నీ గురించి అడిగింది బాటసారీ! వీలైతే ఓసారి వచ్చివెళ్లమని చెప్పింది!’.. నా ఫ్రెండ్ సుజన చెప్పిన మాటలతో వైజాగ్ ప్రయాణానికి సిద్ధమయ్యా!‘ఇక కనిపించదు’ అనుకున్న మానస.. తన మనసులో నాపైన కాసింత ప్రేమని ‘ఇం..కా..’ కలిగి ఉందనే ఊహనిచ్చిన సుజన మాటలు మొన్నటినుంచీ నన్ను నిద్రకు దూరంచేశాయి.అప్పుడెప్పుడో మానసతో కలిసి చేయాలనుకున్న ‘ప్రేమ ప్రయాణం’ విధివశాత్తూ విఫలమై… జీవన పయనంలో ఇద్దరమూ దారితప్పిన బాటసారులం అయ్యామనుకున్నాను. కానీ, నా మనసుకు కాసింత దూరంలోనే మానస ఉందన్న వాస్తవం నాలో ఏదో కొత్తశక్తి నింపుతోంది. అవును… ‘మానస’ అనే మూడక్షరాలు చాలు. వేసవి వడగాడ్పులను సైతం హిమసమీరాలుగా మార్చే శక్తి ఒక్క మానసకూ, మానసతో గడిపే అమృత క్షణాలకే ఉంది.
ముప్పై మూడేళ్ల వయసులో ఐదేళ్ల తర్వాత ఇప్పుడిలా మానసను కలిసేందుకు వెళ్తున్నప్పటికీ.. ఇన్నేళ్లలో మానస గురించిన ఆలోచనలూ, తనతో గడిపిన సంఘటనల తాలూకు జ్ఞాపకాలూ నన్ను చాలాసార్లు ముంచెత్తాయ్! నేను ఏకాంతంగా ఉన్నప్పుడు చదువుకునేది కూడా… యూనివర్సిటీలో తనతో పరిచయం తరువాత నేను రాసుకున్న డైరీనే!ఎన్నో సాయంత్రాలు.. యూనివర్సిటీ స్టేడియం మెట్లపై మానసతో కలిసి కూర్చున్నప్పుడు… అసురసంధ్యవేళ అస్తమిస్తున్న రవి కిరణాలు నా ఎదురుగా కూర్చున్న మానస ముఖం మీదకు ప్రసరించి పసిడిరంగులో మెరిసిపోతున్నప్పుడు… మానస సౌందర్యమంతా సజీవశిల్పమై నా మనోమందిరంలో ప్రతిష్టింపబడిన క్షణాలు.. ఆ క్షణాలు శాశ్వతమై… నేను రాసుకున్న డైరీ చదువుతున్నప్పుడు మానస రూపం ప్రతిపేజీలోనూ కనిపించేదెప్పుడూ!
నా భార్య నిద్రలో ఉన్న అపరాత్రో, తను పుట్టింటికెళ్లిన ఏకాంత సమయాల్లోనో.. గతాన్ని డైరీ లోపలి పేజీల్లో వెదుక్కుంటూ ‘మానస’ గురించి ఆలోచిస్తే… మనసంతా మధురమైన ఆర్ద్రతతో నిండిపోయి, ఒక తీయని బాధలాంటి అనుభూతి కలిగేది.కాలం మానసను నానుంచి దూరం చేసిందేమో కానీ… కలలు మాత్రం నామీద జాలిపడి ఏ అర్ధరాత్రో, అపరాత్రో నన్ను ఊరడించేందుకు మానసను నా మనసు దగ్గరికి చేర్చేవి.నా ఆలోచనలతో తనకు సంబంధం లేనట్లుగా రైలు వేగంగా పరుగులు పెడుతోంది. ఎదురుసీట్లో పసిపిల్లాడి ఏడ్పుతో ఈ లోకంలోకి వచ్చాను.. మానస ఆలోచనల్లోంచి కూడా! పిల్లాడిని వాడి తల్లి జోకొడుతోంది. సరిగ్గా ‘ఎప్పుడెప్పుడు వైజాగ్ చేరుకుంటామా…’ అని గోలపెడుతున్న నా మనసును నేను జోకొడుతున్నట్లుగా!రైలు కుదుపులకు కిటికీలోంచి వీస్తున్న స్వచ్ఛమైన పిల్లగాలి తోడై మనసుకు హాయిగా అనిపిస్తూంటే… మళ్లీ మానస గురించిన ఆలోచనల్లోకి జారిపోయాను.
