జరిగిన కథ : అయ్యనవోలులోనే ఉంటున్న జాయప.. ఓరోజు భైరవతో కలిసి పొలాలవైపు వెళ్లినప్పుడు ఓ యువతిని చూశాడు. గడ్డిమోపు నెత్తిన మోస్తున్న ఆ యువతి.. కాకతి. వేయిస్తంభాల శృంగారాలయంలా ఉన్న ఆమె శరీరపు రమ్యత.. యవ్వనానికి వస్తున్న జాయపను ఆకర్షించింది. కళాకారుల మధ్య కాలం గడుపుతున్న కొద్దీ.. జాయప శరీరభాష కూడా మారిపోయింది. అతనిలో ఏదో ఉద్వేగం.. నాట్యోద్వేగం! తన నాట్య విన్యాసాన్ని చూసిన భైరవ.. ఆశ్చర్యపోయాడు. ఆరోజు నుంచి జాయపను ‘నటరాజా’ అనే పిలుస్తానని ఉద్రేకంగా పలికాడు.
భైరవ మాటలకు ఆశ్చర్యపోయాడు జాయప. నిజమే.. నటరాజుగా నాట్యం చేస్తున్నప్పుడు జాయపకు ఏదో పులకింత. ఎవరో.. ఏదో శక్తి తనను పూని నాట్యం చేయిస్తున్నట్లు!
‘ఈ భంగిమ వద్దు.. ఆ చెయ్యి కదుపు!’ అంటూ ఎవరో నిర్దేశిస్తున్నట్లు.. తదనుగుణంగా ఏదో మగతలో నాట్యం చేస్తున్నట్లు.. ఏవేవో స్పందనల వలయంలో తను నాట్యం చేస్తున్నట్లు తనకే తెలుస్తున్నది.
ఇప్పుడు కాకతి కూడా. తన నాట్యంలోని మహత్తు ఏదో ఆమెను వివశను చేసినట్లు చకితయై కళ్లు పెద్దవి చేసి అబ్బురంగా చూస్తున్నది. ఓ కళాకారుడి కౌశలాన్ని చూడటం మాత్రమే కాదు.. తన నాట్యంలో మరేదో గమనించినట్లున్నాయి ఆ చూపులు!
నటరాజుగా జాయప, వీరభద్రుడుగా భైరవ, పార్వతిగా కాకతి, దక్షుడుగా కొండయ. జాయపకు కూడా నచ్చిందీ బృందం. వాళ్లతో మమేకమై, వారి ఇతర నాటకాలలో కూడా జాయప నటించాడు.
ఈ బృందంతో తిరుగుతూ దేశీగాయకుల ఉత్తేజాన్ని.. భక్తి గాయకుల తన్మయత్వాన్ని.. అనుభూతిస్తున్న జాయపను కళలలోకపు తాదాత్మ్యం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. జాయప తిరిగి అనుమకొండ వెళ్లినా.. కొండయ ఆహ్వానం మీద నాటకాలలో పాల్గొంటూనే ఉన్నాడు. అలాంటి ఓ నాటకం ‘ప్రహ్లాద విజయం’. ఆ ప్రదర్శన అనుమకొండలో నిర్మాణంలో ఉన్న స్వయంభూ దేవాలయ ప్రాంగణంలో జరిగింది. భైరవ నటించలేదు. తనకు ప్రథమ ప్రాధాన్యం శైవపూజలే! అందుకని తనకు ప్రాధాన్యపాత్ర లేని నాటకాలను భైరవ మరో నటుడికిచ్చి తను శైవపూజల్లో ఉండిపోతాడు.
ప్రహ్లాదుడుగా జాయప నటించగా.. కొండయ హిరణ్యక శిపుడు, కాకతి లీలావతి పాత్ర పోషించారు. ఇక్కడికి మిత్రబృందాన్ని ఆహ్వానించాడు జాయప. పురవాసులు విరగబడ్డారు. జాయప నటన చూసి మిత్రులు కూడా ఎంతో ఆనందించారు. మొదటి అంకంలో తన పాత్ర ముగిసింది.
తెర పడింది. జాయప ఒక్క ఉదుటన రంగస్థలం నుంచి లోపలికి అదృశ్యం అయ్యాడు. ఒక్కక్షణం అలసట తగ్గించుకుంటూ నిలుచున్నాడు. వేదికపై కాకతి నటిస్తున్నది. రంగస్థలం వెనుక తెరలకున్న ఖాళీనుంచి ఆమెను చూస్తున్నాడు జాయప. ఆమె మాట, పాట ఖంగున మోగుతుంటే.. ప్రేక్షకుల రసానుభూతి సముద్ర ఘోషలా ఉవ్వెత్తున ఎగసి పడుతున్నది.
