జూన్ ఆఖరున మా పదో తరగతి పరీక్షల ఫలితాలొచ్చాయి. నేను ఫస్ట్‌క్లాస్‌లో పాస్ అవడమే కాక, మా క్లాస్మేట్ లక్ష్మణ్, నేనూ స్కూల్ టాపర్స్‌గా వచ్చాం. మండల్లో కూడా మేమే టాపర్స్ అని మా సార్లు అన్నట్లు గుర్తు.
నన్ను ఎక్కడ వుంచి చదివించాలా అని అమ్మానాన్నలకు దిగులు పట్టుకుంది. అప్పటికి మా నాయనమ్మ, తాతయ్య తాలూకూ మనవరాళ్లలో ఎవరూ టెన్త్ దాటలేదు. మా అక్కే మొదట ఇంటర్లో చేరిన ఆడపిల్ల. అందుకోసం మా అమ్మ అత్తగారింటి వాళ్ల నుంచి ఎన్నో మాటలు ఎదుర్కొంది. ‘ఏందమ్మా! ఆడిపిల్లలను చదివిచ్చుడు ఎందుకు? పెండ్లి జెయ్యక! ఎన్ని పైసలు గావాలె చదివిస్తె?! దాని ఒంతుకు పెండ్లి జేస్తె కాదా?! అయినా చదువుకుంటె ఇగ చేతుల ఉంటరా? మన మాట ఇంటరా?!’ అని ఒకరూ, ‘ఇవాళ రేపు కాలేజీకి పోంగనె ప్రేమలు, గీమలు అని అంటున్నరు, అందుకనె నేను నా బిడ్డను చదువు బంద్ జేసి ఇంట్లనే ఉంచిన.
దానికి అన్ని పనులు వొచ్చు. ఒంట జేస్తది, ఇల్లు సదురుతది, నేను ఊరికి పోతె ఇల్లంత దానికే అప్పజెప్పి పోత!’ అని ఒకరూ, ‘ఇగ కాలేజీల జేరితె ఎక్కడ లేని షోకులు మొదలైతయి. ఎన్ని పైసలు వాటికే చాలవు. మొగోండ్లల్లకు పొయ్యి చదువుకుంటె ఇగ ఆగుతరా?! మొగని మాట ఇంటరా?! అయినా చదివిచ్చి పెద్ద ఉద్యోగాలు జేయిచ్చి బాగా పైసలు సంపాయిస్తె కూడబెట్టాల్నని వాండ్ల అమ్మకు ఆశ. గందుకే చదివిచ్చాల్నని అనుకుంటుంది’ అని ఒకరూ… ఇలా రకరకాల మాటలు అమ్మ ముందే కొన్ని, వెనకాల మరి కొన్ని మాట్లాడారు. నాన్న ముందు ఇలాంటివి అనేవారు కాదు. అయినా నాన్న దగ్గర ఆడవాళ్లు మాట్లాడే అవకాశం ఉండేది కాదు, వున్నా భయపడేవారు. మగవాళ్లలో ఇలాంటి మాటలు తక్కువ.
అప్పటికే మా ఆర్థిక పరిస్థితులు కొంచెం దిగజారడం మొదలయింది. హాస్టల్లో ఉంచి చదివించాలంటే బోలెడు డబ్బులు కావాలి. పైగా బంధువుల మాటలు పడలేక అక్కను మా చిన్నాయన కూతురు లక్ష్మి అక్కయ్య దగ్గర ఉంచారు. ఆమె భర్త హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పీజీ సెంటర్లో లెక్చరర్‌గా పనిచేసేవాడు. అప్పటికి కాకతీయ యూనివర్సిటీ ఏర్పడలేదు. ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ పీజీ సెంటర్‌గా పనిచేసేది. హనుమకొండ సుబేదారిలో ఉన్న క్వార్టర్స్‌లో వాళ్లు ఉండేవాళ్లు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో వడ్డేపల్లిలో ఉన్న పింగలి మహిళా కళాశాలలో 1974లో అక్కను ఇంటర్లో చేర్పించారు. ఆ కాలేజీకి స్పెషల్ బస్సులు ఉండేవి. వాటిలోనే అక్క వెళ్లి వస్తుండేది.
అక్కను అలా ఉంచినందుకు అమ్మానాన్న లచ్చక్కకు నెలకు ముప్పయ్ రూపాయలు, పదిహేను కిలోల బియ్యం ఇచ్చేవారు. ఇంకా పండిన పప్పు ధాన్యాలూ, కాసిన కూరగాయలూ, వండిన పిండివంటలూ పంపిస్తూ ఉండేవారు. ఒక్కోసారి ఎద్దుల బండి మీద వంటకోసం కట్టెలు పంపించేవారు. లచ్చక్క మా ఇంటి ఆడపిల్లే గనుక తన దగ్గర ఊరికెనే ఏమీ తీసుకోవద్దని వాళ్ల ఉద్దేశం. అక్క అక్కడ అలా సెటిల్ అయిన ఏడాదికి నా సమస్య వచ్చింది.
ఇక హనుమకొండలో దగ్గరివాళ్లెవరూ లేరు. ఆ సమయంలోనే మేము హైదరాబాదులో చిన్నాయన (అమ్మకు మేనమామ కొడుకు) పెళ్లికి వెళ్లాం. పెళ్లి అయిన నాలుగు రోజులకు అందరూ కూర్చుని మాట్లాడుకుంటుండగా నా చదువు ప్రసక్తి వచ్చింది. అప్పుడు నాయనమ్మ..అంటే అమ్మకు మేనమామ భార్య, పేరు మోహినీదేవి, ‘ఆ పిల్ల గంత మంచిగ చదివి ఫస్ట్ క్లాసుల పాసయింది. మంచిగ చదివిచ్చవలసిందే! ఎందుకు ఆలోచిస్తవు? ఇక్కడ కాలేజీల షరీకు చెయ్యి. మనింటి పక్కనే మంచి కాలేజీ ఉన్నది. ఇక్కడుండి పోయొస్తది’ అన్నది.
అమ్మ వెంటనే ‘దూరం గదా, ఎప్పుడు కావాల్నంటే అప్పుడు చూడరాదు. హైదరాబాదు అంటే బోలెడు పైసలు ఖర్చు. అయినా, మీకు కూడా పిల్లను ఉంచుకున్నందుకు ఏమన్న ఇయ్యాలె. మా వారితో కూడా ఒక మాట చెప్పాలె’ అన్నది. నన్ను వదిలి ఉండాలంటే అమ్మకు కూడా ఎంత దిగులో నాకు అప్పుడు తెలిసింది. అక్కడే ఉన్న శేషగిరిరావు చిన్నాన్న (పెళ్లి కొడుకు) వెంటనే ‘నువ్వు మా ఇంటి ఆడబిడ్డవు, నువ్వు ఏమిచ్చి పెరిగినవు? అట్లనే అది కూడా! దాని కోసం నువ్వు పైసలు ఇయ్యాల్నా? ఒద్దు’ అన్నాడు. నాయనమ్మ కూడా ‘అవునమ్మా, గా పిల్ల తినే గింతంత తిండి కోసం మాకు నువ్వు ఇచ్చుడేంది? ఇస్తే మాత్రం మేము తీసుకుంటమా?’ అన్నది. అమ్మ ఇక ఏమీ మాట్లాడలేదు.
ఆ మర్నాడే నన్ను గోపమ్మ చిన్నమ్మ ( నాయనమ్మ పెద్ద కొడుకు రంగారావు చిన్నాయన భార్యపేరు గోపికా రాణి) రెడ్డి కాలేజీకి తీసుకెళ్లింది. ఆ కాలేజీ చాలా పెద్దది. ఎంతో మంది ఆడపిల్లలు రంగురంగుల బట్టలు వేసుకుని ఆవరణలో తిరుగుతున్నారు. ముందు చక్కగా పెంచిన లాన్, దాని చుట్టూ కత్తిరించిన క్రోటన్ మొక్కలున్నాయి. ఎడం పక్కగా ఓ దారి ఉంది. అక్కడన్నీ బొండుమల్లె చెట్లు, వాటి కింద అమ్మాయిలు కూర్చోవడానికి బెంచీలు ఉన్నాయి. అలానే వెళితే వారం కిందట చిన్నాన్న పెళ్లి జరిగిన రెడ్డి హాస్టల్ ఉంది.
కాలేజీ ఆఫీసులో నా కోసం అప్లికేషన్ తీసుకుంది చిన్నమ్మ. దాన్ని పూర్తిగా నింపి ఫొటోలు, మార్కుల లిస్టుతో పాటు అప్లయ్ చేస్తే సీటు వచ్చాక మిగతా సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి ఫీజు కట్టాలట. ‘ఈ కాలేజీకి చాలా పేరుంది. ఇక్కడ సీటు రావాల్నంటే కష్టం. కానీ, నీకు వస్తుండొచ్చు, మంచి మార్కులున్నయి, ఫస్ట్ క్లాస్ గద! చూద్దాం’ అన్నది చిన్నమ్మ. నాకు ఈ చిన్నమ్మ అంటే చాలా గౌరవం. నైన్త్లోనే పెళ్లయితే ఆ తరువాత బీయే దాకా చదువుకుంది. సూర్యాపేటలో వాళ్ల నాన్న యాదగిరిరావు సార్ చదువు చెప్పితే ఎటువంటి మొద్దు పిల్లలయినా పాస్ అవుతారని పేరుండేది. చిన్నమ్మ కూడా చాలా తెలివైనది. మొత్తానికి నాకు రెడ్డి కాలేజీలో సీటు వచ్చిందని వారం రోజుల్లో తెలిసింది. నేను హైదరాబాదులో ఉండటానికి పూర్తిగా రంగం సిద్ధమయింది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి