‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.
ఇక్కడ చీకటైతేనే గానీ అక్కడ వెలుగురానంత దూరంలో ఉన్న కొడుక్కి ఫోన్ చేశాడు అనంతం.
“హా.. చెప్పు నాన్నా!” అన్నాడు రాజేంద్ర ఆవులిస్తూ.
“అదేరా.. మీరు ఎప్పుడొచ్చేదీ చెబితే ఏర్పాట్లు చేద్దామని. డాక్టర్ గారికి కూడా చెప్పాలి కదా!?” అన్నాడు అనంతం ఆదుర్దాగా.
“నాన్నా! అదీ.. ముందు వాళ్ల పేరెంట్స్ ఇంటికి వెళ్దాం అంటున్నది కౌసల్య. ‘సర్జరీ కూడా అక్కడే చేయిద్దాం. మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. తిరిగి యూఎస్ వెళ్లే ముందు మీ ఇంటికి వెళ్దాం’ అంటున్నది” అంటూ నసిగాడు రాజేంద్ర.
“అవునా!? ఏదీ ఫోన్ ఒకసారి అమ్మాయికి ఇవ్వు, నేను మాట్లాడతాను” అన్నాడు అనంతం.
“హలో.. మావయ్యా చెప్పండి” అంది కౌసల్య అవతల్నించి పొడిగా.
“ఆ అమ్మా.. బావున్నావా!? చంటాడు బావున్నాడా!? మీ అమ్మగారు నాన్నగారు కులాసానా!?” అన్నాడు అనంతం అభిమానంగా.
“ఆ.. అంతా బావున్నాం మావయ్యా! మీ ఆరోగ్యం ఎలా ఉంది!?” అడిగింది న్యూస్ పేపర్ తిరగేస్తూ.
“నాకేం.. చొక్కా వేసుకునేటప్పుడు కనబడే ‘జెర్రి’ లాంటి మచ్చ తప్ప, బైపాస్ చేయించుకున్నానన్న విషయమే గుర్తురానంత ఆరోగ్యంగా ఉన్నాను. అదేనమ్మా.. చంటాడి ఆపరేషన్ విషయం మా ఫ్రెండ్ సూర్రావుతో మాట్లాడాను. అతను నాతోబాటు ఆర్మీలో డాక్టర్‌గా చేసి రిటైర్ అయ్యాక మన ఊళ్లోనే హాస్పిటల్ పెట్టాడు. చాలా మంచివాడు, హస్తవాసి ఉన్నవాడు. టాన్సిల్స్ చాలా చిన్న ఆపరేషనట. ‘ఒక్క పూటలో చేసి పంపించేస్తాను’ అన్నాడు. మీరు నేరుగా ఇక్కడకి వస్తే బావుంటుంది” అన్నాడు ప్రాధేయ పడుతూ.
“అదీ మావయ్యా.. మీకెందుకు ఇబ్బందని..” అంటూ ఉండగా, అతను మధ్యలోనే..
“ఇబ్బందా!? మీ అత్తయ్య పోయాక ఒక్కణ్నీ ఉండలేక మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నా. నాకూ చంటాడితో కొన్నిరోజులు గడిపినట్టు ఉంటుంది కదా” అని, మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు.
“నీకు తెలుసుకదమ్మా.. నేను పెద్దగా చదువుకోలేదు. ఇక్కడ ఉంటేనే దేశంమీద ప్రేమ ఉన్నట్టు అనుకుని, మీరు అమెరికా వెళ్తామంటే అభ్యంతరం పెట్టాను. తర్వాత అర్థమైంది. మీలాంటి వాళ్లు కష్టపడి అక్కడినించి పంపే డాలర్ల వల్ల మన రూపాయి బలపడుతుందని, ఇదీ ఒకరకమైన దేశభక్తే అని. అందుకే నీకు మళ్లీమళ్లీ సారీ చెబుతున్నా. అవేమీ మనసులో పెట్టుకోకుండా మీరు రండి. ఓ నాలుగు రోజులు గడిపి అప్పుడు మీ పుట్టింటికి వెళుదురు” అన్నాడు ప్రాధేయ పడుతూ. కాసేపు తటపటాయించి..
“సరే మావయ్యగారు!” అనగానే.. అనంతం సంతోషంగా..
“థాంక్స్ అమ్మా! మరొక్క విషయం. నన్ను ‘మీరు’ అనకమ్మా, మీ నాన్నగారి లాగానే నేనూ..” అన్నాడు.
ఫోన్ పెట్టేసింది కౌసల్య. నిజానికి ఆమె పుట్టింటికి వెళ్లాలనే నిర్ణయించుకుంది. కానీ తన తల్లికి ఫోన్ చేస్తే..
“మీ వదిన చంటిపిల్లతో ఉంది. పిల్లాడి ఆపరేషన్ అంటున్నావు, హాస్పిటల్ ఇన్ఫెక్షన్స్ అవీ తగిలితే ఇబ్బంది. మీ మావగారు చేయిస్తానంటూ రమ్మన్నారుగా.. అక్కడే చేయించి, తిరిగి యూఎస్ వెళ్లేముందు మనింటికి రండి” అని నిర్మొహమాటంగా చెప్పేసింది. ఆ విషయం భర్తకి కూడా చెప్పలేదు కౌసల్య. మావగారితో మరీమరీ చెప్పించుకుని అయిష్టంగానే ఓకే అంది.
కోడలు ఒప్పుకొన్న దరిమిలా అనంతం హడావుడి మొదలైంది. భార్య పోయిన తర్వాత ఒంటరిగా ఉండటం అతనికి కష్టంగా ఉంటున్నది. రైతు పోలయ్య అప్పుడప్పుడూ వస్తాడు. కావాల్సిన కిరాణా సామాను, కూరగాయలు తెప్పించి పెట్టాడు. ఆర్మీలో పనిచేయటం వల్ల ఇంట్లోని వస్తువులన్నీ ఎప్పుడూ పద్ధతిగా పెరేడ్ గ్రౌండ్‌లోని సైనికుల్లా ఉంటాయి.
వాళ్లు వచ్చేరోజు అద్దెకారు మాట్లాడుకుని ఎయిర్ పోర్ట్‌కి వెళ్లి.. వాళ్లని ఇంటికి తీసుకొచ్చాడు. ఆరోజు రెస్ట్ తీసుకున్నారు. ముగ్గురికీ కావాల్సినవి అనంతమే స్వయంగా వండిపెట్టాడు. ఆ మర్నాడు మంగళవారం అవటం చేత డాక్టర్ దగ్గరికి బుధవారం వెళ్దామన్నది కౌసల్య. ఆ ఉదయం చంటాడు పొలం తీసుకెళ్లమని పేచీ పెట్టాడు. తెల్లవారితే ఆపరేషన్.. దాంతో వద్దన్నది కౌసల్య.
“పోనీలే అమ్మా! చంటాడు సరదా పడుతున్నాడు. ఓ గంట అలా తిప్పి తీసుకొస్తాను” అని బుల్లెట్ మీద మనవడిని ఎక్కించుకుని, పొలం బయల్దేరాడు అనంతం.
ఇంటికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అతని పొలం. నున్నటి తార్రోడ్డు మీద బుల్లెట్ దూసుకుపోతున్నది. అటూఇటూ చెట్లతో రోడ్డంతా నీడ పరుచుకుంది. ఓచోట పుంతలోకి బండి టర్న్ చేశాడు అనంతం. ఐదొందల మీటర్లు దాటేక వచ్చిందా పొలం. పొలం అనే కంటే.. దాన్నో వనం అనాలేమో.
ఆరుమడులూ కలిపి మూడెకరాలు. ఓ మడిలో మామిడిచెట్లు పంచాయితీలో పెద్దమనుషుల్లా గంభీరంగా ఉన్నాయి. మధ్యలో వేసిన జనుమునార పచ్చని పువ్వులతో ‘ఆమ్స్టర్ డ్యామ్’ని తలపిస్తున్నది ఆ చంటోడికి. మరో మళ్లో వరుసగా వేసిన కొబ్బరిచెట్లు సరిహద్దు సైనికుల్లా క్రమశిక్షణతో ఊగుతున్నాయి. అంతరపంటగా వేసిన మినుములు మిలటరీ ట్యాంకుల్లా మౌనంగా బలపడుతున్నాయి.
ఇంకో మళ్లో అప్పుడే వేసిన రకరకాల కూరగాయల మొక్కలు, పాదులు.. ఎల్కేజీ పిల్లల డ్రిల్లులా గాలికి అటూఇటూ ఊగుతున్నాయి. మిగిలిన మడులు అరటి పిలకలతో అట్లబంతిలో కూర్చున్న ఆడపిల్లల్లా సుకుమారంగా ముచ్చటగా ఉన్నాయి. దూరంగా బోరు శబ్దం చేస్తూ, నీరు సన్నటి కాలవ ద్వారా పారుతున్నది.
బుల్లెట్ శబ్దం వినిపించగానే గట్లు సరిచేస్తున్న పోలయ్య పరిగెత్తుకుని వచ్చాడు. వద్దన్నా వినకుండా అనంతంతోబాటే చంటాడు కూడా మడిలోకి దిగాడు. కాసేపు నీళ్లలో ఆడాడు. షూ తడిసిపోవడంతో విప్పేశాడు. కుండీలో తాబేళ్లతో కాసేపు ఆడుకున్నాడు. పోలయ్య కొట్టిచ్చిన కొబ్బరిబొండం తాత చూపించినట్టుగా ఎత్తిపెట్టి తాగడానికి ప్రయత్నించి.. చొక్కా మొత్తం తడుపుకొన్నాడు. కడుక్కునే సాకుతో బోరు ఎదురుగా నిలబడి కాసేపు వళ్లు తడిసేలా ఆడాడు.
“ఇంక చాలు నాన్నా.. వెళ్లిపోదాం పద!” అనగానే, అడుగులో అడుగేస్తూ వస్తున్న వాడల్లా దుక్కి దున్నిన నేల కావడంతో తూలి పడబోయి.. కోతులు చొరబడకుండా వేసిన ఉన్న ముళ్లకంచె మీద కాలేశాడు. లేత పాదంలో తుమ్మముల్లు కస్సుమని దిగింది.
“అమ్మా” అంటూ కూలబడ్డాడు.
వెంటనే పోలయ్య పిల్లాణ్ని ఎత్తుకుని గట్టుమీదున్న నులకమంచం మీద కూర్చోబెట్టి, నెమ్మదిగా ముల్లు తియ్యసాగాడు. పిల్లాడు ఏడుస్తున్నాడు. ఒక్కక్షణం కంగారు పడినా.. అనంతం వెంటనే తేరుకుని, పిల్లాణ్ని కదలకుండా పట్టుకున్నాడు. ఒడుపుగా ముల్లు తియ్యగానే రక్తం ఎగచిమ్మింది. జేబులో ఉన్న కర్చీఫ్‌ని నీళ్లలో ముంచి పిండి, రక్తాన్ని తుడుస్తున్నాడు. యుద్ధంలో నెత్తురు పారించిన అతనికి ఆ క్షణం చాలా కంగారుగా ఉంది. కోడలికి విషయం తెలిస్తే చాలా రభస అవుతుంది. ఓ అయిదు నిమిషాల్లో అంతా సర్దుకుంటుంది. నొప్పి తగ్గాక ‘అమ్మకి చెప్పొద్దని మనవడికి చెప్పాలి’ అనుకుని, వాడికి తగ్గాక బయల్దేరదామని వెయిట్ చేస్తున్నాడు. అంతలో మొత్తం కర్చీఫ్ రక్తంతో తడిసిపోయింది. పోలయ్య తలకి చుట్టుకున్న టవల్ తీసుకుని తడిపి, పిండి.. దాంతో తుడవడం మొదలుపెట్టాడు. మరో పది నిమిషాలు గడిచింది. ఎర్రటి పిల్లాడు పాలిపోసాగాడు. పాదం ఇంకా రక్తం చిమ్ముతూనే ఉంది. పోలయ్య బెదిరిపోయాడు. అనంతానికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. డాక్టర్ సూర్యారావుకు ఫోన్ చేశాడు. అతను మొత్తం విషయం తెలుసుకుని..
