చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : కూసెనపూండి కళాకేంద్రం. జాయపుని కళల కళాక్షేత్రం! అత్యున్నత ప్రమాణాలతో నాట్యప్రదర్శన కేంద్రం,
దేశి విదేశీ నాట్య పరిశోధన కేంద్రం, గ్రంథాలయం, నాట్యారామం, భోజనశాల, దూరంనుంచి వచ్చేవారికి నివాస సముదాయం.. అన్ని సౌకర్యాలతో నిర్మాణం జరుగుతున్నది. ఓరోజు సిద్ధయ.. ఓ నాట్యాచార్యుడితో వచ్చి జాయపునికి పరిచయం చేశాడు. ఆ వచ్చినవాడు కంకుభట్టు. జాయపుణ్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఆ మాటల్లోనే.. మువ్వ ప్రస్థావన వచ్చింది. ఆమెను కంకుభట్టు నాట్యారామానికి పంపిస్తానని
చెప్పాడు జాయపుడు.
సోమాంబికనాట్యారామం వల్ల మువ్వ ఇప్పుడు పూర్తిస్థాయి కవయిత్రి, గాయని! లోకధర్మి నుంచి నాట్యధర్మి స్థాయికి ఎదిగిన నాట్యకారిణి.
‘హమ్మయ్య!’ అనుకుంటూ.. వెంటనే మువ్వను, పరాశరుణ్ని కంకుభట్టు నాట్యారామానికి పంపాడు జాయపుడు. వెళ్లేముందు..
“నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది మువ్వా..” అంటూ, మరేదో అనబోయాడు.
మువ్వ అవేమీ పట్టించుకోకుండా ఆయన దగ్గరగా వెళ్లి చెవిలో చెప్పింది.
“స్వామీ.. గోపాలశతకం పూర్తయ్యింది. వినిపించమంటారా..?!”.
జాయపుడు జవాబివ్వక ముందే పరాశరుడు కల్పించుకుని..
“వచ్చాక.. వచ్చాక! పద.. పద పద..” అంటూ లాక్కుపోయాడు.
ఊపిరి పీల్చుకున్నాడు జాయపుడు.
కూసెనపూండి కళాక్షేత్రంలో కళాగోష్ఠిలో సూరప్పడు డప్పువాదనం ప్రత్యేక ఆకర్షణ. సాధారణంగా నిమ్నవృత్తుల వారి కళల ప్రదర్శన కవిపండితులు అంగీకరించరు. దాసరులకు, నిమ్నజాతుల కళాకారులకు కూడా ప్రవేశం ఉంటుందని పరాశరుడు తెగేసి చెప్పడంతో.. ఇప్పుడు సూరప్పడు వెలనాడు కవిపండిత గోష్ఠిలో ఒకడయ్యాడు. డప్పును సున్నితంగా ఎడమచంక వద్ద బంధించి సూరప వాయిస్తుంటే చూడాలి.. తనే ప్రేరణ నృత్తం చేసేలా ఊగిపోతాడు జాయపుడు. ప్రేరణ కోసం సూరపతో కొత్త శబ్దాలు అభ్యాసం చేస్తుండగా గతంలో గణపతిదేవుడు అన్నమాట జ్ఞప్తికొచ్చింది.
ప్రేరణ నృత్త రూపకల్పన చేస్తూ గణపతిదేవునికి చూపిన సమయంలో.. ఆయన ప్రదర్శన చూస్తూ పక్కనున్న జాయపుని వైపు వంగి..
“ఇక్కడ మృదంగ ధ్వని కన్నా డప్పుహోరు ఉంటే.. శివశివా! అదిరిపోయేది జాయా..” అన్నాడు ఊగిపోతూ.
అప్పటివరకూ డప్పు శాస్త్రీయ సంగీత కచేరీలలోనూ, మార్గి నాట్యకార్యకలాపాల్లోనూ ఎందుకు ఉపయోగించడం లేదోనని జాయపుడు వాపోతుంటాడు. అలాంటిది చక్రవర్తి స్వయంగా అలా అనేసరికి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఆ సంగతి గుర్తుకు రాగా..
‘ఈ సూరప్పడి డప్పువాద్యం వింటే.. హరహరా.. బావగారు ఊగిపోతారు. దీనికి రాజాస్థానం కల్పించాలి. మార్గి వాద్యంగా గుర్తింపు తేవాలి. సూరప్పడిని బావగారి వద్దకు పంపితే!?’..
ఈ ఆలోచన అతనికే ఎంతో నచ్చింది.
“సూరపా.. మన చక్రవర్తి గణపతిదేవుల ముందు నీ కౌశలాన్ని ప్రదర్శించే అవకాశం వస్తే వెళతావా?”.
నమ్మలేనట్లు చూశాడు సూరప. తర్వాత జాయపుని కాళ్లపై సాగిలపడ్డాడు.
“అంతకంటేనా సామి. అసలు నేనెప్పుడూ అనుమకొండే సూడ్లేదు. ఇంక ఆ దేవుడు సెక్కరవరితి గారి ముందు నా డప్పు వాయించడం అంటే.. ఇక నా బతుక్కి అంతకంటే గొప్ప ఏవుంటది సావీ!”..
అతని కలను.. డప్పు వాద్య పరిమళాన్ని బావగారికి వినిపించాలన్న తన మోజును.. నిజం చేశాడు.
కానీ, ఊహించరానిది జరిగి జాయపుని నాట్య జీవితాన్ని ఈ సూరప ఉదంతం మరోమలుపు తిప్పింది.
చేబ్రోలు దేవాలయ ప్రాంగణం..
రానున్న అతిథికి పూర్ణకుంభ స్వాగతసత్కారం నిర్వహించడానికి బ్రాహ్మణ, పురోహిత బృందంతో సింహద్వారం వద్ద సిద్ధంగా ఉన్నాడు జాయపుడు. కూసెనపూండి కళాకేంద్రం నుంచి ఈ అతిథి కోసమే చేబ్రోలు వచ్చాడు.
ధనదుప్రోలుకు పదియోజనాల దూరంలో ఉంటుంది చేబ్రోలు.
తామ్రపురి.. మహాసేనం.. చేంప్రోలు.. చేబ్రోలు!!
వెలనాడులో ధనదుప్రోలు తర్వాత అంతటి ప్రాముఖ్యం ఉన్న పురం చేబ్రోలు. చరిత్ర పూర్వకాలంనాడే అస్తిత్వమున్న గ్రామాల్లో ఈ చేబ్రోలు ఒకటి. మానవ చరిత్రలో వెలువడిన తొలి ఖనిజాల్లో రాగి లేదా తామ్రం ఒకటి. తామ్రం ఉత్పత్తి జరిగిన తొలి ప్రాంతాలలో ఇది కూడా ఒకటి. అందుకే చేబ్రోలుకు ప్రాచీన నామం తామ్రపురి. భారతంలో చెప్పిన తొలి ఆంధ్ర మహాజన రాజ్యాలలో ఇది కూడా ఉంది. బుద్ధుని పూర్వమే వెలనాడులో తొట్ట తొలి దైవారాధన జరిగిన గ్రామం ఇది.
దేవతల సేనాని అయిన స్కంధుడు లేదా కుమారస్వామికి నిర్మించినవే తొలితరం దేవాలయాలు. గణరాజ్యపు పాలకులు అప్పట్లోనే చేబ్రోలులో కుమారస్వామికి దేవాలయం కట్టించారు. దీనివల్ల ఈ ఊరికి మహాసేనం అనే పేరు కూడా ఉంది. ఈ గ్రామం కంచి నుంచి కాశీ మీదుగా అయోధ్యను కలిపే దండుబాటలో ఉండటం ఈ ఊరి ప్రాముఖ్యానికి మరో కారణం. ఈ వెలనాడు రాజ్యప్రాంతమంతా బౌద్ధ జైనాలు పరిఢవిల్లినప్పుడు ఇక్కడ పెద్ద బౌద్ధ చైత్యం, జైనుల బసది కూడా ఉండేవి. గోదావరీ తీరాన వేంగినాడు, కృష్ణాతీరాన వెలనాడు ప్రధాన రాజ్య ప్రాంతాలు. రెండుచోట్లా భీమేశ్వరాలయాలు ఉన్నాయి.
గజసేనాని జాయపుడు మండలీశ్వరుడు అయ్యాక ఇక్కడ ఏనుగులకు పెద్ద నిలువకేంద్రం, ఓ గజ శిక్షణశాల నిర్మించాడు. అప్పటినుంచి దీనిని ‘చేంప్రోలు’ అని కూడా పిలుస్తున్నారు. చే అంటే తొండం, ప్రోలు అంటే పట్టణం కాబట్టి ఏనుగుల కేంద్రంగా వినుతికెక్కిన తామ్రపురిని చేంప్రోలు అంటే.. అది జననానుడిలో చేబ్రోలు అయ్యింది.
మరి నాలుగు ఘడియల తర్వాత దూరంగా పల్లకి కనిపించింది. రానురానూ దగ్గరై పల్లకి నుంచి కుడికాలు బయట పెట్టారా అతిథి మహానుబావుడు.. మహాస్థపతి రామప!
