రంగు చిన్నిచిన్ని లైట్లు వెలుగుతున్నాయి. రాత్రి నిద్రను చప్పరించడానికి సిద్ధపడింది. ఆ కాంతిలో తాత వెండి జుట్టు మెరుస్తోంది. ఆయినకు ఇప్పుడు ఎనభై యేళ్లు దాటాయి. కళ్లు తెరిచినప్పుడల్లా అడుగుతున్నాడు..‘రైలుబండి, చీకటి, కమల’ అని.. ఒక్కోసారి ఒక్కోలా..మరోసారి ఆ మాటలూ ఉండటం లేదు.
‘ఆమె వచ్చిందా?’‘నన్ను చూడటానికి రాదులే!’‘రైలు దిగి వెళ్లిపోయింది. మళ్లీ కనిపించలేదు’..తాత అట్లా అడగడం ఇది మూడోసారి. లైట్ల వెలుగులో వార్డులోనే తాత మంచం.. గాలికి ఊగుతున్నట్లుగా అనిపించింది. ఒకప్పటి సత్యానికి, ఇప్పుడు గడ్డం వరకూ దుప్పటి కప్పారు. పొడవైన మనిషి, కళ్లు తెరిచి పైకి చూశాడు. స్పష్టంగా కాకపోయినా అన్నీ కనిపిస్తాయి. ఒక్క కమల తప్ప. లోకం నిజాయతీగా ఉన్నప్పుడు సత్యం పుట్టాడు. ఇప్పుడు దుప్పటి కింద సత్యం శరీరం.. ప్రాణంతో ఒకరికోసం ఎదురు చూస్తోంది.
“తాతా! నిద్రపోతున్నావా?”మనవరాలు కిమీ చెయ్యి పట్టుకుని కదిపి..తల అడ్డంగా ఊపాడు తాత.“కమల ఊరికి నన్ను తీసుకుపోతావా?”..“ఎక్కడుంది తాతా?”తెలీదన్నట్టు చెయ్యి తిప్పాడు.
విజయనగరం స్టేషన్లో రైలు కదులుతోంది. అది దాటిపోతే ఉదయం వరకు మరో రైలు లేదు. పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కేసాను. అది నాకు అలవాటే, ఇరవై రెండేళ్ల వయసులో అదో సాహసంగా భావించే వాడిని. ఆయాసంతో కాసేపు గేటు దగ్గర ఆగాను. ఇంతలో హడావుడిగా ఒక అమ్మాయి నా భోగీ ముందు పరుగెడుతూ.. రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. చెయ్యి జారిపోతున్నా పట్టువదలడం లేదు. హఠాత్తుగా ఆమె చెయ్యి పట్టుకొని పైకి లాగేసాను. ఇద్దరం ఒకరి ముఖాల్లోకి మరొకరం చూసుకున్నాం. మేమిద్దరం గమనించలేదు.. ఆ భోగీలో కరెంట్ లేదని. అంతా చీకటి. స్టేషను దాటిపోయే వరకూ మాకా విషయం తెలియదు. ఆ ప్యాసింజర్ రైల్లో సీటుకోసం వెతికి.. ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం. నేను కొంచెం సిగ్గుతో ముడుచుక్కూర్చున్నాను.
“నువ్వెంత వరకు”.. అన్నాను తనతో.“కంఠకాపల్లి”.. అంత చీకట్లోనూ గొంతులో భయం లేకుండా పలికింది.“నీ పేరు”.. అని అడిగాను.“కమల.. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మీ పేరేమిటో చెప్పలేదు”.. అంటూ మృదువుగా అడిగింది.“నా పేరు సత్యం.. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను”.. అన్నాను.ఒకేసారి ఇద్దరం రైలు కిటికీ నుంచి బయటికి చూసి నవ్వుకున్నాం.. గాలికి ఊగే చెట్లను చూసి. ఆమె ముఖం ఒక అస్పష్ట దృశ్యంలా కనిపించింది.బయట గాలికి ఆమె ముంగురులు ఎగిరి పడుతున్నప్పుడు వెనక్కి తోసుకుంటోంది. మౌనంతో సాగే ఈ ఇద్దరి ప్రయాణం.. మా జీవితంలో స్మృతుల సెగగా మారుతుందని ఆ క్షణం తెలియదు. ఆమె గలగలా మాట్లాడుతుంటే నన్ను నేను మరిచిపోయి.. అలా చూస్తుండి పోయాను. ఇంతలో ఏదో స్టేషన్లో రైలు ఆగింది. బయట లైట్ల కాంతి వెలుతురులో అప్పుడు చూసాను.. ఆమె అందమైన ముఖాన్ని. కళ్లమీద విశాలమైన నుదురు, ఆ నుదుటి మీద వెన్నెల ఆరబోసినట్లుంది. మా పరిచయం ఈ రాత్రిని బరువుగా మోస్తోంది. మా మాటల ఇష్టాన్ని చరిత్ర గోడలపై దశాబ్దాలపాటు రాస్తుందేమో. ఇంతలో బ్యాగులో పెన్నూ, కాగితం తీసి..“మీ అడ్రస్ రాయరా?”.. అని అడిగింది.