“వెంటనే తీసుకురండి. అవసరమైతే రక్తం ఎక్కించాలి. బ్లడ్ బ్యాంకు నుంచి ప్లాస్మా తెప్పించి ఉంచుతాను. వాళ్లకి నీ నెంబర్ ఇస్తాను. ఓ ఇద్దరు వెళ్లి, చెరో యూనిట్ బ్లడ్ రీస్టోర్ చేస్తే సరిపోతుంది” అన్నాడు. కోడలితో మాట్లాడటానికి ధైర్యం చాలక, కొడుక్కి ఫోన్ చేసి విషయం చెప్పి నేరుగా హాస్పిటల్‌కి రమ్మన్నాడు. పోలయ్య పిల్లాణ్ని ఎత్తుకుని బండి వెనకాల కూర్చుంటే.. నేరుగా హాస్పిటల్‌కి బయల్దేరాడు అనంతం. దారి పొడుక్కీ రక్తం చిమ్ముతూనే ఉంది. అనంతం జీవితంలో మొదటిసారి భయపడ్డాడు.
అనంతం హాస్పిటల్‌కి చేరుకునే సరికి అప్పటికే కొడుకు, కోడలు అక్కడున్నారు. అనంతాన్ని చూస్తూనే పరిగెత్తుకెళ్లిన కౌసల్య.. పోలయ్య దగ్గరనించి పిల్లాణ్ని లాక్కుంది. అప్పుడు ఆమె అనంతం కేసి విసిరిన చూపు ముందు.. శత్రుదేశపు ఉరికంబం కూడా దిగదుడుపే! వేలాడిపోతున్న పిల్లాణ్ని చూసి ఏడుస్తూ అనంతం మీద విరుచుకుపడింది కౌసల్య. అతనికి యుద్ధంలో వచ్చిన మెడల్స్ ఏవీ.. దించిన మెడ ఎత్తేలా చెయ్యలేకపోయాయి. సర్వీస్‌లో ఉండగా అతనెప్పుడూ ఎదుర్కోని ‘కోర్ట్ మార్షల్’.. ఆ క్షణం కోడలి దగ్గర తప్పలేదు. కనిపించే తూటాలని తప్పించుకున్నాడు కానీ.. వినిపించే తూటాలని తప్పించుకోలేక పోయాడు.
అతను ఏదో చెప్పబోయాడు. ఆమె రొప్పుతూ చివరగా..
“రానంటే రమ్మన్నావు. వద్దంటే తీసుకెళ్లావు. నీలా మట్టిలో దొర్లాల్సిన ఖర్మ నా కొడుక్కి పట్టలేదు. వాడికేదైనా జరిగిందో.. నీ మీద పోలీస్ కేసు పెడతా” అంది.
ఎప్పుడో శీతకాలం కోరుకున్న ఎండ.. వేసవిలో వడగాల్పుగా కొట్టినట్టుందా ‘ఏకవచనం’!
ఆమె కోపం అతనికి తెలిసిందే కానీ, ఈ స్థాయిలో ఎప్పుడూ చూసి ఎరగడు. యుద్ధం లేనప్పుడు శత్రు సైన్యంతో రొట్టెలు పంచుకున్న మనసతనిది. ఈగలు తోలుకునే క్రమంలో కొమ్ము విసిరితే, పిల్లాణ్ని పొడవబోయిందని పొరబడి.. కబేళాకి పంపించేస్తే, కళ్లవెంట నీరు కార్చటం తప్ప ఏమీ చెయ్యలేని గంగిగోవులా బేలగా చూస్తూ ఉండిపోయాడు.
కౌసల్య పిల్లాణ్ని తీసుకుని హాస్పిటల్ లోపలికి పరిగెత్తింది. అనంతం కూడా వెంటరాబోతే రావొద్దని చెప్పింది. లోపలికి వెళ్తూ..
“ఫస్ట్ ఎయిడ్ చేయించి తీసుకెళ్లిపోదాం. నెక్ట్స్ ఫ్లయిట్‌కి మా ఊరికి టికెట్ బుక్ చెయ్యండి” అని భర్తకి విసురుగా చెప్పింది.
లోపల క్యాజువాలిటీ వార్డ్‌లో నర్స్ పిల్లాణ్ని పడుకోపెట్టి కాలికి డ్రెస్సింగ్ చేస్తున్నా.. బ్లీడింగ్ ఆగటం లేదు. డాక్టర్ సూర్యారావు పిల్లాడి కళ్లకింద పరీక్షగా చూసి, అనంతం ఫోన్ చెయ్యగానే తెప్పించి ఉంచిన రెండు ప్యాకెట్ల ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మాను ఐవీ ద్వారా ఇచ్చాడు. గడ్డకట్టే కారకాలను పెంచే విటమిన్ కె ఇంజక్షన్ ఇచ్చాడు. బ్లడ్ శాంపిల్ తీసి కోయాగ్యులేషన్ స్క్రీనింగ్తోబాటు మరికొన్ని టెస్ట్‌లు చేయించాడు. కాసేపటికి రక్తస్రావం ఆగింది. పిల్లాడు నీరసంగా కళ్లు విప్పాడు. నర్స్ చేత పేరెంట్స్‌ని రమ్మని కబురు చేశాడు. కౌసల్యని, ఆమె భర్తని కూర్చోమని..
“అనంతం ఎక్కడ!?” అన్నాడు డాక్టర్.
పులి ప్రవచనాలు వినదు.. జింక విన్నా ఉపయోగం లేదు. శాంతంతో క్రోధాన్ని, మంచితో చెడుని, సత్యంతో అసత్యాన్ని జయించొచ్చని తెలుసుకోవాల్సిన అవసరం ఆమెకి ఇంతవరకూ కలగలేదు. తెలుసుకోలేదు. తెలుసుకోడానికి ఇంకా సమయం పడుతుందేమో. ఏం లాభం? ఆలస్యంగా వచ్చిన జ్ఞానం.. అజ్ఞానంతో సమానం.
“బైట ఉన్నారు డాక్టర్!” అన్నాడు రాజేంద్ర.
“అదేం?” అడిగాడు సూర్యారావు.
సమాధానం చెప్పకుండా..
“బాబుకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్?” ఆదుర్దాగా అడిగింది కౌసల్య.
“ఎందుకిలా జరిగింది డాక్టర్!?” అడిగాడు రాజేంద్ర.
“ప్రస్తుతం బానే ఉన్నాడు. ఇంతకుముందు ఎప్పుడూ బాబుకి దెబ్బలు తగలటం కానీ, బ్లీడింగ్ అవటం జరగలేదా?” అడిగాడు సూర్యారావు బ్లడ్ రిపోర్ట్స్ చూస్తూ.
“లేదు డాక్టర్.. ఇదే మొదటిసారి. యూఎస్‌లో చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. వద్దంటే మా మావగారే పొలం తీసుకెళ్లారు” అంది కౌసల్య. ఆమెకి అనంతం మీద కోపం ఇంకా తగ్గలేదు.
“సరే! ఓ విషయం చెబుతాను కంగారు పడకండి. మీ అబ్బాయికి హీమోఫీలియా ఉన్నట్టుంది” అంటూ ఉండగానే..
“అంటే ఏంటి డాక్టర్?” అడిగింది కౌసల్య కంగారుగా.
