పర్వతగిరి, అక్టోబర్ 14 : వర్టస్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ జివాంజీ దీప్తి పసిడి జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే 400మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన దీప్తి తాజాగా మరో ఈవెంట్లోనూ సత్తాచాటింది. మంగళవారం జరిగిన మహిళల 200మీటర్ల టీ20 రేసును దీప్తి 24.62 సెకన్లలో ముగించి పసిడి పతకాన్ని ముద్దాడింది.
ఈ క్రమంలో గత చాంపియన్షిప్ రికార్డు(25.01సె)ను ఈ తెలంగాణ అమ్మాయి తిరుగరాసింది. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన దీప్తి మరోమారు అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. దీప్తి స్వర్ణం గెలిచిన నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు ధనలక్ష్మి, యాదగిరితో పాటు స్వగ్రామం కల్లెడ వాసులు హర్షం వ్యక్తం చేశారు.