(హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)
జరిగిన కథ : రోహను అత్తగారింటికి పంపడం మంచిది కాదని సూచిస్తాడు పురోహితుడు. పోటిసుణ్ని రాయహత్థి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ కనిపెట్టుకొని ఉంటుంది చంద్రహత్థి. అతనికి చికిత్స చేయడానికి వైద్యుణ్ని తీసుకొని వస్తాడు రాయవగ్గు. ఆ తర్వాత…
యువకుడైన ప్రణాళుడు మాధవుని శిక్షణలో క్రమక్రమంగా శ్రమణకుడిగా మారుతున్నాడు. అందుకు కారణాలు రెండు. మొదటిది మృత్యుముఖంలో నుండి మాధవుడు అతణ్ని కాపాడటం; రెండవది మనసు గాయాలకు బుద్ధుని మార్గం వైద్యంగా పనిచేయడం.
కోరికల వెంట పరుగెత్తిన ప్రణాళుని మనసు క్రమంగా సేదతీరి విశ్రమించడం అలవాటు చేసుకుంటున్నది. ఆ విశ్రాంతిలో అవిశ్రాంతంగా లోక కల్యాణం కోసం కృషి చేయాలన్న లక్ష్యం ఉన్నది. అయితే ఒక్కటే ప్రతిబంధకం… అదే వయస్సు. వయస్సును మనసు అధిగమిస్తుందా? లేక మనసే వయసును పెనువేసుకొని ప్రయాణ దిశను మారుస్తుందా? అనేది కాలమే నిర్ణయిస్తుంది!
షష్ఠి నాటి రాత్రి. జయసేనుడు తన మిత్రుడైన వామదేవునితో మేడ మీద నిలబడి ఆకాశంలోకి చూస్తున్నాడు. శరత్ కాలంలో వెన్నెల రేయిని అనుభవించాల్సిదే గానీ, వర్ణించే వెర్రి ప్రయత్నం చేయకూడదు. అది సముద్రపు నీరులా అపారమైన సౌందర్యంతో అలరారుతూ ఉంటుంది. తమ అనుభవం మేర, హృదయ మార్దవం మేర ఆ సౌందర్యాన్ని అనుభూతించాల్సిందే.. ఎవరైనా.
లేత వయసులోని చంద్రునితో ఆడుకోవడానికి తారామణులు సన్నని మబ్బు తెరలను తొలగించుకొని చేరుకుంటున్నాయి. చిరునవ్వు రూపమై విస్తరిస్తున్న చంద్రుడు దూరంగా వెళుతున్నాడు. అంతలో ఏదో ఒక చుక్క సర్రున దూసుకొని రావడం చూసి ఉలిక్కిపడ్డాడు జయసేనుడు.
అది గమనించిన వామదేవుడు..
“అదేమి మిత్రమా! నీ పక్కన నేనుండగానే నీవు మీ అర్ధాంగితో కలిసి ఏవో చిలిపి పనులు చేస్తున్నట్లున్నావు?” అన్నాడు ఆట పట్టిస్తున్నట్లు…
విచిత్రంగా చూసినాడు జయసేనుడు, అర్థం కానట్లు ముఖం పెట్టి.
“అదేనోయ్! ఇక్కడ నీ పక్కన ఉన్న నన్ను ఒక్కడినే వదిలేసి ఆకాశంలో అందచందాలను నీవు ఒక్కడివే… కాదు కాదు, నీ భార్యతో కలిసి ఆస్వాదిస్తున్నావేమిటీ…?” అని తన అంతరంగాన్ని ప్రకటించినాడు వామదేవుడు.
“నిజమే! ఒక్కడిని వదిలేసే విషయం నీవే చెప్పాలి మరి. దయ్యాలు వేదాలు వల్లించినట్లు…” అన్నాడు జయసేనుడు కటువుగా.
“ఆఁ…” ఇప్పుడు ఆశ్చర్యపోవడం వామదేవుని వంతైంది. అతడు అడగకముందే జయసేనుడు తన మాటల వెనుక గల కారణాన్ని ఇట్లా చెప్పినాడు
కళలు ముగియగానె కలువల ఱేడు భా
స్కరుని పరిధిలోన సమసి నట్లు
మిత్రు లున్న, లేని చిత్రమౌ బ్రతుకాయె
నొంటరితనమె కడ కొరిగెనాకు!
(16 కళలు పూర్తికాగానే చంద్రుడు సూర్యునిలో లీనమై కనిపించకుండా పోయినట్లు, ఎంతమంది
మిత్రులున్నా నేను మాత్రం ఒంటరినే కదా! నన్ను ఒంటరిని చేయడం నీకు అలవాటు. నీవు ఉండి కూడా ఒంటరిగానే నేను మల్లికాపురికి వెళ్లి వచ్చే దుస్థితి కల్పించింది నీవు కాదా!)
“అయ్యో మిత్రుడా! నీవు అట్లా అర్థం చేసుకున్నావా! మీ ఏకాంతానికి భంగం కలగకూడదని ఉద్దేశపూర్వకంగానే నేనప్పుడు ఒంటరిగా నిన్ను మల్లికాపురికి వెళ్లే ఏర్పాటు చేసినాను…” అన్నాడు నవ్వుతూ.
ఆ విధంగా వాళ్లు ఇచ్చకాలు మాట్లాడుకుంటూ ఉండగానే రాత్రి మూడో జాము అయ్యింది. అప్పుడు గుర్తుకొచ్చింది జయసేనునికి…
“మిత్రమా! చంద్రుడు అస్తమించినాడు. రేయి దాదాపు సగం పూర్తికా వస్తున్నది. అమ్మ రాకకు సంబంధించిన ఆనవాలు గానీ; సమాచారం గానీ ఇంతవరకూ లేదు. మనసు ఏదో కీడు శంకిస్తున్నది…”
స్నేహితుని గొంతులో హఠాత్తుగా ధ్వనించిన దిగులు చూసి, వామదేవుడు చింతితుడైనాడు. ఎందుకంటే అతని మాటల్లో నిజం లేకపోలేదు కానీ, మనది కాని ప్రదేశానికి వెళ్లినప్పుడు తిరుగు ప్రయాణం మన చేతుల్లో ఉండదు. ఇది లోకంలో ఉన్నదే, అయినా ఇప్పుడు నిరాశావాదాన్ని బలపరిస్తే మిత్రుని హృదయం మరింత బలహీనపడుతుంది. అందుకే యుక్తియుక్తంగా మాట్లాడినాడు వామదేవుడు.
“మన పోదన నగరం దుర్భైద్యమైన రక్షణకు పెట్టింది పేరు. పైగా అమ్మ వెంట 50 మంది యోధుల వంటి
సేవకులు ఉన్నారు. అత్తగారి ఇంటి నుండి కూడా కొంతమంది నీ భార్యకు తోడుగా వస్తారు కదా!
భయపడాల్సిన పనిలేదు”
“భయం కాదు! అనుమానం. అనుమానానికి కారణం ఆ వచ్చేవాళ్లలో స్త్రీలు ఎక్కువమంది ఉండటం. ఈమధ్య ఆడవాళ్లని ఎత్తుకొని పోయే దొంగలు ఎక్కువైనారు. ‘అమ్మ… చెప్పిన సమయానికి ఎందుకు రాలేదు?’ అన్నదే అసలు ప్రశ్న” సాలోచనగా అన్నాడు జయసేనుడు.
ఇంతలో ఎవరో అశ్వికుడు చాలా వేగంగా వచ్చి తమ మందిర ప్రధాన ద్వారం ముందు ఆగడం ఇద్దరూ గమనించినారు. అపరిచితుడైన ఆ అశ్వికుని ముఖంలో ఏదో ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నది.
