న్యూఢిల్లీ: భారత క్రికెటర్లు యశస్వి జైస్వాల్, షెఫాలీ వర్మకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. గతేడాది షెడ్యూల్డ్ డోప్ టెస్టుకు అందుబాటులో లేకుండాపోయి డోపింగ్ అధికారులకు తొలిసారి తమ ఆచూకీ తెలపడంలో విఫలమైనట్టు గుర్తించింది. తమ రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ)లో ఉన్న ఈ ఇద్దరు ప్లేయర్లు డోప్ టెస్టుకు గైర్హాజరైనందుకు సరైన కారణాలు చెప్పకపోవడంతో నాడా నోటీసులు జారీ చేసింది.
దీనిపై బీసీసీఐతో పాటు ఐసీసీకి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. జైస్వాల్ ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతుండగా.. ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత మహిళల జట్టులో షెఫాలీ సభ్యురాలిగా ఉంది.