‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.
నడ్శీ నడ్శీ పెంటయ్య కాళ్లు నొత్తానయి గనీ.. పోదామని బయల్దేర్న జాగైతే ఇగ
అత్తలేదు, అగ అత్తలేదు. గది డాంబర్
రోడ్డే ఐనా.. ఇర్గ గొట్టే ఎండ జేయవట్టి సిమెంట్
రోడ్డు వారెం తెల్లగా మెరుత్తంది. ఎర్రటి నిప్పుల కుంపటి లెక్క సర్ర సర్ర కాలుతందని.. శెప్పులు లేకుండ రోడ్డుపైన బలం వెట్టకుండా, ఆన్చీ ఆన్చకుండా బిర్ర బిర్ర నడుస్తున్న పెంటయ్య కాళ్లే శెప్తానయ్. పెంటయ్య
బొత్తల ఓసర లేదు. ఎనకటోళ్లు కలో గంజో తాగి
బతకచ్చు అంటే.. పెంటనికది కల్లు, గంజి లెక్క సమజ్ అయినట్టుంది. నిన్న మాపిటేల గౌడ్ బావ కాడ సోపతిగాడు లింగయ్యతోని నాల్గు లొట్ల కల్లు తాగి.. బొత్తల ఇరుకుటం అయ్యి ఇంటికాడ గంజి ఐతే తాగలేదు. కడుపుల ఆకలి జేయవట్టి కాళ్లు కాలుతానయని మల్ల మతచ్చింది పెంటనికి. గప్పుడు అనుకున్నడు.. శెప్పులు
ఏమైనయని?
యాదికచ్చింది ఏందంటే.. నిన్న కల్లు తాగచ్చె తొవ్వల రాత్తిరైంది. రిమ్మల సక్కగ నజర్ లేక..
ఎవడో ఇంట్ల పాయఖానా లేని పోరడు నడితొవ్వల వోయిన పియ్యి తొక్కిండు. ఎనకటి తన రాజా
బతుకు యాదికొచ్చి..
“ఇసొంటి శెప్పులు లచ్చ గొంట! రేపు పొద్దుగాల సర్కారోళ్లు పైసలే ఇయ్యవట్టే.. ఓ పాయఖానా కట్టుకుంటే ఏందీ? కట్టుకుంటమని ముగ్గువోసుడు, పోట్వలు దిగుడు, పైసలచ్చినంక కట్టుడు నడిమిట్ల బంజేషి.. గిట్ల బైటికచ్చి ఏర్గుడు.. ఈల్లకగ్గి తల్గా!” అని సాపిచ్చుకుంటా.. శెప్పులు ఆడ్నే ఇసిరిండు. ఆల్లకగ్గి తల్గుడేమో గని.. గిప్పుడు పెంటని కాళ్లు, కడుపు అగ్గి తలిగినట్టే మండుతానయ్.
గిన్నన్ని నీళ్లయినా తాగుదమని జబ్బకు తలిగిచ్చుకున్న సింగరేణి సాక్స్ సుట్టిన ప్లాస్టిక్ బాటిల్ తీశి తాగవోయిండు. కానీ, అండ్ల నీళ్లు లెవ్వు. ముసల్ది ఉంటే గిట్ల బైటికి వోయినప్పుడు నీళ్ల బాటిల్ నింపి సాగనంపేది. కానీ, పెంటడు తాగి కొట్టిన దెబ్బలకు మంచానవడి.. అర్సుకునేటోల్లు లేక సచ్చిపోయింది.
‘గిప్పుడు తాగనీకి నీళ్లు లెవ్వు. ఆకలైతంది. కాళ్లు గూడ కాలుతానయి. నాకచ్చే కోపానికి తిట్టనీకి నా పెండ్లం గూడ లేదు. అది మంచాన వడ్డప్పుడు అర్సుకునుంటే.. నాకో తోడైనా ఉండేది. గిప్పుడు కుక్కసావ్ గావట్టే!’ అని మనసుల తలుసుకున్నడు.