శాలువా సవరించుకుంటూ పల్లకి దిగిన ఆయన కన్నులు చంచలములై అన్నివైపులా కలయదిరుగుతూ ఆయన ఆశించిన వ్యక్తి.. జాయపుడు.. కనిపించగా లిప్తకాలం అపురూపంగా అతణ్ని కన్నార్పకుండా చూసుకున్నాడు. రానురానూ ఆయన కన్నుల్లో నీరు ఉబికి మనసంతా ప్రఫుల్లమయ్యింది.
“నాయనా జాయా! నా తండ్రీ..” ఆయన కంఠంలో ఉద్వేగంవల్ల కలిగిన గగుర్పాటు.
చిత్రంగా జాయపుని మనఃస్థితి కూడా అచ్చం అలాగే ఉంది.
రుద్దమయిన కంఠం మూగబోగా.. వేగంగా ఆయన్ను హత్తుకున్నాడు.
ఇద్దరికి ఒకరిపై ఒకరికి అంతటి బెంగ ఉన్నదని అప్పుడే తెలిసి మరింతగా హత్తుకున్నారు.
పరిష్వంగం విడిచి జాయపుని జబ్బలవద్ద పట్టుకుని అతని కళ్లలోకి చూశాడు రామప. మళ్లీ..
‘ఎలా ఉన్నావూ!?’ అనబోయి.. జాయపుని వాలకం చూస్తూ ఉండిపోయాడు.
యవ్వనం వెనుకంజ వేస్తుండగా శరీరం కొంత స్థూలం కాగా బంగారువర్ణపు ఛాయ కాస్తమెరుపు తగ్గింది. కళ్ల కింద కనిపించీ కనిపించని నల్లని వలయాలు.. కాలం నేర్పుతున్న నాట్యవిన్యాసాలకు స్పందిస్తున్న జీవితం. మొత్తంగా ఐదేళ్ల తర్వాత చూస్తున్న జాయపుని శరీరం ప్రగల్భిస్తున్న అస్పష్ట విషాద వీచిక.. అలా కదలి కనిపించింది ఆ తండ్రి తర్వాత తండ్రి స్థాయి ఆత్మీయునికి.. రామప స్థపతికి.
జాయపుడు ఆయణ్ని నఖశిఖపర్యంతం చూస్తూ..
“వృద్ధాప్యం మీ దరి చేరలేకపోతున్నది గురుదేవా..” అన్నాడు ఆప్యాయంగా, అభినందనగా.. లోపలికి నడుస్తూ.
“నా జీవితం మీబోటి అద్భుత ప్రతిభావంతుల సాహచర్యంతో పరిపూర్ణమైంది జాయా. అటు మహారాజులు, ఇటు సాధారణ ప్రజల ఆదరాభిమానాలతో నాజీవితం నాకెంతో తృప్తినిస్తున్నది. ఇదిగో ఇక్కడ వెలనాడులో దేవాలయ సమూహాన్ని నీకోరిక ప్రకారం నిర్మిస్తే చాలు. శేషజీవితాన్ని ఆ రుద్రుని భజనతో ముగిస్తాను!”.
ఆతుకూరు రుద్రేశ్వరాలయం ప్రతిష్ఠ సమయంలో జాయపుడు రామపను ఓ కోరిక కోరాడు.
“మా వెలనాడులో మా తండ్రిగారి జ్ఞాపికగా ఇలాంటి ఓ గొప్ప దేవాలయాన్ని నిర్మించాలని కోరిక గురుదేవా! అదీ తమరి నేతృత్వంలో!”.
“అవశ్యం. నువ్వు అడిగితే కాదంటానా వెలనాడు మండలీశ్వరా!?” అంటూ సంతోషంగా అంగీకరించాడు రామప.
ఆ కోరిక ఇటీవల వాస్తవరూపం తీసుకుంటున్నది.
అతిప్రాచీనకాలం నుంచి దేవాలయాలు ఉన్నప్రాంతం వెలనాడు. ఆచార్య నాగార్జునుడు తదితర మహామహోపాధ్యాయుల ప్రభావంతో బౌద్ధంతో తీవ్రంగా ప్రభావితమైన వెలనాడులో ఇప్పుడు బౌద్ధ జైనాలు తిరుగుముఖం పట్టి శైవ, వైష్ణవాలు జనజీవనాన్ని శాసిస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని ఎక్కువకాలం పరిపాలించిన చోడప్రభువులే ఎన్నో గ్రామాలలో అనేక దేవాలయాలు నిర్మించారు. ఇప్పుడు శిథిలాలు అవుతున్నవాటిని తిరిగి నిర్మిస్తూ.. కొత్త ఆలయాలు కూడా నిర్మించాలని జాయపుడు, పృథ్వీశ్వరుడు నిర్ణయించారు.
