కొత్తపేట నుండి బయల్దేరిన కారులో కళ్లు మూసుకొని కూచున్నాడు డబ్బు ఏండ్ల ఐలోని. కళ్ల ముందు తానుపుట్టి పెరిగిన ఇల్లే కనిపిస్తున్నది. కాంక్రీట్వనం లాంటి మహానగరంలో ఉన్న ఐలోనికి.. సొంతూరికి వెళ్తున్నానన్న సంతోషం లేదు. ఊరుకు వెళ్లి స్నేహితులను చూద్దామన్న సంబురమూ లేదు. ముప్పై ఏళ్ల క్రితం కోల్పోయిన తన ఇంటిని ఎలా దక్కించుకోవాలన్న ఆలోచన తప్ప.. మరేమీ లేదు.
ఇల్లు.. తాను పుట్టకముందు తండ్రి కట్టిన పెంకుటిల్లు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని ఓ గ్రామంలో.. కూలడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు. అయినా తాను ఆ ఇంటిని కోరుకుంటున్నాడు. ఎందుకంటే.. అది తను పుట్టిన నేల. ఆ వాకిట్లోనే తాను అంబాడటం నుంచి పరుగులు పెట్టడం దాకా నేర్చుకున్నాడు. తన చెల్లెలు, చిన్నాన్నల పిల్లలతో కలిసి ఆడుకున్నాడు, పాడుకున్నాడు. ఆ వాకిట్లో నులక మంచంలో పడుకొని తన తాత, తండ్రి, చిన్నాన్న కథలు చెబుతుంటే.. ‘ఊ’ కొట్టేవాడు. ఆ వాకిట్లోనే.. తనకు కథలంటే ఇష్టం ఏర్పడింది. ఆ వాకిట్లో ఎంతోమంది జానపద కళాకారులు కథలు చెప్పేవారు. ఆ వాకిలి ఓ కథల లోగిలి. అది తనకెంత అనందాన్నిచ్చింది? ఆ అరుగు మీద కూచొనే చదువుకున్నాడు. అక్కడే తనకు చదువుమీద, పుస్తకాలు, సాహిత్య పఠనం మీద ఆసక్తి పెరిగింది. ఆ లోగిలే తనను రచయితను చేసింది.
ఊరికి, తన వారికి ఉపయోగకరంగా బతకాలని చెప్పేవాడు తన తండ్రి. ఆయన ఊళ్లో పెద్దమనిషి. ధర్మరాజులా పంచాయితీలు చెప్పేవాడని ఊళ్లో అనుకునేవారు. నాన్న ప్రభావం, గుణాలు తనపైనా పడ్డాయి. అమ్మ భాష, తల్లి హృదయం తనపై చెరగని ముద్రవేశాయి. ఆ సాయమాన్లో అమ్మ పెట్టిన బువ్వను, కూరను దేన్నయినా ఇష్టంగా తినేవాడు. పండుగరోజు మటన్ వండితే అమ్మ తనకు కొసరి కొసరి తినిపించేది. అలా.. తల్లిదండ్రులు తనను ప్రాణాధికంగా ప్రేమించారు. తాను కూడా వాళ్లను అంతకంటే ఎక్కువగానే ప్రేమించాడు.