‘నాకేం కమ్మి అయ్యే గనీ.. ఇద్దరు కొడుకులు, ఓ బిడ్డ ఉండే! పెద్ద కొడుక్కు సింగరేణి నౌకరు వెట్టించినంక పెండ్లాం పిలగాండ్లతోని పట్నంల వడ్డడు. మా దిక్కు మల్ల సూపు ఐనా లేదు. అవ్వ సచ్చినప్పుడు సుత రాలే. శిన్నోడేమో.. ‘పెద్దోనికి పని వెట్టిచ్చినవ్. నేను కొడుకును కాదా?’ అని ఇల్లు ఆని పేరట రాపిచ్చుకుని.. దాన్ని ఎవనికో అమ్ముకున్నడు. నా పించిని పైసలువడే బేంకు అకోంటు ఏటీఎం కారట తీస్కొని.. దేన్నో వట్టుకొని బైటవడ్డడు. జాడ లేడు – పత్త లేడు. కులంగాని దాన్ని వట్టుకవోయిండని మా కులపోల్లు మమ్మల్నిఎలేశిర్రు.
గందుకే.. బిడ్డ లగ్గం జేసుడుకు పిలగాడు దొరుకక సావు కట్టమైంది. ఎట్లనోగట్ల ఉన్న పొలం ఆయింత అమ్మి దాని లగ్గం ఘనంగా జేశి సాగనంపితే.. నా ఇంటికత్తే విలువ తక్కువనీ తొలిసూరు కాన్పుకైనా రాలే.
ఏం జేయలేక తాగితాగి ఇంటికివోయి ముసల్దాన్ని కొట్టుడు. అది పొద్దంతా కైకిలికి వోయచ్చి, నాకు బువ్వకూర అండివెట్టేది. నేను పనుగడ లేక తాగి తిరిగినా కూడా.. అది నన్ను ఎంత మంచిగా అర్సుకున్నది ఉన్నన్ని రోజులూ..!? నేనేమిచ్చిన దానికి? సచ్చిపోయే దాంక నరకం తప్ప!’.. తాగనీకి నీళ్లు లేవు గానీ..
గివన్ని యాదికచ్చి పెంటనికి కండ్లల్ల దూపనువెంచే నీళ్లు అచ్చినయ్.
ఎవరినైన కొన్ని నీళ్లు అడుగుదామన్నా.. కులం ఎలేశినోడాయే. నీళ్ల కోసం అటూఇటూ దేవులాడిండు. గప్పటి దాంక ఎంబటే నడుసుకుంటస్తున్న కుక్క ఒకటి.. పెంటని గోశిని పిలుస్తున్నట్టు లాగి, ఎక్కడికో దారి సూపిస్తున్నట్టు ముంగటకు నడిశింది. పెంటడు సుత దాని ఎనకనే వోయిండు. కుక్క బోర్ పంపుకాడికి తీస్కవోయింది.
‘దీనికెంత ఇస్వాసం!? ఎప్పుడో ఓసారి నా గుడిశె ముంగటకచ్చి మొత్తుకుంటే గింతంత పాశివోయిన సలి బువ్వ ఏశినందుకు. నేను కన్నోల్లకు సుత లేకపాయే ఇండ్ల సగం ప్రేమ గూడ’..
అనుకుంట వొయ్యి బోర్ పంపు కటుక ఒత్తిండు. నీళ్లు రాలే. కరెంటు లేనట్టుంది.. ఎండకాలం గదా. గీ కరెంటు మోటార్లువెట్టి శేతి పంపు లేకుండా జేశిర్రు. గదుంటే రెండు దెబ్బలు అటుఇటు అనంగనే నీళ్లు అచ్చేటివి. గిప్పుడు కరెంట్ లేంది రావాయే.
