అప్పట్లో మా ఇంటికి రోజుకు అయిదారుగురైనా బిచ్చమడగడానికి వచ్చేవాళ్లు. పొద్దున్నే భోజనాల వేళ లోపల ఓ నలుగురు.. ఒకళ్లు కాగానే మరొకళ్లు వస్తుండేవాళ్లు. చిరిగిన బట్టలతో, భుజానికి ఓ బట్టసంచితో.. కొందరైతే చంకలో పిల్లనెత్తుకుని కనిపించేవాళ్లు.
చేతిలో ఓ బొచ్చెతో ‘అమ్మా! తల్లీ.. బుక్కెడంత బువ్వెయ్యమ్మా!’ అని దీనంగా అడిగేవాళ్లు. ఇంకొందరు ‘అమ్మా! ఇగ జూడు.. బట్టంత చినిగిపోయింది. ఒక్క చీరియ్యమ్మా!’ అనేవాళ్లు. వాళ్లను చూస్తే ఎంతో బాధ కలిగేది. ‘అమ్మా! వీండ్లు ఎక్కడుంటరు?!’ అని అమ్మను అడిగాను. ‘పాపం.. వాండ్లకు ఇండ్లెక్కడుంటయే? ఊరి బయట చెట్ల కింద ఉంటరు. కొన్నాళ్లు ఒక ఊర్ల, తర్వాత ఇంకో ఊర్ల … ఇట్ల తిరుగుతరు’ అని చెప్పింది అమ్మ. ఓ సారి బడికి వెళ్తూ దారిలో ఉన్న చింతల తోపులో చిన్న చిన్న గుడారాల్లాంటివి వేసుకుని ఓ యాభై మందిదాకా కనపడ్డారు. చింతకొమ్మలకే ఓ చీరో, దుప్పటో వేలాడగట్టి ఉయ్యాల చేసి చిన్నపిల్లల్ని వాటిలో పడుకోబెట్టి మరో ఆరేడేళ్ల పిల్లలు వాటిని ఊపుతూ ఉండటం చూశాను. మరోపక్క మూడు ఇటుకలో, రాళ్లో పెట్టి కుండల్లో వంట చేస్తూ ఉన్నారు కొందరు. ‘అయ్యో .. పాపం! వానొచ్చినా, ఎండొచ్చినా వీళ్లకు ఎట్ల ?! ఎక్కడుంటరు?! ఏం తింటరు? ఎట్ల పండుకుంటరు?!’ అనిపించింది నాకు.
అది మొదలు ఇంటికి ఎవరొచ్చినా నేను మా అమ్మనో, నానమ్మనో పీడించి వెంటనే ఏదో ఒకటి పెట్టేదాకా ఊరుకునేదాన్ని కాదు. అసలే మా ఇంట్లో ఓ ఇద్దరు ముగ్గురికి సరిపడా అన్నం ఎక్కువ వండేవాళ్లం. చాలా ఏళ్లపాటు సాయంత్రం పూట చాకలివాళ్లు చెరువులో బట్టలు ఉతికి తెచ్చి, మా ఇంట్లో దండెం మీద వేసి అన్నం తీసుకుని వెళ్లేవాళ్లు. ఆ తరువాత రోజుల్లో ఆ అలవాటు మారింది.
సాయంత్రం దాటి రాత్రి ప్రవేశిస్తున్నప్పుడు ఒకాయన తంబూరా మీటుతూ వచ్చేవాడు. అతను ‘జీవుడు- దేవుడు’ అంటూ ఏవో పాటలు పాడేవాడు. ఆ పాటలు అర్థం కాకపోయినా వింటుంటే చెప్పలేనంత దిగులు వేసేది. నానమ్మకు ఆ పాటలు బాగా నచ్చేవి. ‘ఇంకోటి చదువు బైరాగీ!’ అంటే అతను పాడేవాడు. ఆయన గొంతు ఎంతో బాగుండేది. అయితే ఆయన కంచమో, గిన్నో తెచ్చుకునేవాడు కాడు. అమ్మ గానీ, నానమ్మ గానీ ఆయనకు అరుగు మీద విస్తరి వేసి అన్నం, కూరలు, చారు, మజ్జిగతో వడ్డించేవాళ్లు. ‘అడుక్కునేవాళ్లలో ఈయన పనే జోరుగా ఉందే!’ అనుకునేవాళ్లం.