కారు ప్రజ్ఞాపూర్ దగ్గర ఓ హోటల్ ముందు ఆగింది. “ఏంటి నాన్నా! రెండు గంటలుగా ఆలోచిస్తూనే ఉన్నావు?” అన్నాడు ఐలోని కొడుకు అనిల్‌కుమార్. “ఇంకేముంటది బావకు ఆలోచించడానికి. ఇల్లు, ఊరు, బాల్యం.. ఇవే కళ్ల ముందు తిరుగుతుంటాయి. ఇప్పుడైతే ఇల్లు కోసం పోతున్నాం కదా! ఇల్లే అయ్యుంటుంది…” అన్నాడు ఐలోని బావమరిది నరేందర్. “నా బాధ నీకర్థం కాదు నరేందర్! అనిల్ తరం వాళ్లకైతే అసలే అర్థం కాదు” “అవును నాన్నా! మీరేంటో మీ కొడుకునైన నాకే అర్థం కావడం లేదు. కూలిపోయే దశలో ఉన్న.. తాతల కాలంనాటి ఆ మట్టి పెంకల ఇంటి కోసం మీరు ఎందుకింత తపిస్తున్నారో నాకసలే అర్థం కావడం లేదు..”అనిల్ దిక్కు కోపంగా చూసాడు ఐలోని. “ఆ ఇంట్లో మీకు మట్టి, పగిలిపోతున్న పెంకలు, విరిగిపోతున్న వాసాలే కనిపిస్తున్నాయిరా? కానీ, అందులో నాకు మా అమ్మ తినిపించిన బువ్వ, నేను తొలిగా అడుగులు వేసిన పాదముద్రలు, నన్ను భుజాలపై ఎత్తుకొని తిరిగిన తాత, ‘నా మనుమడు సిపాయి’ అంటూ గొప్పగా చెప్పుకొన్న నానమ్మ, చిన్నాన్నలు-చిన్నమ్మలు, కతలు, శాత్రాలు, నీతివాక్యాలు చెప్పి నన్నో మనిషిగా తీర్చిదిద్దిన మా నాన్న, నాతో ఆడిపాడిన తమ్ముళ్లు, చెల్లెళ్లు.. వాళ్ల ప్రేమానురాగాలు కనిపిస్తున్నాయిరా?” అన్నాడు దుఃఖపూరితమైన గొంతుతో.“బావా! మీ ఆవేదన మాకర్థమైంది. మీకు ఆ ఇంటితో ఉన్న అనుబంధాలు మరిచిపోదగ్గవేం కాదు. కానీ, శిథిలావస్థలో ఉన్న ఆ ఇల్లును కూలగొట్టాల్సిందే కదా! కొత్త ఇల్లు కట్టుకోవాల్సిందే కదా! అంతమాత్రాన అదే ఇల్లు కావాలని పట్టుదలెందుకు?” అన్నాడు నరేందర్.
“నేనా ఇల్లు కావాలంటున్నది నా జన్మస్థలం కోసం. అదే స్థలంలో ఓ చిన్న ఇల్లు కట్టుకోవడం కోసం. మా పూర్వికుల జ్ఞాపకాలను ఆ ఇంట్లో పదిలపరచడం కోసం.. ఇప్పుడర్థమైందా నేనా ఇల్లును ఎందుకు కావాలంటున్నానో? ఆ స్థలం కోసం..” అన్నాడు ఐలోని.“యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా రిటైర్మెంట్ తీసుకొని, హైదరాబాద్‌లో ఉంటున్న నీవు.. ఆ మారుమూల పల్లెలో రెండు గదులేసుకొని ఉంటావా బావా? ఇదేం పిచ్చి?”“అవును! నాది పిచ్చే నరేందర్? ఆ పిచ్చి ముదిరింది కూడా! నా మూలాలను మరిచిపోకుండా నా ఊళ్లో, నేను పుట్టిన చోటే చివరిరోజులు గడిపి చావాలనుకోవడం నా పిచ్చే. వెళ్లండి.. అందరూ గ్రామాలొదిలి పట్టణాలకు వెళ్లండి. కానియ్.. ఊళ్లు మట్టిదిబ్బలుగా మారనీయ్. పాత ఇళ్లన్నీ కూలిపోయి ధ్వంసం కానీ..” అన్నాడు ఐలోని ఆవేదనతో, ఆవేశంతో..“మామా! దేశమంటే, ఊరంటే ప్రేమ, అభిమానమున్న తరం వాళ్లది. అందుకే, మేమెన్ని చెప్పినా వినకుండా ఊళ్లోని ఇల్లు కావాలంటున్నాడు. ముప్పై ఏళ్ల క్రితం వదిలిపెట్టుకున్న ఇంటిని ఇప్పుడున్న ఖరీదుకైనా కొనుక్కుంటానంటున్నాడు. ఈ వయసులో ఆయన్ని బాధ పెట్టడం దేనికి? తనకు ఇష్టమున్నట్టే చేద్దాం.. ఇక ఆ విషయం గురించి చర్చ వదిలెయ్యి” అన్నాడు అనిల్.టిఫిన్ ముగించి కారెక్కారు వాళ్లు..