దూప ఐతంది. కాళ్లు కాలుతానయి. ఎండ శిట్టశిట్ట కొడుతాంది. ఓసర లేక బోరుపంపు గద్దె మీద కూలవడ్డడు. గట్ల ఎంతసేపయ్యిందో గానీ.. శేతుల వట్టుకున్న రేషన్ కారట, సంచి జారి కిందవడ్డయి. నిద్రల నుంచి లేశి సూస్కుని..
‘మల్ల డీలర్ రేషన్ దుకాణం బంజేషి పోతడు’ అనుకుంట దబదబ లేశి మల్ల తొవ్వవట్టిండు.
‘నా కారట మీద మొన్ననే బియ్యం పోశిండు. ఇప్పుడు పోస్తడో, పొయ్యడో? కొన్నయిన ఉంచుకుంటే అయిపోవు. కిలకు పది రూపాలు అత్తానయని,బియ్యంకొనే ఆటోవోనికి అమ్మి, తాగుడుకు ఓడగోడితి. పైసలు గూడా లెవ్వు నా కాడ! కాళ్లయినా మొక్కి బియ్యం తెచ్చుకోవాలె. లేకుంటే మాపటీలి బువ్వకుఒక ఇత్తు గూడ లేదు!’..
సోంచాయింపుల రేషన్ దుకాణం అచ్చింది. ఎపుడచ్చిందో తెల్వది గానీ.. కుక్క కూడా ఎనకనే ఉన్నది.
మెల్లగా బుగులు వడుకుంటనే లోపలికివోయి అటూఇటూ సూశిండు. బియ్యం బస్తాలు ఐతే ఇర్గనే ఉన్నయి. కొంచెం మదిల నిమ్మలం అయ్యింది పెంటనికి. కాంటల బియ్యం జోకుతండు డీలర్. ఐదారుగురు లైన్ల ఉన్నరు. అండ్ల ఆరు నెలల ముంగట పెంటనికి అప్పు ఇచ్చిన రాజిగాడు సుతం ఉన్నడు.
‘నన్ను సూడకుంటే మంచిగుండు. ఐనా.. నా పిస గనీ ఉన్నది ఊరగల్ల మందనీ.. కనవడకుంట ఉంటనా? సూశినా పైసలు అడుగుతడా? గిప్పుడు బియ్యానికే పైసలు లెవ్వు!’ మల్ల బుగులు వట్టుకున్నది.
రాజిగాడు సూడనే సూశిండు. పైసలు అడుగుదామని అనుకున్నడు గానీ, పెంటడు ఎనకటితీర్గ కనవడ్తలేడు. సైలేకుంట ఉన్నడు. నల్లగ తేజ్ ఉండే మొఖం.. తెల్లగ నెత్తురు లేకుండా పీక్కువోయి నారాజైంది.
కండ్లు లోపలికి వోయినై. మొఖం, బొండిక్కాయ మీద బొక్కలు తేలినయి. ఒక శేతుల సంచి వట్టుకుని, ఉంకో శెయ్యి బొత్త మీద వెట్టుకుని మెల్లగ సొలుక్కుంట అచ్చిండు గనీ.. తాగినట్టు లేడు. ఇగ పైసలు అడగబుద్ధి గాలే. బియ్యం వోస్కొని డీలర్‌కు పైసలిచ్చి.. ఆడికేంచి వోయిండు రాజిగాడు.
రేషన్ డీలర్ పెంటణ్ని సూశి..
“ఏం పెంటయ్య కాకా! గిట్ల తొవ్వ వట్టినవ్?” అన్నడు నవ్వుకుంట.
ఆ పలకరింపుతోటి..
‘ఈ పూట డీలర్ మంచిగనే ఉన్నడు. బియ్యం
పోసేటట్టే ఉన్నడు’ అనుకొని, పెంటని మనసు గింతంత తేలికవడ్డది.
పెంటడు శిన్న గొంతుతో..
“అయ్యా..! కొన్ని బియ్యం పొయ్యరాదే? పైసలు అచ్చే నెలకు ఇత్తగని” అన్నడు.
డీలర్ నవ్వుడాపి..
“పైసల ముచ్చట అటెంక గనీ.. బియ్యమే లేవు. మొన్ననే నీ కారట మీద అచ్చేటివి పోస్తి కదా!?” అన్నడు.
ప్రేమగా పలకరించిన గా నోటి నుంచి.. గీ మాటలు ఊహించలేదు పెంటడు. కండ్లల్ల నీళ్లు తిరిగినయ్.
“నీ బాంచెన్ అయిత అయ్యా..! గట్ల అనకు. ఏదో ఒకటి జేషి ఇయ్యకుంటే ఆకలితోని సచ్చిపోయేటట్టు ఉన్ననే!” అన్నడు బొత్త వట్టుకుని.
“నా శేతులేం లేదు కాకా! గిప్పుడంత ఆన్లైన్ సిస్టం అయింది గదా? నువ్వు మిషిని మీద ఏలుముద్ర వెడితెనే.. నీ బియ్యం నీకు అస్తయి. మల్ల నెలదాంక రావు”.
పెంటడు బియ్యం బస్తాల దిక్కు సూస్కుంట..
“ఇర్గనే ఉన్నయి కదనే బియ్యం. నాకెన్ని..? ఓ ఐదారు కిలలు ఇయ్యి. ఎట్లయినా గీ నెలకు సరివెట్టుకుంట” అన్నడు.
“నీకు వోశిన బియ్యం పైసలకు అమ్ముకొని.. నన్ను అడిగితే నేను ఏడికి పోవాలే? నేను ఇంకా శానామందికి బియ్యం వోశేడిది ఉంది. ఈడికేంచి పో కాకా” గద్దరాయించినట్టే అన్నడు డీలర్.
ఇంకో బస్తా తియ్యనీకి వోతుంటే.. కాలుకేదో తాకినట్టయ్యి కిందికి సూశిండు డీలర్. పెంటడు కాలువట్టుకుని ఉన్నడు.. డీలర్ పెంటణ్ని పైకి లేపిండు.
“ఒక్క కిలైనా పొయ్యి అయ్యా! ఆకలికి సచ్చివోయేటట్టు ఉన్నా. మల్లెప్పుడు అడగను సుత అడగ”.. ఏడుసుకుంట అన్నడు పెంటడు.
“లెవ్వని జెప్తే అర్థం గాదా? కిల గాదు.. ఒక్క గింజ గూడా పోసేది లేదు” మళ్ల గద్దరాయించిండు.
పెంటడు నిరాశతోని వోతుంటే.. డీలర్ బియ్యం బస్త ఇప్పుతూ..
“ఒకసారి గాదు.. రెండుసార్ల గాదు! ప్రతినెలా గిదే పని” అనుకుంట గునిగిండు.
పెంటడు తడి కండ్లతోనే ఎనకకు మర్రిసూశిండు. గడప కాలికి తాకి.. రోడ్డుమీద ఇర్సుకవడ్డడు. జబ్బకున్న బాటిల్, రేషన్ కారట ఇంకా సంచి ఏడనోవడ్డయి. కుక్క జాలిగా సూస్కుంట దగ్గరికచ్చింది. అది పెంటడు తాగి వడిపోయినప్పుడు ముసల్ది సూపిన ప్రేమకు ఏ మాత్రం తీశిపోదు. డీలర్, ఇంక నలుగురు సూశి..
‘ఎప్పటిలెక్కనే తాగివడ్డడు!’ అనుకొని ఇడిశివెట్టిర్రు.
గంతల్నే..
“రేషన్ బియ్యం కొంటాం.. పది రూపాయలకు కిల!”.. అంటూ మైక్ సౌండుతోని ఆటో వచ్చి, రేషన్ షాప్ ముంగట ఆగింది.
గది విన్న డీలర్.. దాసుకున్న బియ్యం బస్తాలు తియ్యడానికి లేశిండు. ఆడున్నోల్ల సాయమడిగి.. బస్తాలు మోసుకుంట కిందవడున్న పెంటనిపక్కనుంచి తీస్కవోయ్యి కాంటాల వెట్టిండు. ఆటోవోడు అవి తూకం సూశి, పైసలు ఇచ్చిండు. గిదంతా పెంటనికి కలగా పులగంగా కనిపిస్తంది. డీలర్ గా పైసలులెక్క సూసుకుని, జేబుల వెట్టుకుంటా.. అరుస్తున్నకుక్క ముంగట నుంచి దర్జాగా నడుసుకుంటలోపలికి వోయిండు.
ఆటో మల్ల మైక్ చాల్ జేస్కుని ఊర్లకు వోయింది.
గా సప్పుడు ఊర్లందరికీ వినసొంపైన పాట లెక్క వినిపిస్తంది.. ఒక పెంటనికి తప్ప. ఆనికి మాత్రం సావు డప్పు లెక్క.. లీలగా వినిపిస్తంది. భూమికి శెయ్యి అదిమివెట్టి లేవడానికి సూశిండు గానీ ఐతలేదు. పెయ్యిలున్న బలమంతా వెట్టి మెల్లగ ఎట్లనోగట్ల లేశి నిలవడ్డడు. గోశి ఊషివోయింది. మోకాళ్లు, మోచేతులు కొట్టుకపొయ్యి నెత్తురు కారుతంది. ఐనా పెంటనికి స్పర్శ తెలుత్తలేదు. పెయ్యంత తిమ్మిరెక్కింది. కుక్క ఏం జేయలేక బీరిపొయ్యి సూత్తంది. గోశి ఆటుమూటుగ శెక్కుకొని.. బాటిల్, రేషన్ కారట, సంచి తీస్కోనే ఓసర లేక ఆడనే ఇడిశివెట్టి.. మెల్లగ సొలుక్కుంట ఊర్లకు తొవ్వవట్టిండు.
పెంటనికి ఈ పూట తాగకున్న గూడా రిమ్మ ఎక్కినట్టే కండ్లకు శీకటి అచ్చినట్టు ఐతంది. ఏదేదోమతికస్తన్నయి..
‘నిన్న కల్లు తాగకుంటే ఈ పూటకు గంజైనా ఉండేటిది. కనీసం నిన్న రాత్తిరన్న గంజి తాగుంటే గింత ఆకలయ్యేదా? గీ తాగుడు జేయవట్టే గదా..? సక్కగ పనికివోక నా సింగరేణి నౌకరి వోతదని పెద్దోడు వెట్టుకున్నది? ఇల్లు ఏడ కుదవెట్టి తాగుడుకు ఓడగొడ్తనో అని శిన్నోడు పట్టా జేస్కుంది? వాడు ఎవలతోని పోతేంది.. నాకు మంచిగ పేరు ఉంటే బిడ్డ లగ్గం ఎందుకు కట్టం అయ్యేది? నేను తాగి తేపకీ లొల్లి జేస్తున్న అనే గదా.. అందరూ నన్ను దూరం వెట్టి ఎవల తొవ్వల ఆళ్లు వోయింది!? నేను కొట్టిన దెబ్బలకే గదా.. నా ముసల్ది సచ్చింది? అన్నీ నన్ను ఇడిశినా గూడా.. నేను గీ తాగుడు ఇడిశివెట్టలే!’..
గిట్ల ఎన్నో ప్రశ్నలు, ఆలోచన్లతో సొలుక్కుంట.. శాతనగాక సోయి తప్పి కిందవడ్డడు.
పెంటని మొఖం మీద నీళ్లువడ్డట్టు అయ్యి పక్కకు సూశిండు. కరెంటు అచ్చినట్టుంది. గప్పుడు కటుక ఏశున్న బోర్ పంపులకెల్లి నీళ్లు బొల్ల బొల్ల పోతానయ్. సుట్టుపక్కల ఇండ్లోల్లు ఆ పంపును, పెంటణ్ని పట్టిచ్చుకోకుండా.. ఇంట్లున్న రేషన్ బియ్యం బైటికి దీశే పనిలున్నరు. సోపతిగాడు లింగయ్య దూరంకెల్లి సైకిల్ ఏస్కొని వస్తున్నట్టు కనిపిస్తంది. వాడేనా? కాదా? అని పరీక్షవట్టి సూశిండు. నజర్ మసక మసక ఉంది. సక్కగ కనిపిస్తలేదు. దగ్గర దాంక వచ్చినంక ఆడు కిందవడున్న పెంటణ్ని సూశి, సైకిల్ ఆపకుండనే..
“మల్ల వడ్డవారా నాయినా..!? లేపితే మల్ల నాకో లొల్లి. నాకు మస్త్ పనుంది” అనుకుంట వోయిండు.
పంపు దిక్కు ఏదో సప్పుడైతే సూశిండు. కుక్క నీళ్లను సూపెడ్తూ అరుస్తంది. పెంటనికి ఆ అరుపు సక్కగ వినిపిస్తలేదు. నీళ్లు ఉన్నా.. నోటికి దూప లేదు. కాళ్లు కాలుతలేవు. కడుపుల ఆకలి లేదు. ఎందుకంటే.. పెంటని గొంతుల గిప్పుడు ఊపిరి లేదు.
దాంతో సంబంధం లేకుండ ఊర్ల చానామంది రేషన్ బియ్యం బైటికి దీశి తయారుగున్నరు..
‘బతుకును అమ్మడానికీ – సావును కొనడానికి’..
పెంటడు తడి కండ్లతోనే ఎనకకుమర్రిసూశిండు. గడప కాలికి తాకి.. రోడ్డుమీద ఇర్సుకవడ్డడు.
జబ్బకున్న బాటిల్, రేషన్ కారట ఇంకా సంచి ఏడనోవడ్డయి.
రవితేజ సిరిపురం
కథకుడు, నటుడు, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ చాటుతున్నారు రవితేజ సిరిపురం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట్ స్వస్థలం. ఇంజినీరింగ్ చదివినా.. సినిమాల మీద మక్కువతో ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్‌గా పనిచేస్తున్నారు. ‘వై మీ?’, ‘నయా బ్రేకప్’ లఘుచిత్రాలలో నటించడంతోపాటు దర్శకత్వ శాఖలోనూ పనిచేశారు.
ఫ్రీలాన్సర్‌గా రెండు సినిమాలకు కథనాలు అందించారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ‘కలవా..? చెలియా..!’ అనే లఘుచిత్రాన్ని నిర్మించారు. దర్శకత్వ బాధ్యతలతోపాటు నటుడిగానూ రాణించారు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే కేటగిరిల్లో జాతీయ, అంతర్జాతీయంగా అవార్డులు అందుకున్నారు. ఆన్లైన్లో మీరా నాయర్ మాస్టర్ క్లాస్, ఐఐటీ మద్రాస్ నుంచి ఫిలిం అప్రిసియేషన్లో సర్టిఫికేషన్ కోర్సులు చేశారు. తాను దర్శకత్వం వహించిన ‘ప్రామాద్య’ అనే డెమో ఫిలిం విడుదలకు సిద్ధంగా ఉంది. మరో డాక్యు డ్రామా.. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. తాను చెప్పాలనుకున్న అన్ని కథలనూ సినిమాలా చెప్పే ఆర్థిక స్తోమత లేక.. వాటిని కథల రూపంలో చెబుతున్నారు. ఇప్పటివరకూ రాసిన ఒకే ఒక కథ.. ‘బతుకును అమ్ముడు
– సావును కొనుడు’.