జరిగిన కథ : రాత్రివేళ మౌనంగా ఉండే రాజనగరులో.. ఓరోజు హఠాత్తుగా ఓ రాగాలాపన! ఎవరో స్త్రీ.. మధురంగా గానం
చేస్తున్నది. అది విన్న జాయపుడు.. విస్మయంతో బయటికి వచ్చాడు. ఆ గానం వినవస్తున్న వైపుగా నడుస్తూ.. ఓ భవనపు మొదటి అంతర్వుపై నుంచి రాగం ఆలపిస్తున్న ఆ మహిళను చూశాడు. ఆ మరునాడు ఆ భవంతిలో ఎవరు ఉంటారో తెలుసుకున్నాడు జాయపుడు. సిద్ధయదేవుని ఏకైక కుమార్తె.. ఇంద్రాణిదేవి, ఆమె గాయనీమణి అని కూడా తెలిసింది. ఆమె గానం.. అందులోని శాస్త్రీయత.. అంతకుమించి ఆమె స్వరంలోని గాఢత అతణ్ని వదిలిపెట్టడం లేదు. రాత్రి కాగానే..
మళ్లీ వచ్చి డొంకల్లో తిరుగాడాడు.
రాజనగరిలో ఆడ మగ మధ్య ఉండే దూరాలు.. జాయపుని కుర్ర హృదయాన్ని బాధ పెడుతున్నాయి. కళా
హృదయులైన ఇద్దరు తమతమ కళల సొబగుల్ని పంచుకుంటూ.. ఆయా రంగాలలోని మహామహుల్ని స్మరించుకుంటూ, వారివారి ప్రతిభను విశ్లేషించుకుంటూ.. ఆనందంగా కళలలోకంలో చర్చానందం పొందడానికి ఇక్కడ ఆస్కారం లేదు. గురుకులంలో ఆ వాతావరణాన్ని గడిపాడు. అక్కడ కూడా అబ్బాయిలు, గురువులు, అమ్మాయిలతో కళాత్మక ముచ్చట్లు పంచుకున్నాడు. ఆడపిల్లలతో తక్కువే.. అంతా మీదమీదకు వచ్చేసేవారు.
అయ్యనవోలులో కాకతితోనూ, భైరవతోనూ, కొండయతోనూ ఎన్నో చర్చలు చేసేవాడు.. ఎవరూ అడ్డు
పెట్టింది లేదు. ఇక్కడ కాకతిలాగే ఓ కళామహిమ
తెలిసిన అమ్మాయి ఉంది. కానీ, ఆమెతో కబుర్లు
చెప్పుకొనే అవకాశం ఇక్కడ లేదు. ఏమిటో ఈ
రాచరికాలు.. ఈ రాజప్రాసాదాలు..
ఎలాగైనా.. పెద్దలతో చెప్పి అయినా ఆమెను కలవాలి. కళా సంస్పందనలు పంచుకోవాలి. ఆమె భావు
కతలో తను కొంత సహాయపడాలి. తన ఆలోచనలను ఆమె భావనల్లో కలగలపాలి. అలాగే నాట్యంలో తన ప్రతిభ ఆమె ముందు ప్రదర్శించాలి. ఆమె తన ప్రదర్శనలోని తప్పొప్పులు చెబితే సరిచేసుకుని.. మరింత మెరుగులు దిద్దుకోవాలి..
ఆమె పాట పూర్తి చేసిందో లేదో.. ఓ మధురమైన రాత్రిని ఆమె ఎంతో సున్నితమైన భావనలతో, అందుకు తగిన పదాలతో అల్లుతున్నది.
‘బావుంది బావుంది!’ అనుకుంటూ.. మరునాటి పగలంతా ఆమె ఆలోచనలతో గడిపాడు.
రాత్రి మొదటిజాము దాటాక మెల్లగా బయటికి వచ్చాడు. రాజభవనాలు ఆముదపు కాగడాల నిస్తేజపు వెలుగుల్లో నిద్రకు ఉపక్రమిస్తున్నాయి. ముందూ వెనకా చుట్టుకుంటూ మిణుగురులు..
ఇంద్రాణి భవనమున్న డొంకలోకి వచ్చాడు.
కాపలాభటుడు కనిపిస్తాడేమోనని అటూ ఇటూ చూస్తూ అడుగులు వేస్తున్నాడు. అప్పుడే.. ఆ అంతర్వు తలుపు తెరచుకుని ఆమె బయటికి వచ్చింది.
ఆనందంగా అటువైపు అడుగులు వేశాడు.
ఆమె కాగడాతో భవనపు అంచువరకూ వచ్చి.. డొంకవైపు దృష్టి సారించింది.
ఎందుకు చూస్తున్నది? ఎవరి కోసం చూస్తున్నది? కాగడా ఎత్తిపట్టి వసారా అంచునుంచి ముందుకు వంగి చూస్తున్నది. ఆ భంగిమలో ఆమె ముఖం మరింత స్ఫుటంగా భాసిస్తున్నది. అలంకరణ లేని ఆమె మోము.. మూట కట్టిన వెన్నెల్లా ఉంది. కనురెప్పల కదలికలు ఉవ్వెత్తున ఎగసి.. ఆమె చూపులు అన్నివైపులా కదలిన నదీ తరంగాల్లా ఉన్నాయి. కాస్త ధైర్యం చేసి డొంకలో ముందుకు వెళ్లాడు వేగంగా.
ఆమె చూసింది.
చెయ్యి ఊపబోయాడు.
“ఎవరది??”.. మరో కొండరాళ్ల గొంతుక దగ్గరగా వినిపించింది.
జాయపుని సంగతి ఏమోగానీ.. ఆమె గబుక్కున కాగడా ఆర్పేసింది. జాయపుడు వెనుదిరిగాడు కానీ.. అతణ్ని తాకుతూ ఉన్నాడో ఆగంతుకుడు.
అతను ఏమాత్రం ప్రసన్నంగా లేడు. రాజ ప్రాసాదపు నివాసులకు కూడా అతడు గౌరవం ఇచ్చే ధోరణిలో లేడు.
ఓ ఆడపిల్లను చూసిన దృక్కులతో జాయపుడు కడు ప్రసన్నంగా ఉన్నాడు. ఆ ఆగంతుకుణ్ని చూశాక.. అతనిలోని ప్రసన్నత ఎగిరిపోయి, భయవిహ్వలత చుట్టుముట్టింది.
“ఎవరు తమరు? ఈ వేళ ఇక్కడ తిరగకూడదని తెలియదా..?” గద్దించాడు.
దగ్గరగా చూడటం చేత ముఖం చాలా కరుగ్గా ఉన్నదని.. ఆ చీకటిలో కూడా జాయపునికి అర్థమైంది.
“గణపతిదేవుల..”
“ప్చ్.. అందరూ మహారాజుగారి బంధువులే! మాకూ తెలుసు. వారితో బంధుత్వం చెప్పకండి. రాజనగరిలో కోటలో రాత్రివేళ.. వీధుల్లో తిరగడం పూర్తిగా నిషిద్ధం! తెలియదా?”.
ఎవ్వడో ఓ ఉద్యోగి తనను ఇలా నిగ్గదీయడం జాయపునికి జీవితంలో ఎప్పుడూ తెలియని సంగతి. నివ్వెర పోయాడు. ఉద్యోగులు ఇంత నిక్కచ్చిగా కొలువు చేయడం అతనికి పూర్తిగా అనూహ్యం.
వెనుదిరిగి లోపలికి చేరుకున్నాడు.
మర్నాడు ఉదయమే గణపతిదేవుడి వద్ద ప్రస్తావించబోయాడు.
ఆయన నవ్వి..
“రాజనగరి దండనాయకుడు లచ్చుమయ. కనికరంలేని మహాయోధుడు. నిజానికి అర్ధరాత్రి రాజనగరి డొంకల్లో దొరికిన వాళ్లను చీకటి కొట్లో వేసి మాకు తెలియజేస్తాడు. నిన్ను క్షమించి వదిలేశాడు. అయినా అంత రాత్రివేళ రాజనగరి డొంకల్లో ఎందుకు తిరుగాడుతున్నావ్ జాయా?” అని అడిగాడు.
తను చెప్పకముందే.. చెప్పబోయేది ఏమిటో ఆయనకు తెలిసినట్లు.. చెరుకుపానీయం సేవిస్తూ సరదాగా ఆయన మాట్లాడటం జాయపుణ్ని విస్మయపరచింది.
రాజనగరిలోనే కాదు.. అనుమకొండలో అర్ధరాత్రి జరిగే గొడవలు తొలిజామునే ఆయనకు చేరతాయని జాయపునికి తెలియదు. ప్రతి ఉదయం ఓ ప్రధాని, రాజనగరి దండనాయకుడు, అనుమకొండ నగర దండనాయకుడు మహారాజును కలిసి.. నిన్నటి రోజున జరిగిన అంశాలన్నీ ఆయన చెవిన వేస్తారని.. ఈవిధానం రాజ్య దైనందిన పాలనలో ముఖ్యాంశమని కూడా తెలియదు.
మరికాసేపటికి జాయపుడు కాస్త తెప్పరిల్లాడు.
‘గణపతిదేవుని పాలనలో ఉద్యోగులు ఏ మాత్రం జాలీ, కరుణ లేకుండా ప్రవర్తిస్తారన్నమాట!’ అని
సరిపెట్టుకుని.. అక్కణ్నుంచి మెల్లగా జారుకున్నాడు.
