గువాహటి: యువ షట్లర్ తన్వి శర్మ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో అదరగొడుతున్నది. టోర్నీ ఆరంభం నుంచి ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న ఆమె.. శనివారం ఇక్కడ జరిగిన బాలికల సింగిల్స్ సెమీస్‌లో 15-11, 15-9తో లియు సి య (చైనా)పై గెలిచి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తద్వారా ఈ టోర్నీలో ఫైనల్స్ చేరిన మూడో భారతీయ మహిళా షట్లర్‌గా రికార్డులకెక్కింది.
గతంలో సైనా నెహ్వాల్, అపర్ణ పొపట్ మాత్రమే ఈ ఘనత సాధించారు. తాజా ప్రదర్శనతో ఆమె స్వర్ణం లేదా రజతాన్ని సొంతం చేసుకోనుంది. 17 ఏండ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు పతకాన్ని అందించిన జోష్‌లో సెమీస్ ఆడిన తన్వి.. చైనా అమ్మాయితో పోరులోనూ అదే జోరును కనబరిచింది. ఫైనల్లో తన్వి.. థాయ్‌లాండ్‌కు చెందిన రెండో సీడ్ అన్యాపత్‌తో తలపడనుంది.