‘అసలీ ప్రయాణమెందుకు?!’ విచిత్రమైన ప్రశ్న నా మదిలో మెదిలింది.మానస కోసమా? ఆమె ప్రేమ కోసమా? నిజమే! అంతటి సౌందర్యాన్ని అనుభవించకపోతే ప్రేమకు ఫలమేమిటి?ఏఁవిటీ… నేనేనా ఇలా ఆలోచిస్తోంది? నా ఆలోచన నాకే చిత్రంగా అనిపించింది..! ఎప్పుడైనా మానస మీద నాకు ‘అలాంటి’ ఉద్దేశం కలిగిందా? ఏమో… అలాంటి ఉద్దేశం లేదన్న ఆత్మవంచనతో బతికానేమో!మానస కూడా నన్ను చూడాలని ఉందని ‘సుజన’తో అన్నదంటే… ‘ఈ ఉద్దేశం’తోనే అన్నదేమో! ఆమెకింకా నాపై ఆ ‘ఇది’ ఉన్నదేమో! ఎంతైనా నా కవితలకు ఫిదా అయిపోయి నన్ను గాఢంగా ప్రేమించింది కదా! ఎలా మర్చిపోగల్దు!మానసపై ఇలాంటి ‘కోరిక’ కలగడం ఇదే తొలిసారి కాకపోవచ్చేమో కానీ, ఇప్పుడు కలగటం మాత్రం గమ్మత్తుగా ఉంది! కోరిక కలగడంలో తప్పులేదేమో… వీలైతే ఆచరణలో పెట్టాలనుకుంటున్నాను కూడా! ఆ భావమే థ్రిల్లింగ్‌గా ఉంది!ఆలోచనల్లోంచి తేరుకుంటూ కిటికీలోంచి బయటికి చూశాను.దూరంగా కనిపిస్తున్న కొండల మధ్య అస్తమిస్తున్న సూర్యుడు కాషాయరంగులో నెమ్మదిగా, బరువుగా కిందకి జారిపోతున్నాడు. బహుశా… పగలంతా తనని అంటిపెట్టుకొని ఉన్న ఆకాశదేవిని వదిలివెళ్లలేక ఆమె నీలిరంగు పైట చెంగులో దాక్కుంటున్నాడేమో… అనిపించేలా పడమటి నింగి మొత్తం కొద్దిసేపట్లోనే అరుణకాంతితో నిండిపోయింది.నిజమే.. మానస మాత్రమే కాదు. తనలాగే, తన మనసులాగే ప్రకృతిలోని ప్రతిదీ మధురమే… సౌందర్యమయమే!
పెద్ద బంగళా.. పోర్టికోలో ఖరీదైన కారు పార్క్ చేసి ఉంది! అప్పుడు అర్థమైంది… మానస స్థాయి ఏ ‘స్థాయి’లో ఉందో?!నేను కనిపించగానే.. మానస కళ్లింత చేసుకొని నావంక అలా చూస్తూండిపోతుందా? లేక… సంతోషం పట్టలేక పరిగెత్తుకుంటూ వచ్చి నామీద వాలిపోతుందా? నా అంచనాలన్నీ తప్పని కాసేపట్లోనే అనుభవమైంది!తలుపులు తీసిన మానస.. మెరిసే కళ్లతో క్షణంపాటు నావంక చూసి, తలవంచుకొని కాసేపు నిల్చుండిపోయింది. ఆ తర్వాత… “బాగున్నారా… ఇదేనా రావడం?” అంది చిరునవ్వుతో.ఆశ్చర్యపోయాన్నేను… ఆమె బహువచన సంబోధనకు! తనతో నా స్నేహం కొనసాగుతున్న రోజుల్లో.. ‘ఏమోయ్ బాటసారీ… ఈరోజు కవిత ఏ వనిత గురించి రాశావోయ్?’ అంటూ నన్ను ఏకవచనంతో చనువుగా ఆటపట్టించే మానసేనా ఈమె? అనిపించింది.‘ఫణికుమార్’గా కంటే… కవిగా ‘బాటసారి’ అనే కలంపేరుతోనే నేను ఎక్కువ పాపులర్!“హలో… ఏంటలా ఉండిపోయారు?” అంటూ గట్టిగా వినిపించిన ఆమె ప్రశ్నకు గతంలోంచి తేరుకొని ప్రస్తుతానికి వచ్చాను.నేనేదో అనబోయేంతలో… “రండి… లోపలికి రండి!” అంది లోనికి దారితీస్తూ.ఆమె వెనకే లోపలికి నడిచాను. హాల్లో ఉన్న సోఫా చూపిస్తూ
“కూర్చోండి…” అంది.
కూర్చోబోతూ చుట్టూరా ఓసారి పరికించి చూశాను. పెద్ద హాలు… హాల్లోంచి పాములా పైకి పాకుతున్నట్లుగా కనిపిస్తున్న మెట్లతో కూడిన డూప్లెక్స్ నిర్మాణం, గోడలకు ఖరీదైన తైలవర్ణ చిత్రాలు, సీలింగ్ నుంచి హాలు మధ్యలోకి వేలాడుతున్న అధునాతన శాండిలియర్, పొందికగా అమర్చిన సామాన్లతో అందంగా, హుందాగా ఉంది ఇంటీరియర్ డెకరేషన్!తను నా ఎదురుగా కూర్చుంది.‘మానస భర్త బిజినెస్మెన్!’ అని చెప్పిన సుజన మాటలు గుర్తొచ్చాయ్. తలతిప్పి ఆమెవంక చూశాను నిశితంగా.కాస్త ఒళ్లుచేసింది. అప్పట్లో పురులు విప్పుకొంటున్నట్లుగా ఉండే ఆమె అందం.. ఇప్పటికి పరిపూర్ణత సంతరించుకున్నట్లుగా అప్పటికంటే ఇప్పుడే నిండుగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది.తలంటుస్నానం చేసిందేమో… నిగనిగలాడుతున్న ముంగురులు ఏసీలోంచి వీస్తున్న పవనాలకు సుతారంగా ఎగురుతూ వచ్చి అందమైన ఆమె ముఖాన్ని అలవోకగా ముద్దాడుతున్నాయి.
మనిషి ఆసాంతం అద్భుత సౌందర్యంతో, అపురూప లావణ్యంతో మెరిసిపోతోంది.‘ఈమెను పెళ్లి చేసుకోకుండా వదులుకొని పొరపాటు చేశానా?’ అన్న ఆలోచన క్షణంపాటు నా మదిలో మెదిలింది.మానస ముఖంలో కనిపిస్తున్న ఆ ‘పరిపూర్ణతే’ నన్ను కాస్త సంకోచానికి గురిచేస్తోంది. వ్యక్తిత్వం వల్లో, మెచ్యూరిటీ వల్లో వచ్చిన ఆ ‘హుందాతనం’ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.‘ఎలాగైనా సరే… ఈ సౌందర్యాన్ని ఒక్కసారైనా సొంతం చేసుకోవాలి… ఇంతటి లావణ్యాన్ని అనుభవించకపోతే జీవితం వ్యర్థం!’ అనే నిర్ణయానికి వచ్చేశాను.‘ఏమిటీ… మానసను నువ్వు నిజంగానే ప్రేమించావా? ప్రేమిస్తే… ఇలాంటి ఆలోచనలేంటి?’ అంటూ నా అంతరాత్మ నన్ను నిలదీసింది. కానీ, అది కొద్దిసేపే! ఆమెను చూస్తూంటే… నాలోని ‘మరోమనిషి’ గెలుస్తున్నట్లుగా అనిపించింది.
ఇంతలో…
“ఎక్స్క్యూజ్ మీ… జస్ట్ ఎ మినిట్!” అంటూ మానస లోపలికెళ్లింది.
“టీ తీసుకోండి !”
