శనివారం 16 జనవరి 2021
Sports - Dec 17, 2020 , 17:41:06

యోగాకు అరుదైన గుర్తింపు.. ఇకపై జాతీయ క్రీడల్లో!

యోగాకు అరుదైన గుర్తింపు.. ఇకపై జాతీయ క్రీడల్లో!

హైద‌రాబాద్‌:  యోగాకు అరుదైన గుర్తింపు ల‌భించింది.  యోగాను పోటీ క్రీడ‌గా గుర్తిస్తున్న‌ట్లు ఆయుష్ మంత్రిత్వ‌శాఖ ప్ర‌క‌టించింది.  ఆయుష్‌తో పాటు క్రీడా మంత్రిత్వ‌శాఖ కూడా యోగాను పోటీ క్రీడ‌గా గుర్తిస్తున్న‌ట్లు ఇవాళ‌ప్ర‌క‌టించాయి. ఖేలో ఇండియాలో యోగాసనాల‌ను కాంపిటీటివ్ స్పోర్ట్‌గా ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిర‌ణ్ రిజిజూ వెల్ల‌డించారు.  జాతీయ క్రీడ‌లు, యూనివ‌ర్సిటీ క్రీడ‌ల్లోనూ యోగా పోటీ క్రీడ‌గా ఉంటుంద‌న్నారు. పోటీ క్రీడ‌గా ప్ర‌క‌టించ‌డంతో.. యోగాపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెర‌గ‌‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  యువ‌తలో ఆధ్యాత్మిక చింత‌న‌ను పెంచేందుకు కూడా యోగా ఉప‌క‌రిస్తుంది. 

యోగాను పోటీ క్రీడ‌గా ప్ర‌క‌టించ‌డం సంతోషంగా ఉంద‌ని ఆయుష్ మంత్రిత్వ‌శాఖ మంత్రి శ్రీప‌ద్ నాయ‌క్ తెలిపారు.  యోగాను పాపుల‌ర్ చేయాల‌ని, దాన్ని క్రీడగా చూడాల‌న్న ప్ర‌ధాని మోదీ ఆకాంక్ష నెర‌వేసిన‌ట్లు మంత్రి కిర‌ణ్ రిజిజు తెలిపారు. క్రీడా లోకానికి యోగాస‌నం ఓ గొప్ప బ‌హుమ‌తి అని మంత్రి త‌న ట్వీట్‌లో తెలిపారు.  ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం.. నేష‌న‌ల్ యోగాస‌న స్పోర్ట్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియాను స్థాపించింది. ఫిట్ ఇండియా ఉద్య‌మం ద్వారా కూడా యోగాను ప్ర‌మోట్ చేయ‌నున్నారు. రానున్న రోజుల్లో యోగాను ఒలింపిక్ క్రీడల్లోనూ చూసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు నిపుణులు భావిస్తున్నారు.