వేడివేడిగా సజ్జ రొట్టెలు చేసి ఇచ్చే పనిలో పడ్డది రాయహత్థి. వైద్యుడు పోటిసుణ్ని పరిశీలించి.. గాయం లోతయిందే కానీ సరైన పథ్యం పాటిస్తే వారం రోజుల్లో నయమవుతుందని; 15 రోజుల్లో మునుపటిలా పరుగెత్తగలడని చెప్పినాడు. ఆ వైద్యుని పేరు గుణ మందియుడు. ఆ చుట్టుపక్కల 10 గ్రామాల్లో అతని హస్తవాసికి గొప్ప పేరున్నది. ఆయన వైద్యానికి తిరుగులేదు; మాటకూ తిరుగులేదు. అతని సూచనలు పొల్లు పోకుండా పాటించ గలిగితే చాలు! అనుకున్న సమయానికి ముందే కోలుకొని గాయపడ్డ రోగులు కీలు గుర్రాలై పోతారు.
“అదేమి మిత్రమా! నీ పక్కన నేనుండగానే నీవు మీ అర్ధాంగితో కలిసి ఏవో చిలిపి పనులు చేస్తున్నట్లున్నావు?” అన్నాడు ఆట పట్టిస్తున్నట్లు వామదేవుడు. విచిత్రంగా చూసినాడు జయసేనుడు, అర్థం కానట్లు ముఖం పెట్టి. “అదేనోయ్! ఇక్కడ నీ పక్కన ఉన్న నన్ను ఒక్కడినే వదిలేసి ఆకాశంలో అందచందాలను నీవు ఒక్కడివే… కాదు కాదు, నీ భార్యతో కలిసిఆస్వాదిస్తున్నావేమిటీ…?” అని తన అంతరంగాన్ని ప్రకటించినాడు వామదేవుడు.“నిజమే! ఒక్కడిని వదిలేసే విషయం నీవే చెప్పాలి మరి. దయ్యాలు వేదాలు వల్లించినట్లు…” అన్నాడు జయసేనుడు కటువుగా.
తమ ప్రాణాలు కాపాడిన పోటిసుణ్ని కన్న బిడ్డలా, ప్రాణప్రదంగా చూసుకోవడంలో ఎంతో ఆనందం పొందుతున్నది రాయహత్థి. ఆమెకు ఒక కొడుకున్నాడు. వానికి మూడేళ్లు ఉంటాయి. పోటిసుడు అంతకంటే పసివానిలా అనిపిస్తున్నాడు ఆమెకు. అందుకే కన్నాకులా చూసుకుంటున్నదామె.
రొట్టెలు చేసి ఇచ్చేందుకు ఎండు కట్టెలు దొరక్క అప్పటికప్పుడు దొరికిన కొంచెం పసిమి గల కట్టెలతో పొయ్యి వెలిగించే ప్రయత్నం చేస్తున్నది. అది సరిగ్గా ఫలించక ఇల్లంతా పొగ నిండి పోతున్నది.
అది ఒంటిపారు ఇల్లు. వంటశాలకు, మిగతా ఇంటి భాగానికి తడిక ఒక్కటే అడ్డు. అవతలి భాగంలో పడుకున్న పోటిసునికి పొగ వల్ల ఇబ్బంది కలగకూడదని, అదేపనిగా పొయ్యి ఊదుతున్నది. ఆమె కన్న కొడుకు వీధిలో ఆడుకుంటున్నాడు. వాడు పాలు కుడిచేటప్పుడు, బువ్వ తినేటప్పుడు, నిదురపోయేటప్పుడు తప్ప ఎప్పుడూ వీధిలోనే ఉంటాడు. వానికి రాత్రీ పగలుతో సంబంధం లేదు. ఆమె తన ప్రయత్నంలో లీనమై
ప్రపంచాన్ని మరిచిపోయింది.
ఎప్పుడు వచ్చినాడో రాయవగ్గు, ఆమె గమనించనే లేదు. అతడు మాత్రం ఆమెనే తదేకంగా చూస్తున్నాడు.
హఠాత్తుగా రాయవగ్గును చూసి ఏదో అనబోయింది రాయహత్థి.