చేబ్రోలు గ్రామంలో చోడుల కాలంలో నిర్మించిన ఆలయాలున్న ప్రాంగణాన్నే జాయపుడు కూడా ఎంచుకున్నాడు. అప్పటికే ఆ ప్రాంగణం నాలుగు మూలలా అమ్మవార్లు కాకతమ్మ, పద్మాక్షమ్మ, పోలేరమ్మ, గంగానమ్మ ఉండగా తండ్రి పేర చోడేశ్వరాలయంతోపాటు మహాసేన, రుద్రేశ్వర, భీమేశ్వర, పుష్పభద్ర, కాలయమ, సూర్యదేవ, కేశవాలయాలు ఉండే గుడిప్రాంగణం రామప అధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్నది. శిష్యగణం నిర్మాణాలు జరుపుతుండగా అప్పడప్పుడూ చేబ్రోలు వచ్చి వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఆ నిమిత్తం వచ్చిన రామప అన్నిటినీ పరిశీలిస్తూ శిష్యులకు సూచనలు చేస్తూ ఐదారుదినాలు అక్కడే ఉన్నాడు. వెళ్లబోయే రోజున మళ్లీ అన్నాడు.
“కాకతి.. ఆచూకీ ఏమైనా..??!!”.
తల అడ్డంగా ఊపాడు జాయపుడు.
“ప్చ్.. విధి వైపరీత్యం జాయా! ఎంత అపురూపమైన జంట మీరు?! ఆ దేవాలయంలో మీ పరమాత్మలతో ప్రాణప్రతిష్ఠ చేశారు. కానీ కానీ.. మీ జీవాత్మలు.. ప్చ్.. ఎందుకో ఒక్కటి కాలేక..”
ఆయన మాటలకు అడ్డుపడుతున్నట్లు..
“ఏమో.. రేపో మరునాడో ఎప్పుడో ఒకప్పుడు ఏకమవుతామేమో గురుదేవా..” అన్నాడు కానీ అతని ముఖంలో, కంఠంలో అప్పటి ఉత్సాహ ఉద్వేగాలు మృగ్యం. అతని నమ్మకానికి చలించిన రామప లిప్తకాలం నిశ్వసించి..
“అదే జరిగితే నాకంటే సంతోషించేవాడు ఎవ్వరూ ఉండరు జాయా. శలవు!”.
పల్లకి అధిరోహించాడు. పల్లకి కనుమరుగయ్యే వరకు చూసి వెనుదిరిగాడు జాయపుడు. అతని ముఖంలో నిర్లిప్తత. అది ఆశావాదపు ఎదురుచూపో.. లోలోని నిరాశావాదపు ఆక్రందనకు పైపై మెరుగో.. అతనికే తెలియదు.
రామప పల్లకి వెంట ఓ అభాగిని కొంతదూరం మౌనంగా అనుసరించిందని ఆ ఇద్దరికీ తెలియదు.
కూసెనపూండి కళాక్షేత్రం.
కళాకారులకు ఇప్పుడొక తీర్థయాత్రా స్థలం. వెలనాడులోని సమస్త కవి పండిత వాద్య గాయక ప్రదర్శన కళాకారులకు స్వర్గధామం. సాధారణ పౌరులు కూడా కళాస్వర్గంలో ఉన్నామా!? అన్నట్లు.. కళ్లు తిప్పుకోలేనంత రమణీయ శిల్పశోభలతో అలరారుతున్న ఆరామాలు.. ఎల్లప్పుడూ వినపడే సంగీత సోయగాలు.. పాట, పద్య, గేయ, వాద్య మాధుర్యాలు.. కూసెనపూండి మాత్రమేకాదు కృష్ణాతీరం, తూర్పుసముద్ర తీరపు అంచు అంతటా పైనుంచి కింద గుద్రవాడనాడు వరకు.. అవతల వెలనాడు పశ్చిమరాజ్యం అంతటా అందరూ చెప్పుకొంటున్న కళల స్వర్గధామం.. కూసెనపూండి కళాక్షేత్రం.
అన్ని సాహితీ కళా రంగాలలో కొత్త కొత్త సంప్రదాయాలను సృష్టిస్తున్న వాగ్గేయకారుల ఆవాసం.
ఆరోజు విద్వత్ గోష్ఠి జరుగుతున్నది.
అప్పుడే ప్రవేశించిన ఇద్దరు పండితులు జాయపునికి నమస్కరించి కూర్చున్నారు. చర్చలో పాల్గొన్నారు.
అప్పుడే ఒకరు లేచి..
“తమరిని ఎక్కడో చూసినట్లుంది స్వామీ..” అన్నాడు.
గతుక్కుమన్నాడు జాయపుడు.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284