రెగ్యులర్‌గా, కొంచెం ఘరానాగా వచ్చేవాళ్లిద్దరు. ఒకాయన తుపాకిరాముడు అయితే మరొకాయన హరిదాసు. వీళ్లొస్తే నిజంగానే ఎక్కువ పట్టుకుపోయేవాళ్లు. హరిదాసు తెలుపు, పసుపు, గులాబి రంగుల్లో ఏదైనా ఓ రంగు ధోతి, పైన లాల్చీ వేసుకునేవాడు.. తల మీద ఓ బట్ట మడిచి పెట్టుకుని దానిమీద గుమ్మడికాయ ఆకారంలో ఓ పాత్ర పెట్టుకుని, చేతిలో చిడతలు పట్టుకుని వచ్చేవాడు. ఆయనకు ఒకటే పాట వచ్చు. ‘రామ రాఘవ… టిక్కుమ్ టిక్కుమ్… ఏడుకొండలు.. టిక్కుమ్ టిక్కుమ్… వెంకటరమణ…. టిక్కుమ్ టిక్కుమ్… భద్రచ్చలములు…. టిక్కుమ్ టిక్కుమ్… రంగనాయక…. టిక్కుమ్ టిక్కుమ్… రాముల భజన… టిక్కుమ్ టిక్కుమ్… రామ రాఘవ ’… ఇలా ఇదే పాటను ఆయన పాడగా మేము ఓ ఇరవై ఏళ్ల పాటు కొన్ని వందల సార్లు విని ఉంటాం.
టిక్కుమ్ టిక్కుమ్ అనేది చిడతలు వాయించేటప్పుడు వచ్చే చప్పుడు. ఆయన వస్తున్నాడంటేనే ‘అగో … రామ రాఘవ ఒస్తున్నడు’ అనుకునేవాళ్లం. ఆ పాట తప్ప ఆ నోట మరో పాట మేము విన్నది లేదు. కాసేపు మెల్లటి గొంతుతో … అంతలోనే మేము తన రాకను గమనించలేదనుకుంటే పెద్ద గొంతుతోనూ పాడేవాడు. ఆయన న్యాయపరమైన డిమాండ్లు ఏమిటంటే గుమ్మడి కాయ పాత్రలో కనీసం అర్ధసేరుకు తగ్గకుండా బియ్యం పోయాలి. మా నాన్నవి ధోతులూ, కమీజులూ ఇవ్వాలి. తల మీద చుట్టకుదురు కోసం ఒక కలర్‌ఫుల్ పాతబట్ట ఇవ్వాలి. నాన్న కమీజు ఇచ్చేదాకా ఆగి .. అప్పుడు ‘అయ్యో , ఎప్పటికి తెల్లది, గోధుమరంగుదేనా?! దొరవారికి గులాల్ రంగుదో, కృష్ణ కలర్దో అంగీలు లెవ్వా ?!’ అనేవాడు కూల్‌గా. మా నాన్న నవ్వి ఊరుకునేవాడు గానీ, నానమ్మ మాత్రం ‘ఆఁ .. ఇగ నీ కోసం రంగు రంగుల బట్టలు ఏసుకుంటడా?!’ అనేది. మేము ఆ డ్రెస్సుల్లో నాన్నను ఊహించుకుని నవ్వుకునేవాళ్లం. మా ఆదివారపు ఆటల్లో భాగంగా నేను ఎక్కువగా ‘రామ రాఘవ’ పాత్రను వేసేదాన్ని.
-నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి