‘భయమెందుకు?’ సిటీ శివార్లలోని ఫామ్‌హౌజ్‌కు తనతోపాటు వస్తున్న రాజీతో అన్నాడు అలెక్స్. ‘పెండ్లికి ముందు ఇవన్నీ నాకు అస్సలు ఇష్టంలేదు అలెక్స్. ఈ రోజు నీ బర్త్‌డే అన్నావనే ఇలా వస్తున్నా. అయితే, మనం లిమిట్స్ అస్సలు క్రాస్ చేయకూడదు. దానికి నువ్వు ఓకే అంటేనే నేను ఫామ్‌హౌజ్‌కు వస్తా. లేకపోతే ఇప్పుడే కారు దిగుతా’ కండిషన్ పెడ్తూ చెప్పింది రాజీ. సరేనంటూ ఒప్పుకొన్నాడు అలెక్స్. అరగంటలో ఫామ్‌హౌజ్‌కు చేరుకొన్నారు. అలెక్స్ బర్త్‌డే కేక్ కట్ చేశాడు. రాజీ ప్రేమగా ఇచ్చిన గోల్డ్ బ్రేస్‌లెట్‌ను తీసుకొన్నాడు. కొంతసేపు కబుర్లు చెప్పుకొని డిన్నర్ చేశారు.‘ఓకే అలెక్స్.. ఇప్పటికే లేట్ అయ్యింది.
నన్ను ఇంటిదగ్గర దిగబెట్టు’ అడిగింది రాజీ. ‘ఇంకొంచెం సేపు ఉండొచ్చుగా’ అడిగాడు అలెక్స్. ఇంట్లో వాళ్లు కోప్పడతారంటూ చెప్పిన రాజీ వెళ్దామంటూ పట్టుబట్టింది. ఆమెతో గడపాలని అప్పటికే దృఢంగా నిశ్చయించుకొన్న అలెక్స్ అడ్డుకోబోయాడు. ఆమె ఎదిరించింది. దీంతో అలెక్స్లోని మృగం బయటకొచ్చింది. రాజీ తలను గోడకు గట్టిగా బాదడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. రక్తమోడుతున్న ఆమె స్థితిని కూడా ఏమాత్రం పట్టించుకోని అలెక్స్ మృగమయ్యాడు. విషయం బయటికి పొక్కుతుందేమోనని రాజీని గొంతునులిమి చంపేశాడు. ఆమె శవాన్ని ఫామ్‌హౌజ్‌లోని పాడుబడ్డ బావిలో పడేశాడు. అలెక్స్‌కు ఇలాంటి హత్యలు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఏడెనిమిదిమంది అమ్మాయిలను మాటల్లో పెట్టి తన కోరిక తీర్చుకొని ఇలాగే హత్య చేశాడు. ఆ తర్వాత ఆ పాడుబడ్డ బావిలో విసిరేసేవాడు.
తెల్లారింది. డిప్యూటీ కలెక్టర్ కూతురు రాజీ కనిపించడంలేదన్న వార్త సిటీ అంతా దావానలంలా వ్యాపించింది. ఆ వార్తలను అప్పటికే అలెక్స్ టీవీలో చూస్తున్నాడు. ఇంతలో అలెక్స్ తల్లి అక్కడికి వచ్చింది. ‘అలెక్స్.. ఆ పని ఎందుకు చేశావ్?’ అని సూటిగా ప్రశ్నించింది. ‘కొత్తగా అడుగుతావేం?’ అంతేసూటిగా సమాధానమిచ్చాడు అలెక్స్. ‘ఇక, నీ ఆటలు చాలు. ఆ అమ్మాయి డిప్యూటీ కలెక్టర్ కూతురు. పోలీసులు ఏ క్షణమైనా ఇక్కడికి రావొచ్చు. నీకు అర్థమవుతుందా?’ కోపంగా అంటున్న తల్లిని నిలువరించిన అలెక్స్.. ఆమె చేయిని పట్టుకొని పాడుబడ్డ బావి దగ్గరికి తీసుకెళ్లాడు. ‘చూడు.. ఇది మాయాబావి. ఇందులో విసిరేసిన రాజీ శవం కూడా ఎప్పటిలాగే మాయమైంది. ఇక, పోలీసులు ఎలా కనిపెడతారు?’ అంటూ కనుబొమలెగరేశాడు అలెక్స్. ‘పిచ్చోడా.. ప్రతీసారీ నువ్వు తప్పించుకోలేవు’ అంటూ కోపంతో కిచెన్‌లోకి వెళ్లింది అలెక్స్ తల్లి.
రాజీ తనతో ఫోన్ తీసుకెళ్లకపోవడంతో సీసీ కెమెరాల ఫుటేజ్‌ని బట్టి ఆమె జాడ సిటీ శివారులో దొరకవచ్చని పోలీసులు భావించారు. అటువైపు ఉన్న అన్ని ఫామ్‌హౌజుల్లో వాకబు చేస్తూ.. అలెక్స్ ఫామ్‌హౌజ్‌కు చేరుకొన్నారు. రాజీ గురించి అడిగారు. తెలియదంటూ అలెక్స్, అతని తల్లి చెప్పారు. ఫామ్‌హౌజ్‌లోని బావిని చెక్‌చేశారు. ఏమీలేదు. దీంతో పోలీసులు వెనుదిరిగారు.
హై-ప్రొఫైల్ కేసు కావడంతో ఈ కేసును ఇన్స్పెక్టర్ రుద్రకు అప్పగించాడు డీసీపీ సత్యనారాయణ. కేసు దర్యాప్తును మళ్లీ మొదటినుంచి ప్రారంభించాడు రుద్ర. ఇదిలాఉండగా.. గతంలో ఎన్నో హత్యలు చేసినా ఎప్పుడూ తన ఫామ్‌హౌజ్‌కు రాని పోలీసులు ఇప్పుడు ఎందుకు వచ్చారన్న అనుమానం అలెక్స్ మెదడును తొలిచేసింది. తన తల్లే విషయం బయటపెట్టిందా? అన్న అనుమానంతో ఆమెను నిలదీశాడు. తానేమీ చెప్పలేదని ఆమె మొరపెట్టుకొంది. ఇకనైనా తప్పుడు పనులను వదిలిపెట్టాలని హెచ్చరించింది. దీంతో కంట్రోల్ కోల్పోయిన అలెక్స్ ఆమెను గోడకు బాదాడు. దెబ్బ గట్టిగా తగలడంతో ఆమె చనిపోయింది. ఆమె శవం మాయమవ్వాలంటే మాయాబావిలోనే పడేయాలనుకొన్న అలెక్స్ అలాగే చేశాడు.
ఆ రాత్రి ఏమీ జరగనట్టు పడుకొన్నాడు. రాజీ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న రుద్ర.. అంతకుముందు ఏడెనిమిది మంది అమ్మాయిలు కూడా ఇలాగే మిస్టీరియస్ సిట్యుయేషన్లలో మిస్ అయ్యారని తెలుసుకొని షాక్ అయ్యాడు. దర్యాప్తులో భాగంగా అలెక్స్ ఫామ్‌హౌజ్‌కు వచ్చాడు. తనకేమీ తెలియదన్నాడు అలెక్స్. పాడుబడ్డ బావిలో దిగి చూడమని కానిస్టేబుల్స్‌ను పురమాయించాడు రుద్ర. ఆశ్చర్యం.. అలెక్స్ తల్లి మృతదేహం దొరికింది. దీంతో అలెక్స్ కాళ్ల కింద భూకంపం వచ్చినంత పనైంది. అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ శవాన్ని పోస్ట్‌మార్టంకు పంపించారు. చివరికి ఆమెను అలెక్స్ చంపేసినట్టు తేలింది. దీంతో రుద్ర.. తనదైన శైలిలో విచారించగా.. రాజీ సహా మిగతా అమ్మాయిలను కూడా తానే చంపేసినట్టు అలెక్స్ ఒప్పేసుకొన్నాడు. వాళ్ల శవాలను ఏం చేశావని రుద్ర ప్రశ్నించాడు. మాయాబావిలో పడేశానని, అవి మాయమైపోయాయని అలెక్స్ బదులిచ్చాడు. అందుకే, తాను ఇంతకాలం పోలీసులకు దొరకలేదన్నాడు. అది విన్న రుద్ర ఒకింత షాక్‌కు గురై.. ఫామ్‌హౌజ్ మొత్తం జల్లెడ పట్టాడు.
భూమిలో ఎనిమిది అడుగుల లోతులో నిర్మించిన ఓ సొరంగంలో ఎక్కడో లోపల చివరన ఏవో కాల్చేసిన ఆనవాళ్లు రుద్రకు కనిపించాయి. వాటిని ఫోరెన్సిక్ టీమ్‌కు పంపించగా రాజీ, అంతకుముందు మరణించిన అమ్మాయిలవేనని తేలింది. దీంతో అలెక్స్‌ను అరెస్ట్ చేశాడు రుద్ర. ‘మా అమ్మగనుక మీకు కంప్లయింట్ ఇవ్వకపోతే, నేను ఈ జన్మలో మీకు దొరికేవాడినే కాదు’ అంటూ అలెక్స్ అరిచాడు. ‘మీ అమ్మను గనుక నువ్వు చంపకపోయుంటే, నువ్వు ఎప్పటికీ మాకు దొరికేవాడివి కాదు’ అన్న రుద్ర మాటల్లోని ఆంతర్యం ఏమిటో కనిపెట్టారా?
సమాధానం
నిజానికి మాయాబావి అనేది ఏమీ లేదు. అలెక్స్ చంపేసిన రాజీ సహా అమ్మాయిల శవాలన్నిటినీ ఆ పాడుబడ్డ బావి నుంచి అలెక్స్ తల్లే బయటికి తీసి ఎవరికీ కనిపించకుండా సొరంగంలో కాల్చేసేది. అయితే, ఇదేమీ తెలియని అలెక్స్ శవాలను మాయాబావే మాయం చేస్తుందనుకొని మరింతగా రెచ్చిపోయాడు. ఎప్పుడైతే డిప్యూటీ కలెక్టర్ కూతురు రాజీని అలెక్స్ హత్య చేశాడో.. కొడుకు ఎక్కడ దొరికిపోతాడేమోనని అలెక్స్ తల్లి భయపడి అతణ్ని వారించింది. అయితే, కోపంలో తల్లినే చంపేసిన అలెక్స్ మాయాబావి ఆమె శవాన్ని మాయం చేస్తుందిలే అనుకొని అందులో పడేశాడు. అంతవరకూ అమ్మాయిల శవాలను మాయం చేయడంలో కీలకంగా మారిన అలెక్స్ తల్లే ఇప్పుడు శవంగా మారడంతో అలెక్స్ దొరికిపోయాడు. అందుకే రుద్ర.. ‘మీ అమ్మను గనుక నువ్వు చంపకపోయుంటే, నువ్వు ఎప్పటికీ మాకు దొరికేవాడివి కాదు’ అన్నాడు.
-రాజశేఖర్ కడవేర్గు