“ఏకారణంచేతైనా రక్తస్రావం జరిగితే, కొద్ది నిమిషాల్లో దానంతటదే గడ్డకట్టి ఆగిపోతుంది. కానీ, హీమోఫీలియా పేషంట్లలో ఎనిమిది, తొమ్మిది, పదకొండు రకం రక్తస్రావ కారకాల్లో ఏదో ఒకటి చాలా తక్కువగా ఉండటంతో రక్తం గడ్డకట్టదు. హిస్టరీ తెలిస్తే తప్ప సర్జరీకి ముందు ఈ విషయం బయటపడదు. ఈ పేషెంట్లు చాలా తక్కువ శాతం ఉండటంతో మేమూ సాధారణంగా వాటి గురించి పరీక్ష చెయ్యము” అనగానే.. కౌసల్య ఆందోళనగా చూసింది. డాక్టర్ ఇంకా చెప్పసాగాడు.
“అనుకున్న ప్రకారం రేపు టాన్సిల్స్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లయితే.. రక్తం గడ్డకట్టక చాలా ప్రమాదం జరిగేది. ఓ రకంగా ఈరోజు చంటాడి కాల్లో ముల్లు గుచ్చుకుని మంచే జరిగింది. కొంతకాలం సర్జరీ వాయిదా వేద్దాం. నాకు తెలిసిన హెమటాలజిస్ట్కి బ్లడ్ శాంపిల్ పంపుదాం. ఫర్దర్గా ఎగ్జామిన్ చేసి ఏయే ఫ్యాక్టర్లు లోపమున్నాయో తెలుసుకొని.. ట్రీట్మెంట్ ప్రొటోకాల్ చెబుతాడు. ఆ తర్వాత టాన్సిల్స్ ఆపరేషన్ ప్లాన్ చేద్దాం. లేదంటే అమెరికాలో స్పెషలిస్ట్‌కి చూపిస్తానన్నా మీ ఇష్టం!” అన్నాడతను వెనక్కి వాలి.
“ఏం ఫరవాలేదా డాక్టర్?” విచారంగా అడిగాడు రాజేంద్ర.
“మందులు రెగ్యులర్‌గా వాడుతూ, దెబ్బలేవీ తగలకుండా చూసుకోవాలి. అవసరమైనప్పుడు ఫ్యాక్టర్లు ఎక్కించుకుంటే చాలు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది” అన్నాడు సూర్యారావు.
ఈలోగా బ్లడ్ బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. పక్కనే ఉండటంతో అనంతం, పోలయ్య వెంటనే వెళ్లి చెరో యూనిట్ బ్లడ్ రీస్టోర్ చేసి వచ్చి కూర్చున్నారు. ఎప్పుడూ నిటారుగా కూర్చునే రిటైర్డ్ ఆర్మీ హవిల్దార్ అనంతం.. బల్లపైన ఒంగి కూర్చుని మోకాళ్లపై చేతులు పెట్టుకుని నేలని చూస్తున్నాడు. బైటవాళ్లకి కనబడనీయకుండా అతని కన్నీళ్లని జోళ్లు పీల్చుకుంటున్నాయి.
‘మట్టిలో దిగటం ఖర్మనా? మట్టి లేనిదే మెతుకు లేదు. మట్టి లేనిదే బతుకు లేదు. అదేంటో.. ఈ కాలం మనుషుల లక్ష్యం మాత్రం పిల్లల కాలికి మట్టంటకుండా తిరగటం’ అనుకుంటుంటే.. మెలితిప్పిన మీసాల మాటున మెత్తని గుండె విలవిల్లాడుతున్నది. లోపల ఏం జరుగుతున్నదో తెలీదు. చిన్న ముల్లు గుచ్చుకుంటే ఇంత ప్రమాదం ఎందుకైందో తెలీదు. ప్రస్తుతం చంటాడు ఎలా ఉన్నాడో తెలీదు. ఇందులో తన తప్పెంతుందో కూడా తెలీదు. ఏదైనా జరగరానిది జరిగితే.. కోడలు ఏం చేస్తుందో మాత్రం తెలుసు. నీరసంగా ఉన్నా సరే.. బ్లడ్ బ్యాంకు వాళ్లు ఇచ్చిన ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్‌ను తాగాలనిపించలేదు. మనవడి కోసం దాచి ఉంచాడు. కాసేపటికి డాక్టర్ రూమ్‌లోంచి బైటకొస్తూ.. బల్లమీద కూర్చున్న తండ్రిని వెళ్లి పలకరించమని కౌసల్యకి సైగ చేశాడు రాజేంద్ర.
