e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home కథలు ఈవారం కథ: పాయమాలు

ఈవారం కథ: పాయమాలు

!ఎన్ని దినాల సంది అనుకొంటున్న.. హైద్రాబాద్‌ వోయి, మెట్రో రైలెక్కి అన్ని సూసి రావాల్నని. గిన్ని దినాలకు నా కాయిషు తీరుతాంది! నిన్ననే మా బామ్మర్ది సత్నారి ఇంటికి అచ్చిన. రేపు అయితారం గదా! ఆనికి తాతిల్‌ దొరుకుద్ది. ఏంసక్క ఇద్దరం గల్సి, గల్లీగల్లీ తిరిగత్తం!
“ఓ.. ఇత్తారి బావ! జెప్ప జెప్ప శాయె దాగంటే కోపుల ఊదుకుంట తాగుతానవ్‌? గది గా సాసర్ల బోసుకొని తాగు! గిప్పటికే ఆల్శమైంది!”.
“అరె బామ్మర్దీ.. ఉడుకుడుకు శాయె దాగితే గొంతు సాప్‌ అయితది. గందుకే, ఊదుకుంట ఊదుకుంట దాగుతాన! సాసర్ల బోసుకొని తాగితే సల్లార్తది. ఎంత సేపు? అయిపాయెనే అయిపాయె! ఇగ దా.. పోదం!”.
పొద్దుపొద్దుగాల్నే ఇద్దరం గల్సి పట్నం సూసేందుకు బైలెల్లినం.
నడుసుకుంట మెట్రో రైలు టేషన్‌ కాడికి పోతానం.
“బావా.. నువ్వు గూడ హైద్రాబాద్‌ రారాదు! నా లెక్క ఎక్కడన్నా వాచ్‌మెన్‌ పని జేత్తే నెలకు పదివేల జీతం. అయితారం తాతీలు దొరుకుద్ది. గప్పుడు గీ పట్నంల ఉన్నయన్ని తిరిగి సూడచ్చు” .
“అరే సత్నారీ.. పట్నంల ఉండుడు నాకేం వాక? గా పల్లె మీద గీ పట్నం సాటత్తదా? గా పల్లెలున్న గొడ్లు, బర్లన్నిటినీ నేనే గాత్తాన. గవి గాత్తే.. కుంచెడో, అడ్డెడో జీతం ఇత్తాండ్లు. గా మందను శేన్లు, శెల్కలల్ల దోలి మంద వెడితె పైసలిత్తరు. పెండ కూడేసి అమ్మినా మంచిగనే పైసలత్తయ్‌. ఊళ్లె ఏ పండుగైనా, పబ్బమైనా మంచిగ బువ్వ పెడుతరు. అప్పాలు ఇత్తరు! శేనుకాడికి వోతే పంటల సుత కొంచెం దానంగ వెడ్తరు! గిన్ని సవులతులు ఇడ్శివెట్టి.. నేను గీడ బత్క! నువ్వంటే ఎండ పని శాతగాక.. ఇక్కడికచ్చి నీడకు కూసుంటున్నవ్‌. గది నాతోని గాదు! అప్పుడో ఇప్పుడో ఒకపారి సుట్టం సూపు లెక్క అత్తాన గదా? గది సాలు!”.
“మనసుల లేంది ఎన్నిసార్ల శెప్పినా నువ్వు అత్తవా? సరే, గట్లనే ఉండు?”.
మేము నడ్సుకుంట వోతంటే.. రోడ్డు మీదనే గొడ్లు, బర్లు, మ్యాకలు తిరుగుతానయ్‌. కొన్నయితే.. పుర్సత్‌గ వండుకొని నెమరేత్తానయ్‌.
“అరే బామ్మర్దీ.. గీ గొడ్లేందిరా? గిట్ల రోడ్ల మీదనే దిరుగుతానయ్‌. గివ్విటిని బందెలదొడ్ల దోలి, పాయమాలు గట్టించరా?”.
“గీడ గిట్లనే తిరుగుతయ్‌ బావ! గిక్కడ బందెలదొడ్లు ఎక్కడుంటయ్‌? గివ్విటిని ఎవ్వల్‌ వట్టించుకోరు! గవి రోడ్ల మీదనే తిరుక్కుంట దొరికిన శెత్తా శెదారం తింటయ్‌. అప్పడప్పుడు శెత్తతోని ప్లాస్టిక్‌ కవర్లను గూడ తిని సచ్చిపోతయ్‌. రైలు పట్టాలు దాటుకుంట.. లోకల్‌ రైలు కింద వడుతయ్‌. గివ్విటి గురించి గా ఆసాములే వట్టించుకోరు! పాలు విండుకొని బైటికి ఇడ్శి పెట్టుడే ఆళ్లకు తెల్సు. ఆళ్లకు లేని అక్కర మందికెందుకు ఉంటది?”.
“గిదేం పట్నంరా.. గింత అన్యాలమా? గివ్విటితోని జనాలకు మస్తు ఇబ్బంది అయితంది. అచ్చిపోయే మోటార్లకు గూడ ఇబ్బందే! గిదే మన ఊర్లె అయితే.. దొర్కవట్టి బందెలదోలి, పాయమాలు గట్టించెటోల్లు. గిప్పుడు గా హరితహారం శెట్లను మేత్తెనే.. దొర్కవట్టి పాయమాలు గట్టిత్తాండ్లు! గిట్ల గాదు బామ్మర్ది.. గివ్వన్నిటినీ ఒక్కదిక్కు జేశి, మున్సిపాలిటోళ్ల తానికి దోల్కవోదం. బందెల దోలుదం. ఇవ్విట్ని కొట్టుక వోయినందుకు మనకు పైసల్‌ గూడ ఇత్తరు! దా.. దా”.
“గదేంది బావ! ఊళ్లె గొడ్లుగాసిన బుద్ధి వోనిచ్చుకున్నవ్‌ గాదు. అసలే పొద్దు వోతాంది అంటే.. గివ్విటిని జమజేసి బందెలకు దోల్కవోదం అంటానవ్‌? ఎవ్వలకు లేని రంది మనకెందుకు? పట్నం సూపిత్త దా!”.
“అరే.. పట్నం ఇయ్యాల గాకుంటే రేపు సూడచ్చు. ముందైతే గివ్విటి సంగతి సూద్దం. ఖర్సులకు పైసల్‌ అత్తయ్‌! రారా!”.
‘ఓ.. బాబా అనుకుంట రోడ్ల మీద ఎంత సక్కగ వండుకున్నరే! మీ పని శెప్తా ఉండుండ్లి!’ అనుకొంట.. గొడ్లన్నిటినీ ఒక్క దిక్కు
జమ జేశిన.
“పొద్దుగాల్నే మంచిగ దొర్కవట్టినవ్‌ పో!” అని గులుక్కుంట, నాతోగూడి ఆ గొడ్లను జమజేశిండు మా బామ్మర్ది.
ఇద్దరం గల్సి ఆ గొడ్లను రోడ్డు
దాటితానం.
గది పెద్ద చౌరస్త. అక్కడ డూటి జేత్తన ట్రాఫిక్‌ పోలీసాయ్నె.. గొడ్లను రోడ్డు దాటిత్తాన మమ్ములను సూసిండు.
“ఒరేయ్‌! పొద్దున్నే ఎక్కడ దొరికిండ్లురా? నేను ట్రాఫిక్‌ కంట్రోల్‌ చెయ్యలేక సత్తాంటే.. సందులో సడేమియా లాగా గివ్విటిని గిప్పుడే రోడ్డు దాటియ్యాల్నారా? జల్ది దాటియ్యిండ్లి? దాటియ్యిండ్లి?” అని అరుత్తాన్నడు.