ఆమెను మాట్లాడవద్దని సైగ చేస్తూ, రాయవగ్గు ఇట్లా అన్నాడు…
పొయ్యి నూదు పనిని పొగ కారణము చేత
ఆపబోకు హత్థి అందమైన
నీదు రూపమునకు నిజమైన అద్దమై
చూపుచుండె, నన్ను చూడనీవె!
(పొగ వస్తుందనే కారణం చెప్పి, పొయ్యి ఊదే పని మాత్రం ఆపకు హత్థీ! ఇప్పుడు నీవు చేస్తున్న ఈ పని, నీ అందమైన రూపాన్ని నాకు కనువిందు చేస్తున్నది)
ఆ మాటలతో అతను తనని ఎక్కడెక్కడ చూస్తున్నాడో అర్థమైంది ఆమెకు. చిరు కోపంతో వంటచెరుకులో నుంచి ఒక పుల్లను తీసుకొని వానిమీదికి విసర బోయింది.
ఆ ప్రయత్నంలో కొంగు పూర్తిగా జారింది. పైకెత్తిన ఆమె చేతిని అతను ఒడుపుగా పట్టుకున్నాడు. తన మనసులోని భావనను కొనసాగిస్తూ…
“అంతే కాదు! చెదిరిన నీ ముంగురులు, చెల్లాచెదరైన నీ నుదుటి కుంకుమ, చెమట ముత్యాలతో తడిసిన నీ మోము, ఊది ఊది మరింత ఎర్రబారిన నీ పెదాలు…” అంతలో ఎవరో వచ్చిన అలికిడైంది.ఆమె సర్దుకున్నది; అతడు ఏదో పని ఉన్నట్లు బయటికి నడిచినాడు.
“అక్కా! నేను నీకు సాయం చేయనా?” లోనికి వస్తూనే అన్నది చంద్రహత్థి.
‘ఇంకా ఏం చేస్తావు??? చేసేసినావుగా! రెండు మూడు రోజుల పడకటింటి ఉపవాస దీక్షకు ఏదో ఒక ఉపశమనం కలిగించాలని అనుకున్నాడు నా మొగుడు. దాని మీద నీళ్లు పోసినావు. అగ్గి చల్లారిపోయింది. ఇదీ ఒకందుకు మంచిదేలే…’ నిట్టూరుస్తూ అనుకున్నది తనలో తానే రాయహత్థి.
ఆ మాటలు అస్పష్టంగా వినపడ్డాయి చంద్రహత్థికి.
“ఏం అక్కా! ఏదో అంటున్నావు?” అన్నది అమాయకంగా.
వెంటనే మాట మార్చింది రాయహత్థి. పంటి కింద కోపాన్ని అణచి పెట్టి…
“అగ్గి చల్లారిపోయిందే! పాడు కట్టెలు! ఎంత ఊదినా మండటం లేదు” అంటూ, చెల్లెలి మీది కోపం పుల్లల మీదికి నెట్టింది.
“ఆ పని నేను చూసుకుంటానులే అక్కా! నీవు ఇంకేదైనా చేసుకో” అంటూ అర్ధాంతంగా మిగిలిపోయిన పనిని కొనసాగిసాగించేందుకు రాయహత్థి చేతిలో నుండి పొగ గొట్టం తీసుకున్నది చంద్రహత్థి .
“ఎవరి పని వాళ్లు చేస్తేనే బాగుంటుందే చంద్రా! నీవు వెళ్లి పోటిసునికి ఏం కావాలో చూసుకో!” అన్నది, చంద్రహత్థి చేతిలోని వెదురు గొట్టం మళ్లీ తన చేతిలోకి తీసుకుంటూ రాయహత్థి. పోటిసుని పేరెత్తగానే చంద్రహత్థి ఒళ్లంతా నీరైంది.
“అక్కా! ఆయన నన్ను చూసినాడా? ఆ చూపుల్లో నాపట్ల ప్రేమ ఉన్నదా? నేను లేనప్పుడు నా గురించి అడిగినాడా? ఏమేం అన్నాడు?” అంటూ ప్రశ్నల పరంపర కురిపించింది చంద్రహత్థి.
(సశేషం)
– దోరవేటి 89788 71961