Yashasvi Jaiswal : ఐపీఎల్ 16వ సీజన్లో చెలరేగి ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)తో కలిసి ఓపెనింగ్ చేయాలనేది తన కల అని తెలిపాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో కవర్ డ్రైవ్ షాట్ ఆడడంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) దిట్ట అని ఈ యంగ్‌స్టర్ వెల్లడించాడు. క్రికెట్‌తో పాటు తాను ఫుట్‌బాల్ ఎక్కువగా చూస్తానని, పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో తన ఫేవరెట్ అని జైస్వాల్ చెప్పుకొచ్చాడు. యశస్వీ పేద కుటుంబంలో పుట్టాడు. క్రికెటర్ అయ్యేందుకు చాలా కష్టపడ్డాడు. దాంతో అండర్ -19 ప్రపంచ కప్ జట్టుకి ఎంపికయ్యాడు. దేశవాళీ టోర్నమెంట్లో పరుగుల వరద పారించిన అతడిని ఐపీఎల్లో అదృష్టం వరించింది.
పదిహేనో సీజన్ ఐపీఎల్లో పెద్దగా రాణించిన యశస్వీ ఇరానీ ట్రోఫీ(Irani Cup-2023)లో విశ్వరూపం చూపించాడు. ఒకే మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాది రికార్డు క్రియేట్ చేశాడు. అదే ఫామ్‌ను అతను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో జైస్వాల్ హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లోనే ఫిఫ్టీతో చెలరేగాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్‌తో కలిసి రాజస్థాన్‌కు శుభారంభాలు ఇస్తున్నాడు. వీళ్లిద్దరూ బ్యాటింగ్‌లో సత్తా చాటుతుండడంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఈ రోజు సంజూ శాంసన్ సేన బలమైన గుజరాత్ టైటన్స్‌ను ఢీ కొననుంది.