IND vs ENG : సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఓవల్ టెస్టు (Oval Test)లో భారత జట్టు పట్టుబిగించింది. ఆదిలోనే రెండు వికెట్లు పడినా.. అద్భుత పోరాటంతో మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది టీమిండియా. రెండో రోజు అర్ధ శతకంతో జట్టును ఆదుకున్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (85 నాటౌట్), నైట్ వాచ్‌మన్ ఆకాశ్ దీప్(66)లు బౌండరీల మోతతో శతక భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వని ఈ ద్వయాన్ని లంచ్‌కు ముందు ఓవర్టన్ విడదీశాడు. ఆ తర్వాత కెప్టె్న్ శుభ్‌మన్ గిల్(11 నాటౌట్) దూకుడుగా ఆడాడు. దాంతో.. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 189 రన్స్ కొట్టింది. ప్రస్తుతానికి గిల్ సేన 166 పరుగుల ఆధిక్యంలో ఉంది.
మూడో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ పేసర్లకు యశస్వీ జైస్వాల్ (85 నాటౌట్), ఆకాశ్ దీప్(66 : 94 బంతుల్లో 12 ఫోర్లు)లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. స్లిప్‌లో ఫీల్డర్ల మధ్యలోంచి యశస్వీ బంతిని బౌండరీలకి తరలిస్తూ స్కోర్ బోర్డును నడిపించాడు. ఆకాశ్ సైతం చకచకా సింగిల్స్ తీస్తూ.. ఆపై ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఆతిథ్య జట్టు బౌన్సర్లను కాచుకొన్న క్రీజులో నిలిచిన ఆకాశ్.. అట్కిన్సన్ ఓవర్లో బౌండరీలతో కెరీర్లో మొదటి అర్ధ శతకం నమోదు చేశాడు. తద్వారా నైట్‌వాచ్‌మన్‌గా ఫిఫ్టీ కొట్టిన రెండో భారత క్రికెటర్‌గా అతడు చరిత్రకెక్కాడు. 2011లో అమిత్ మిశ్రా ఇంగ్లండ్ పైనే 84 రన్స్ బాదాడు.
Akash Deep – how good with the bat! 👌 👌
6⃣6⃣ Runs
9⃣4⃣ Balls
1⃣2⃣ FoursUpdates ▶️ https://t.co/Tc2xpWMCJ6#TeamIndia | #ENGvIND pic.twitter.com/GX2v9gCZux
— BCCI (@BCCI) August 2, 2025
ఆకాశ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగానే బాల్కనీలోని భారత కెప్టెన్ గిల్, ఇతర ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ ఆకాశ్‌ను అభినందించారు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే కోచ్ గౌతం గంభీర్ సైతం నవ్వాడు. ఫిఫ్టీ తర్వాత కూడా దంచేస్తున్న అతడిని ఓవర్టన్ పెవిలియన్ పంపాడు. బౌన్స్ అయిన బంతిని అంచనా వేయలేకపోయాడు.. గాల్లోకి లేచిన బంతిని అట్కిన్సన్ పరెగెత్తుతూ వచ్చి క్యాచ్ అందుకోగా.. మూడో వికెట్ 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం శుభ్‌మన్ గిల్ (11 నాటౌట్) రెండు ఫోర్లతో చెలరేగగా లంచ్ బ్రేక్లోపు భారత్ 189/3తో పటిష్ట స్థితిలో నిలిచింది.