ఆమె చేతిలోని టీకప్పు అందుకుంటూ.. “మీవారు ఇంట్లో లేరా?” అన్నాను.“లేరు. కంపెనీ డైరెక్టర్స్ మీటింగ్ ఉందని నిన్ననే హైదరాబాద్ వెళ్లారు!” అంది నా ఎదురుగా సోఫాలో కూర్చుంటూ.“థాంక్యూ మానసా! నాకు టీనే ఇష్టమని ఇన్నేళ్ల తరువాత కూడా గుర్తుంచుకున్నందుకు!” అన్నాను… ఆమె కళ్లలోకి అదోలా సూటిగా చూస్తూ.మానస నవ్వింది..“నాకూ, మావారికీ కూడా టీ అంటేనే ఇష్టం!” అంది క్యాజువల్‌గా! అంతేకాదు..
‘నీ ఇష్టాన్ని గుర్తుపెట్టుకొని, నీ కోసమేమీ ప్రత్యేకంగా చేసింది కాదు!’ అనే అర్థం వచ్చేలా ఉందామె సమాధానం.నా మనసులో ఏదో విస్ఫోటనం! నాలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న స్వార్థపు కోరికలపై మానస విసిరిన మొదటి అస్ర్తానికి కాసేపు కోలుకోలేకపోయాను. అయినా ఏదో ఆశ..‘మానస మరోవ్యక్తికి భార్య అయినా మానసికంగా నాదే!’ అనే బలమైన విశ్వాసం!
కప్పు టీపాయ్ మీద పెడుతూ అన్నాను..“మొన్ననే సుజన చెప్పింది. నువ్వు నా గురించి అడిగావని! వీలైతే ఓసారి వచ్చివెళ్లమని నాకు చెప్పమన్నావట కూడా!” అంటూ గుర్తుచేశాను. నేనెందుకు వచ్చానన్న విషయం అస్పష్టంగా ఉంచి!‘నువ్ రమ్మంటేనే వచ్చాను సుమా!’ అన్న అహంకార పూరితమైన మాటలు నావి.“ఔను! మొన్నెప్పుడో సుజన కలిసినప్పుడు మాటల సందర్భంలో మీ ప్రస్తావన వచ్చి ‘బాటసారి ఎలా ఉన్నారు?’ అన్నాను. ‘ఎందుకు?’ అనడిగింది.. సగటు ఆడదాని లాగానే! ‘చాలా కాలమైందిగా… చూసి!’ అన్నాను…” అంటూ ఆపింది మానస… కాకతాళీయంగానే నా గురించి అడిగినట్లు తన మాటల్లో స్పష్టం చేస్తూ.నేను పేర్చుకుంటూ వచ్చిన ఆశాసౌధాలను తన ఒక్కొక్క మాటతో ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నట్లు కనిపిస్తున్న మానస వంక సూటిగా చూడలేకపోయాను. అయినా… ఇంత సులభంగా ఓటమిని ఒప్పుకొంటే ‘మగాడిని’ ఎలాగవుతాను? ‘బాటసారి’ని దుకవుతాను??“మనసెలా ఉంది?” ఆడవాళ్లపై నేను తరచూ ప్రయోగించే పడికట్టు వాక్యం వొదిలాను.
“పండు వెన్నెలలా, నిండు గోదారిలా, వసంతకాలంలోని పచ్చదనంలా… బావుంది!” అంది.నేను ఆశించని.. ఊహించని.. ఎదురుచూడని.. నాకు నచ్చని సమాధానం అది!!“ఎలా ఉంది నీ జీవితం?” అడిగాను.ఆమెలాగా బహువచనంతో సంబోధించి నాకు నేను తనకు దూరం కాదలచుకోలేదు. అంతేకాదు.. ఈ ప్రశ్నతో ‘గతం’గా మారిన మా ప్రేమను ‘వర్తమానం’లోకి తీసుకొచ్చి కనీసం కొన్ని ఘడియలైనా ఆమెను నావైపు తిప్పుకోవాలన్న స్వార్థం!“ప్రస్తుతం నా జీవితంలో ఎలాంటి వెలితీ లేదు… చాలా బావుంది!” బదులిచ్చింది మానస.వెంటనే మరో ప్రశ్న సంధించాను.. “..గతంలోని మన ప్రేమ లాగానా?” ఇది తిరుగులేని ప్రశ్న. ఆమె మీద చిన్న ‘గెలుపు’ లాంటి గర్వం నాది. కానీ… మానస నవ్వుతూ బదులిచ్చింది. “చాలా పిచ్చిప్రశ్న బాటసారిగారూ! ప్రేమ అనేది ఒక్కొక్కరి హృదయంలో ఒక్కోవిధంగా రూపుదిద్దుకుంటుంది. స్వార్థం లేనిదీ, పవిత్రమైందీ అయితే జీవితమంతా ఉండవచ్చేమో కానీ… పూర్తి వంచనతో కూడుకొంది కదా మీ ప్రేమ! ఓ చేదుగుర్తులా… నాలాంటి వాళ్ల ఆనందమయ వైవాహిక జీవితానికి మునుపు వేసిన తప్పటడుగులోంచి నేర్చుకొనే ఓ చక్కటి గుణపాఠంలా మిగుల్తుంది. అయితే.. ఆ పాఠం నేర్చుకోవడానికి కావలసిందల్లా.. కాస్తంత ఓర్పూ, మనోధైర్యం… అంతే !”
“ఎవరిదీ వంచన? నాదా? నీదా?” వెంటనే అన్నాన్నేను.“మీదే… మీ పిరికితనానిది! నేను తప్పుకొంటే చాలు అనీ… డబ్బుకోసం, ఎక్కువ కట్నంతో వచ్చే మరో అమ్మాయి కోసం… వ్యక్తిత్వం లేనివాడిలా… మీ అమ్మ అభ్యంతరం తెలిపిందన్న సాకుతో నా ప్రేమను మీ స్వార్థపు చదరంగంలో పావుగా మార్చి చిదిమేసిన మీదే వంచన అవుతుంది తప్ప.. నాదెలా అవుతుందీ?”నేను లేచి ఆమెకు దగ్గరగా వెళుతూ.. “మానసా! నేను నిజం చెప్తున్నాను… నన్ను నమ్ము! నన్ను కనిపెంచిన మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంగా మరో అమ్మాయి మెళ్లో తాళికట్టానే కానీ… ఇప్పటికీ నా మనసులో నీకు తప్ప వేరొకరికి చోటు లేదు… ఇవ్వలేను కూడా!” అన్నాను.. అందంగా మాట్లాడటంలో మరోసారి నా కళను ప్రయోగిస్తూ.మానస బదులివ్వలేదు. అటుపక్కకు తిరిగి నిశ్శబ్దంగా రోదిస్తోంది.‘అదే సరైన సమయం’ అనిపించింది.
ఇక ఆలస్యం చేయదల్చుకోలేదు. చనువుగా ఆమె పక్కనే కూర్చుని.. “క్షమించు మానసా! ఇప్పుడేమైందనీ? నేనున్నానుగా… నీకోసం నేనేమైనా చేస్తాను…” అంటూ చుబుకం పట్టుకొని ఆమె ముఖాన్ని పైకెత్తి కళ్లనీళ్లు తుడిచాను.అభ్యంతరం చెప్పలేదు మానస. ‘ఆడదాని మౌనం అర్ధాంగీకారం’ అన్న విషయం నా ‘అనుభవం’ద్వారా నేను తెలుసుకున్న విషయం! నెమ్మదిగా ఆమె భుజంచుట్టూ చేయివేసి నా గుండెలకు హత్తుకోబోయాను.
అంతే… తోక తొక్కిన తాచులా ఒక్కసారిగా నా చేతుల్ని విదిల్చుకుంటూ లేచి నిలబడింది.“మనం విడిపోవడంలో నా తప్పేముందీ?నువ్వే వేరొకరితో పెళ్లికి ఒప్పుకొన్నావుగా!” అన్నాను తత్తరపడుతూ.
