జరిగిన కథ : రాచనగరిలోనూ ఓ కళామహిమ తెలిసిన అమ్మాయిని గుర్తించాడు జాయపుడు. అయితే, అందరిలా ఆమెతో కబుర్లు చెప్పుకొనే అవకాశం ఇక్కడ లేదు. ఎలాగైనా ఆమెను కలవాలనీ, కళా స్పందనలు పంచుకోవాలని అనుకున్నాడు. నాట్యంలో తన ప్రతిభను ఆమె ముందు ప్రదర్శించాలని భావించాడు. అయితే, వారిద్దరూ కలుసుకోలేని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో.. జాయపుడు – ఇంద్రాణి కలిసే సన్నివేశం ఒకటి జరిగింది.
గణపతిదేవుడు వస్తున్నాడన్న వార్త తెలిసి.. చాలామంది పురుషులు కూడా వోణీల కార్యక్రమానికి వచ్చారు. తల్లిదండ్రులతో ఇంద్రాణి కూడా హాజరయ్యింది. అనేకానేక కులీన రాజయువతులలో ఆమె ఒక్కరుగా సామాన్యంగా ఉంది. కారణం.. ఒకరిని మించిన అందగత్తె ఒకరు. ఒకరిని మించి మరొకరు వారివారి తనూ లావణ్యాలకు నప్పే దుస్తులు, ఆభరణాలు ధరించి ఉన్నారు. రాచరికశోభతో అలరారుతున్నారు.
కానీ భావుకుడు, అనేకానేక కళల్లో పరిచయమున్న జాయపునికి.. ఇంద్రాణి కళాకారిణి అని తెలుసు కాబట్టి, ఆమె తనూ లావణ్యం అందరికంటే విభిన్నంగా తోచింది.
ఆమె ముఖం కళాత్మకత వెలార్చుతున్నది. ఆమె శరీరం స్పష్టాంగ రేఖాసమన్వితం. ఇక్షు కోదండంలా.. ఇటీవల రామప్ప దేవళం కోసం చెక్కుతున్న అలసాకన్యలా సన్నగా పొడవుగా సాగలాగినట్లుంది. ఆమె కాలు చేతులు మృదులములు.. పుష్టిమంతములు. నడక సున్నితంగానూ నేల కందిపోతుందేమో అన్నట్లు ఆచితూచి వేస్తున్నది అడుగు. మొత్తంగా ఆమె గురుకులంలో చూసిన అనేకమంది కులీన యువతుల్లాగే ఉంది. కానీ, ముఖంలో తేజరిల్లుతున్న స్నిగ్ధత్వపు ప్రాకృతిక అందంలో మిళితమైన కళాత్మకత ఏదో ఇతరులనుంచి ఆమెను వేరు చేస్తున్నది. అంతలోనే నవ్వొచ్చింది. ఈమె ఆమెకంటే పూర్తిగా విభిన్నం! ఆమె కాకతి!!
అందరి ఆడపిల్లల్లాగే ఆమె కళ్లు చంచలిస్తూ.. అక్కడున్న యువకులను మౌనంగా పట్టి పరిశీలిస్తున్నాయి. లిప్తమాత్రంలో.. ఎక్కువగా జాయపుణ్ని. ఓ పక్కన పురోహితులు, శైవముఖ్యులు ఈనాటి ప్రధాన అంశమైన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చిన్నారి సుందరాక్షిని ఆశీర్వదిస్తుండగా.. రాజ్యంలోనే అత్యంత ఉన్నత కులీన కుటుంబాల పురుషులు, మహిళలు, యువతులు, పిల్లా జెల్లా ఆటపాటలతో, ముచ్చట్లతో మందిరమంతా పరిమళిస్తుండగా.. పెద్దలందరూ ఆత్మీయంగా తిలకిస్తున్నారు. మరికాసేపటికి మహారాజుతోపాటు పెద్దల ఆశీర్వచనం కూడా ముగిసింది.
అక్కడ అందరి కళ్లూ జాయపుని చుట్టూ తిరుగుతున్నాయి. అక్కడున్న యువకుల్లో అనేకులు అందగాళ్లు ఉన్నారు. సాక్షాత్తూ యువమహారాజు గణపతిదేవుడే తన చతురతతో, కబుర్లతో అందరినీ ఆకర్షించగలడు.
ఈరోజు తన శారీరక ఉన్నతత్వంతో అందరినీ మించి వెలుగులీనుతున్నాడు జాయప. అతని తేజస్సు, కళాత్మకత కంటే అతని వయస్సు, అందచందాలు, పురుషత్వం, అందున్న వీరత్వం.. అన్నిటినీ మించి అతనికి చక్రవర్తితో ఉన్న అనుబంధం, దగ్గరితనం.. వారిని అసూయాగ్రస్తులను చేస్తున్నాయి. అదంతా వారి చూపుల్లో, మాటల్లో ద్యోతకమవుతున్నది.