“అబ్బో.. ఏం మంచిగున్నవ్‌! మోటార్ల డూటే జేత్తవా? గివ్విటి డూటి నీది కాదా? మనం జెయ్యకున్నా గవాళ్లు జేత్తున్నరని మెచ్చుకునుడు బోయి లొల్లి జేత్తానవా?”.
“ఓర్నీ! పొద్దుగాల్నే భలే దొరికినవ్‌ రా! గీడ నిలుసుండి డూటిజెత్తే తెలుత్తదిరా? నిలవడలేక కాళ్లు గుంజుడు, నోట్లెకు దుమ్మువోయి ఊపిరాడక సత్తాన. జెప్ప.. జెప్ప దాటియుండ్లిరా?”.. అనుకుంట కొంచెం గరానికచ్చిండు.
గా ట్రాఫిక్‌ పోలీసు లొల్లి జేత్తాంటే.. నేను, నా బామ్మర్ది గల్సి ఆ గొడ్లు, బర్లను జెప్ప జెప్ప రోడ్డు
దాటించినం.
ఆటిని ఇంకో దిక్కు తోల్కొని పోతానమ్‌.

కొద్ది దూరం పోంగనే ట్రాఫిక్‌ పోలీసోళ్లు మోటర్లను ఆపుకుంట, చాలాన్లు రాస్తున్నరు.
మమ్ముల సూడంగనే.. “అరే గిదేందిరా? గొడ్లు, బర్లను జమ జేసుకొని గిటు గొట్టుకత్తాండ్లు. ఎన్కకు పోండ్రా!” అని అన్నరు.
“మోటర్లకు చాలాన్లు రాస్తరు గని, రోడ్ల మీద తిరుక్కుంట మనుషులను తిప్పలు వెడుతున్న గివ్విటికి పాయమాలు రాయరా? గిప్పుడు ఇవ్విటికి గూడ పాయమాలు రాయిండ్లి. గప్పుడే గీ గొడ్లను సాదుకొనేటోళ్లకు బుద్ధత్తది!” అని నేనన్న.
“గట్లనా? అయితే గివ్వి మియ్యి గాదా?” అని అడిగిండు పోలీసాయన.
“మాయైతే గిట్ల రోడ్ల మీద ఇడ్శి వెడ్తమా? మంచిగ సాదుకుంటం!”.
“అరేయ్‌ మియ్యి గానప్పుడు మీకెందుకురా ఈ లొల్లి? గిప్పటికే గీ మోటర్లు దొంగయా? దొరయా? కాయితాలు ఉన్నాయా? లెవ్వా? అని చెక్‌ చేసుకుంట.. చాలాన్లు రాయలేక సత్తానం. మీరు గీ గొడ్లను తోలుకచ్చి పాయమాలు రాయంటే ఎట్లరా? గిది మా డూటి కాదు? జల్ది దోల్క వోండ్రా అవ్విటిని” అని అన్నడు.
“రోడ్ల కావలి గాసేది మీరే కదా? గా మోటార్లకు దండుగ రాసినట్లు.. గివ్విటికి గూడ దండుగ రాయాలె!”.
“అరేయ్‌.. పొయ్యి గా మున్సిపాల్టీ దొడ్లకు దోల్కపాండ్రి. అక్కడ పాయమాలు రాయించుకోండ్రి”.
“అబ్బో మోటార్లయితే పైసస్‌ రాల్తయ్‌.. గీ గొడ్లకు రాలయని భలే ఇకమతు వడుతున్నరు! మీరు దండుగ రాయకపోతే గా మున్సిపాల్టి ఆపీస్‌కే తొలుక పోతం! రారా.. బామ్మర్ది!”.
“అరే.. నీకేమన్న పిచ్చివట్టిందా? గా పోలీసోళ్లతోటి తిట్లు దినుకుంట గీ గొడ్లను దోల్కపోవుడు అవసరమా! సప్పుడు జెయ్యకుండ ఇడ్శిపెట్టి పోదం దా!”.. అన్నడు సత్నారి.