“ఏమిటీ..?” బిగ్గరగా అంది మానస.. దాదాపుగా అరిచినట్లు.“అదే… నన్ను ప్రేమిస్తూనే మరొకరితో పెళ్లికెందుకు ఒప్పుకొన్నావ్?” అన్నాను బింకంగా.“నేనొప్పుకొంటే? నీ ప్రేమ.. నీ మగతనం ఏమయ్యాయ్? ‘లేచిపోదాం రా’ అంటే నేను రానన్నానా? హుఁ… వచ్చే దాన్నేనేమో… ఎందుకంటే అప్పటికింకా తమరి అసలు స్వరూపం నాకు తెలీదు కదా!” అంటున్న తననే చూస్తూ అన్నాను.. “ఇప్పుడు మాత్రం నా గురించేం తెల్సుకున్నావనీ?” ఓడిపోతున్న అసహనం, విజయం జారిపోతున్న ఆందోళనతో. “కాదు కాదు! నన్ను నమ్ము మానసా! ఇప్పటికీ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా!” అన్నాను కాస్త మెలో డ్రమెటిక్‌గా! యుద్ధభూమిలో నేలకొరిగిపోతూ చిట్టచివరిగా ప్రత్యర్థి మీదికి ఈటెను విసిరే సైనికుడి పరిస్థితి నాది! కానీ…
“నిన్ను నమ్మడం, నమ్మకపోవడం… అనే విషయాలు ప్రస్తుతం నాకనవసరం! ఇప్పుడు కూడా నీ బూటకపు మాటలతో, నీ అద్భుత నటనతో నన్ను నమ్మించాలని అనుకుంటున్న నిన్ను చూస్తూంటే… జాలేస్తోంది!” అంటూ ఏకవచన సంబోధనతో మానస మాటలు విన్నాక.. ‘ఆమెను గెలవటం ఇక దాదాపు అసాధ్యం!’ అన్న విషయం తేలిపోయింది.“అయితే… ఇంటికి పిలిపించి అవమానిస్తున్నావన్నమాట!” అన్నాను.. సాధ్యమైనంత వరకు తప్పును తనమీదకి తోసేసి, నా అస్తిత్వాన్ని నిలుపుకోవాలని నా ప్రయత్నం.ఆమె వెంటనే మాట్లాడలేదు. మానసికంగా తనను తాను స్తిమితపరచుకోవడానికీ, తనలోని భావావేశాన్ని అదుపు చేసుకోవడానికీ కాస్త సమయం తీసుకొని, ఆ తర్వాత అంది..
“మిమ్మల్ని నేను అవమానించలేదు, ఎప్పుడూ ద్వేషించలేదు. మీపైన నాకెలాంటి భావమూ లేదు కూడా! అసలు అప్పుడూ, ఇప్పుడూ నా బాధల్లా ఒక్కటే.. ‘అర్హతలేని ఓ అధముడిని నేనెందుకు ప్రేమించానా?’ అని! ప్రేమించడానికి ఎంచుకున్న వ్యక్తి విషయంలో నేను పొరపాటు చేశానేమోకానీ, నా ప్రేమలో ఎక్కడా పొరపాటు లేదు. నా ప్రేమంటే నాకెంతో అపురూపం! అలాంటి నా ప్రేమను మాటలతో అవమానించి, మీ నటనతో ఏమార్చాలని చూస్తూంటే సహించలేక పోయానంతే!”ఆమె మాటలూ, వాటిలోని తన ‘ఫిలాసఫీ’ వెంటనే అర్థంకాలేదు నాకు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మౌనంగా ఆమెవంకే చూస్తూండిపోయాను. తనలోని భావసంచలనాన్ని కుదుటపరచుకొనే ప్రయత్నంలో మౌనంగా ఉంది మానస.
నిశ్శబ్దంగా నిల్చున్న ఆమె రూపం నా కళ్లకు అద్భుతమైన పాలరాతి శిల్పంలా, దివినుంచి భువికి దిగివచ్చిన అప్సరసలా కన్పించడం… అప్పటి నా మానసిక స్థితికి కారణమై ఉండొచ్చు! నెమ్మదిగా లేచి, ఆమె దగ్గరగా వెళ్లి చుబుకాన్ని పైకెత్తి చుంబించబోయాను. అంతే… ఒక్కసారిగా నా చెంప ఛెళ్లుమంది.“మిస్టర్ ఫణికుమార్! నా భర్త ఇంట్లో లేకపోయినా ఇంతసేపూ నీతో ఎందుకు మాట్లాడానో తెల్సా… అప్పుడెప్పుడో నిన్ను ప్రేమించిన పాపానికి! నిన్ను ప్రేమించాను కాబట్టే… నీకు ఆ అర్హత లేకపోయినా, నీవెక్కడున్నా నీ ఉన్నతినే కోరుకున్నాను. ఇక.. సుజనతో ‘నిన్ను చూడాలనుంది’ అన్నది.. నన్ను నీకు శారీరకంగా అర్పించుకోవడానిక్కాదు. నాపట్ల చేసిన మోసానికి నీలో పశ్చాత్తాపం కలిగిందేమోననీ, పశ్చాత్తాపపడిన బాటసారిని నీలో చూడాలనీ! ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే కానీ… మరొకరితో కాపురం చేస్తూ, నిన్ను కూడా కోరుకునేటంత నీచురాలిని కాదు. నేనే కాదు… ‘సాధికారత’ నిలుపుకోవాలని కోరుకునే నాలాంటి వాళ్లెవ్వరూ తమ భర్తలను మోసం చేయరు!” అంటూ ఆగింది.
ఓడిపోయాను… పూర్తిగా, ఘోరంగా ఓడిపోయాను!ఒకప్పుడు.. తన మనసులో పేర్చుకున్న ప్రేమరాశుల్నీ, అపురూపమైన ఆమె ఆశల్నీ నేను క్రూరంగా తొక్కి చిదిమేస్తే… అది తన తల రాతనుకొని మౌనంగా సహించిన మానస మనసులో కాసింత ‘సానుభూతి’కైనా నేను అర్హత పొందటం… ఈ జన్మలో సాధ్యంకాదని స్పష్టంగా అర్థమైంది నాకు. ఇక జీవితంలో మానస నన్ను నమ్మదు గాక నమ్మదు!“వెళ్లొస్తాను…” అంటూ లేచాను. మానస బదులివ్వలేదు. బయల్దేరాను… అక్కడినుంచీ, ఆమె మనసు నుంచీ దూరంగా… శాశ్వతంగా! బయటికొస్తుండగా కనిపించింది… గోడకు వేలాడుతున్న పెయింటింగ్‌లోని ఓ వాక్యం.. ‘ఈ ప్రపంచంలో ఏదైతే ఎంత కష్టపడినా దొరకదో… దేన్నయితే పొందాలంటే చాలా కష్టపడాలో.. ఎంత కష్టపడినా కూడా ఏదైతే కొంతమందికే దొరుకుతుందో… అలాంటిది అపురూపమైతే.. అందులో కూడా అపురూపమైనది… ప్రేమ!నిజమే… నేను ‘కోల్పోయింది’ కూడా అపురూపమైనదే! అంతేకాదు.. నాకు ఓ కఠినసత్యం కూడా తెలిసింది. ‘గతం’ ఎప్పుడూ వాస్తవంలో కన్నా ‘జ్ఞాపకం’గా మిగిలిపోవడంలోనే స్తిమితంగా ఉండగలమని!!!
జన్ను లక్ష్మి
కవయిత్రిగా, రచయిత్రిగా సాహితీసేవ చేస్తున్నారు జన్ను లక్ష్మి. ‘శ్రీ మానస’ కలంపేరుతో కవితలు, కథలు రాస్తున్నారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. మూడు దశాబ్దాల వృత్తి జీవితంలో ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ప్రవృత్తిరీత్యా తెలుగు భాషా పరిశోధకురాలిగానూ పనిచేస్తున్నారు. తన ఆరేళ్ల రచనా ప్రస్థానంలో.. 200కి పైగా కవితలు, కథలు రాశారు. వీటిలో అధిక భాగం.. అన్ని ప్రముఖ పత్రికలు, ఆన్లైన్ వేదికల్లో ప్రచురితమయ్యాయి. యూట్యూబ్ చానెళ్లలో ప్రసారమయ్యాయి. తన కవితలలో కొన్నిటిని 2019లో ‘విరాళి’ పేరిట సంకలనం వెలువరించారు. తెలుగు విద్యార్థులకు, తెలుగు భాషను అధ్యయనం చేసే/ చేయాలనుకునే భాషా పరిశోధకులకూ ఉపయుక్తంగా ఉండేలా ‘మన తెలుగు’ పేరిట వ్యావహారిక తెలుగు భాషా వ్యాకరణం రచించారు. విపుల మాసపత్రికలో ప్రచురితమైన ‘సుభద్రమ్మ అత్త’ కథ, ‘లైవ్’ ఆంగ్ల మాస పత్రికలో వచ్చిన ‘యాసిడ్ వెర్సెస్ చిల్లీ పౌడర్’ కథలు.. పాఠకుల ఆదరణ పొందాయి. సాహితీసేవలో భాగంగా అనేక అవార్డులు, బహుమతులు అందుకున్నారు.
-‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన
‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.