చాలామంది యువకులు జాయపుణ్ని పలకరించి మాట్లాడుతున్నారు. ఆడపిల్లలున్న తల్లులు మరీ విశాలమైన నవ్వులతో పలకరిస్తున్నారు. గణపతిదేవుడు అన్నదమ్ములతోనూ.. చిన్ననాటి స్నేహితులతోనూ.. ‘ఒరే! రారా! పోరా!’ అనే సోదరులతోనూ పగలబడి నవ్వుతూ ముచ్చట్లు పంచుకుంటుండగా.. నారాంబకైతే పట్టపగ్గాలు లేవు. ఇంతమంది భర్త తరఫు బంధువులు తనతో మాట్లాడటం ఆమెను పరవశింపజేస్తున్నది. అక్కలు, చెల్లెళ్లు, వదినలు, పెద్దమ్మలు.. పిన్నమ్మలు, మేనకోడళ్లు.. అందరితో వరసలు కలుపుతూ.. అందరిలో కలిసిపోతున్నది.
ఆమెను చూస్తూ జాయపుడు మురిసిపోతున్నాడు. కానీ, అతని చూపులన్నీ తనను చుట్టుముడుతున్న చూపులను తప్పుకొని ఇంద్రాణిని చూడటానికి తహతహలాడుతున్నాయి. ఆమె కూడా చాలా మౌనంగా, బిడియంగా, మందస్మితంగా, మధురస్మితంగా.. అటూ ఇటూ చూస్తూ.. ఎవరితోనో మాట్లాడుతూ.. ఓ పసిపాపను ముద్దులాడుతూ.. శిరోజాలను సవరించుకుంటూ.. పైటను సున్నితంగా కదుపుతూ.. మరో చేత్తో కుచ్చిళ్లు సుతారంగా పట్టుకుని, జాయప చూపులతో చూపులు కలుపుతూ.. అప్పుడప్పుడూ తిరస్కారంగా తల తిప్పుకొంటూ.. మళ్లా అతను ఏమన్నా నొచ్చుకున్నాడేమోనని బిడియపడుతూ మళ్లీ చూస్తూ.. కళ్లతో క్షమించమంటూ.. కాస్త మోహనత్వాన్ని చూపులతో కలిపి అతని కళ్లకు అందిస్తూ.. ఓ రసరమ్య మధుర వాహిని వారి తొలి సమాగమవేళ వారి మధ్య ఉరికి దూకుతూ.. సుడులు తిరుగుతూ.. ఎత్తు పల్లాలను ఒరుసుకు ప్రవహిస్తున్నది.
ఉన్నట్టుండి ఎవరో అన్నారు.. “వెంగమాంబా! ఓ మంచి పాట పాడవచ్చుకదా!?” అని. అంతా తమతమ గుంపుచర్చల నుంచి బయటికి వచ్చి.. ఆ వెంగమాంబ వైపు చూపు సారించారు. రాజకుటుంబీకులు అందరూ విద్యావంతులే! రాజ్యంలో పూర్తి విద్యావంతుల గ్రామం లేదా పురం ఉన్నదంటే.. అది రాజనగరి మాత్రమే. అందరూ చిన్ననాటి నుంచే నివాసంలో గురువును నియమించుకుని విద్యను అభ్యసిస్తారు. ధనుర్విద్య, యోగాసనాలు, అశ్వ, గజ, మల్లయుద్ధంతోపాటు న్యాయశాస్త్రం, రాజనీతి శాస్ర్తాలు, పురాణాలు, ప్రబంధాలు.. స్త్రీ పురుషులంతా విధిగా చదువుకుంటారు. పెద్దలు తప్పక నేర్పుతారు. రాచరికపు స్త్రీలు యుద్ధవిద్యలు నేర్వడం కూడా సాధారణమే! ఇక ప్రతి మహిళ ఏదో ఒక కళ పట్ల అభిరుచి పెంచుకుని ప్రాథమిక జ్ఞానంతో ఉంటారు. వారి ఆసక్తి, అభిరుచిని బట్టి నిష్ణాతులవుతారు. దాదాపు మహిళలంతా కొద్దో గొప్పో పాడగలరు. కనీసం శాస్త్రీయ సంగీతం లాంటిది విని ఆస్వాదించగలరు.
