IND vs ENG : అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ విజేతను నిర్ణయించే ఓవల్ టెస్టులో సమిష్టిగా రాణించిన భారత జట్టు భారీ స్కోర్ కొట్టింది. ఆతిథ్య జట్టు బౌలర్లను వచ్చినవాళ్లు వచ్చినట్టు ఉతికేయగా.. కొండంత లక్ష్యాన్ని ముందుంచింది. మూడో రోజు ఓపెనర్ యశస్వీ జైస్వాల్(118) సెంచరీకి ఆకాశ్ దీప్ (66) తొలి అర్ధ శతకంతో విరుచుకుపడగా.. టీ సెషన్ తర్వాత రవీంద్ర జడేజా(53 ), వాషింగ్టన్ సుందర్(53 ) విధ్వంసక అర్ధ శతకంతో చెలరేగారు. జడ్డూ వెనుదిరిగాక టెయిలెండర్ల అండతో రెచ్చిపోయిన సుందర్ సిక్సర్లతో దడపుట్టించి జట్టు స్కోర్ 390 దాటించాడు. ధాటిగా ఆడబోయిన అతడు పదో వికెట్‌గా వెనుదిరగగా టీమిండియా ప్రత్యర్థికి 373 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఫలితాన్ని తేల్చే ఓవల్ టెస్టులో భారత బ్యాటింగ్ యూనిట్ గొప్పగా రాణించింది. ఒకరిద్దరూ విఫలమైనా.. ప్రత్యర్ధికి సవాల్ విసిరే స్కోర్ చేసింది టీమిండియా. ఓవర్ నైట్ స్కోర్ 75/2తో మూడో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ మ్యాచ్‌పై పట్టుబిగించింది. రెండో రోజే మెరుపు బ్యాటింగ్‌తో అర్ధ శతకం బాదేసిన ఓపెనర్ యశస్వీ (118) మూడో రోజు అదే జోరు చూపించాడు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్(66) నమ్మశక్యంకాని విధంగా క్రీజులో పాతుకుపోయాడు. ఇంగ్లండ్ పేసర్ల ఎత్తుల్ని చిత్తు చేస్తూ యశస్వీ.. స్లిప్‌లో బంతిని బౌండరీ దాటిస్తుంటే ఫీల్డర్లు అయ్యో అని తల పట్టుకుంటున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 107 రన్స్ జోడించి మంచి పునాది వేశారు.
𝙔𝙖𝙨𝙝𝙖𝙨𝙫𝙞 𝙅𝙖𝙞𝙨𝙬𝙖𝙡 🫶
Hundred in the first innings of the series 👌
Hundred (and going strong) in the last innings of the series 💪
Updates ▶️ https://t.co/Tc2xpWMCJ6#TeamIndia | #ENGvIND | @ybj_19 pic.twitter.com/hJswO7a4Kt
— BCCI (@BCCI) August 2, 2025
ఇంగ్లండ్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఆకాశ్ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ బాదాడు. ఓవర్టన్ ఓవర్లో అతడు బౌండరీతో ఫిఫ్టీ సాధించాడు. అతడు ఔటయ్యాక వచ్చిన కెప్టెన్ గిల్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. కరుణ్ నాయర్ సైతం నిరాశపరచగా.. మాంచెస్టర్ హీరో రవీంద్ర జడేజా (53), ధ్రువ్ జురెల్ (34) బాధ్యతగా ఆడారు.ఏడో వికెట్‌కు 50 రన్స్ జోడించి ఆధిక్యాన్ని 300లకు చేరింది. అయితే.. ఆ తర్వాత బంతికే ఓవర్టన్ బౌలింగ్‌లో జురెల్ ఎల్బీగా వెనుదిరిగాడు. అయినా సరే వాషింగ్టన్ సుందర్ (53) జతగా జడేజా భారీ స్కోర్ అందించే పనిలో నిమగ్నమయ్యాడు.
ధనాధన్ ఆడిన జడ్డూను టంగ్ ఔట్ చేయగా.. సుందర్ గేర్ మార్చి విధ్వంసం కొనసాగించాడు. టంగ్ వేసిన ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ బాదిన అతడు.. సూపర్ ఫిఫ్టీతో జట్టు స్కోర్ 390 దాటించాడు. కానీ, అతడి ఓవర్లోనే పెద్ద షాట్‌కు యత్నించిన సుందర్ మిడాన్‌లో క్రాలే చేతికి చిక్కాడు. దాంతో.. రెండో ఇన్నింగ్స్‌లో 396 వద్ద భారత జట్టు పోరాటం ముగిసింది.