తెర వదలి ఎవరో పిలిచినట్లయి వెనక్కి చూశాడు.
దేవళం లోపల అంతరాలయం అంతటా గాఢమైన నిశ్శబ్దం.. గర్భాలయం నుంచి దీపాల వెలుగులో లింగరూప శివుడు తననే చూస్తూ, తనకేదో చెబుతున్నట్లు.. ఏదో జరగబోతున్నది. తట్టుకోలేనట్లు తలతిప్పాడు. మండపం పక్కనుంచి ఈ నాటకప్రదర్శనను ఇద్దరు వ్యక్తులు పరిశీలిస్తుండటం జాయప గుర్తించాడు.
నాటకాన్ని చూస్తూ ఇద్దరూ చర్చించుకుంటున్నారు. ఒకరు చూస్తూ చెబుతుంటే.. మరొకరు ఘంటంతో బిరుసు వస్త్రంపై లిఖిస్తున్నాడు. నిశ్శబ్దంగా వారి దగ్గరికి వెళ్లాడు. నటుల భంగిమలను చిత్రిస్తున్నారు వాళ్లు. వాటిలో తన చిత్రాలను చూసి ఆశ్చర్యపోయాడు జాయప. ఎందుకా చిత్రీకరణ??
కొండయ పరుగునవచ్చి.. “ఇప్పుడు నీదే ప్రవేశకం. పరుగు పరుగు!”.. తొందరపెట్టాడు. వేగంగా కదిలి ఆహార్యం సరిచూచుకుని, గొంతు సవరించుకుని రంగంపైకి వెళ్లాడు జాయప.
నాటకం ఆసాంతం అద్భుతంగా సాగింది. ప్రేక్షకులు పులకించిపోయారు. వందలమంది విరగబడ్డారు. జాయప కథానాయకుడై పోయాడు. కానీ, అతని దృష్టిమాత్రం పక్కనుంచి నాటకం చూస్తున్న వ్యక్తులపై ఉంది. వాళ్లుకూడా తదేకంగా జాయపనే చూస్తున్నారు.
కొందరు వ్యక్తులు..
“తొలగండి తొలగండి! స్థపతిగారు. శిల్పాచార్యులవారు. దారి తొలగండి!” అంటూ ఆ ఇద్దరికీ దారి ఇస్తున్నారు. ఆయన జాయపనే చూస్తూ..
“మంచి అభినయం. కాలి మువ్వకు – చేతి ముద్రకు సామ్యం సరిగా కుదరలేదు. కానీ, ఏదో ఆకర్షణ ఉంది నీలో..” అన్నాడు విశ్లేషణగా.
ఆయన ఓ శాస్త్రవేత్తలా చిన్మయంగా ఉన్నాడు. ఆయన వేషభూషణాదులు ఎంతో ఆకర్షణీయంగా, నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. కట్టూబొట్టూ పూర్తిగా శైవరుషిలా ఉండగా.. ముఖ్యంగా ఉత్తరీయం నిలువెత్తున భుజాలను చుట్టి, పాదాలకున్న పావుకోళ్ల వరకూ రెండుగా వేలాడటం! దానిపై నడుముకు కట్టిన అడ్డకట్టులో చిన్న బంగారు ఉలి.. కవి చేతిలో ఘంటంలాగా! ఆ ఉలి ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతున్నది. అరవై ఏళ్ల పైబడిన వయసులో.. నిత్యం ఉపాసన, ధ్యానశక్తితో తేజోమూర్తిగా భాసిస్తున్నాడు.
జనాన్ని తప్పించుకుంటూ లోపలికొచ్చారు నాగంభట్టు, త్రిపుర, ఇతరమిత్రులు. వారి ముఖాలు విస్మయంతో నిండి స్వేదధారలు కారుతున్నాయి.
“జాయపా! అద్భుతం నీ నటన. పామరులకు భలే ఆనందాన్నిచ్చావ్. లోపలికి రావడానికి మాకు తోవ కూడా ఇవ్వడంలేదీ జనం..” అంటూనే నాగంభట్టు ఆ తేజోమూర్తిని చూశాడు.
“అరే! రామప స్థపతి.. ఇక్కడ ఉన్నారేవిటి తమరు?”.. పలకరించి, పాద వందనం చేశాడు.
ఆయన రామప.. జాయపను చూపిస్తూ..