పూర్తిస్థాయి లిపి లేకపోవడం వల్ల చాలామంది తల్లులు.. పిలల్లతో ఇంట్లోనే పాడుతూ, పాడిస్తూ నేర్పుకోవడం కూడా సహజమే. కానీ, ఇలాంటి సమావేశాలలో మంచి గాయకులు, గాయనీమణులు మాత్రమే ముందుకు వస్తారు. తెలిసిన వారు ప్రోత్సహిస్తారు. అప్పుడే కార్యక్రమం మరింత శోభాయమానం అవుతుంది.
వెంగమాంబ ఎవరోనని జాయపుడు ఆసక్తిగా చూశాడు. ఆమె ఓ యాభై ఏళ్ల ఫ్రౌడ. చాలామంది మహిళలు ఒత్తిడి చేయడంతో ఆమె పాడసాగింది. ఆమెను ఒత్తిడి చేసిన వారిలో ఇంద్రాణి కూడా ఉండటం జాయపుణ్ని ఉత్సాహపరచింది. సహజమే కదా.. ఈమె గాత్రం ఇంద్రాణికి తెలిసే ఉండాలి. ఓ వినాయక స్తుతి పాడింది సదరు వెంగమాంబ. అందరూ చప్పట్లు కొట్టారు.
జాయపుని వంక చూసింది ఇంద్రాణి. ఆమె ముఖంలో ప్రశ్నార్థకం!
‘పాట ఎలా ఉంది!?’ అన్నట్లు. ఆమె తనను అలా అడుగుతుందని జాయపుడు ఊహించలేదు.
‘సాధారణంగా ఉంది’ అన్నట్లు ముఖం పెట్టాడు.
ఆమె కూడా..
‘నాకూ అలాగే ఉంది’ అన్నట్లు చూసింది. దాంతో జాయపునికి కొంచెం హుషారు హెచ్చింది. మరొకరు ఎవరో మరో పాట పాడారు. అయ్యాక మళ్లీ ఇద్దరూ అభిప్రాయాలు చెప్పుకొన్నారు. ‘ఇదీ నీరసంగానే ఉంది!’ అనే ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చారు. మరొకరు మరో పాట.. ‘కొంచెం బావుంది’.మరొకరు మరో గీతం.. ‘ఇంకా కొంచెం బావుంది’ అనుకున్నారు. హఠాత్తుగా ఒకామె అన్నారు..
“ఇంద్రాణీ! ఏదీ.. నువ్వొక పాట ఎత్తుకో!” అని. జాయపునిలో ఓ సంతోషపు అల మౌన శబ్దంతో ఉవ్వెత్తున ఎగిరింది. కారణం.. ఆమెతో పరిచయం లేకపోవడం వల్ల తానుగా అడగలేడు. అతని కోరిక మరొకరు అడగడం ద్వారా తీరింది. ఇంద్రాణి అప్పుడు జాయపుని వంక చూడలేదు. తలొంచుకుని గొంతు సవరించుకుంది. ఆలాపన ప్రారంభించింది. కళ్లు మూసుకుని తనలో తాను పాడుకుంటున్నట్లు.
‘ఒహ్వా!’.. అనుకున్నాడు జాయపుడు. ఆమె పూర్తిగా మనోధర్మం ప్రకారం పాడుతున్నది. అప్పుడే పాట నలుగురినీ కట్టి పడేస్తుందని జాయపుడు చదువుకున్నాడు.
“రేయి.. రేయి.. గోరువెచ్చని ఈ రేయి.. మరిమరీ ముద్దొస్తుందోయి.. మన రేయి.. మనిద్దరి రేయి..”
అప్రతిభుడయ్యాడు జాయపుడు. ఈ నాలుగురోజులుగా పాట పెంపొందిస్తూ.. శ్రుతి, రాగం నిర్ణయం చేసి ఓ పథం.. ఓ ప్రవాహిని చేసిందన్నమాట. అతని కళాత్మక ఆర్తికి ఓ మధుర రుచి అందింది.
అందరూ మౌనంగా.. చంటిపిల్లల్లా సున్నితంగా కదలాడుతున్నారు. ఆ పాటలోని తల్లీ పిల్లలమధ్య ఉండే తీవ్రమైన అనుబంధం.. తండ్రీ పిల్లలమధ్య ఉండే గాఢత.. రసరమ్యంగా అందరి హృదయాలలోని మాతృత్వాన్ని తట్టి కుదుపుతున్నది ఆమె.
ఆ పాట.. ఆమె గాత్రం.. అందులోని మాధుర్యం అందరిని కట్టిపడేస్తున్నది. సంగీత విశిష్టత తెలిసిన ఆ బంధుజనం తన్మయత్వపు పథాలలో పయనిస్తున్నారు. ఆ పథంలో మూకుమ్మడిగా ఇంద్రాణి అద్భుతంగా తీసుకుపోతున్నది. ఈ అద్భుతం వెనక లేదా ముందు ఉన్నవి.. ఏడు స్వరాలు.
షడ్జమము, ఋషభము, గాంధారము, మధ్యమము, పంచమము, ధైవతము, నిషాదము. క్లుప్తంగా చెప్పాలంటే సరిగమపదని.. అంతే! వీటిని సరళీ స్వరాలు అంటున్నారు సంగీతజ్ఞులు. కేవలం ఈ ఏడుస్వరాలతో గాయకులు, సంగీతకర్తలు సృష్టిస్తున్న మహాసంగీత సముద్రాలు ఎన్నో. ఈ ఇంద్రాణి కూడా ఆ మహాసృష్టి వైపు వెళ్తున్నదా!? అన్నంత ఉన్నతంగా ఉన్నాయి ఆమె గానామృత తేనెవాకలు. పూర్తిగా లిఖించుకున్న పాటను పూర్తి విశ్వాసంతో తగిన ఆరోహణ అవరోహణ క్రమణికతో.. తన గానధర్మానికి తగిన శ్రుతితో.. అద్భుతమైన సృజనాత్మక గమకాలతో పాడి, ఆ మందిరాన్ని రసభరితం చేసింది. పూర్తవ్వగానే కరతాళధ్వనులతో అందరూ తమ రసాస్వాదనను ప్రకటించారు.
ఎవరో అడిగారు..
“ఆరోజు ఎవరో చంటిపాప ఏడుస్తుంటే పాడావూ చూడు.. ఆ పాట పాడు ఇంద్రాణి!” అని.
ఇంద్రాణి నవ్వి..
“మీరూ ఆ రోజు విన్నారా.. అత్తమా?!” అన్నది.. కించిత్ అబ్బుర ప్రకటనతో.
వాళ్ల సంభాషణ ఏమోగానీ, ఆమె మాటతీరు.. అందులో ధ్వనించే వినయమర్యాదలు కూడా విని సంతృప్తి చెందాడు జాయపుడు.
‘స్వకీయంగా రంజించునది గాన దానిని స్వరం అన్నారు’ అన్నాడో సంగీత గ్రంథకర్త. ఇంద్రాణి స్వరాన్ని స్వకీయంగా పలుకుతున్నది. అదే ఆమె గాత్రవిన్యాసం..
“లల్లాయిలో.. లాయిలో.. లాయిలో.. లల్లాయిలో..
అమ్మను నేనే.. లల్లాయిలో.. నీ అమ్మను నేనే లల్లాయిలో
నువ్ నా అమ్మవు నాన్నవులే లాయిలో..
లల్లాయిలో.. లాయిలో.. లాయిలో.. లల్లాయిలో..”
ఇది సాహిత్య ప్రధానంగా ఉన్న పాట. పాట భావాన్ని ఉన్నతం చేసి సంగీతాన్ని వెనుక నిలిపింది. అద్భుతం!!
అందరూ మౌనంగా.. చంటిపిల్లల్లా సున్నితంగా కదలాడుతున్నారు. ఆ పాటలోని తల్లీ పిల్లలమధ్య ఉండే తీవ్రమైన అనుబంధం.. తండ్రీ పిల్లలమధ్య ఉండే గాఢత.. రసరమ్యంగా అందరి హృదయాలలోని మాతృత్వాన్ని తట్టి కుదుపుతున్నది ఆమె.
ఆమె సందర్భోచిత గీతానికి.. అందుకు ఎంచుకున్న పథం.. అంటే ఎంచుకున్న రాగాన్ని పరికించి అచ్చెరువొందాడు. ఈమె ప్రతిభావంతురాలు.. సందేహం లేదు. పాట పూర్తికావడం.. అందరూ ముక్తకంఠంతో ప్రశంసించడం జరిగిపోయాయి.
దాదాపు కార్యక్రమం చివరికి వచ్చింది. అప్పుడన్నాడు మహామండలీశ్వరుడు గణపతిదేవుడు..
“మాంచి శాస్త్రీయగీతం ఏదైనా నువ్వు ఆలపిస్తే.. అందుకు అనుగుణంగా మా జాయపుడు నర్తిస్తాడు!”
ఆయనన్నది అర్థం కాక ఓ రెప్పపాటు హఠాత్తు నిశ్శబ్దత.. తర్వాత మందిరం చప్పట్లతో అదిరిపోయింది. సంభ్రమంతో చేసిన కూజితాలతో ఊగిపోయింది.ఇలా ఓ గాయని పాడుతుంటే తదనుగుణంగా ఓ నాట్యకారుడు నర్తించడమా!? అద్భుతం!
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284