వడోదరా : వడోదరా వేదికగా జరుగుతున్న యూటీటీ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ యువ ప్లేయర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ కాంస్య పతకంతో మెరిశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో స్నేహిత్ 9-11, 12-14, 12-10, 10-12, 9-11తో రోనిత్ భాంజ చేతిలో ఓటమి పాలయ్యాడు.
టోర్నీలో నిలకడగా రాణించిన స్నేహిత్.. సెమీస్‌లో ప్రత్యర్థికి దీటైన పోటీనివ్వడంలో విఫలమయ్యాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో స్నేహిత్ 12-10, 5-11, 11-5, 11-9తో అంకుర్ భట్టాచార్జీపై గెలిచాడు. టోర్నీలో మంచి ఫామ్‌మీద ఉన్నప్పటికీ సెమీస్‌లో అదే జోరు కొనసాగించలేకపోయానని మ్యాచ్ ముగిసిన తర్వాత స్నేహిత్ పేర్కొన్నాడు.