Lamine Yamal : క్రికెట్లోనే కాదు ఫుట్‌బాల్‌లోనూ కొన్ని జెర్సీలు చాలా స్పెషల్. ఆ జెర్సీలను తమ అభిమాన ఆటగాళ్ల గుర్తుగానే కాదు వాళ్ల జ్ఞాపకంగానూ భావిస్తుంటారు. బార్సిలోనా (Barcelona) ఫుట్‌బాల్ క్లబ్ దిగ్గజ ఆటగాళ్ల జెర్సీ నంబర్ 10 ఇప్పుడు యువ కెరటం లమినె యమల్ (Lamine Yamal) ఒంటిపై చేరింది. గురువారం సదరు క్లబ్ యజమానులు అతడికి ఆ జెర్సీని అందజేశారు.
బార్సిలోనా పదో నంబర్ జెర్సీకి ఘన చరిత్ర ఉంది. లెజెండరీ ఆటగాళ్లు డిగో మారడోనా, రివాల్డో, రొనాల్డిన్హో, లియోనల్ మెస్సీలు ఈ జెర్సీతో విశ్వ ఖ్యాతి గడించారు. అర్జెంటీనా స్టార్ అయిన మెస్సీ ఏకంగా 13 ఏళ్లు ఈ జెర్సీతోనే మైదానంలోకి దిగి గోల్స్ వర్షం కురిపించాడు. మిగతావాళ్లు సైతం అంతే. పదో అంకెతో మైదానంలో మ్యాజిక్ చేస్తూ.. మెరుపు గోల్స్‌తో అభిమానులను అలరించారు. ఇప్పుడు యమల్ సైతం వీళ్ల తరహాలోనే ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాడా? అనేది చూడాలి.
Visca el Barça i Visca en Lamine Yamal ❣️ pic.twitter.com/4qXh7khlQO
— FC Barcelona (@FCBarcelona) July 16, 2025
స్పెయిన్‌కు చెందిన యమల్ ఫుట్‌బాల్‌లో టీనేజ్ సంచలనంగా మారాడు. చిన్నవయసులోనే సీనియర్లకు పోటీగా రాణిస్తున్న ఈ కుర్రాడు 30 గోల్స్ చేశాడు. మరో 40 గోల్స్‌కు సహకరించాడు. బార్సిలోనా, స్పెయిన్ జట్ల తరఫున ఐదు టైటిళ్లు సాధించాడీ యంగ్ సెన్సేషన్. యూరో ఛాంపియన్‌షిప్‌లో తన సంచలన ఆటతో వైరలైన యమల్ ఈమధ్యే బార్సిలోనాతో ఒప్పందం చేసుకున్నాడు. 2031 వరకూ అంటే ఇంకో ఆరేళ్లు ఈ కుర్ర కెరటం పదో నెంబర్ జెర్సీతో మైదానంలో తళుక్కుమననున్నాడు.
Lamine Yamal takes Barcelona’s iconic No. 10 shirt 🔵🔴 pic.twitter.com/JQstB5Lpxh
— B/R Football (@brfootball) July 16, 2025