మరికొన్ని రోజులు కాలుకాలిన పిల్లిలా ఎటెటో తిరిగాడు. ఏం చెయ్యాలో తోచడం లేదు. ఆమెను స్వయంగా కలిస్తే.. వొద్దు వొద్దు. ఓ ఆడపిల్లతో మాట్లాడితే గురుకులంలోనే గొప్ప అలజడి రేగేది. ఇక రాజనగరిలో అయితే.. అక్క బావగార్లపై కూడా ఎన్నో ఒత్తిళ్లు వస్తాయి.
‘మీ తమ్ముడు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడట.. ఏమిటి సంగతి!?’ అనే గోల మొదలవుతుంది. దానికి బావగారికి, అక్కకు కూడా ఇబ్బందే! అందరికీ సంజాయిషీ ఇచ్చుకోలేడు తను.
ఈ అనవసరపు రాద్ధాంతాలు తన ఏకాగ్రతను పాడు చేస్తున్నాయని జాయపుని అభిప్రాయం.
మరోరోజు జాయపుడు రాజనగరి వీధిలో నడుచుకుంటూ వస్తుండగా.. ఓ పసిబిడ్డ ఏడుపు వినిపించింది. వీధిలో పిల్లవాని ఏడుపు వినిపించడం కూడా రాజనగరిలో విశేషమే! నివాసులు కాకుండా కేవలం పరిచారికలు, కాపలా, రక్షణభటులు, చారులు, నియోగాధిపతులు, కొట్టారువు.. ఆయన బృందం.. ఇలాంటి పరిచితవ్యక్తులు మాత్రమే తిరుగాడే రాజనగరి నివాస సముదాయం వద్ద.. ఓ పసిబిడ్డ ఏడుపు వినరావడం దూరంనుంచి గమనించి జాయపుడు ఆశ్చర్యపడ్డాడు.
ఆ ఏడుపు వినవచ్చిన వైపుగా అడుగులు వేశాడు. అప్పుడే మరో ఇద్దరు మగవారు.. నలుగురైదుగురు మహిళలు ఆశ్చర్యంతో అక్కడికి వచ్చారు.
వచ్చిన వారంతా తల్లి కోసం వెతుకుతూ బిడ్డను ఊరడించడానికి ప్రయత్నిస్తున్నారు.
అప్పుడే అందులో ఒకామె ఓపాట ప్రారంభించింది.
“లల్లాయిలో.. లాయిలో.. లాయిలో..
లల్లాయిలో..”
పాట వింటూనే బిడ్డ ఏడుపు ఆపేసింది. అంతేకాదు. వచ్చినవారంతా బిడ్డతోపాటు పాటను మైమరచి వింటున్నారు. తల్లి పరుగున వచ్చి బిడ్డను ఎత్తుకుంది. ఆమె ఓ పరిచారిక. బయటికి వచ్చి తనబిడ్డను ఓ ఇంటివసారా వద్ద ఉంచి.. యజమాని చెప్పిన పని నిమిత్తం వెళ్లింది. తల్లి కనిపించక ఆ బిడ్డ గట్టిగా ఏడుస్తున్నాడు.
జాయప అక్కడికే వస్తూ బిడ్డ ఏడుపు ఆపడం చూసి ఆమె ఎవరో గుర్తించాడు.
ఆమె ఇంద్రాణి. తాను వెదుకుతున్న తీగె.. కావచ్చు కాకపోవచ్చు! స్పష్టపరచుకునేందుకు వడివడిగా ముందుకు కదిలాడు. కానీ, అప్పుడే ఆమె కదిలి బాట ఆవలనున్న తమ భవంతిలోకి అదృశ్యమయ్యింది. హతాశుడయ్యాడు.
మరునాడు చిన్నారి మేనల్లుళ్లు మురారి, హరిహరులతో ఆటలాడుకుంటున్న జాయప చెవి వద్ద..
“నలుగురిలో మాటలు నగుబాటుకే సుమా..” అని వినిపించింది.
ఓ క్షణం సాలోచనగా ఆగి, తలతిప్పి చూశాడు. చిరునవ్వు నవ్వుతున్నది పరిచారిక పున్నాగ.. అక్కడ నారాంబ లేదు.
“ఎవరు? ఎవరితో అన్నారీ మాటలను పున్నాగ?” అన్నాడు జాయపుడు.
“ఇంద్రాణిదేవి అమ్మ.. నిన్న ఆమెపాట మీరు విన్నారటగా. అక్కడ మీరు పలకరిస్తే ఏం పెడార్థాలు తీస్తారోనని ఆమె భావించారట!. మీకు తెలియజేయమని నాకు మా అక్క తెలియబరిచింది. చెప్పానుగా.. మా అక్క వారి ఇంట్లో పరిచారిక..” వివరించింది పున్నాగ.
