హరారే: అంతర్జాతీయ క్రికెట్లో పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్న జింబాబ్వే క్రికెట్‌కు డ్రగ్స్ మహమ్మారి మళ్లీ షాకిచ్చింది. ఆ జట్టు మాజీ సారథి సీన్ విలియమ్స్ డ్రగ్స్‌కు బానిసై జట్టు నుంచి శాశ్వతంగా దూరమయ్యాడు. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్ కప్ కోసం ఈ సెప్టెంబర్‌లో ఆఫ్రికా రీజియన్ నుంచి అర్హత పోటీలను నిర్వహించగా ఆ టోర్నీ నుంచి సీన్ అనూహ్యంగా తప్పుకున్నాడు. టోర్నీ ముగిశాక జింబాబ్వే క్రికెట్ (జెడ్సీ) విషయం ఏంటని ఆరా తీస్తే సీన్ అసలు విషయాన్ని వెల్లడించాడు.
తాను డ్రగ్స్‌కు బానిసనయ్యానని.. ఒకవేళ ఆ టోర్నీలో డ్రగ్స్ టెస్టు చేస్తే దొరికిపోయే అవకాశమున్నందనే స్వచ్ఛందంగా వైదొలిగానని విచారణలో చెప్పాడు. ప్రస్తుతం డ్రగ్స్ వ్యసనం నుంచి కోలుకోవడానికి డీఅడిక్షెన్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పాడు. అయితే జింబాబ్వే క్రికెట్ మాత్రం సీన్‌పై కఠినంగా వ్యవహరించింది. ఇకపై అతడిని జట్టులోకి తీసుకోకుండా శాశ్వతంగా కాంట్రాక్టును రద్దుచేసింది. ఆ జట్టులో డ్రగ్స్ కలకలం రేగడం ఇదే మొదటిసారి కాదు. 2022లో మాజీ సారథి బ్రెండన్ టేలర్ సైతం డ్రగ్స్‌కు బానిసై మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు యత్నించిన కారణంగా మూడున్నరేండ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం విదితమే.