“అందరు గిట్లనుకుంటే ఎట్లరా? ఎవలో ఒకలు పూనుకొంటనే కదా.. దారికత్తరు. దా గివ్విటిని మున్సిపాల్టి ఆపీసుకు దోల్కపోదం”..
అనుకుంట మా బామ్మర్దికి సర్ది జెప్పిన. ఆ గొడ్లను దోల్కొని మున్సిపాల్టి ఆపీసుకు పోయినం.

- Advertisement -

గొడ్లు, బర్లు ‘అంబా.. అంబా..’ అని అరుత్తానయ్‌. గా అరుపులకు లోపలున్న సారు బైటికి ఉరికచ్చిండు.
మాతోపాటు గొడ్లు, బర్లను సూసి.. “ఎవలు మీరు? గివ్విటిని గిక్కడికి ఎందుకు దోల్కచ్చిండ్రు? బైటికి దోల్కపోండ్రి!”.. అని గట్టిగనే అర్శిండు. “ఓ సారు! మీం ఎవలైతేంది గనీ, గీ గొడ్లు, బర్లు రోడ్ల మీద తిరుక్కుంట అందర్నీ ఇబ్బంది వెడుతున్నయ్‌. గందుకనే గివ్విటిని బందెల దోలడానికి తీస్కచ్చినం. గీ గొడ్లను గిక్కన్నే కట్టేసి, పాయమాలు వసూలు జేయిండ్లి! కొట్టుకొచ్చినందుకు మాకు కొన్ని పైసల్‌ ఇయ్యిండ్లి! సరేనా?”.. అని చెప్పిన.
“ఓరి మీ దుంపతెగ! గివ్విటిని గిక్కడెక్కడ కట్టేత్తం. గీ గొడ్లకు నీళ్లెవడు వెట్టాలె? మేతెవడు ఎయ్యాలె? ఛల్‌.. ఎక్కడ్నించి కొట్టుకొచ్చిండ్లో గక్కడికే తోల్కపోండ్రి..” అని గదమాయించిండు.
“మీరు శెయ్యని పని మేం జేత్తన్నం. బందెల గట్టేసి పాయమాలు వసూలు జెయ్యిండ్లంటే.. మళ్ల ఎక్కడ నుంచి తోలుకొచ్చిండ్లో గక్కడికే దోల్కవొమ్మంటున్నరు. గిది మీ డూటీ గాదా? గీ గొడ్లను బందెల కట్టేయిండ్లి?”.. కొంచెం గట్టిగనే అన్న.
“గిప్పటికే ఉన్న డూటీలు శెయ్యలేక సత్తన్నం. ‘రోడ్లమీద శెత్త’ అని ఒకలు ఫోన్‌ జేత్తరు. ‘మోరీలు పొంగినయ్‌’ అని ఇంకొకలు లొల్లి జేస్తరు. మంచినీళ్లు రాలేదని ఒకలు, దోమలని ఇంకొగలు. గీ తల్కాయె నొప్పులతోనే సత్తాంటే.. గీ గొడ్లను బందెల దోలుమని కొట్టుకచ్చిండ్రా. గిదేమన్న పల్లెటూరా.. బర్లెను కట్టెయ్య? సప్పుడు జెయ్యకుండ గివ్విటిని కొట్టుకపొండ్రి” అని కోప్పడుకుంట, మమ్ములను బైటికి దరిమిండు.
గొడ్లు, బర్లు.. ‘అంబా…అంబా’ అని అరుసుకుంట ఉరుకుతున్నయ్‌.
“గిదేం పట్నంరా సత్నారి? ఎవ్వలను జూసినా ‘నాకు అక్కరలేదు’ అన్నట్టే మాట్లాడుతున్నరు? గిదేందిరా రాముడు లేని అయోధ్య లెక్క?” అనుకుంట మా బామ్మర్ది మొకం జూసిన.
“నీకు ఎవ్వలు జెప్పినా బుద్ధత్త లేదు బావ! ఎవ్వనికి లేని అక్కర నీకే ఉన్నట్టు. నన్ను గూడ తిప్పి, తిప్పి సంపుతుంటివి. సప్పుడు జెయ్యక పోదాం దా!” అని సత్నారి గూడా కోపానికొచ్చిండు.
“గింత దూరం అచ్చినంక ఇగ ఇడ్శి పెడ్తమారా? ఈళ్లు బందెల దోలకుంటె.. నేను దోల్కవోయి బందెల కట్టేత్త! రారా దోల్కవోదం!”.
“గీడెక్కడ కట్టెత్తవు బావ?”.
“మనూరికి దోల్కవోయి కట్టేత్త!”.
“గివ్విటిని ఒరంగల్లుకు దోల్కవొయ్యి కట్టేత్తవా? నువ్వు”.
“ఔ!”.
“ఒరంగల్లు ఎంత దూరమో తెలుసునా? నూటయాభై కిలోమీటర్లు! నీకేదో పిచ్చి వట్టినట్టుంది. సప్పుడు జెయ్యకుండ పోదాం.. దా! పగటీలి అయ్యింది! ఆకలి సుర్‌సుర్‌ అంటాంది. పా బావ!”.
“గదెంత దూరం రా! రొండు దినాల్ల నడ్శి పోత? పోతాంటే పోతాంటే రోడ్డు పొంట శాన గడ్డి ఉంటది. గది మేపుకుంట వోతె ఐపాయే? గప్పుడు గివ్విటి జాడకు ఆళ్లే అత్తరు. సచ్చినట్టు పాయమాలు గట్టి, ఇడిపించుకుంటరు! నాకు మస్తు పైసలత్తయ్‌ గదా? హైద్రాబాద్‌ అచ్చినందుకు ఓ మంచి పనైంది!”.
“నాకేం పని లేదనుకున్నవా? నీకు బగ్గ బలుపున్నది. పోతే నువ్వు వో! నేను ఇంటికి పోతాన”.
“అరే! నువ్వు రాకపోతే రాకపోతివి తియ్‌. నన్ను గీ పట్నం దాటియ్యి. నా తిప్పలు
నేను వడ్త!”.
“సుట్టమై అచ్చి దయ్యమై వట్టినవ్‌ పో! ఇగ తప్పుతదా? ఊరు దాటిత్త పా”.. అని మా బామ్మర్ది అనంగనే, గొడ్లు, బర్లను ఒక్కదిక్కు జమచేసి దోల్కపోతున్నం.

గొడ్లను కొట్టుకుంట పట్నం శివారు దాటినం.
నలుగురైదుగురు పోరగాండ్లు మాకు ఎదురుంగ వస్తున్నరు.
గా గొడ్లు, బర్లతోని మమ్ములను సూసి..
“ఎవ్వర్రా మీరు! గీ గొడ్లు, బర్లను యాడికి దోల్క పోతాండ్లు?” అని అడిగిండ్రు.
“నా పేరు ఇత్తారి! ఈడు మా బామ్మర్ది సత్నారి. గీ గొడ్లు, బర్లు రోడ్ల మీద తిరుక్కుంట జనాలకు, మోటర్లకు శాన ఇబ్బంది వెడుతున్నయ్‌. ఎవలకు శెప్పినా వట్టించుకుంటలేరు. గందుకే గివ్విటిని ఊర్లెకు దోల్కవోయి బందెల గట్టేస్తం. పాయమాలు అసూలు జేత్తం! గప్పుడు గాని, గివ్విటిని పెంచుకొనేటోళ్లకు బుద్ధి రాదు!” అని శెప్పిన నేను.
“గిన్ని రోజులసంది పట్నంల గొడ్లు, బర్లు మాయంగాడానికి కారణం మీరన్న మాట? రోడ్ల మీద శెత్తాశెదారం తిని బతికే గొడ్లను ఎవ్వలకు తెల్వకుండ దోల్కబోయి కబేళాలకు
అమ్ముతున్నరా!”.