జాయపుని మది పరవశించింది. ఆమె.. ఇంద్రాణి.
ఆమె వివరాలు తను సేకరించినట్లే.. ఆమె కూడా తన వివరాలు సేకరించింది. రాజప్రాసాదంలో చీమ చిటుక్కుమంటే తెలియాల్సినవారికీ, తెలియకూడనివారికీ తెలిసిపోతుందని తెలిసినవ్యక్తి కాబట్టే.. తనతో మాట్లాడటానికి సాహసించలేదు. తను మాట్లాడిస్తానేమోనని వడిగా నిష్క్రమించిందన్నమాట.
పున్నాగతోనే అన్నాడు జాయపుడు..
“ఆమె గానం, స్వరం మాత్రం అద్భుతం!” అని.
ఆమె నవ్వింది. తల ఊపింది.
‘ఇంద్రాణి అమ్మకు తెలియజేస్తా.. మీ మాట!’ అన్న ధ్వని ఉంది ఆమె నవ్వులో.
రాజప్రాసాద నివాసులైన మహిళలు.. సాధారణంగా ఇళ్లలో నిర్వహించుకునే పూజలు, వ్రతాలు, నోములు తదితర కార్యక్రమాల సందర్భంగా కలుస్తుంటారు. దాదాపుగా అందరూ బంధువులే. కానీ, వారిమధ్య ఎన్నో రాజకీయ గోడలుంటాయి. కొందరు కొందరికి మిత్రులు.. కొందరికి పోటీదారులు.. కొందరికి శత్రువులు. అందువల్ల ఎవరైనా ఓ కుటుంబం మరొక కుటుంబంతో కలిస్తే.. దానిపై ఇతరులు చెవులు కొరుక్కుంటారు. అందువల్ల ఓ ఆడది – ఓ మగాడు కలిసి మాట్లాడుకోవడానికి కూడా జంకుతారు.
జాయపుడు, ఇంద్రాణి మధ్యనున్న సమస్య కూడా ఇదే! ఒకరినొకరు కలుసుకున్నదే లేదు. కేవలం కళ.. గానం.. కళాత్మక దగ్గరితనం!!
ఆమె వివరాలు తను సేకరించినట్లే.. ఆమె కూడా తన వివరాలుసేకరించింది. రాజప్రాసాదంలోచీమ చిటుక్కుమంటే.. తెలియాల్సినవారికీ, తెలియకూడనివారికీ తెలిసిపోతుందని తెలిసినవ్యక్తి కాబట్టే.. తనతో మాట్లాడటానికి సాహసించలేదు. తను మాట్లాడిస్తానేమోనని వడిగా నిష్క్రమించిందన్నమాట. పున్నాగతోనే అన్నాడు జాయపుడు.. “ఆమె గానం, స్వరం మాత్రం అద్భుతం!” అని.
రాజప్రాసాదంలో ఓ మంచి గాయని ఉన్నదన్నదే జాయపుని దృక్కోణం. పున్నాగ చెప్పినదాన్ని బట్టి బహుశా జాయపునిపై ఇంద్రాణి అభిప్రాయం కూడా ఇదే. కానీ, అనుకోకుండా వారిద్దరూ కలిసే సన్నివేశం ఒకటి జరిగింది.
నానాదేశీ వణిజుడు, గణపతిదేవుని జ్ఞాతిసోదరుడు జంగమదేవుని మనుమరాలికి ఓణీల పండుగ కార్యకమం నిర్వహించారు. ఆ సంబురాలకు రాజప్రాసాదంలోని నివాస కుటుంబాలన్నీ హాజరయ్యాయి.
మహామండలీశ్వరులు గణపతిదేవుడు నారాంబ సమేతంగా విచ్చేశాడు. సాధారణంగా రాజప్రాసాద కులీన కుటుంబ కార్యకలాపాలలో పట్టమహిషి సోమలదేవి ఉత్సాహంగా పాల్గొంటుంది. అయితే ఇటీవల ఆమె తరచూ అనారోగ్యంబారిన పడుతున్నది. ఈరోజు కూడా ఆమె నలతవల్ల రాలేనని భర్తకు చెప్పింది. దాంతో ఆయన కొత్త భార్యతోపాటు జాయపుని కూడా తీసుకు వచ్చాడు. ఇది పూర్తిగా రాజకుటుంబాల వేడుక. ఇక్కడ సభామర్యాదలు, వందిమాగధులు, భేరీబాంకారాలు ఉండవు. బయటి సమాజానికి ఇవి తెలియవు. తెలవాల్సిన పని లేదు. రాజనగరిలో తరచూ ఇలాంటి
కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.
జాయపునికి మాత్రం ఇలాంటివాటికి హాజరవడం.. ఇది తొలిసారి.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284