ఆమె మాట గొంతుకీ, పెదవులకీ మధ్య దోబూచులాడుతూ మధురంగా పలికింది.
“ఇంత చీకట్లోనా”.. అన్నాను.“కాదు. మధ్యలో మీరు దిగే స్టేషన్ కంటే ముందు స్టేషన్లో మన కిటికీ పక్కన వెలిగే కాంతిలో రాసివ్వండి”.. అంది.
“ఆ రెండు క్షణాలు చాలు మన చిరునామాల పరిచయానికి”.. “అలాగే”.. అన్నాను, ఆమె ముందుచూపునకు ఆశ్చర్యపోయి.నేను మాత్రం ఆమె చిరునామా అడగలేదు.
“మీరు దిగి వెళ్లిపోయాక.. ఈ చీకటి భోగీలో ఒంటరిగా ప్రయాణం చెయ్యలేను. ప్రయాణికులు ఉన్న మరో భోగీలోకి నన్ను ఎక్కించండి”..
నేను నా చిరునామా రాసిచ్చాక ఆమె కళ్లలో ఏదో ఆశ కనిపించింది. మౌనంతో నా హృదయం బరువెక్కింది. నా స్టేషన్ సమీపించే కొద్దీ గుండె వేగం పెరుగుతోంది. ఈ రైలు.. వేకువదాకా నా గమ్యాన్ని సమీపించకపోతే బాగుండునని నా మనసు ఆత్రుత పడుతోంది. కాసేపు మౌనంగా కళ్లు మూసుకున్నాను. ఇంతలో ఆమె..“మీ మౌనంతో మీ ఊరు దాటిపోయేలా ఉన్నారు. ఇప్పుడే ఏదో వంతెన దాటింది. అందుకే మిమ్మల్ని ఒకసారి పిలిచాను” అంది.ఇంతలో నేను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. మరో భోగీలోకి ఆమెను ఎక్కించి, నవ్వుతూ చేతులూపాను. వర్షం కురిసిందేమో.. నేలంతా తడిగా ఉంది.నువ్వు వెళ్లలేవని చెప్తూ.. భారమైన అడుగులు బరువుగా ముందుకు పడుతున్నాయి.
డాక్టర్ గారి చేతిలో రిపోర్ట్ ఉంది.“కిమీ.. నువ్వు డాక్టర్వి కాకపోతే మరోలా చెప్పేవాడ్ని. మీ తాతయ్యకు ఇకపై పరీక్షలు, మందులు అనవసరం. నీకు తెలుసు కదా!”.“అవును సార్”..“తాతకు ఎక్కువ టైం లేదని తెలుసు. అందుకే ఆయనకు ఏం కావాలో అది పెట్టమంటున్నాను. ఆయనకి ఏవో.. ఎప్పటివో జ్ఞాపకాలున్నాయి. ఆయన ఈ చివరి దశలో ఎన్నో ఏళ్ల నాటి గత జ్ఞాపకాన్ని చూసి ప్రశాంతంగా వెళ్లిపోవాలనుకుంటున్నాడు”.
రిపోర్ట్ చూడగానే కిమీకి తెలిసిపోయింది. మెల్లిగా నడుచుకుంటూ, వార్డులోకి వెళ్లి తాత పక్కన కూర్చుందామె. కళ్లు మూసుకుని పడుకున్నాడతను. ఆమె కూర్చోగానే ఆమె చేతి కోసం వెతుకుతున్నాడు. ఆమె చెయ్యి తీసుకుని రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు.“తాతా.. ఎలా ఉంది? ఇప్పుడు” అడిగింది.
“కిమీ! డాక్టర్ గారు ఏమన్నారు?” చిన్నగా నవ్వుతూ తిరిగి ప్రశ్నించాడు తాత.“నువ్వు బాగా నీరసపడిపోయావు. సమయానికి తిని, క్రమం తప్పకుండా బిళ్లలు వేసుకోమని చెప్పారు”.“నువ్వూ డాక్టరమ్మవే కదా! అబద్ధం చెప్పకూడదు. నా టైం అయిపోయింది. నాకు తెలుసు.. ఇంకా కొన్ని రోజులే అని”.
కొన్ని రోజుల క్రితం తాత మాటలు బాగానే వినపడేవి. నీరసంగా ఉన్నా, మాటలు స్పష్టంగా అర్థమయ్యేవి. రోజులు దగ్గర పడేకొద్దీ ఆయనీ లోకానికి దూరం అవుతాడేమో అనిపిస్తోంది. బహుశా ఆసుపత్రి వెలుపల ఉన్న, ఈ విజయనగరంతో ఆయనకింకా అనుబంధం ఉండదేమో?! కిమీ బలవంతంగా నాలుగు ముద్దలు తినిపిస్తుండగా.. ఐదో ముద్ద తింటూ నిద్రపోయాడు. తను భోజనం ముగించి ఇంటికి ఫోన్ చేసింది.
“అమ్మా!.. గులివిందాడ అగ్రహారం ముత్యాలమ్మ గట్టు పక్క ఇంటికి తీసుకుపొమ్మంటున్నాడు. నీకు తెలుసా?.. తాతకు తెలిసిన ఊరా?
నేనెప్పుడూ వినలేదు.. నాకు తెలిసి నాన్నకు కూడా ఆ ఊరితో సంబంధం లేదు”..కాసేపు తాత ఆరోగ్యం గురించి చెప్పి ఫోన్
పెట్టేసింది కిమీ.
సత్యం ఒంటరిగా నదివైపు చూస్తూ కూర్చున్నాడు. ఒడ్డునే వందేళ్లు దాటిన నిద్ర గన్నేరు చెట్టు కింద పడవలు కట్టి ఉన్నాయి. రేవులో జాలర్లు, ఎవరి పనిలో వారున్నారు. ఈ నది విశాలంగా వొంపు తిరిగి నీలంగా ఉంది. గట్టుని తాకుతూ వెళ్తోంది.నేనూ, కమల పరిచయమయ్యి అప్పటికే ఆరు నెలలయ్యింది. ఎన్నో ఉత్తరాలతో ఇద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. తలుచుకోకపోతే ఇదో కలలాగే ఉంది. తను చదువుకుంటూ నివసించే చోటికి నన్ను చాలాసార్లు పిలిపించుకుని.. ఆప్యాయత, అనురాగాలు కురిపిస్తుంది. కాలేజీకి రెండు రోజులు సెలవులు వస్తే, ఆమె దగ్గరికే వెళ్లిపోయేవాడిని. ఆ రెండు రోజులూ తనతో ఉన్నంతసేపూ నక్షత్రాల లోకంలో విహరించినట్లు ఉండేది. ఆదివారం బద్ధకంగా నిద్రలేచేవాడిని. అది ఓ భయంలేని నిశ్శబ్దపు నిద్ర. లేచి చూసేసరికి తను స్నానం చేసి.. నాకోసం టిఫిన్ రెడీగా చేసి ఉంచేది. ఒక ఆదివారం రోజు మేమిద్దరం కలిసి రామతీర్థం బయలుదేరాం. నెల్లిమర్లలో బస్సు దిగి గుర్రం బండి ఎక్కాం.
అక్కడికి వెళ్లడానికి ఏ రవాణా సౌకర్యాలు లేవు. రాముడు-సీతమ్మ వారితో కలిసి వనవాసం చేసిన కొండమీద కూర్చున్నాం. సీతమ్మ వారు స్నానం చేసిన కోనేరులో నీళ్లు పసుపు రంగులో ఉన్నాయి. ఆ నీళ్లు ఇద్దరం నెత్తిమీద చల్లుకున్నాం. కొంచెం దూరంలో సూది కొండమీద ఉన్న రాముడి పాదాలను దర్శించుకుందామని బయలుదేరాం. ఏనుగు ఆకారంతో ఉన్న పలుకు రాయిమీద రాముని పాదాలు చేతులతో కళ్లకు అద్దుకుని నమస్కరించుకున్నాం. ముసురు మేఘం కింద మా తలలపై చినుకుల వర్షం కురిసిందపుడు. ఆనందంతో ఇద్దరం ఒక్కసారిగా గట్టిగా హత్తుకున్నాం. సన్నని వర్షంలో తడుస్తూ గుబురు చెట్టు కింద తల దాచుకున్నాం. ఈ ఏకాంతంలో కలిసిన మాకు ఒంటరితనం దూరమైంది. మధ్యాహ్నాకాశపు గాలికి రెక్కలు మొలిచాయి. ఆకలి, మొలకెత్తే ఒక్క భూమికే కాదు.. మా ఇద్దరిలో ఆకలి మొదలైంది.
“సత్యం! రాముడు సీతతో నడయాడిన ఈ కొండమీద. నీ ఒడిలో పడుకొని, స్వర్గపు సంగీతాన్ని వినాలనుకుంటున్నాను”.. అంటూ ఒడిలో వాలిపోయింది.“నా తనువు ఈ అణువులో కలిసిపోయే వరకూ నన్ను నిద్రలేపకు. ఇలాగే పడుకోనీ. ఒకవేళ నేను చివరిదాకా రాలేకపోతే నా జ్ఞాపకాల అడుగులను నీతో చివరిదాకా తీసుకెళ్తావు కదూ!”..నేను చిన్నగా నవ్వి తలదించుకొని, ఆమె నిశ్శబ్దపు ముఖాన్ని దగ్గరికి లాక్కుని.. జీవం తొలగిపోని శక్తితో తనను జీవితాంతం ఇలాగే చూసుకుంటానని గోముగా తలనిమిరాను. నా చేతుల స్పర్శను తన గుండెకు హత్తుకుని తనను తాను మరచి పోయింది. ఆమె కళ్లలోకి చూసిన నాకు.. ఆమె చిరకాలపు సుఖతలంపై నిద్రిస్తున్నట్లుంది. వర్షంలో చెట్టుపై తడిసిన పూలు.. గాలికి ఎగిరొచ్చి మీద పడుతున్నాయి. ప్రేమతో దగ్గరికి వచ్చిన ఆ పూలను చేతితో తీసుకొని, ఆమె తలలో పెట్టాను.
“సత్యం.. ఇది కల కాదుగా!! ఇప్పుడు మనం వేరే లోకపు వెన్నెల్లో పరదా పరుచుకుని పడుకున్నట్లుంది. ఈ స్మృతిని నా చితిదాకా మోస్తానని మాటివ్వు”.. అంటూ నా చేతిని తన చేతిలోకి తీసుకుని..“నీకో బహుమతి తెచ్చాను” అంటూ బ్యాగులోంచి లాకెట్‌తో ఉన్న బంగారు గొలుసు తీసి నా చేతిలో పెట్టింది.“అబ్బో! చాలా బరువుగా ఉందే.. చాలా ఖరీదైన బహుమానం తెచ్చావే!”.“సత్యం! ఆ లాకెట్టు ఒకసారి తెరిచి చూడు. నా హృదయం నీకు కనిపిస్తుంది. ఇది జీవితాంతం నీ హృదయం మీద వేలాడుతూ ఉండి పోవాలని.. నా జ్ఞాపకంగా నీకు ఇవ్వాలని తెచ్చాను”.
లాకెట్ విప్పి చూసాను. ప్రశాంతంగా నవ్వుతోన్న నా ఫొటో ఒకవైపు, నిశ్చలమైన పెద్ద కళ్లతో చూస్తున్న ఆమె ఫొటో మరోవైపు అతికించి ఉన్నాయి. ఒక్కసారిగా ఆశ్చరపోయాను. ప్రేమ.. విశ్వాసాన్ని కోల్పోకుండా మరణించదని తెలుసుకున్నాను. నమ్మకాన్ని వధించి, నమ్మకం చచ్చి పోతుంది. కానీ, జీవిత గమనం మాత్రం ఆగదు. ఆమె విశాలమైన నుదుటి మీద ప్రేమతో ఒక ముద్దు పెట్టాను.
“సత్యం! అదిగో ఆ కనిపిస్తున్న సీతమ్మ కోనేటి సాక్షిగా నీ మెడలో వేస్తున్నాను ఈ గొలుసును. నీ జీవితం చివరి దాకా ఉంచుకుంటావని కోరుకుంటున్నాను. మన ఈ జ్ఞాపకం జీవితాంతం నెత్తుటి శ్వాస ఆగిపోయేదాకా ఇలాగే కాపాడుకుంటావని ఆశిస్తాను”.కాలం స్తంభించింది. సూర్యుడు రామతీర్థం కొండ దిగి నడిచిపోతున్నాడు.“చీకటి పడబోతోంది మనం ఇంటికి బయలుదేరుదామా”.. అంటూ ఇద్దరూ కలిసి కొండ దిగి ఇంటికి బయలుదేరారు.
సత్యం మాట్లాడడం తగ్గించేసాడని గమనించింది కిమీ. తాత కళ్లలో ఇప్పుడు నీటిపొర కనిపిస్తోంది. అప్పుడప్పుడూ కళ్లు చెమర్చేవి. కళ్లు మూసుకుని పడుకున్నప్పుడు తన పెదాల చివర ‘కమల’ అనే పేరుని పలుకుతున్నాడు. ఇప్పుడు తన ఆరోగ్యం గురించి అడగడం మానేశాడు. ఒక్కోసారి ఆమెను చూసినట్టు మాట్లాడి.. ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం తన ఇంటి చిరునామాకు వెళ్లమని అంటున్నాడు.తాత చెప్పిన చిరునామాలో ఆమె ఇప్పుడు ఉంటుందా? అయినా, కిమీ మాత్రం తన ప్రయత్నం చేస్తున్నది తండ్రితో కలిసి.ఈ రోజో రేపో నాన్న ఆమెకు తాత విషయం తెలియజేస్తాడని అనుకుంటున్నది. చివరి రోజుల్లో మనిషి మెదడు సరిగ్గా పనిచేయదని డాక్టర్ చెప్పారు. ఏవో పిచ్చి కలలు వస్తుంటాయట. తాత.. ఇవి కేవలం చివరి రోజుల్లో కనే కలలు కావు. ఇది తాత జీవితపు సుదీర్ఘ కల. తాత దగ్గర కూర్చొని ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఆయన పొడవాటి వేళ్లు లయబద్ధంగా కదులుతున్నాయి. అతని చెయ్యి ప్రాణంతో ఏదో చెప్పినట్లు అనిపించింది కిమీకి.తలగడ వైపు అతను ముఖం తిప్పి..
‘కింద ఏదో వస్తువు ఉంది. తీసివ్వు!’ అంటూకళ్లతో సైగ చేసాడు.
పాతకాలం నాటి చిన్న చెక్కపెట్టె.‘దీన్ని తెరిచి చూడనా?!’ అన్నట్లు తాత వైపు చూసింది.‘వద్దు!’ అని తన చెయ్యి మీద బలంగా నొక్కి పట్టాడు.గది కప్పువైపు దీర్ఘంగా చూస్తూ..“ఆమె వచ్చిన తర్వాత ఇది అందజేయి!” అంటూ కిమీ చేతిలో పెట్టాడు.తాత తన పెట్టెను ముట్టుకున్న అరచేతిని ముద్దు పెట్టుకుంటున్నాడు. నది దిశను మార్చుకున్నట్లు, కమల అనే పేరు గల ఆమె ఏ దిశలో ఉన్నా తాత దగ్గరికి తప్పకుండా వస్తుందని కిమీలో నమ్మకం కలుగుతోంది.. తాత పట్టుదల చూస్తుంటే.
“సత్యం.. నా గురించి నీ జీవితంలో ఏం తెలుసుకున్నావో నాకు తెలీదు. కోపంతో చిరకాలపు దుఃఖ తలంపై దిగులుతో గడిపేలా చేస్తావని అనుకుంటున్నాను. నీ కళ్లలో కనిపించే ప్రేమ, నీ చేతల్లో లేదు. మన మూడేళ్ల కలను మరిచిపోయి వెళ్లిపో.. ఇప్పటిదాకా నన్ను తాకుతున్న ఆ చేతుల్ని దూరంగా పెట్టు. నేనికపై వెన్నెల కురిసే ఈ భూమిపై సమాధిలో తల దాచుకుంటాను. నా శరీరానికి నువ్విచ్చిన జ్ఞాపకాలు వర్షంలో వెలిసిపోయాయి అనుకుంటాను. విడిపోవడానికి కారణాలు వెతికి నన్ను ప్రశ్నించకు. జ్ఞాపకం తూయ లేనంత బరువుంటుంది. కన్నీటిగా జారిపోవడమే తప్ప జీవితాన్ని ప్రశ్నించదు. జీవితం కొలతకు అందదు. కొన్ని ప్రేమలు ఇంతే!”..
ఉరితీయబడ్డ మాటలన్నీ విన్న సత్యం.. గోడకు ఆనుకొని నిలబడి బాధగా వింటున్నాడే తప్ప ఒక్కమాట కూడా బయటికి రావడం లేదు.
“కూలిన శోక శకలాలని ఎలాగూ అతికించలేం. కనుక నేను వెళ్లిపోతాను కమల. చంపెయ్యకు నన్ను నీ దుఃఖంతో. నీకు తెలియనంత దూరం వెళ్లిపోతాను. మళ్లీ రాను. ఈ గడ్డకట్టిన మనసు మీద రేగిన తుఫాను ఎప్పటికీ తీరం చేరని దుఃఖపు వానే. చీకట్లో చిగురించిన ఆనాటి మన ప్రేమ ప్రయాణాన్ని ఇదే చీకటి చిదిమేసింది చూసావా!!”.. జీవితమెంత చిత్రమైందో అనుకుంటూ, ఆ అర్ధరాత్రి చిమ్మచీకట్లో గమ్యం తెలియని బాటసారిలా గుండె బరువుతో నడిచి పోయాడు.
కుర్చీని మంచం దగ్గరికి లాక్కుని కూర్చుంది కిమీ. కళ్లు సగం తెరిచి చూస్తున్నాడు తాత. నాలుగు మెతుకులు కూడా లోపలికి వెళ్లడం లేదు. రెండు చెంచాల నీళ్లు మాత్రం తీసుకుంటున్నాడు. డాక్టర్ వచ్చి, పరీక్ష చేసి.. కిమీ భుజం తట్టి వెళ్లిపోయాడు. రాత్రి పదైంది. లైట్లన్నీ తీసేసారు. నీలం రంగు బల్బు కాంతిలో తాత చెయ్యి తీసుకుంది కిమీ. అతికష్టం మీద కళ్లు తెరిచాడు. అతని చెవి దగ్గర నోరు పెట్టి అందామె..
“తాతా.. కమల చిరునామా తెలిసింది. కాసేపట్లో నాన్నతో కలిసి వస్తుంది”.తలను మెల్లిగా ఆమె వైపు తిప్పాడు. సత్యం పెదాలు కదులుతున్నాయి. కిమీ మళ్లీ చెవి దగ్గరగా పెట్టింది.“రామతీర్థం.. కొండమీద.. చెక్కపెట్టె”..కిమీ తలెత్తి చూసింది. సత్యం తల మెల్లగా
జారిపోయింది.
చనిపోయిన సత్యం కళ్లు ఎవరి రాక కోసమో చూస్తునట్టున్నాయి. కిమీ నాలుగైదు సార్లు తాత కళ్ల మీద నుంచి తన చేతితో నిమిరింది. అయినా తాత కళ్లు మూతపడలేదు. నాన్న నిశ్శబ్దంగా తాతకు కాస్తంత దూరంలో నిలబడి ఉన్నాడు. కిమీ.. సత్యం కాళ్ల దగ్గర ఉన్న కమలను సమీపించి, తాత ఇచ్చిన చెక్కపెట్టెను ఆమె చేతిలో పెట్టింది. బరువెక్కిన గుండెతో పెట్టెను తెరిచి చూసింది.“నువ్వు ఎవరు”.. అని అడిగింది.
“మా తాత కొడుకు, కూతుర్ని”.. అంది పసిపిల్లలా.
“నీ పేరు”..
“ఎప్పుడో నేను పుట్టిన ఇరవై రోజుల తరువాత తాత ముద్దుగా పెట్టిన పేరు కమల”.ఆ మాటతో సత్యం పాదాల దగ్గర కమల విషాద వదనంతో కూలబడిపోయి..“నిదుర పోతున్నావా? సత్యం!.. నేను వచ్చానని, మాట్లాడాలని ముందుగానే వెళ్లిపోయావే! ఏటి గలగలలనడిగాను.. ఆకు కదలికలనడిగాను.. పక్షినడిగా. పండు వెన్నెల పున్నమినడిగా.. ఇన్నాళ్లూ నీ జాడెక్కడని. కడలి ఒడిలో తీరంలా సడిచెయ్యకుండా కరిగిపోయావా సత్యం. మణికిరీటంతో రత్నపీఠికపై కూర్చున్న రాజులా వెళ్లిపోయావా సత్యం?. ఇన్నేళ్లూ ఈ అనంత నీరవ నిశీధిలో, ఈ కలువ తుది నిరీక్షణ నీ కోసమేనని నీకు తెలియకుండానే నువ్వు వెళ్లిపోయావు సత్యం. అసలు నువ్వు నాకు ఏమవుతావని కలిసావు. జీవితంలో నీ జ్ఞాపకంతో నా కళ్లమీద నీటి చెమ్మ ఎందుకు రప్పించావు? ఇన్నేళ్లూ ఎడారిలో నడుస్తూ, మృత్యువు కోసం దూరాన్ని కొలుస్తున్నాను. మరణం సమీపించే లోపు, నువ్వు కనిపిస్తావో? లేదోనని ఈ దేహంలోని ఊపిరిని ఆగిపోవద్దని వేడుకుంటునే ఉన్నాను. దశాబ్దాల పాటు నా గుండెల్లో దాగిన, నీ ఎడబాటు కన్నీళ్లను, నిర్జీవమైన నీ పాదాల మీద ఒలకబోస్తాను”.. అంటూ కన్నీటితో అతని పాదాల మీద తలవాల్చి కళ్లుమూసింది.ఎంతకూ లేవని ఆమె భుజం మీద చెయ్యి వేసింది కిమీ. అప్పటికే చలనం కోల్పోయిన ఆమె నిర్జీవంగా పక్కకు ఒరిగిపోయింది.
నిదుర పోతున్నావా? సత్యం!..నేను వచ్చానని, మాట్లాడాలని ముందుగానే వెళ్లిపోయావే! ఏటి గలగలలనడిగాను.. ఆకు కదలికలనడిగాను.. పక్షినడిగా. పండు వెన్నెల పున్నమినడిగా.. ఇన్నాళ్లూ నీ జాడెక్కడని.కడలి ఒడిలో తీరంలా సడిచెయ్యకుండా కరిగిపోయావా సత్యం.
మణికిరీటంతో రత్నపీఠికపై కూర్చున్న రాజులా వెళ్లిపోయావా సత్యం?
పొత్తూరి సీతారామరాజు
పదహారేళ్ల నుంచే కవిత్వం రాయడం ప్రారంభించారు రచయిత పొత్తూరి సీతారామరాజు. కథాప్రస్థానం మాత్రం 2020 నుంచి మొదలుపెట్టారు. ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటూ, దేవాలయ పరిశోధకులుగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ 150 కవితా పురస్కారాలు, 70 కథలకు బహుమతులు అందుకున్నారు. ఉగాది పురస్కారం, ప్రతిష్ఠాత్మకమైన గురజాడ కవితా పురస్కారం దక్కించుకున్నారు. సాక్షిలో ‘జల ప్రస్థానం’, తెల్సా కథల పోటీల్లో ‘రాజవ్వ’ కథకు బహుమతులు గెలుచుకున్నారు. ఈయన రాసిన ‘భ్రమర’ కథ.. స్వాతి పత్రిక నిర్వహించిన కథల పోటీలో రూ.పదివేల బహుమతికి ఎంపికైంది. ‘గాజు బొమ్మ’ కథకు విశాలాక్షి మాసపత్రిక పోటీలో ప్రథమ బహుమతి, ‘సహజాతం’ కథకు ఆంధ్రప్రభ కథల పోటీలో బహుమతి అందుకున్నారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి
రూ.3 వేలు పొందిన కథ.
-పొత్తూరి సీతారామరాజు
99488 49607