“అబ్బో మంచిగున్నరు. మీం దొంగల్లెక్క అగుపిస్తన్నమా!” అని నేను అంటుండగానే..
“ఇంకా సూత్తవేంది మామ! ఆళ్లను వట్టుకొని మక్కిలిర్గ దంతే.. ఇగ జన్మల గీ పని జెయ్యరు”.. అని వాళ్లల్ల ఒకడన్నడు.
ఆ మాటలినంగనే.. నల్గురు గల్సి మా ఇద్దర్ని దొరకవట్టి తన్నుడు షురూజేశిండ్రు.
“నీ యవ్వ! నేను శెప్తనే ఉన్న.. అద్దు బావా! అద్దు బావా! అని. నా మాట ఇన్నవు గాదు? ఉత్తపుణ్యానికి తన్నిత్తాంటివి?”.. అనుకుంట మా బామ్మర్ది ఏడ్వబట్టిండు.
ఆళ్లు నల్గురు మా ఇద్దర్ని పొర్కపొర్క గొట్టిండ్రు.
“మళ్లెప్పుడన్నా గిసొంటి పనిజేత్తే.. కాళ్రెక్కలు ఇర్శి మూలకు వడేత్తం!” అని
బెదిరించిండ్రు.
ఆ గొడ్లు, బర్లను ఎన్కకు దోల్కపోయిండ్రు.
“పాయమాలు.. పాయమాలు అనుకుంట ఈపు సున్నం జేత్తివి! నీ ఇంట్ల పీనుగెల్ల!” అని శాపాలు వెట్టుకుంట ఏడుత్తాండు సత్నారి.
“థూ.. గీళ్లకు దిమాక్‌ లేదురా సత్నారి! నీ ఏడుపే ముంగల వడే! ఇగ మెల్లమెల్లగ
వోదాం లే”.. అనుకుంట మా బామ్మర్ది రెక్కవట్టి లేపుకొని వోయిన!

ఆకుల రాఘవ
ఆకుల రాఘవ స్వస్థలం హైదరాబాద్‌. కవి, సినీ రచయిత, దర్శకుడిగా సుపరిచితులు. 1980 నుంచి కవితలు, 1985 నుంచి కథలు రాయడం మొదలుపెట్టారు. కలం పేరు ‘ప్రసన్న’. ఈయన రాసిన మొదటి కథ ‘వెలుగు రేఖలు’. ‘కాలం మారినా స్థానం మారలేదు’, ‘ఇడుపు కాయితం’, ‘ఈ పిల్లకు పెళ్లవుతుందా?’, ‘నా ఇంట్లో నేను ఒంటరి’ కథలు పలు వెబ్‌సైట్లలో ప్రచురితమయ్యాయి. ‘వింత కాపురం’, ‘మరణాన్ని ఆపగలిగితే’ కథలు బహుళ ప్రజాదరణ పొందాయి. మరిన్ని కథలు వివిధ సంకలనాల్లో అచ్చయ్యాయి. నోముల సత్యనారాయణ కథల పోటీలో ‘కాలం మారినా స్థానం మారలేదు’ కథకు నగదు బహుమతితోపాటు సన్మానం అందుకొన్నారు. తెలుగు అకాడమీ నిర్వహించిన ‘గుఱ్ఱం జాషువా కథల పోటీ’లో ‘ఇడుపు కాయితం’ కథకు బహుమతి దక్కింది. ‘జననం ఒక రణరంగం’, ‘మనో గీతం’ కవితలకు బహుమతులు అందుకొన్నారు. కొన్ని సినిమాలకు కథా సహకారం అందించారు. రాజకీయాల నేపథ్యంలో bharathamahan.com పేరుతో సినిమా రూపొందించారు.

-ఆకుల రాఘవ ,73824 41792

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement