Ruth Chepngetich : కోచింగ్ తీసుకోకుండానే మారథాన్‌లో బెస్ట్ టైమింగ్‌తో చరిత్ర సృష్టించిన కెన్యా అథ్లెట్ రుత్ చెప్నెగెటిక్ (Ruth Chepngetich)పై నిషేధం పడింది. డోపింగ్ పరీక్షలో పాజిటివ్ వచ్చినందుకు ఆమెను అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ (AIU) తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. మార్చిలో రుత్ శాంపిల్స్‌ను పరీక్షించగా ఆమె నిషేధిత డైయురెటిక్ మాస్కింగ్ ఏజెంట్ డ్రగ్ తీసుకున్నట్టు తెలిసింది. దాంతో, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏఐయూ రుత్పై కొరడా ఝులిపించింది. తదుపరి విచారణ కొనసాగేంతవరకూ ఈ స్టార్ అథ్లెట్‌ను ఏ పోటీలోనూ పాల్గొనకూడదని ప్రకటన విడుదల చేసింది.
కెన్యాకు చెందిన రుత్ చెప్నెగెటిక్ అక్టోబర్‌లో జరిగిన మారథాన్ పరుగు పందెంలో సరికొత్త చరిత్ర లిఖించింది. ట్రాక్ మీద తనకు తిరుగులేదని మరోసారి చాటిచెబుతూ రెండు నిమిషాల తేడాతో రికార్డులు బద్దలుకొట్టింది. చికాగో వేదికగా జరిగిన పోటీలలో 2 గంటల 09 నిమిషాల 56 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది 30 ఏండ్ల చెప్నెగెటిక్.. గతంలో ఈ రికార్డు ఇథియోపియా అథ్లెట్ టిగిస్ట్ అస్పెఫా పేరిట (2:11:53 ని.) పేరిట ఉండేది. నిరుడు బెర్లిన్ మారథాన్‌లో అసెఫా ఈ రికార్డు నెలకొల్పాడు.
మట్టిలో మాణిక్యాలకు నెలవైన ఆఫ్రికా నుంచి రుత్ సంచలనాల పర్వం లిఖిస్తోంది. చికాగో మారథాన్‌లో ఈ కెన్యా కెరటం విజేతగా నిలవడం ఇదే మొదటిసారి కాదు. వరుసగా 2021, 2022లో ఆమె చాంపియన్ అయింది. ఇక 2023 ఎడిషన్‌లో రుత్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ‘నా పేరు రుత్ చెప్నేగెటిక్. నాకు కోచ్ లేడు. నాకు నేనే కోచ్’ అని మీడియా సమావేశంలో రుత్ సగర్వంగా చెబుతుంటే అక్కడున్నవాళ్లంతా చప్పట్లతో ఆమెకు అభినందనలు తెలిపారు.