“భట్టూ! ఈ అబ్బాయి.. తెలుసా??” అన్నాడు.
“అయ్యో.. బాగా తెలుసు స్థపతీ! ఏమి విశేషం?” అన్నాడు నాగంభట్టు.
ఉన్నట్టుండి జనం పెరిగిపోయారు. తోపులాట, కలకలం పెరిగిపోయింది. జాయప చుట్టూ మూగిన జనంలో పురుషులకన్నా స్త్రీలు ఎక్కువయ్యారు. వారంతా జాయపను చుట్టుముట్టేశారు. తర్వాత జాయప అదృశ్యం. మరి కనపడలేదు.
నాలుగో అధ్యాయం : కాకతీయ సాంస్కృతిక ప్రతీక మరునాడు మధ్యాహ్నవేళకు జాయపను కనుగొన్నారు మిత్రులు. అదీ వేశ్యా వాటికలోని నీలాంబ భవనంలో. నీలాంబ కాకతీయ రాజ్య ఆస్థాన నర్తకి. మాండలీకుల భవంతులను తలదన్నేలా ఉన్నది నీలాంబ భవంతి. లోపల విశాలమైన మందిరం. నలుగురైదుగురు నర్తకీ నర్తకులు సాధన చేస్తున్నారు.
ఈవలగా కింద వాద్యకారులు, నట్టువాంగ గాయని, మరి కొందరు నటులు. ఆవలగా జాయప అర్ధపర్యంకంపై కూర్చుని.. ఆ సాధన పరిశీలిస్తూ, అందులో ఎప్పుడెప్పుడు వాళ్లతో కలిసి నాట్యం చేద్దామా!? అన్నట్లు అస్థిరంగా కదులుతున్నాడు. మిత్రులు ఆ మందిరంలోకి రాగానే పరుగున వారి దగ్గరికి వెళ్లాడు.
అప్పుడే అక్కడికొచ్చింది నీలాంబ. శృంగారమే
నడిచి వచ్చినట్లు. మత్తెక్కించే జినుగు జివ్వాది నింపుకొన్న నవ్వు. పండువెన్నెల, పన్నీరు చిలకరిస్తున్న చూపు.
వచ్చినవారు ఐదుగురు. అందరూ వివాహితులే. శృంగార రుచిమరిగిన మగజీవులే! కన్నెత్తి ఆమెను చూడటానికే అడ్డొస్తున్న వివశత్వం. మృదు వక్షోజాలు చూపుల్ని గుంజేస్తున్నాయి. తలెత్తితే చూపు అటే పోతున్నది. ఐదుగురూ తలొంచుకుని..
ఇప్పుడు కాకతి కూడా…
తన నాట్యంలోని మహత్తు ఏదో ఆమెను వివశను చేసినట్లు
చకితయై కళ్లు పెద్దవి చేసి
అబ్బురంగా చూస్తున్నది.
‘నువ్వు మాట్లాడు!’ అంటే.. ‘నువ్వు మాట్లాడు!’ అన్నట్లు ఒకరినొకరు కళ్లతో సంభాషించుకుంటున్నారు. వారి ఇబ్బంది ఆమెకు దినదిన అనుభవైకవేద్యమే. విలాసంగా చేతులు కట్టుకుని నవ్వి.. “మీ మిత్రుణ్ని నేనే ఎత్తుకొచ్చేశాను. ఏం మీకు అభ్యంతరమా?” అన్నది. ఐదుగురూ తడబడ్డారు. నీలాంబకు శత్రువు అవడం అసాధ్యం! అనవసరం!!
జాయప దగ్గరికి వచ్చాడు.
“నీలాంబ నాకు పెద్దక్క. అనుమకొండ వస్తున్నప్పుడు పరిచయం. ఆమె రమ్మని వర్తమానం పంపితే నేనే వచ్చేవాణ్ని. అయినా ఆమె తన నాట్యబృందంతో నన్ను తరలించుకువచ్చింది. మీకు చెప్పే సమయం ఇవ్వలేదు. క్షమించండి..” అన్నాడు నవ్వుతూ.
జాయప ఇక్కడ అత్యంత సౌకర్యంగా ఉండటం మిత్రబృందానికి కొంచం ఈర్ష్య కలిగించింది.
“సరే సరే! మరి.. వెళ్దామా జాయపా!” అన్నాడు నాగంభట్టు.
నీలాంబ చురుగ్గా అంది..
“ఎక్కడికీ!? జాయప ఇక్కడే ఉంటాడు. రాజ
నగరులో నాట్యవారోత్సవం. ఈరోజే ప్రారంభం.
వినలేదా!? మీరిక బయల్దేరవచ్చు!”..
ఆమె వెనుదిరిగింది. అందరి చూపులూ ఆమెను అతుక్కుని వెళ్తున్నాయి.
జాయప వాళ్ల ఏకాగ్రతను భగ్నంచేస్తూ..
“ఆ.. మిత్రమా! పెద్దక్క తమ ప్రదర్శనలో వేషం కట్టమంటున్నది..” అన్నాడు.
ఆ మాటల్లో వేషం కట్టడం ఇష్టంగా ధ్వనిస్తున్నది.
“మిత్రమా.. కాస్త కొండయ బృందానికీ, భైరవకూ నేనిక్కడే ఉన్నట్లు దయచేసి తెలియజేయండి” మళ్లీ అన్నాడు జాయప.
అంగీకరించి అయిష్టంగానే కదిలారు మిత్రులు. ఆ వెళ్తున్న మిత్రుల్లో.. మరో ఆనందపు రేఖ కూడా ఉంది.
జాయప ఇక్కడ ఉంటే తాము అప్పుడప్పుడూ వేశ్యావాటికకు, నీలాంబ భవంతికీ వచ్చి, జాయపతో మాట్లాడుతూ అందగత్తెలందరినీ చూడొచ్చు.
రాజనర్తకి నీలాంబ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాల్లో భాగంగా రాజనగరులో నాట్యోత్సవం ప్రారంభం అవుతుంది. అనుకోకుండా నిన్నటినుంచి ప్రహ్లాద వేషంవేసే నటుడు అదృశ్యం. కారణం తెలియదు. ‘ఎలా!?’ అని నీలాంబ మల్లాగుల్లాలు పడుతుంటే.. ఆమెకో వార్త తెలిసింది. ఓ గ్రామీణ నాటకబృందం స్వయంభూదేవాలయం వద్ద భక్త ప్రహ్లాద ప్రదర్శిస్తున్నదని..
ఆమె తన వేశ్యాబృందాన్ని ఆదేశించింది. తదనుగుణంగానే వాళ్లు ప్రహ్లాద వేషధారిని తెచ్చి ఆమె ముందు ఉంచారు. అనుకోకుండా ఆ పాత్రధారి జాయప కావడం, అతను ఆమెకు ముందే పరిచయమున్నవాడూ, అత్యంత ఇష్టుడూ కావడం అన్నీ విచిత్రంగా జరిగాయి. నీలాంబను చూసి జాయప కూడా సంతోషించాడు. అతనికి సైనిక తిరుగు ప్రయాణంనాటి కళాప్రదర్శనలు గుర్తొచ్చాయి. అనుమకొండకు వచ్చిన దగ్గరనుంచీ ఆ కళా ప్రపంచానికి దూరమయ్యాడు. మళ్లీ శివరాత్రి పుణ్యాన భైరవను కలవడం, తిరిగి నాట్యప్రదర్శనల్లో పాల్గొనడం, సరాసరి నీలాంబ భవంతిలోకి వచ్చిపడటం అమదానందం కలిగించింది.
“జాయపా! ఈ రోజే రాజనగరులో చక్రవర్తిగారి ముంగట మన ప్రదర్శన. ప్రహ్లాద పాత్రధారి చెప్పకుండా మానేశాడు. నువ్వు అనుకోకుండా లభించావు. ఒక్కరోజులో ఆ పాత్రనంతా ఆకళింపు చేసుకుని నటించలేవు కాబట్టి.. కనీసం ఆ పాత్ర ఆహార్యంతో రంగప్రవేశం చేసి, నా పరువు కాపాడు..” అన్నదామె.
వాళ్ల అభ్యాసం మొత్తం చూశాడు జాయప.
“అలాగే పెద్దక్కా! అభ్యాసం చూశానుగా.. చేస్తా! కాకపొతే ఆ గాయని మరోసారి పాడితే వింటాను. పాడించవా?” అన్నాడు.
“ఓ అదెంత భాగ్యం!” అంటూ జాయప కోరినట్లు.. ‘ప్రహ్లాద విజయం’ ఆసాంతం మరోమారు పాడి విని పించమని నట్టువాంగ గాయనిని ఆదేశించింది.
ఆమె జాయప కోరినట్లే పాడింది. కన్నులు మూసి ప్రశాంతంగా విన్నాడు జాయప. ఒకే వొక్కసారి!!
(సశేషం)
-మత్తి భానుమూర్తి 99893 71284