‘గడ్డకట్టే లక్షణం బైటకొచ్చే రక్తానికే కాదు.. బయటకొచ్చే కోపానికి కూడా అవసరమే! రక్తస్రావాన్ని ఆపేందుకు కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్లను శరీరం ఎలా ఉంచుకుంటుందో.. క్రోధాన్ని ఆపేందుకు బంధాలను కూడా పేనుకుంటూనే ఉండాలి’ అని భార్యకి చెప్పాలని ఉందతనికి.
పులి ప్రవచనాలు వినదు..
జింక విన్నా ఉపయోగం లేదు. శాంతంతో క్రోధాన్ని, మంచితో చెడుని, సత్యంతో అసత్యాన్ని జయించొచ్చని తెలుసుకోవాల్సిన అవసరం ఆమెకి ఇంతవరకూ కలగలేదు. తెలుసుకోలేదు. అనంతానికి అవన్నీ తెలిసినా ఉపయోగం లేదు. అపార్థాలతో గీసుకున్న ‘గిరి’ చెరిగి, అసహనంతో పేరుకున్న ‘గిరి’ కరిగి, తిరిగి మామూలుగా మారటానికి ఆమెకి బహుశా కొంచెం సమయం పడుతుందేమో. ఏం లాభం? ఆలస్యంగా వచ్చిన జ్ఞానం.. అజ్ఞానంతో సమానం. ఆమె కొడుకుని ఎత్తుకుని ఇంటికి వెళ్లిపోయింది.
“నాన్నా.. నాన్నా!” అంటూ ఎంత పిలిచినా అనంతం పలక్కపోవటంతో.. డాక్టర్ని పిలవటానికి
లోపలికి పరిగెత్తాడు రాజేంద్ర.
‘శాంతంతో క్రోధాన్ని జయించొచ్చని శాంతంగా ఉండేవాళ్లకి తెలిస్తే సరిపోదు.. క్రోధంతో ఊగిపోయే వాళ్లకి కూడా తెలియాలి’ అని చెప్పే కథ.. ‘అక్రోధేన జయేత్ క్రోధం’. రచయిత ఉమా మహేష్ ఆచాళ్ల. వీరి స్వస్థలం కాకినాడ జిల్లా తుని. కేంద్ర పరోక్ష పన్నుల విభాగమైన కస్టమ్స్ డిపార్టుమెంటులో ఉన్నతోద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగరీత్యా ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నారు. 2016 నుంచి కథలు రాస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 50 కథలు.. నమస్తే తెలంగాణ, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, స్వాతి, వార్త వంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
వీటిలోని 21 కథలతో ‘సంఘే శక్తి కలియుగే’ శీర్షికతో కథా సంపుటిని వెలువరించగా, ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నుంచి స్వర్ణ పతకం, ప్రశంసాపత్రం అందుకున్నారు. మరో పదహారు కథలతో ‘వ్యక్తావ్యక్తం’ పేరుతో రెండో సంపుటి రాబోతున్నది. నమస్తే తెలంగాణ – ముల్కనూర్ సాహితీపీఠం సంయుక్తంగా నిర్వహిస్తున్న కథల పోటీలలో వరుసగా నాలుగు సార్లు బహుమతులు అందుకున్నారు. తెల్సా – 2022 కథల పోటీలో ఈనాడు కథా విజయం – 2019, 2020లో బహుమతులు పొందారు. మూడు కథలు కన్నడలో అనువాదమై.. అక్కడా ప్రాచుర్యం పొందాయి.
– ఉమా మహేష్ ఆచాళ్ల 98493 03247