ఐలోనికి ఆ ఇంట్లోని అణువణువుతో అనుబంధముంది. చిన్నాన్నలు వేరుపడి పశువుల కొట్టంలోకి వెళ్లినపుడు తాను చాలా బాధపడ్డాడు. కానీ, మూడు కుటుంబాలకు ఆ ఇల్లు సరిపోదని వేరుపడక తప్పలేదు. ఇల్లు తన తండ్రి వంతుకే రావడంతో సంతోషపడ్డాడు. ఆ ఇంట్లోనే తన చెల్లి పెళ్లి, తన పెళ్లి జరిగింది. ఉద్యోగరీత్యా దూరప్రాంతానికి వెళ్లినా, తనకా ఇంటిపై ఎంతో ప్రేమ. ఊరికెళ్తే ఇల్లును చూసి పులకింతకు గురయ్యేవాడు.కానీ.. కానీ.. ముప్పై ఏళ్ల క్రితం జరిగిందేంటి?ఓ రోజు తన ఊరివాడైన నీలన్న.. నగరంలోని తన ఇంటికొచ్చాడు. వస్తూ వస్తూ పిడుగులాంటి వార్త మోసుకొచ్చాడు. “ఐలోనీ! మీనాన్న మీకున్న రెండెకరాల పొలం, ఇంటిని మీ చెల్లెకు రాసిచ్చాడు” అని చెప్పాడు.ఆ మాటలతో తలపై పిడుగు పడినట్టయింది ఐలోనికి. తను అమితంగా ప్రేమించే నేలను తనకు కాకుండా చేసిన తండ్రిని ఏమనడానికీ మనసు రాలేదు. ఊళ్లో ఎంతోమందికి సహాయం చేసిన నాన్న.. తన విషయంలో ఎందుకిలా చేసాడు? నాన్నకేమైంది? అసలేం జరిగింది? అదే మాట నీలయ్యతో అన్నాడు ఐలోని.
“తమ్మీ! ఇప్పుడు ఎవ్వల్నీ ఏమనలేవు. ఏమన్నంటే మంచి పేరు ప్రతిష్ఠలున్న నీకు.. భూమికోసం తల్లిదండ్రులను వేధించావన్న అపవాదు. ఊర్కుందామంటే ఊళ్లో ఉండటానికి నీడ కూడా లేకుంటవుతుంది..” అన్నాడు నీలయ్య.“ఎందుకూర్కోవాలి బావా?! తల్లిదండ్రులైతే ఉన్న భూమిని బిడ్డకు తగులబెడితే నోర్మూసుకొని ఉండాలా? బిడ్డ మీదెంత ప్రేమున్నా ఉన్న కొంప కూడా లేకుండా చేస్తారా? కోర్టుకు పోయి అయినా సరే.. అవన్నీ లాక్కోవాల్సిందే. ఈనె ఊర్కున్నా నేనూర్కోను” అంది ఐలోని భార్య కమలమ్మ.
“ఏమంటున్నావు కమలా! నా తల్లిదండ్రులతో యుద్ధం చేయాలా నేను. ముసలి వయసులో వాళ్లను కోర్టుల చుట్టూ తిప్పాలా? అది నేనెప్పటికీ చేయను. చెల్లెకు చిన్నతనంలోనే పెళ్లయింది. బావ ప్రతిసారీ ఏవేవో తెమ్మని వేధించుక తినేవాడు. చెల్లె కష్టపడకూడదు ఇవ్వమని నేనే మా నాన్నతో చెప్పేవాన్ని. అప్పట్నుంచి అదే విధానం కొనసాగుతుంది. చివరికి ఇల్లు కూడా ఇచ్చేస్తాడని నేననుకోలేదు”“మీ అలుసుతోనే మీ వాళ్లు మీకు ఊళ్లో ఏం లేకుండా చేస్తున్నారు. అయినా మీ అమ్మా నాన్నలపై మీకు అంతులేని ప్రేమ. వాళ్లను ఒక్కమాటా అననీయరు. మనకు ఏమిచ్చారని వాళ్లపై అంత ప్రేమండీ!” అంది కమలమ్మ.
భార్య మాటలు హృదయంలో శూలాల్లా గుచ్చుకుంటున్నాయి ఐలోనికి. ఇదేం ప్రశ్న? తనకేం ఇవ్వలేదని?? ఆస్తి ఇవ్వనంత మాత్రాన ఏమీ ఇవ్వనట్టా? “కమలా! నాకు జన్మనిచ్చారు. అల్లారుముద్దుగా పెంచారు. నన్ను చదువుకోవద్దని శాసించిన దొరలను ఎదిరించి బడికి పంపించారు. గొర్రెల కాపరిగానో, వ్యవసాయదారునిగానో ఉండాల్సిన నేను.. వాళ్ల వల్లే ప్రభుత్వ ఉద్యోగినయ్యాను. సమాజంలో గౌరవంగా బతుకుతున్నాను. ఇంకేమివ్వాలోయ్?” అన్నాడు ఐలోని.“కమలా! తమ్మీ! ఈ వాదనలన్నీ వద్దు. ఏమన్నుంటే ఊళ్లో మాట్లాడుదాం..” అన్నాడు నీలయ్య. “సరే నీలన్నా! రేపే ఊరెళ్దాం. నలుగురిని పిలిచి మాట్లాడుదాం”తెల్లవారే ఊరెళ్లారు.నలుగురైదుగురు పెద్ద మనుషులను జమ చేసారు.“ఊళ్లో పెద్దమనిషి. మీ నాన్న మీదనే పంచాయితీ పెడుతావుర ఐలోని..?” అన్నాడు మెండె రాజన్న.“నువ్వు చదువుకున్నోనివి. నౌకరి సేత్తన్నవు. కరీంనగర్ల ఇల్లు గట్టినవు. గీ ఇల్లుంటేంది? లేకుంటేంది? మీ పిల్లలు ఇక్కడికొస్తరా? మట్లె, పొలాలల్ల తిరుగుతరా? పోనియ్యలేవు” అన్నాడు రామయ్య పటేలు.“భలే పెద్దమనుషులున్నరు మీరు. పుట్టినూల్లె, తను పుట్టి పెరిగిన ఇల్లును పోగొట్టుకొమ్మంటరా? ఏం మాట్లాడ్తున్నరు. వాన్ని ఊరికి రావద్దంటరా?” అన్నాడు వేంసాని వెంకటయ్య.“ఐలోనికి నౌకరుంది గద! దూరాన ఉంటుండాయె! తల్లిదండ్రులకు ఏ ఆపతచ్చినా ఊరి పక్కనున్న ఐలోని చెల్లెనే చూసుకుంటుంది కద! మల్ల ఆమెకు ఇల్లు లేకపాయె. ఇస్తేం బోతుంది?” అన్నాడు గడ్డం లస్మయ్య.
“పొలం పోతే పోనియ్యి. నాకు ఇల్లు కావాలె. నేను దూరంగున్న.. నిజమే! అయినా అమ్మానాన్నలను చూడందెప్పుడు? నెలకోసారి వస్తూనే ఉన్నాను కదా! నాన్నకు పంటమీద, గొర్లమీద వచ్చే పైసలతోనే నేను లేనప్పుడు చెల్లెవాళ్లు చూసుకుంటున్నారు. అందుకోసం పొలం రాసిచ్చాడు కదా! దాన్ని అడుగుతలేను. ఇల్లు మాత్రం నాకు కావాలి” అన్నాడు ఐలోని.“ఐలోనీ! నువ్వు మంచిగానే సంపాయించుకుంటున్నవు. కన్నాగురంల ఇల్లుంది. నీ పిల్లలు పట్నంలనే ఇల్లు కట్టుకుంటరు. గీ పల్లెటూల్లేం పాడైంది? ఇల్లును చెల్లెకిడ్సి పెట్టు. అదే మమ్ముల సూసుకుంటది..” అంది ఐలోని తల్లి ఈరవ్వ.“గాన్నేంది బతిమిలాడేది. నా ఇల్లు, నా భూమి నా ఇష్టం. నా ఇష్టమున్నోళ్లకు ఇచ్చుకుంట. వానికి గూడ రెండెకురాలు రాసిచ్చిన గద ఎప్పుడో..? ఆ ఇల్లు, పొలం మాత్రం నా బిడ్డకే. బాజాప్త రిజిస్ట్రేషన్ చేస్తి” అన్నాడు రాజమల్లు. ఈరవ్వ కూడా అదే మాటంది. తల్లిదండ్రులే ఒప్పుకోకుంటే ఇక తానేం చేసేది లేదనుకున్న ఐలోని కళ్లవెంట పటపటా నీళ్లు కారాయి.
కొద్దిసేపు ఎవరేం మాట్లాడలేదు.“సరే! అయిందేదో అయిపోయింది. తల్లిమీది బంగారం, ఇల్లు, పొలం దొబ్బుతంది కాబట్టి రాజమల్లు-ఈరవ్వను బిడ్డే చచ్చేదాక సాది పారెయ్యాలె. ఐలోనికి ఇష్టముంటె వస్తడు. లేకుంటె లేదు. గిట్ల కాగిదాలు రాసి సంతుకాలు తీసుకుందాం..” అన్నాడు రాజిరెడ్డి.“అంటే.. నాకు మా తల్లిని చూసుకునే అవకాశం కూడా లేదా? నాకిచ్చిన రెండెకరాల భూమి కూడా వద్దు. మా చెల్లెకే ఇయ్యిండ్రి. నేను మా అమ్మను తీసుకొని పోత..” అన్నాడు ఐలోని.“అవునే ఈరవ్వా! నీ కొడుకుతోని పోతావె..?”“నేనుబోను. నా బిడ్డతోనే ఉంట..”ఆ మాటతో భారమైన హృదయంతో ఊర్నుంచి వెళ్లిపోయాడు ఐలోని.
కరీంనగర్లో ఆగి భోజనం చేసారు వాళ్లు. కారు గోదావరిఖని రోడ్డుకు మళ్లింది. ఐలోని ఆలోచనా పరంపర కొనసాగుతూనే ఉంది.పంచాయితైన ఆరునెలల్లోనే తండ్రి చనిపోయాడు. ఆ ఇంట్లో ఐలోని చెల్లె కూతురు ఉంటున్నది. తల్లికోసం అప్పుడప్పుడూ ఊరెళ్లి వస్తున్నాడు. ఐలోనికున్న భూమిని కూడా.. మేనకోడలు భర్తే తక్కువ ధరకు కాజేసాడు. ఇప్పుడు ఐలోనికి ఊళ్లో ఏమీలేదు. తల్లి కొరకు ఊరెళ్లి వస్తున్నా.. తనది కాని ఆ ఇంట్లో ఉండటానికి మనసొప్పడం లేదు. తల్లిని వాళ్లు సరిగా చూడటం లేదని తెలిసినా.. ఆమె నుంచి ఏ ఫిర్యాదూ లేనందువల్ల మౌనంగానే ఉండాల్సి వచ్చింది. ఊళ్లో తనకేం లేకున్నా ఊరిపై ప్రేమ తగ్గలేదు ఐలోనికి. తండ్రి మరణించినప్పుడే కాదు.. తల్లి మరణిస్తే కూడా కర్మ ఖర్చులవీ తానే పెట్టుకున్నాడు.
కొన్నేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఐలోని పదవీవిరమణ పొంది పదేళ్లయింది. అయినా ఊరంటే ప్రేమ, ఇల్లంటే మమకారం తగ్గలేదు. వయసు పెరుగుతున్నకొద్దీ.. ఆ ఇంట్లోనే చనిపోవాలన్న కోర్కె ఐలోనిలో బలీయమవుతూ వస్తున్నది. “నాన్నా! మీ ఊరు.. కాదు కాదు. సారీ! మన ఊరొచ్చేసింది” అన్నాడు అనిల్‌కుమార్ బతుకమ్మ వాగు రోడ్డు పైనుండి కారు నడుపుతూ. ఆ మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు ఐలోని. “అప్పుడే ఊరొచ్చేసిందా? కారాపు.. యాదవ సంఘంలోనే అందరూ కలుస్తామన్నారు. పక్కకు బండాపు” అన్నాడు.రెండుగదుల డాబా ఇంటిముందు కారు ఆగింది. ముగ్గురూ కారు దిగారు. “రా బాపూ. అందరూ మంచిగున్నరా!?” అన్నాడు మహేశ్.“మహేష్! ఎలాగైనా నాకా ఇల్లు కావాలి. సర్పంచ్‌కి చెబితే కులంలోనే మాట్లాడుకొమ్మని చెప్పిండు కదా! మీరెళ్లి కులపు పెద్ద మనుషులను తీసుకరాండ్రి” అన్నాడు ఐలోని..అరగంటలో రావాల్సిన వాళ్లంతా వచ్చారు. “మా చెల్లె-బావ రాలేదా శీను. వాళ్లకు చెప్పుమని అన్నకదా! నేను ఫోన్ చేసినా మాట్లాడలేదు. ఇంటికెళ్లి మాట్లాడుదామంటే ఒప్పుకోలేదు..” అన్నాడు ఐలోని.
“బాపూ! నువ్వట్టి పిసోనివి కానీ, నువ్వు మాట్లాడుతానంటేనే ఇంటికి రానియ్యని వాళ్లు పంచాయితీకి రమ్మంటే వస్తారా చెప్పు? మీ ఇంట్లో ఉంటున్న వాళ్ల అల్లుడు రమేశ్, బిడ్డ లక్ష్మి వచ్చిండ్రు కదా! వాళ్లతోని మాట్లాడుదాం..” అన్నాడు యాదవసంఘం అధ్యక్షుడు మారం శీను.“ఏంది మాట్లాడేది? మాజీ సర్పంచ్, ఇప్పుడున్న సర్పంచ్, జడ్పీటీసీ సుత నాతోని మాట్లాడిండ్రు. అందరికి నేనొక్కటే మాట చెప్పిన. ఆ ఇల్లును మా అత్త నా భార్యకు ఇరువై యేండ్ల కిందనే రాసిచ్చింది. మీరేమైన అడుగుతే.. వాళ్లనే అడుక్కోండ్రి. నేనా ఇల్లును వదిలిపెట్టేది లేదని చెప్పిన కద! మల్ల గీ పంచాయితేంది?” అన్నాడు రమేష్. అవే మాటలంది లక్ష్మి. “మా అవ్వ ఉన్నప్పుడు మా చెల్లె అన్న మాటల్నే ఇప్పుడు దాని అల్లుడు, బిడ్డ అంటున్నరు..”“ఏమన్నవు బాపూ అప్పుడు నువ్వు?” అన్నాడు మెండె పోచాలు.“ఆ భూమి, ఇల్లు వల్ల మా రెండు కుటుంబాల మధ్య సంబంధాలు నాశినమైనయి. అది నాకిష్టం లేదు. వాళ్లింట్లో శుభకార్యమైతే నాకు ఆహ్వానం ఉండదు. నేను ఆహ్వానిస్తే వాళ్లు రారు. తప్పు చేసామన్న భావం మా చెల్లెవాళ్లను వెంటాడుతున్నది. అందుకే ఒక్కమాటన్న.. పొలం సంగతి వదిలెయ్! నాకవసరం లేదు. ఇల్లును నాది నాకు వదిలిపెట్టు. ఆ ఇల్లుకెంత ఖరీదవుతుందో తీసుకొనైనా వదిలిపెట్టు. ఎప్పట్లాగా మన సంబంధాలను కొనసాగిద్దాం. అందరం కలిసుందాం. గిప్పుడూ గదే మాట అంటున్న!” అన్నాడు ఐలోని.
“ఏం అంటవు రమేష్! ఐలోని మాటల్ల న్యాయముంది! ‘ఆ ఇల్లును కొనుక్కుంటా’ అంటున్నాడు. తనిల్లును తాను కొనుక్కుంటానంటే ఇవ్వననడం న్యాయమేనా? ఐలోనికిప్పుడు డబ్బు దాటినయి. ముసలితనంలో తాను పుట్టినచోట కొంతకాలం ఉండాలన్న సెంటిమెంట్. నీ ఇబ్బందేంటి?”పోచాలు మాటలకు ఏం సమాధానమివ్వాలో అర్థం కాలేదు రమేష్‌కు.“నా బిడ్డ పెండ్లుంది. ఇప్పుడు ఇల్లు లేకుంటెట్ల. ఇల్లొదిలి నేనెక్కడుండాలె?” అన్నాడు.“గట్లయితే బిడ్డ పెండ్లయి, ఇల్లు కట్టుకునే దాకా ఆ ఇంట్లోనే ఉండనీయి. ఆ తర్వాతే నేను తీసుకుంటా. ఇల్లడుగు గుంటనర భూమే. రమేష్‌కు నేను ఇదే వాడకు రొండు గుంటల భూమి కొనిస్తా” అన్నాడు ఐలోని.ఆ మాటలందరికీ నచ్చాయి. అందరి ముఖాల్లో సానుకూలత కనిపించింది.“రమేష్, లక్ష్మీ! ఐలోని మాటల్లో న్యాయముంది. ఇంకా మీకున్న అభ్యంతరమేంటి?”“ఎప్పుడో ఊరొదిలి పోయి ఇక్కన్నే, ఇదే జాగల ఉంటానని పట్టుబట్టడం దేనికి? ఏం రాజకీయాలు నడుపుదామని..” అంది లక్ష్మి.
“ఐలోని మనూల్లో ఉండటం మనూరుకెంతో గర్వకారణం. ఆ బాపు సంగతి మీకు తెల్వదు. మన ఊరు ప్రతి మట్టి రేణువు గురించి కతలు రాసిండు. మనలనందర్నీ చరిత్రకెక్కించిండు. అయినెకు ఊరుమీదున్న ప్రేమ, పుట్టిన నేలపై మమకారమే.. ఇక్కడ ఉంటాననటానికి కారణం” అన్నాడు శీను.“నేను ఊళ్లో స్థిరంగా ఉండకపోవడానికి కారణాలు మీ అందరికీ తెలుసు. యువతరానికి తెలువకపోవచ్చు. ఊళ్లో ఉండకున్నా ఊరితో సంబంధాలను ఎప్పుడూ వదులుకోలేదు. నేను నా పూర్వికులు, రక్తసంబంధీకులు, గ్రామీణుల మధ్య జీవించాలనీ, నా జన్మభూమిలో కన్నుమూయాలనే ఇక్కడికి రావడం. నా గ్రామ చరిత్రను మరింత అద్భుతంగా చిత్రించాలన్నదీ మరో కారణం”“లక్ష్మీ, రమేష్! విన్నారు కదా ఐలోని మాటలు. మీ పట్టుదల వదిలి ఐలోని దగ్గర భూమి ధర తీసుకొని మీ ఇష్టమున్నప్పుడే ఆ ఇల్లును అతనికి అప్పగించండి. ఇంకా వాదాలొద్దు..” అన్నాడు కత్తెర్ల రాజేశ్వర్.“అవ్వయ్యలకు గంజిపోయనోడు గిప్పుడు ఇల్లని వచ్చిండు. ఈనెకట ఊళ్లె ఇల్లు కావన్నట. గిక్కడచ్చి పోగువోత్తడట” అని ఇంకేదో అనబోయిన లక్ష్మిని.. “నోర్ముయ్! ఎవ్వలు గంజి పోయలేదో, ఎవ్వరేంటో ఊరందరికీ తెలుసు. చివరి నాలుగైదేండ్లు ఈరమ్మ ఎంత కష్టపడిందో, నువ్వెంత బాగ చూసుకున్నవో నాకు తెలుసు..” అన్నాడు శీను.ఈ వాదన ఎంతదూరం పోతుందో ఐలోనికి తెలుసు. తన మేనకోడలు తన చేతుల్లో పెరిగింది. తనను దోషిని చేసి మాట్లాడటం బాధగా ఉంది.“ఇంక ఈ వాదాలన్నీ వదిలి పెడుదాం.
రమేష్‌కు, లక్ష్మికి ఇల్లంటే నాలుగు గోడల మధ్య వైశాల్యమనే తెలుసు. కానీ, ఈ ఇల్లంటే నా జన్మభూమి. ఈ ఇల్లు, ఈ స్థలం మట్టిముద్ద కాదు. మనిషి ముద్ర. నాకు సెంటిమెంట్. అవన్నీ వాళ్లకు అర్థం కావు” అన్నాడు ఐలోని.. గొడగొడా ఏడుస్తూ. “ఏంది బాపూ! నువ్వేడ్సుడేంది?” అన్నారు అక్కడున్నోళ్లు. “బాపుది ముప్పయేళ్ల దుఃఖం. ఏడ్వనివ్వండి. భారం తగ్గుతుంది. మనసు తేలికవుతుంది..” అన్నాడు మారం శీను.పది నిమిషాలు వెక్కివెక్కి ఏడ్చాడు ఐలోని. తనను తాను తమాయించుకున్నాడు. ఐలోని ఏడ్పు చూసి వెకిలి నవ్వు నవ్వుతున్న రమేష్, లక్ష్మిని పెద్దమనుషులు గమనించకపోలేదు. కొద్దిసేపాగి.. “నాకు ఆ ఇల్లు వద్దు. ఇప్పుడు వాళ్లు ఇస్తామన్నా అవసరం లేదు. మా తాతదే.. మా చిన్నాన్నకు వచ్చిన భూమి ఉంది. అదిప్పుడు చిన్నాన్న కొడుకు పేరున ఉంది. నాకా ఇల్లు రాకుంటే తన స్థలం కొనుక్కోమన్నాడు మా తమ్ముడు. అది నాలుగ్గుంటల భూమి. దాన్ని కొనుక్కొని అందులో చిన్న ఇల్లు కట్టుకుంటాను. మిగతా స్థలంలో చెట్లు పెడ్తాను. నా వృద్ధాప్యాన్ని ప్రకృతి మధ్య హాయిగా గడుపుతాను. వాన్ని పిలువండి. ఇప్పుడే మీ అందరిముందు బయానా ఇస్తాను. నా జన్మభూమిలోనే నా చివరి రోజులు గడుపుతాను” అన్నాడు ఐలోని.ఆ మాటలతో రమేష్, లక్ష్మి ముఖాలు నల్లబడ్డాయి. పొలం పనికెళ్లిన మల్లేశంను పిలుచుకు రావడానికి బైక్ కిక్ కొట్టాడు మహేశ్. “బాపూ! నేను దగ్గరుండి ఆ భూమిల ఇల్లు కట్టిస్తాను. నిన్ను మా బాపులా చూసుకుంటాను”అన్నాడు మారం శీను.
“అంకుల్! నేను సివిల్ కంట్రాక్టర్‌ను కదా! నయాపైసా లాభం లేకుండా మీరు కోరినట్టు ఇల్లు కట్టిస్తాను..” అన్నాడు అక్కడే ఉన్న అజయ్.వాళ్ల ప్రేమానురాగాలు చూస్తున్న అనిల్‌కుమార్‌కు ఊళ్లో ఇల్లు వద్దని తాము తండ్రితో వాదించింది ఎంత తప్పో అర్థమై కళ్లవెంట పటపటా నీళ్లు కారాయి. “నాకు భవంతి అవసరం లేదు. మా తల్లిదండ్రుల జ్ఞాపక చిహ్నంగా.. అచ్చంగా నేను పుట్టిపెరిగిన ఇంటి మోడల్లోనే పెంకుటిల్లు కట్టాలి అజయ్. ఆ ఇల్లు ఈ దేశపు సగటుమనిషి ఇంటి ఖరీదును మించకూడదు” అన్నాడు ఐలోని.
డా. కాలువ మల్లయ్య
సామాజిక ప్రయోజనంలేని సాహిత్యం వృథా అనే దృక్పథంతో.. నిరంతరం సాహితీ సృజన చేస్తున్న సీనియర్ రచయిత డా. కాలువ మల్లయ్య. సాహితీ రంగంలో 52 ఏండ్లకు పైగా అనుభవం ఈయన సొంతం. స్వస్థలం పెద్దపల్లి జిల్లాలోని తేలుకుంట. తల్లిదండ్రులు గొర్లకాపర్ల సమూహానికి చెందిన పోశమ్మ-ఓదెలు. ఎమ్మెస్సీ బీఈడీ, పీజీ డీపీఆర్, ఎంఏ, పీహెచ్డీ చేశారు. విద్యార్థి దశనుంచే సాహిత్యాభిలాషను పెంచుకున్నారు. 1972లో పీయూసీ చదివేటప్పుడే కథా రచన మొదలుపెట్టారు. 1983లో రాసిన ‘వెలి’ కథతో అభ్యుదయ రచయితగా మారా రు. ఇప్పటివరకూ 25వేలకు పైగా రచనలు చేశారు. ఇందులో వెయ్యికిపైగా కథలు, 18 నవలలు, 7 కవితా సంపుటాలు, వందలాది వ్యాసాలు ఉన్నాయి.
ఇప్పటి వరకూ 80 పుస్తకాలను ప్రచురించారు. సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, కథాసాహితి లాంటి కథా సంకలనాల్లో ఈయన రాసిన 50 కథలు చోటు దక్కించుకున్నాయి. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 40 మందికిపైగా విద్యార్థులు, ఆయన సాహిత్యంపై పీహెచ్డీ, ఎం ఫిల్ పట్టాలు తీసుకున్నారు. ‘బతుకు పుస్తకం’ నవలకు ‘ఆటా అవార్డు’ దక్కించుకున్నారు. తన రచనలకు ఇప్పటిదాకా 90కిపైగా వివిధ పురస్కాలు, అవార్డులు, అనేక సన్మానాలు అందుకున్నారు. ‘అవ్వతోడు గిది తెలంగాణ’, ‘కాలువ మల్లయ్య కథలు’, ‘నేలతల్లి’, ‘మా కథలు’, ‘కట్నం కథలు’, ‘తెలంగాణ మట్టికథలు’, ‘తెలంగాణ తాతలు చెప్పిన కథలు’ లాంటి అనేక కథలు రాశారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో రూ.2వేల బహుమతి పొందిన కథ.
-డా. కాలువ మల్లయ్య
98493 77578